దొర కాళ్లు మొక్కిచదువుకునేవాళ్లం

                                                                 “మెడలో పలుగు విప్పగానే రంకలేస్తూ మేతకోసం పరుగులు పెట్టే పశువుల వెంట పరిగెట్టడం అంటే నాకు మహా ఇష్టం. ఎనిమిదేళ్ల వయసొచ్చేవరకూ నాకు అ..ఆలు తెలియవు. చెట్టుకింద కూర్చుని పలకమీద అక్షరం దిద్దుతుంటే… జంగిల్ నుంచి జైలుకు వచ్చినట్టు అనిపించింది” ప్రముఖ సామాజిక విశ్లేషకుడు కంచె ఐలయ్య తన సొంతూరి విషయాలను గుర్తుచేసుకుంటూ చెప్పిన మొదటి వాక్యం ఇది. ఆయన ఊళ్లో… దొర కాళ్లు మొక్కందే అక్షరం నేర్చుకోలేరుదొర దయచూపందే గుప్పెడు మెతుకులు గొంతులోకి వెళ్లవు…ఇంకా ఎన్నో కళ్లు చెమర్చే విషయాలను చెప్పారాయన. ఆ పెద్దాయన ఊరి విశేషాలే ఈవారం మా ఊరు

ailiah

“ఐదో తరగతి వరకూ ఎవరైనా చదువుకోవచ్చు. ఆరో తరగతిలో అడుగుపెట్టాలంటే దొర అనుమతి ఉండాలి. నేను,అన్నయ్య ఐదో తరగతి పూర్తయ్యాక ఆరో తరగతిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు మా అవ్వ(అమ్మని మేం అవ్వ అంటాం) మమ్మల్నిద్దర్నీ లక్ష్మారెడ్డి అనే దొర దగ్గరకి తీసుకెళ్లింది. మా రెక్కలు పట్టుకుని ఆయన కాళ్లమీద పడేసి….”అయ్యా నాకిద్దరు బిచ్చగాళ్లు…అచ్చరం నేర్చుకుని బతుకుతమంటున్నరు”అంటూ ఆమె కూడా అతని కాళ్లదగ్గర మోకరిల్లింది. దొర ఓ నిమిషం…తర్వాత “చదువుకోపోండిరా…”అని మమ్మల్ని కాళ్లమీద నుంచి లేవమన్నాడు.

ఆరోజు మా అమ్మ కళ్లలో కనిపించిన ఆనందం నేనెప్పటికీ మరిచిపోలేను. నాకు ఎనిమిదేళ్ల్లవయసప్పుడు నన్ను,అన్నయ్యని బడికి పంపించమని మా ఊరి లింగాచారి సారు అడిగినపుడు “అమ్మో నా పిల్లల్ని చదువుకి పంపితే…ఇంకేమన్నుందా! ఆ సరస్వతి బాపనోళ్లకు, కోమటోళ్లకే చదువు నేర్పుతుంది. సూద్రోళ్లను చంపేస్తుంది” అని అనడం కూడా నాకు గుర్తుంది.

ఆమె మాటలకర్థం దొరకాళ్లపై పడ్డప్పుడు అర్థమైంది నాకు. వెనకబడిన కులాలవారు వెట్టికి తప్ప దేనికీ పనికిరారని ఆనాటి దొరల నమ్మకం. వారి నమ్మకం ఎంత గట్టిదంటే ఆ మాటను మేం కూడా నమ్మేంత. చదువు విలువ తెలుసుకున్న మా అవ్వ మాత్రం అందరి కాళ్లు పట్టుకుని మమ్మల్ని చదివించింది. ఇప్పటికీ ఊరెళితే చిన్నప్పుడు చదువుకోసం మేం పడ్డ తిప్పలే గుర్తుకొస్తాయి. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకాలోని ‘పాపయ్యపేట’ మా ఊరు. చాలా చిన్న ఊరు. అడవికి ఆనుకుని ఉన్న ఊరు. పాకాల చెరువు కిందున్న ఊరు.

