ఇది మా ఊరు…

ఇంటిని మించిన స్వర్గం లేదు. తల్లిని మించిన దైవం లేదు. సోదరప్రేమకు ఏదీ సాటి రాదు. మనిషన్న వాడు ఇంకా మాయమైపోవడం లేదంటే.. ఆ మూడే కారణమని చెప్పొచ్చు. అందుకేనేమో ఇల్లులేని, తల్లిలేని, సోదరులు లేని.. అనాథపిల్లలకు ఓ కొత్త సమాజాన్ని అందివ్వాలనుకున్నారు ఓ మహానుభావుడు. ఆస్ట్రియాలో అప్పుడెప్పుడో ఆయన నాటిన మొక్క విశ్వవ్యాప్తమై.. ఇప్పుడు 133 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.50 లక్షల మంది దిక్కులేని పిల్లలకు పెద్దదిక్కై నిలిచిన ఆ సంస్థ పేరు ‘ఎస్ఒఎస్ చ్రిల్డన్స్ విలేజ్’. అన్నీ కోల్పోయి ఒట్టి చేతులతో అడుగుపెట్టిన ప్రతి చిన్నారికీ అన్నీ తానై నిలుస్తోంది ఈ సంస్థ. మంచి చదువులు చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది.. తిరిగి సమాజానికి అప్పగిస్తోంది. మన రాష్ట్రంలో మూడు విలేజ్‌లను ఏర్పాటు చేసింది. అందులో ఒకటైన హైదరాబాదుకు సమీపంలోని వట్టినాగులపల్లి చ్రిల్డన్స్ విలేజ్ గురించే ఈ వారం కవర్ స్టోరీ..

తల్లిదండ్రులంటే ఎవరు?
దేనికీ లోటు రాకుండా పెంచేవారు.
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లలంటే..?
రక్తసంబంధం తెంచుకోలేనివారు.
కుటుంబం అంటే..
భద్రతతోపాటు భరోసానిచ్చేది. ఇవన్నీ లేనోళ్లను ‘అనాథ’లు అంటుంది సమాజం. ఒకసారి ‘ఎస్.ఒ.ఎస్.(సేవ్ అవర్ సోల్) చిల్డ్రన్స్ విలేజ్’కు వెళ్లి అక్కడున్న పిల్లల్ని చూస్తే.. ఆ మాట అనేందుకు నోరు రాదు. ఆపిల్లల తల్లిదండ్రులు బతికున్నా.. ఇంతకంటే గొప్ప జీవితాన్ని పొందేవారు కాదేమో అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లి రూట్‌లో యాభై కిలోమీటర్లు వెళితే.. వట్టినాగులపల్లికి పక్కనే ఉంటుంది ఈ స్వర్గధామం. చుట్టూ పచ్చటి పొలాలు. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆత్మీయంగా పలకరించే పల్లె జనం. వీటన్నిటి నడుమ నాలుగున్నర ఎకరాల్లో ఎస్ఒఎస్‌ను తీర్చిదిద్దారు. గేటు దాటి లోపలికి అడుగుపెడుతూనే.. చూడముచ్చటైన ఇళ్లు, విశాలమైన గడ్డిమైదానాలు, అటూ ఇటూ కలియదిరిగే తెల్లటి బాతులతో.. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీకంటే గొప్పగా కనిపిస్తుంది. పొద్దున తొమ్మిదిలోపు వెళితే పిల్లలందరూ యూనిఫాం వేసుకుని, బూట్లు తొడుక్కుని, క్యారేజ్‌లు పట్టుకుని స్కూలు బస్సులు ఎక్కుతుంటారు. తల్లులందరూ ఇళ్ల గుమ్మాల్లో నిలబడి.. చిరునవ్వులతో వారిని సాగనంపుతున్నారు.

ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం, మళ్లీ ట్యూషన్లకు వెళ్లడం.. సమయం దొరికినప్పుడల్లా ఆడుకోవడం.. అందరి పిల్లల్లాగే వీళ్లు కూడా బిజీగా కనిపిస్తారు. ఇక్కడున్న పిల్లల్లో కొందరికి అమ్మలేదు. మరికొందరికి నాన్న లేడు. చాలామందికి ఇద్దరూ లేరు. అయితే, ఈ ప్రాంగణంలోకి వచ్చాక.. పిల్లలకు ఆ లోటు తెలియదు. వారి దిగులు ముఖాల్లో వెలుగులు పూస్తాయి. పిల్లల కోసం కట్టిన ఇళ్లు, వాళ్లకు పెట్టే తిండి, వేసుకునే బట్టలు, కంటికి రెప్పలా చూసుకునే తల్లులను చూశాక.. దీన్ని అనాథాశ్రమం అంటే నమ్మబుద్ధి కాదు.

మామూలు అనాథాశ్రమాలకు దీనికీ పోలికే లేదు. అందరి ఇళ్లలో పిల్లలు ఎంత హాయిగా బతుకుతారో, అనా«థ పిల్లలు కూడా అంతే హాయిగా బతకాలన్నదే ఎస్ఒఎస్ లక్ష్యం. ఈ సంస్థ పునాదులే చాలా ప్రత్యేకమైనవి. ఆ పునాదుల్లోనే నాలుగు మూలస్తంభాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి: తల్లి (మదర్), రెండు : అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు (బ్రదర్స్ అండ్ సిస్టర్స్), మూడు : ఇల్లు (హౌస్), నాలుగు : గ్రామం (విలేజ్). ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చిల్డ్రన్స్ విలేజ్ పెట్టాలనుకున్నా వాళ్లు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇప్పటి వరకు 130 దేశాలలో 500 చ్రిల్డన్స్ విలేజ్‌లను ఏర్పాటు చేసిస సంస్థ ఎస్ఒఎస్.

పుట్టుక ఆస్ట్రియాలో..
వ్యాపార సంస్థను స్థాపించేవారికి తెలివితేటలు కావాలి. పదిమందికి సేవచేసే సంస్థను ఏర్పాటు చేసేవారికి తెలివితేటలకంటే సున్నితమైన హృదయం ఉండాలి. అలాంటి మనసున్న మనిషి డాక్టర్ హెర్మన్ మీనర్. ఆస్ట్రియాలోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఈయన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిలేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసింది వాళ్ల అక్క. బాగా చదువుకుని హెర్మన్ డాక్టర్ అయ్యారు. తల్లిదండ్రులు లేని తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది ఆయనకు. తన అక్క మాదిరి ప్రేమతో చూసుకునే మనుషులు దొరికితే.. అనాథలకు ఏ దిగులూ ఉండదనుకున్నారు. అప్పటికే ఎన్నో రకాల అనాథాశ్రమాలను చూశారాయన. వాటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత హెర్మన్‌కు.. ఒక కొత్త ఆలోచన తట్టింది. ఒక మనిషిని మానవీయ విలువలతో పెంచి పెద్దచేసేందుకు కుటుంబం కంటే గొప్ప వ్యవస్థ ఈ ప్రపంచంలో మరొకటి లేదనుకున్నాడు. ఆ కుటుంబం నమూనాలోనే అనాథాశ్రమాన్ని పెడితే ఎలా ఉంటుంది? అనుకున్నారు.

