ఒక ఖరీదైన గ్రామం

స్టార్ హోటళ్లు, విల్లాలు, బీఎండబ్ల్యు కార్లు- ఖరీదైన నగరాల్లో కనిపించడం సహజం. అదే పల్లెల్లో కనిపిస్తే- అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆశ్చర్యానికి కారణమైన గ్రామం పేరు ‘హక్సీ విలేజ్’.

“ఇది పల్లెటూరా..? ఇంత విలాసవంతమైన సౌకర్యాలు మెట్రోసిటీల్లో కూడా ఉండవు” అంటారు హక్సీ విలేజ్‌ను తొలిసారి చూసిన సందర్శకులు. ఖరీదైన పగోడాలు, టన్నెల్స్, లాంగ్సీ లేక్, వరల్డ్ గార్డెన్, ఫార్మర్ గార్డెన్‌లతో తీర్చిదిద్దినట్లు ఉంటుంది ఆ ఊరు. గ్రామం మధ్యలోకి వెళ్లగానే 60 అంతస్తుల ఆకాశహర్మ్యం కనిపించి ఔరా ఏమిటీ అద్భుతం అనిపిస్తుంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో ఉన్న ఈ గ్రామం.. బీజింగ్ నుంచి 600 కిలోమీటర్లు వెళితే వస్తుంది. చైనీయులందరూ దీన్ని లిటిల్ దుబాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఖరీదైన హక్సీ విలేజ్‌ను 1961లో స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వూరెన్‌బావో స్థాపించారు. గ్రామంలోని రైతులంతా శ్రీమంతులు. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.25 కోట్ల దాకా డబ్బులు నిల్వ ఉంటాయంటే ఎంత షావుకార్లో అర్థమవుతుంది. వీరికి ఇన్నేసి ఆస్తులు వారసత్వంగా రాలేదు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల వచ్చాయి.

వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని డిమాండ్ కలిగిన వ్యాపార రంగాలకు మళ్లించారు. అందుకోసం రైతులందరూ కమ్యూన్‌గా (ఒక బృందంగా) ఏర్పడ్డారు. ఇనుము ఉత్పాదక సంస్థలు, రవాణా సంస్థలు, దుస్తుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కమ్యూన్ అంటే ఒక రకంగా మన దగ్గరున్న రైతు సహకార సంఘంగా చెప్పుకోవచ్చు. కమ్యూన్ లాభాల బాట పట్టాక మరికొన్ని సబ్సిడరీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిపి 40 దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి చేరుకోవడంతో.. రైతుల దశ తిరిగింది. విపరీతమైన లాభాలు రావడంతో.. రైతులందరికీ అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది కమ్యూన్. ఎటు చూసినా కిలోమీటరు కూడా లేని హక్సీ.. ఇప్పుడు చైనాలోనే అత్యంత ఖరీదైన గ్రామంగా రికార్డులకు ఎక్కింది. పల్లెలో అతి తక్కువ జనాభా ఉన్నప్పటికీ వలస వచ్చిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య ఎక్కువ.

సౌకర్యాలకు కొదవ లేదు..

హక్సీ విలేజ్‌ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపేందుకు.. 60 అంతస్తుల ఆకాశ హర్మ్యం నిర్మించారు రైతులు. ఈ టవర్ ఎత్తు 328 మీటర్లు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన టవర్లలో ఇది పదిహేనవది. 324 మీటర్ల ఎత్తున్న పారిస్‌లోని ఈఫిల్ టవర్, 319 మీటర్లున్న క్రిస్‌లర్ బిల్డింగ్‌లకంటే కూడా హక్సీ విలేజ్ టవరే ఎత్తయినది. టవర్ ఆఖరి అంతస్తులో ఒక టన్ను బరువున్న గోవు స్వర్ణ ప్రతిమను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో వెచ్చించిన ఈ ప్రతిమను వ్యవసాయానికి చిహ్నంగా భావిస్తారు చైనీయులు.

ఆకాశహర్మ్యంలో అత్యాధునిక విలాసవంతమైన సూట్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్స్, రెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో ఒక ఇంటర్‌నేషనల్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నిట్నీ కేవలం హక్సీ విలేజ్‌లోని రెండువేల మంది రైతులకు మాత్రమే కేటాయిస్తారు. వ్యాపారం, వ్యవసాయంతో అలసిపోయిన గ్రామస్తులు కుటుంబాలతో వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోతారు. చైనా దేశానికే భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ గ్రామం పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది. ఏటా 120 దేశాలకు చెందిన పది లక్షల మంది హక్సీవిలేజ్‌ను సందర్శిస్తారు.

ఇన్ని విశేషాలుండడం వల్ల ఈ గ్రామం ఇప్పటికే నేషనల్ సివిలైజ్డ్ విలేజ్, నేషనల్ కల్చరల్ మోడల్ విలేజ్ అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ వ్యవసాయంలో కాలానుగుణంగా మార్పులు తీసుకురావడం, అనుబంధ వ్యాపారాల్లో అడుగుపెట్టడం హక్సీ విలేజ్ రైతులకు కలిసొచ్చింది. ఇలాంటి మార్పును అవకాశమున్న రైతులు అవలంభిస్తే మన రైతులు కూడా ఆ స్థాయిలో కాకపోయినా.. ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s