పాపయ్య పాతిన రాయి…
మా అమ్మ(నాయనమ్మను మేం అమ్మా అంటాం), పాపయ్య అనే అతను ఇద్దరూ కలిసి మా ఊరి బొడ్డురాయి పాతినట్టు చెబుతారు. ఊరికి ఎవరు బొడ్డురాయి పాతితే వారే ఊరికి అడ్రస్. అందుకే అతని పేరుమీద పాపయ్యపేట వెలిసిందన్నమాట. ఊరంతా గొర్లె కాపరులు, చేపలు పట్టేవారు, కల్లు తీసేవారే ఉండేవారు. మిగతా కులస్తులున్నా చాలా తక్కువమంది. మా ఊరు మహబూబ్‌రెడ్డి అనే దొర జాగీరులో ఉండేది. అదెలా అంటే….ఆరవ నిజాం మహబూబ్ అలీ పాషా ఒకరోజు మా దగ్గరగా ఉన్న పాకాల అడవికి వేటకు వచ్చినప్పుడు ఓ రెడ్డి తన కొడుకుని నిజాంకాళ్ల దగ్గరుంచి ‘నా బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాను…’ అంటే దానికి మెచ్చి ఆ రెడ్డికి మా ఊరిని ఇచ్చేశాడట.

అలా మా ఊరు ఆ దొర సొంతమైంది. మా దొర నర్సంపేట దగ్గర పెద్ద గడీలో ఉండేవాడు. ఆయన గడీ ఒక్కటే ఒక ఊరులా ఉండేది. అందుకే దాన్ని ద్వారకపేట అని పిలిచేవారు. మా ఊళ్లో కురుమోళ్లందరికీ గొర్లు, మేకలు, బర్రెలు ఉండేవి. పొద్దున లేవగానే కాసింత కల్లు నోట్లో పోసుకుని పశువుల్ని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయేవాళ్లు. ఐదేళ్ల పిల్లాడి నుంచి మూడో కాలొచ్చిన ముసలోడివరకూ అందరిదీ అదే పని. నేను, అన్నయ్య కూడా నాన్న(కొమరయ్య)తో పొద్దునే అడవికి వెళ్లిపోయేవాళ్లం.

పన్ను‘ నొప్పి….
కోడి దగ్గర నుంచి పాడి వరకూ అన్నిటికీ మేము దొరకు పన్ను కట్టాలి. ఉన్నా…లేకున్నా కట్టాలి. “మా వల్ల కాదు దొర”అన్న మాట వినిపిస్తే దొర కన్నెర్రజేస్తాడు. అతని కోపాన్ని చూసే దమ్ము ఎవరికీ ఉండేది కాదు. అడవిలో పశువుల్ని మేపుకున్నందుకు ప్రభుత్వానికి పుల్లర(పశువుల మేతకు పన్ను) కట్టాలి. దాంతో పాటు అటవీ అధికారులకు రోజూ కల్లు తాపించాలి. అడిగినప్పుడల్లా గొర్రెల్ని, మేకల్ని కోసి వండిపెట్టాలి. రోగాలొచ్చి పశువులు సచ్చిపోయినా….వానలొచ్చి వడ్లు తడిసిపోయినా…దొరకు, అటవీ అధికారులకు మాత్రం ముట్టేది ముట్టాలి.

ఊరు తరపునుంచి దొరకు కష్టం చెప్పుకోడానికి మగాళ్లు కూడా వెనకాడే పరిస్థితుల్లో మా అమ్మ (కంచె లింగమ్మ) ఒకసారి దొర దగ్గరికి వెళ్లి గోడసాటునుండి..”అయ్యా గీఏడు…గొర్రులు రోగమొచ్చి సచ్చిపోయినయ్…నీ కిచ్చెటందుకు మాకాడ ఏం లేదు”అని చెప్పింది. అప్పట్లో వెనకబడ్డ కులాల స్త్రీలు దొర కంట్లోనే పడేవారు కాదు. ఒక స్త్రీ గడి గడప తొక్కడం అదే మొదటిసారి. దానికి కారణం మా ఊరికొచ్చిపోయే కమ్యూనిస్టులు. వారిచ్చిన దైర్యం వల్లనే కనీసం పిల్లల్ని చదివించుకోవాలన్న కోరిక కొందరిలోనైనా వచ్చింది.