ఆ ఆలోచనను మిత్రుల ముందు పెడితే అద్భుతం అన్నారు. దీంతో ఆస్ట్రియాలో తొలి ఎస్ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ ఊపిరిపోసుకుంది. అందులో- రెండో ప్రపంచ యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కొరియా యుద్ధం తర్వాత కొరియాలో రెండో కేంద్రం వెలసింది. మిగిలిన దేశాలు కూడా హెర్మన్‌ను ఆహ్వానించడంతో.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో చ్రిల్డన్స్ విలేజ్‌లు వెలిశాయి. హెర్మన్ మరణించాక ఆ స్థానంలో హెల్మట్ కుటిన్ బాధ్యతలు తీసుకున్నారు. ఒకప్పుడు కుటిన్‌కు కూడా ఎస్ఒఎస్ విలేజ్‌లోనే చదువకునే భాగ్యం కలిగింది. ఎస్ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ కాన్సెప్ట్‌కు మన తొలి ప్రధాని నెహ్రూ సైతం స్పందించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రోత్సాహం ఇవ్వడంతో ఇండియాలో తొలి చిల్డ్రన్స్ విలేజ్ ఫరీదాబాద్‌లో ఆవిర్భవించింది. ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 32 విలేజ్‌లు పనిచేస్తున్నాయి. మన రాష్ట్రంలో నెలకొల్పిన విలేజ్‌లలో విశాఖపట్టణంలో 283 మంది, వట్టినాగులపల్లిలో 170 మంది పిల్లలకు ఆశ్రయం లభించింది. తిరుపతిలో విలేజ్ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. అక్కడ కూడా తాత్కాలిక వసతి కింద 60 మంది పిల్లలను చేరదీశారు.

ఎవరి ఇల్లు వారిదే..

sos
పిల్లలందర్నీ ఒకే గదిలో పెడితే సొంతింట్లో ఉన్నామన్న భావన కలుగదు. వాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టి పెంచటమూ కష్టమవుతుంది. ఆ వయసులో తగినంత ప్రేమ అందకపోతే మానసిక ఎదుగుదల లోపిస్తుంది. ప్రేమాభిమానాలు లేకుండా కేవలం సౌకర్యాలొక్కటే అమర్చితే- వేళకు తిండి జరిగిపోవచ్చు. అంతో ఇంతో చదువు రావచ్చు. కాని అన్ని భావోద్వేగాల మధ్య పెరిగిన మనిషి మాత్రం అవ్వలేరు. అందుకే ప్రతి పదిమందికి ఒక హౌస్‌ను ఏర్పాటు చేసింది ఎస్ఒఎస్. ఈ ఇళ్లన్నీ గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఉంటాయి. విస్తీర్ణాన్ని బట్టి హౌస్‌ల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. వట్టినాగులపల్లిలోని చ్రిల్డన్స్ విలేజ్‌లో మాత్రం 12 హౌస్‌లను నిర్మించారు.

హౌస్‌లు ఎన్ని ఉన్నా ఒక్కో ఇంట్లో 10 నుంచి 12 మంది పిల్లలకే ఆవాసం లభిస్తుంది. అంతకు మించి ఒక్కరిని కూడా ఉంచరు. ఇంట్లోలానే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండే అలవాటు రావాలన్న ఉద్దేశ్యంతో.. ప్రతి హౌస్‌లో ఆడమగ ఇద్దరూ ఉండేలా చూస్తారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మాదిరి సోదర ప్రేమకు దూరం కాకూడదన్నదే ఎస్ఒఎస్ లక్ష్యం. హౌస్‌లలో చేరిన వెంటనే పిల్లల ఆసక్తులను బట్టి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చేర్పిస్తుంది యాజమాన్యం. స్కూలు ఫీజులు, యూనిఫాం, పుస్తకాల ఖర్చు పెట్టుకోవడమే కాక రానుపోను బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం ట్యూషన్లను కూడా పెట్టించారు. ఇక్కడున్న వాళ్లలో ఎనభైశాతం మంది పిల్లలు తొంభై శాతం మార్కులతో పాసవుతుండం విశేషం.

