కే. విశ్వనాధ్ అంతరంగం

గర్భ గుళ్లో
అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా…
అమ్మ ఒళ్లో
పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా…
సముద్రంలో
కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా…
వెండితెరపై సినిమాను సాకాడాయన.
అందుకే మనకిన్ని కళాఖండాలు… కలకండలు.
పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళాతపస్వి ప్రతి ప్రయత్నం
సుందరం… సుమధురం…
సున్నితం… సమున్నతం.
మంగళవారం కె.విశ్వనాథ్ పుట్టిన్రోజు.
అందుకే ఈ ‘అదర్‌సైడ్’ సందర్భోచితం.

vish1
సుమారు 45 ఏళ్ల పాటు సినిమాలే ప్రపంచంగా బిజీబిజీగా గడిపారు. ఇప్పుడు జీవితం ఎలా అనిపిస్తోంది?

కె.విశ్వనాథ్: మీ ఉద్దేశం ఏంటి? ఏ పనీ లేకుండా కూర్చున్నాననా? (నవ్వుతూ).

అదేం కాదండీ. దర్శకత్వం చేయడం లేదు కదా.. తీరిక సమయం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది…

కె.విశ్వనాథ్: ఉదయం టిఫినేంటి? లంచ్ ఏంటి? డిన్నర్‌లో ఏ ఐటమ్స్ ఉంటాయి? ఇవి మినహా ఏముంటాయ్… ప్రత్యేకంగా. ‘శుభోదయం’సినిమాలో చంద్రమోహన్ పాత్ర గుర్తుంది కదా. అచ్చంగా నా నిజ జీవితపాత్ర అలానే ఉంటుంది. చాలా బద్దకస్తుణ్ణి. అయితే ప్రొఫెషన్ దగ్గరికొచ్చేసరికి చాలా సిన్సియర్. ఆకలి, నిద్ర కూడా మర్చిపోతాను. ఇప్పటికీ నా మనసు ఉత్సాహంగానే ఉంది. రోజూ ఏవో ఆలోచనలు వచ్చిపోతుంటాయి. ఈ ఆలోచనతో సినిమా చేస్తే ఎలా ఉంటుందా? అనిపిస్తుంది. మళ్లీ బద్దకం ఆవహిస్తుంది. ఓ రకంగా నాది వాలంటరీ రిటైర్మెంటే. ఇప్పటికీ నన్ను సినిమాలు తీయమని అడిగేవాళ్లు వస్తూనే ఉన్నారు. నేనే ఆసక్తి చూపించడంలేదు. ఇన్నాళ్లూ బిజీగా ఉండి ఫ్యామిలీ లైఫ్ చాలా కోల్పోయాను. పిల్లల ఆలనా పాలనా కూడా పట్టించుకోలేకపోయాను.

ప్రతి మగాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. మరి మీ విజయం వెనక?

కె.విశ్వనాథ్: ఇంకెవరు నా భార్యే. మాదో పేద్ద ఉమ్మడి కుటుంబం. వచ్చే పోయే బంధువులతో ఇల్లు సత్రంలా ఉండేది. ఎవ్వరికీ ఇబ్బంది రానిచ్చేది కాదు. ఓపక్క పెద్దవాళ్లకు మర్యాదలు, మరోపక్క పిల్లల్ని స్కూలుకు తయారు చేయడం. అన్నీ ఓపిగ్గా చూసుకునేది. తన షెడ్యూలు చూసి నాకే జాలి అనిపించేది కానీ ఏం చేయగలను? ఏనాడూ నా పనికి అడ్డు రాలేదు తను. ఇబ్బందిపెట్టలేదు కూడా. నిజం చెప్పాలంటే నా తరఫు బంధులెవరో నాకన్నా ఆవిడకే బాగా తెలుసు. క్షణం తీరిక లేకుండా కుటుంబ భారాన్ని మోసే తన దగ్గర‘శంకరాభరణం’ కథ వింటావా? అని ఏం అడుగుతాం.. అందుకని నా సినిమాల గురించి చర్చించేవాడ్ని కాదు..

మీ పిల్లల గురించి చెప్పండి?

కె.విశ్వనాథ్: మాకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్దవాడు సింగపూర్‌లో ఉంటున్నాడు. సౌత్ ఈస్ట్ ఏషియా డాటాక్రాఫ్ట్ కంపెనీకి వైస్ చైర్మన్. వాడికి ఇద్దరు మగపిల్లలు. మా రెండో అబ్బాయికి హైదరాబాద్‌లోనే ఉద్యోగం. వాడికి ఇద్దరు కూతుళ్లు. ఇక నా కూతురు చెన్నైలో ఉంటుంది. అల్లుడుగారు ఇంజినీర్‌గా పనిచేసి, రిటైరయ్యారు. వారికో పాప ఉంది.