ఒంటిచేత్తో ఈత…
నాకు ఎనిమిదేళ్ల వయసుండగా మా ఊర్లో లింగాచారి అనే అతను ఒక చెట్టుకింద స్కూలు పెట్టాడు. మా అవ్వ మొదట్లో మమ్మల్ని చేర్పించనంది. ‘చదువు లేకపోతే నీ కొడుకులు కూడా నీలాగే గొర్లు కాసుకోవాలి…’అంటూ అతను అవ్వ(కట్టమ్మ)కి చదువు విలువ చెప్పాడు. ఆ రోజు మొదలు తను కన్నుమూసేవరకూ మా చదువు గురించే ఆలోచించింది. నేను స్కూల్లో చేరిన కొత్తలో రెండు నెలల నరకం చూశాను. ఎందుకంటే అప్పటివరకూ ప్రకృతికి అలవాటు పడ్డ పక్షిని. ఒక్కసారిగా నన్ను చెట్టుకింద కూర్చోబెట్టడం వల్ల జంగల్ నుంచి జైలుకి వెళ్లినట్టు ఉండేది.

అదీ ఎనిమిదేళ్లు వచ్చాక అక్షరాలంటే అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. అందులో మా ఊరు చాలా అందంగా ఉండేది. పశువుల మెడలో పలుగు విప్పగానే రంకలేస్తూ మేతకోసం పరుగులు పెడుతుంటే దానికి వెనక పరిగెట్టడం నాకు చాలా ఇష్టం. అలా అడవుల్లోకి పోయి అక్కడ దొరికే రేగిపండ్లు, కలింకాయలు, ఇప్ప పువ్వు, తునిక పండ్లు తినేవాడ్ని. మా ఊర్లో మేం చదువుకుంటుంటే కోమటోళ్లు మా వంక గుర్రుగా చూసేవారు. వారి ఇళ్లలో ఆడపిల్లలు చదువుకోవచ్చు సూద్రోళ్ల ఇళ్లలో మగపిల్లలు కూడా చదువుకోవద్దనేవారు. నిజమే వారన్నట్టుగానే మాకు చదువురాదు. వారికొచ్చినంత సులువుగా అస్సలు రాదు.

పెద్ద బాలశిక్షలో ‘చేతవెన్న ముద్ద’ పద్యం చదవడానికి నా నోరు తిరిగేది కాదు. ‘కృష్ణ’ అనే పదం అనడానికి వచ్చేది కాదు. మా భాషలో వత్తులు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కురుమ భాష కన్నడానికి దగ్గరగా ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగుభాష మాకు పరాయిభాషతో సమానం. మా ఊర్లో ఐదోతరగతి పూర్తయ్యాక ఆరోతరగతి కోసం పక్కూరికి వెళ్లాల్సివచ్చేది. మా ఊరు దాటాలంటే ముందు పాకాల వాగు దాటాలి. ఎండాకాలమయితే పరవాలేదు నీళ్లలో నుంచి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. అదే వానాకాలమయితే వాగులో ఈదుకుంటూ వెళ్లాలి.

రోజూ అలా వెళ్లడం కష్టం కాబట్టి సోమవారం పొద్దునే వెళ్లిపోయి స్కూలు దగ్గరే ఉండి తిరిగి శనివారం సాయంత్రం వచ్చేవాళ్లం. వెళ్లేటప్పుడే వారానికి సరిపడా సరుకులు, బట్టలు తీసుకెళ్లేవాళ్లం. అన్నిటినీ చిన్న చిన్న సంచుల్లో పెట్టి మూటకట్టి వాగు ఒడ్డున పెట్టుకుని ఒకచేత్తో మూట పట్టుకుని ఆ చేతిని పైకి పెట్టి ఒంటిచేత్తో ఈదుకుంటూ వాగు అవతలి ఒడ్డున ఆ సంచి పెట్టి మళ్లీ తిరిగొచ్చి మిగతావాటిని తీసుకెళ్లి అక్కడి నుంచి అన్నింటినీ తీసుకుని స్కూలుకి వెళ్లేవాళ్లం.