మగ పిల్లలకు 14 ఏళ్లు వచ్చాక.. ‘యూత్ ఫెసిలిటీ’ పేరుతో నగరంలో ప్రత్యేక వసతిని కల్పిస్తారు. పగలు వస్తూపోతూ ఉండొచ్చు కాని రాత్రి పూట మాత్రం హౌస్‌లో ఉండేందుకు అనుమతించరు. యూత్‌ఫెసిలిటీ పొందుతున్న పిల్లలువాళ్ల ఆసక్తులను బట్టి పై చదువులు చదువుకోవచ్చు. లేదా కోర్సుల్లో శిక్షణ తీసుకోవచ్చు. అందుకు అయ్యే ఖర్చులను సంస్థే భరిస్తుంది. ఆడపిల్లల్ని మాత్రం వాళ్లు బాగా చదువుకుని, ఉద్యోగాల్లో స్థిరపడి, పెళ్లిళ్లు చేసుకునే వరకు విలేజ్ హౌస్‌లలోనే ఉంచుకుంటారు. “నాకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరన్న కొరతే లేదు. నేను ఎక్కడ పుట్టానో, ఇప్పుడు నా అమ్మానాన్నలెవరో నాకు అనవసరం. ఈ విలేజ్‌లో ఇంతమంది మాకోసం కనిపెట్టుకుని ఉన్నారంటే మేమెంత అదృష్టవంతులం..? మా హౌస్‌లో ఉన్న పిల్లలే నాకు బ్రదర్సు, సిస్టర్సు. ఇంతకంటే ఏం కావాలి..? విలేజ్‌లోని ఉద్యోగుల్ని కూడా ‘సార్’ అని పిలవం. అంకుల్, బాబాయ్, చిన్నమ్మ, పెద్దమ్మ.. అనే పిలుస్తాం..” అంది అక్కడ ఉంటున్న ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి.

సకల సౌకర్యాలు..
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun34.jpgప్రతి ఇంట్లో ఫ్రిజ్, టీవీ, డైనింగ్ టేబుల్, కిచెన్‌లతో పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ అమర్చారు. సాధారణ అనాథాశ్రమాల్లో అయితే- నిద్రపోవాలన్నా, అన్నం తినాలన్నా అందరికీ ఒకే చోట సదుపాయం ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఎవరింట్లో వాళ్లు వండుకు తింటారు. ఇంటికి అవసరమైన సరుకులు, కూరగాయలను ఎవరికి వాళ్లే తెచ్చుకుంటారు. కిరాణాకొట్టుకు వెళ్లినా, బట్టల దుకాణానికి వెళ్లినా, పుస్తకాలు కొనాల్సి వచ్చినా.. ‘తల్లి’తోపాటు పిల్లలందరూ కలిసి బజారుకు వెళతారు. అందుకు అయ్యే బిల్లులను సంస్థ చెల్లిస్తుంది. “ఈ ఇల్లు మాది అన్న భావన పిల్లల్లో కలగాలి. వాళ్లకు ఏం కావాలో కొనుక్కునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే బయటి సమాజంతో సహజంగా కలిసిపోయే మనస్తత్వం అలవడుతుంది. ఆత్మవిశ్వాసం చిగురిస్తుంది..” అన్నారు విలేజ్ డైరెక్టర్ కె.నటరాజన్. పండుగలు వచ్చినప్పుడు కూడా ఎవరికి నచ్చిన వంటలు వారు చేసుకుంటారు. కుల, మతాల భేదాలుండవు. ఏం చేసినా పిల్లల మనసెరిగే చేయాలి. “మా హౌస్‌లో ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటాం.

