పొలం ఆయన మాట వింటుంది!

భారతదేశం సుసంపన్న వ్యవసాయ దేశం. ఇది మనమందరం గర్వపడే విషయం! రసాయనిక ఎరువుల వాడకంలోనూ అగ్రగామి మనదేశం. ఇది మనమందరం బాధపడాల్సిన విషయం! ఇంతకు ముందుతరాలలో వేల సంవత్సరాలపాటు అవసరం లేని మందుల వాడకం ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరిగింది? పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటిని రుజువు చేసిన ఓ రైతు గాథ ఇది.సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని కరవు ప్రాంతం విదర్భకు చెందినవాడు. దాంతో సహజంగానే వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. ఫలితంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. కొంతకాలానికి సొంతపొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు పదేళ్లపాటు అంటే 1972 నుంచి 82 వరకు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలలోకి దిగాడు. నిపుణులను అడిగాడు. సర్వేనివేదికలు తెప్పించుకుని చూశాడు.దిగుబడి పెంచుకోవడానికి అప్పటికి ఆయనకు కనిపించిన ఒకటే మార్గం మరిన్ని రసాయనిక మందులు వాడటం. ‘సరే, ఇప్పుడంటే మందులు ఎక్కువ వాడతాను, మరలా కొన్నేళ్లకు దిగుబడులు పడిపోతే ఏంటి పరిస్థితి? అపుడింకా ఎక్కువ వాడాలా? మందులవాడకాన్ని ఎంతకాలమని ఇలా పెంచుకుంటూ పోతాం…’ అన్న అంతర్మథనం ఆయనలో మొదలైంది. దీనికేదో ఒక మార్గం కనిపెట్టాల్సిందే అనుకున్నాడు. రసాయనిక ఎరువుల లాభ-నష్టాలపై మూడేళ్లపాటు పరిశోధిస్తే, దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. ముందుగా భూసారంపై పరిశోధనలు చేశారు.

సేంద్రియ ఎరువుల వల్ల నేల కలుషితం కాదు, పంటల్లో రసాయనాలు ఉండవు, అంతవరకు బాగానే ఉంది కానీ అది చాలా క్లిష్టమైన పద్ధతి. ఒక రకంగా ఖరీదైనదే. ఎక్కువ శ్రమతో కూడినదీ. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పాత్ర పంట దిగుబడుల్లో ప్రధాన పోషిస్తోంది గాని మందులు కాదు అని తెలుసుకున్నాడు.

మొక్క కేవలం రెండు శాతం మాత్రమే భూమిలో పోషకాలను ఉపయోగిస్తుంది. మిగతా అంతా గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే గ్రహిస్తుందని గ్రహించాడు. ఆ రెండింటినీ సరైన మోతాదులో సరిగ్గా అందించగలిగితే చాలనుకున్నాడు. తన పరిశోధనల్లో భాగంగా మన ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించాడు.

ఆవుపేడ, గోమూత్రం … ఈ రెండింటికీ మించిన ఎరువు లేదని ఆయనకు అర్థమైంది. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు విజయం సాధించారు. కేవలం ఒక ఆవు ఎరువు 30 ఎకరాలు పండించడానికి సరిపోతుందట. పదికిలోల ఆవుపేడ, పదిలీటర్ల గోమూత్రం, రెండుకేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాడు. ఈ మందుకు ఆయన పెట్టిన పేరు ‘జీవ మూత్ర’. దాన్నే పొలంలో వాడారు. దాంతో అత్యధిక దిగుబడులు సాధించారు.

ఒక్క బెల్లం తప్ప బయటనుంచి కొనేదేమీ లేది ఇందులో. పురుగు మందులు అతిగా వాడి పాడైన పొలాలను జీవ మూత్ర మందు మళ్లీ యథాతథ స్థితికి తేగలదు. ఎందుకంటే ప్రతి గ్రాము ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులుంటాయిట. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి. అయితే, విదేశాల నుంది దిగుమతి చేసుకున్న జెర్సీ, ముర్రా జాతి ఆవుల పేడ ఇందుకు పనికిరాదట!

తన పరిశోధన ఫలాలు అందరికీ అందించడం కోసం రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాడు పాలేకర్. సుమారు ఇప్పటివరకు 2000 శిబిరాల కంటే ఎక్కువే నిర్వహించాడు. అరవైలలోనూ అలసి పోకుండా తన పయనం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం (జీరో బడ్జెట్ ఫర్ నేచురల్ ఫామింగ్) ప్రధానాంశంగా పలు పుస్తకాలు రాశారు.

తన పరిశోధన ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వాటిపై రూపాయి కూడా లాభం వేసుకోకుండా ఉత్పాదక వ్యయానికే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలిచ్చేందుకు ఇంటర్‌నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.

కుటుంబమంతా భూమిపుత్రులే!

సుభాష్ పాలేకర్ మాత్రమే ఆ కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. సుభాష్ వారసుడు అమోల్ కూడా తండ్రి మార్గంలో నడిచారు. ఇందుకోసం ఆయన తన ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తండ్రి, అన్నల బాటలో అమిత్ తన అడుగులు వేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ కటుంబం మొత్తంతో భూమిపుత్రులుగా మారి, రసాయనిక వ్యవసాయంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. సుభాష్ కోడళ్లు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు చేసే ఫోన్ కాల్స్‌కు సమాధానాలిస్తూ వీరితో పాటు ప్రకృతి వ్యవసాయంలో తమ పాత్ర పోషిస్తున్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే సుభాష్ పాలేకర్ అనుసరించే వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే www.palekarzerobudgetnaturalfarming.comను సంప్రదించవచ్చు. అందులో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పంటల పండగ సంక్రాంతి రోజున సుభాష్‌కు సలాం!

‘‘కేవలం ఒక ఆవు పేడ 30 ఎకరాలు పండించడానికి సరిపోతుంది. పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల గోమూత్రం, రెండు కేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాను. దాన్నే పొలంలో వాడాను. దాంతో అత్యధిక దిగుబడులు సాధించాను. మందులు అతిగా వాడి పాడైన పొలాలను ఈ జీవ మూత్ర మందు మళ్లీ యథాస్థితికి తేగలదు.’’

-ప్రకాష్ చిమ్మల

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

4 thoughts on “పొలం ఆయన మాట వింటుంది!”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s