చదువుకోమని చెప్పేవారు కాని చదువుకోసం ఊళ్లో ఏ ఒక్కరూ సాయం చేసేవారు కాదు. మా ఇంట్లో ఒక ముసలావిడ ఉండేది….ఆమె మేం సాయంత్రంపూట కిరోసిన్ దీపాల దగ్గర కూర్చుని చదువుకుంటుంటే మాకు కళ్లు పోతాయని ఏడ్చేసేది. ఆమె ఆ బెంగతోనే చనిపోయిందని చెప్పేవారు. చదువు విషయంలో మా పెద్దల అజ్ఞానం ఆ స్థాయిలో ఉండేది.

అలాంటి పరిస్థితుల్లో కష్టపడి పుస్తక భాష నేర్చుకున్నాను. పదో తరగతి పూర్తయ్యాక అంతకన్నా కష్టపడి ఇంగ్లీషు నేర్చుకున్నాను. అన్నట్టు పదో తరగతి అంటే గుర్తొచ్చింది. ఆ సమయంలోనే మా అవ్వ చనిపోయింది. ఆమె చనిపోయింది అనారోగ్యంతో అయినా మా ఊరివాళ్లంతా ‘చదువుకి పోయి తల్లిని చంపిండ్రు’ అన్నారు. నిజమే మేం చదువుకి పోకుండా గొర్రుల్ని కాసి మందని పెంచితే మా అవ్వకు వైద్యం చేయించేవాళ్లమేమో….మా చదువు మమ్మల్ని కాపాడింది కాని మా అవ్వని కాపాడలేదు. వెనకబడ్డవాడు ఒక్క ముందడుగు వేస్తే ఎన్నింటిని వదులుకోవాల్సి వస్తుందోననిపించేది. మా అవ్వ చనిపోయిందనుకోవడం లేదు. నేను రాసే ప్రతి అక్షరంలో మా అవ్వ ఉంది.

ఊళ్లో ఇంగ్లీషు స్కూలు…
నేను 1971లో వరంగల్‌లో పియుసి పూర్తిచేశాను. ఆ తర్వాత బిఎ, ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎ చదివాను. ఉద్యోగంలో స్థిరపడ్డాక మా ఊరి గురించి ఆలోచించాను. ఆర్థికసాయం చేయడం వల్ల ఎవరో నలుగురి కడుపు నిండుతుంది. కాని ఊరిపేరు నలుదిశలా చాటేలా చేయాలంటే ఊళ్లో విద్య పెరగాలి. ఇందుకోసం ‘దళిత్ ఫౌండేషన్ నెట్‌వర్క్’ అనే సంస్థని సంప్రదించాను. తండాల చుట్టూ ఉన్న గామాల్లో ఆ సంస్థ స్కూళ్లను నిర్మిస్తుంది. చాలా పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దాతలున్నారు దానికి. ఏదో విధంగా ఆ సంస్థని ఒప్పించి 2003లో మా ఊళ్లో ‘గుడ్ షెపర్డ్ ఇంగ్లీషు మీడియం’ స్కూలుని పెట్టించాను. ప్రస్తుతం మా ఊళ్లో మూడేళ్ల పిల్లాడిని కూడా అందులోని ప్లేసూల్లో చేర్పిస్తున్నారు.

ఆ స్కూలు బోధన చాలా అడ్వాన్సుగా ఉంటుంది. అందుకని మా స్కూలు విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్‌లో చక్కగా మాట్లాడుతారు. ఏది సాధించాలన్నా చదువు ముఖ్యం. ప్రపంచంలో కలవాలంటే అవసరమైన భాషలు కూడా రావాలి. ఆ ధ్యేయంతోనే మా ఊరి పిల్లలకు ఇంగ్లీషు విద్యని దగ్గర చేశాను. ప్రస్తుతం మా స్కూల్లో 600 పైగా విద్యార్థులు పాపయ్యపేట ప్రపంచానికి వందలసంఖ్యలో ఇండియన్ ఐన్‌స్టీన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు మా ఊరికి వెళ్లి స్కూల్లో పిల్లల్ని కలుస్తుంటాను.

భువనేశ్వరి

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “దొర కాళ్లు మొక్కిచదువుకునేవాళ్లం”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s