పండగలప్పుడే కాదు. మిగిలిన రోజుల్లో కూడా పిల్లలు తమకు ఏం కావాలన్నా పోట్లాడి మరీ చేయించుకుంటారు..!” అని చెప్పారు తల్లులు. ఇక్కడ చేరిన పిల్లలకు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేస్తారు. చిన్న పిల్లలకైతే బాసర తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తారు. “అక్కడ గోడ మీదున్న నా కూతురు ఫోటోను చూడండి. దాని పేరు సాయిప్రియ. చిట్టిది ఎంత ముద్దొస్తోందో చూడండి. అది ఇక్కడికి వచ్చినప్పుడు రెండ్రోజుల పసిపాప. ఎక్కడో ఆస్పత్రిలో దొరికిందట పాపం. పోలీసులు తీసుకొచ్చి మాకు అప్పగించారు. పేరు కూడా నేనే పెట్టాను. పదకొండు రోజులకు బారసాల చేశాం. తల్లులందరం బాసరకు తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయించాం. ఇప్పుడు ఆ పిల్ల రెండో తరగతి చదువుతోంది..” అంటూ మురిపెంగా చెప్పుకొచ్చారు మదర్ ఉషారాణి. పిల్లలు తమ రక్తం పంచుకు పుట్టకపోయినా.. సొంతపిల్లల కంటే ఎక్కువగా చూసుకునే తల్లులు ఉన్నారిక్కడ. “స్వచ్ఛమైన ప్రేమను పంచే మదర్స్ లేకపోతే ఈ విలేజెస్సే ఉండవు” అని చెప్పిన హెర్మన్ లక్ష్యం నెరవేరింది.

విలేజ్‌కు అమ్మలే దిక్కు…
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun37.jpg‘చిట్టీ హోంవర్క్ పూర్తయిందా?’, ‘చిన్నోడా స్నాక్స్ తీసుకున్నావా?’, ‘స్నానం చేసిరా తల్లీ కూర్చుందాం. లెక్కల్లో డౌట్స్ అన్నావుగా’ ‘పరీక్షలు పూర్తయ్యాక పిక్‌నిక్ పెట్టుకుందాం’.. చ్రిల్డన్స్ విలేజ్‌లోని ఇళ్లలో ఇలాంటి మందలింపులు, బుజ్జగింపులే కనిపిస్తాయి. అప్పుడప్పుడు మన ఇళ్లలో విధించే చిన్నపాటి దండనలూ కనిపిస్తాయక్కడ. ఏం చేసినా పిల్లల బాగు కోసమేనంటారు తల్లులు. పిల్లల తిండితిప్పల దగ్గర్నుంచి చదువుసంధ్యల వరకు అంతా తల్లులదే బాధ్యత. అందుకే తల్లుల ఎంపికకు ఎస్ఒఎస్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. మదర్ కావాలనుకునే వారు పదోతరగతి పూర్తి చేసుండాలి. భర్త చనిపోయి పిల్లలు లేని మహిళలను మాత్రమే అర్హులుగా పరిగణిస్తుంది సంస్థ. ఎలాంటి బాదరబందీలు లేని మహిళలే పిల్లలను బాగా చూసుకుంటారని ఈ నిబంధనలను పెట్టారు. “రిలేషన్‌షిప్ అనే మాటకు అర్థం తల్లి నుంచే బిడ్డలకు తెలుస్తుంది.

మహిళలందరూ మాతృప్రేమ అందించగలరు. అందుకే మా పిల్లల సంరక్షణ కోసం అలాంటి తల్లులనే తీసుకుంటున్నాం..” అని చెప్పారు అసిస్టెంట్ విలేజ్ డైరెక్టర్ విజయశ్రీ. ఎంపికైన తల్లులకు ఢిల్లీలోని ‘మదర్స్ ట్రైనింగ్ స్కూల్’లో ప్రాక్టికల్, థియరిటికల్ శిక్షణ ఇస్తారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్, చైల్డ్‌కేర్, రిలేషన్‌షిప్స్, హెల్త్, న్యూట్రీషన్, హ్యూమన్ సైకాలజీ వంటి అంశాల మీద లోతైన అవగాహన కల్పిస్తారు నిపుణులు. ఇక్కడి నుంచి వెళ్లే మహిళలకు భాషా సమస్య తలెత్తితే, అనువాదకులను ఏర్పాటు చేస్తారు. చ్రిల్డన్ విలేజ్‌కు భిన్న మనస్తత్వాలు కలిగిన పిల్లలు వస్తారు కాబట్టి.. వాళ్లను అర్థం చేసుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుంది. శిక్షణ పూర్తయ్యాక మదర్స్‌గా ఉద్యోగం ఇస్తారు. రెండేళ్లకు పూర్తిస్థాయి వేతనం అందుతుంది. ఉచిత భోజన, వైద్య సదుపాయాలతోపాటు పింఛను సౌకర్యం కూడా కల్పిస్తారు. అరవై ఏళ్లు పూర్తయి రిటైర్ అయ్యే వరకు మదర్స్ యోగక్షేమాలన్నీ కూడా సంస్థే చూసుకుంటుంది. తమ ఇంటిని, పిల్లలను చక్కగా చూసుకునే తల్లులను ఎస్ఒఎస్ ప్రెసిడెంట్ బంగారపు ఉంగరంతో సన్మానిస్తారు.

పిల్లల్ని ఎలా తీసుకుంటారు..?
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun38.jpgఒకప్పుడు మరీ పసి పిల్లల్ని, ఒక పేరెంట్ ఉన్న పిల్లల్ని తీసుకునేవారు కాని కొత్త నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లలను మాత్రమే తీసుకుంటున్నారు. అయిదు నుంచి పదేళ్ల దేళ్లలోపు వయసున్న పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా జిల్లాల స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీల నుంచి ఆమోదపత్రం తీసుకోవాలి. తల్లిదండ్రులు మరణించినట్లు ధృవీకరణ పత్రాలు, పిల్లల బర్త్ సర్టిఫికెట్టు ఉండాలి. దత్తత నిబంధనలకు లోబడే పిల్లలకు విలేజ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఒక్కసారి తీసుకున్నాక పిల్లలకు అన్నీతానై నిలుస్తుంది ఎస్ఒఎస్. చ్రిల్డన్ విలేజ్‌తోనే ఆగకుండా గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు కూడా మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నారు వాళ్లు.

ఫ్యామిలీ స్ట్రెంతెనింగ్ ప్రోగ్రామ్ (ఎఫ్ఎస్‌పి) పేరుతో విలేజ్ చుట్టుపక్కల గ్రామాల్లోని తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోతున్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు సంస్థ ప్రతినిధులు. కొందరికి ఆర్థిక చేయూతను అందించి కొత్త జీవితాన్ని కూడా ప్రసాదించారు. ఈ పనులన్నిటికీ కార్పొరేట్ సంస్థలు తలా ఒక చేయి వేస్తున్నాయి. చ్రిల్డన్స్ విలేజ్‌లు నడిపేందుకు మాత్రం యూరోపియన్ దేశాల దాతలే ఎక్కువ సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశాలను ఆర్థికమాంద్యం పీడిస్తుండటంతో.. దాతలు చేసే సాయంపైనా ఆ ప్రభావం పడింది. ఈ విలేజ్‌లలో చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. విమానాలను నడిపే ఫైలెట్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీఈవోలు, ఫ్యాషన్ డిజైనర్లు అయ్యారు.

—-* మల్లెంపూటి ఆదినారాయణ

ఇదొక భాగ్యం..
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun35.jpgమాది విశాఖలోని భీమిలి. అప్పట్లో వరదలొచ్చి మా జీవితాలన్నీ ఛిద్రమయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో మదర్స్ కావాలంటూ పత్రికలో వచ్చిన ప్రకటన చూశాను. అప్లికేషన్ పెట్టాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక ఢిల్లీలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ రెండేళ్లు అసిస్టెంట్ మదర్‌గా పనిచే శాక ఇప్పుడు మదర్‌గా పదోన్నతి పొందాను. నేను పెళ్లి చేసుకోలేదు కనక పిల్లల ఆలనాపాలన చూసే భాగ్యం లేదనుకున్నాను. ఇక్కడికొచ్చాక ఆ ముచ్చట తీరింది. మా హౌస్‌లో పన్నెండుమంది పిల్లలున్నారు. వాళ్లందరూ బాగా చదువుకుంటున్నారు. ‘అమ్మా నేను పాసయ్యాను. నూటికి తొంభై అయిదు మార్కులొచ్చాయి’ అంటూ చెబుతుంటే చాలా సంతృప్తిగా ఉంటోంది.
ఉషారాణి, మదర్

అస్తిత్వాన్ని కాపాడతాం..
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun36.jpgపిల్లలు మా విలేజ్‌లో చేరాక.. వాళ్ల పేర్లు, కులం, మతం.. ఇలాంటివేవీ మార్చము. పిల్లల అస్తిత్వానికి ఏ మాత్రం భంగం కలిగించము. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కూడా తల్లిదండ్రుల పేర్లే నమోదు చేయిస్తాం. ఇవన్నీ చిన్న విషయాలే అనుకుంటాం కాని పిల్లలకు తమ మీద తమకు విశ్వాసాన్ని కలుగజేస్తాయవి. పండుగలు, పుట్టినరోజుల నాడు చాలామంది అనా«థాశ్రమాలకు వచ్చి.. మిఠాయిలు పంచిపెట్టడం, భోజనాలు అందివ్వడం చేస్తుంటారు. ఇలా బయటి నుంచి వచ్చే పదార్థాలను మేము ప్రోత్సహించం. ఎందుకంటే, సమాజం సానుభూతి మీద బతుకుతున్నామన్న విషయం పదే పదే గుర్తుకొస్తే.. వాళ్లలో న్యూనతాభావం కలిగే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రతికూల ఆలోచనలను తొలగించి.. స్ఫూర్తిని రగిలించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటాం. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఎంతో మంది ప్రముఖులు మా విలేజ్‌కు వచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు.
కె.నటరాజన్, డైరెక్టర్,
విజయశ్రీ, అసిస్టెంట్ విలేజ్ డైరెక్టర్

ఆ పిలుపే ఒక బంధం
Description: Description: http://www.andhrajyothi-sunday.com/2012/mar/4/images/4-3sun39.jpgఈ పిల్లలు ఏ తల్లిదండ్రులకు పుట్టారో.. ఏ ఊరో తెలియదు. అయినా నోరు తెరిచి ‘అమ్మా’ అంటుంటే ఆ పిలుపుతోనే బంధం అల్లుకుంది. నేను పుట్టి పెరిగిన ఇంట్లో కూడా ఇంత అనుబంధాన్ని చూడలేదు. పిల్లలందరూ మా చేతుల్లోనే పెరిగి పెద్ద చదువులకు వెళుతుంటే అదొక వరంగా భావిస్తున్నాం. వాళ్లకు ఏమీ తక్కువ కాకుండా అన్ని సదుపాయాలను కల్పించింది సంస్థ. అర్థరాత్రయినా అపరాత్రయినా ఏ కష్టమొచ్చినా అమ్మలం మేమున్నాం. వాళ్లు ఆడుతూపాడుతూ చదువుకుంటే చాలు. మిగిలినవన్నీ మేము చూసుకుంటాం. దిక్కులేని పిల్లలన్న ఆలోచనే రాదు. ఇది అంతర్జాతీయ స్వచ్ఛందసంస్థ. అన్ని దేశాలలో వేలమంది పిల్లలు ఈ విలేజ్‌లలో ఉంటున్నారు. వాళ్లంతా వీరికి బంధువులేనని చెబుతుంటాను. మా హౌస్‌లో పెద్దమ్మాయి విష్ణుప్రియ డిగ్రీ చదువుతోంది. మిగిలిన పిల్లలు పాఠశాల చదువు చదువుతున్నారు.
సత్యవతి, మదర్

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “ఇది మా ఊరు…”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s