మీ కుటుంబం నుంచి ఎవ్వరూ సినిమా ఫీల్డ్‌కి రాకపోవడానికి కారణం?

కె.విశ్వనాథ్: నేనే ప్రోత్సహించలేదు. వాళ్లు ఇక్కడ రాణిస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ రోజుల్లో పైకి రావడమంటే చాలా కష్టం. మా రోజులు వేరు. ప్రతిభను గుర్తించే మనుషులు అప్పుడు చాలామంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ, పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను.

కె.విశ్వనాథ్ వారసులుగానైనా ఓ గుర్తింపు వచ్చేదేమో?

కె.విశ్వనాథ్: నా గౌరవ మర్యాదలన్నీ నా బిడ్డలకు ట్రాన్స్‌ఫర్ కావాలనే రూలేమీ లేదిక్కడ. ఎవరికి వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. నాలాగా మా పిల్లల్ని కూడా డెరైక్టర్లు చేయాలనుకుని నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా. అంత డబ్బు కూడా నేను సంపాదించలేదు. మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని నేను గర్వంగానే చెప్పుకోగలను.

సినిమా ఫీల్డ్‌కి ఉండే గ్లామరే వేరు కదా?

కె.విశ్వనాథ్: సినిమాకి గ్లామర్ ఉన్న మాట వాస్తవమే. అయితే దేని మర్యాద దానిదే. షారుక్‌ఖాన్ బయట కనిపిస్తే అభిమానులు ఎగబడి చొక్కాలు చించేసుకుంటారు. అదే అబ్దుల్ కలాం కనబడితే ఎవ్వరూ స్పందించకపోవచ్చు. అలా అని ఆయన గొప్పతనమేమీ తగ్గిపోదు కదా.

మీ సినిమాలన్నీ సంగీత, సాహిత్యాలకు నిలువెత్తు రూపాల్లా అనిపిస్తాయి. వాటిమీద మీకెందుకంత ఆసక్తి?

కె.విశ్వనాథ్: నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలనుకున్నాను కానీ నేర్చుకోలేకపోయాను. మా ఇంట్లోవాళ్లు కూడా నన్ను ఇంజినీర్‌ని చేయాలనుకున్నారు కానీ నాలోని సంగీత తపనను గమనించలేదు. మనకేది లేదో అదే కావాలనిపిస్తుంది. అందుకే నా సినిమాల్లో సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ చూపేవాణ్ణి.

మీది సంప్రదాయ కుటుంబం కదా… సినిమాల్లోకి వెళతాననప్పుడు ఇంట్లో వాళ్లేమన్నారు?

కె.విశ్వనాథ్: బీఎన్‌రెడ్డిగారు, నాగిరెడ్డిగారు ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా చేసేవారు మా నాన్నగారు. కానీ నేను సినిమాల్లోకి రావడానికి అది కారణం కాదు. అప్పుడు మద్రాసులో కొత్తగా వాహినీ స్టూడియోస్ ఆరంభించారు. దాంట్లో లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ తెప్పించి, యంగ్ గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనప్ చేసి, టెక్నీషియన్స్‌గా తీసుకుంటున్నారు. ఆ విషయం గురించి మా అంకుల్ ఒకరు.. మనవాడిని ఎందుకు చేర్చకూడదని నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నాన్నగారితో అన్నారు. మా నాన్నగారు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ‘వెళతావా’ అని అడిగితే ‘సరే’ అన్నాను. ఆ విధంగా ‘సౌండ్ డిపార్ట్‌మెంట్’లో చేరాను.

ఆ ఎపిసోడ్ కొంచెం వివరంగా చెబుతారా?

కె.విశ్వనాథ్: కెమెరా, ఎడిటింగ్‌లానే సౌండ్ అని మొదట్లో అనుకునేవాడ్ని. రాను రాను సౌండ్‌కి కూడా ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి, ఇంకేం చేస్తే బాగుంటుందనే తపన కలిగింది నాకు. ఆ రోజుల్లో డైలాగ్స్ అన్నీ లొకేషన్లోనే డెరైక్ట్‌గా రికార్డ్ అయ్యేవి. ప్రత్యేకంగా డబ్బింగ్ ఉండేది కాదు. అందువల్ల పర్‌ఫెక్ట్‌గా ట్రాక్ రావాలి. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్టు డైలాగులు చెప్పలేక, మాటలు మింగేస్తుంటే, ఒత్తులు సరిగ్గా పలకకపోతుంటే వాళ్లతో నేరుగా చెప్పలేక ‘సౌండ్ రికార్డిస్ట్’ సహాయం తీసుకునేవాళ్లు దర్శకులు. ఎందుకంటే సౌండ్ రికార్డిస్ట్ సెట్లోనే ఉండేవాడు. ‘కొంచెం మాటలు దొర్లుతున్నట్లున్నాయ్.. చెప్పండి సార్’ అంటూ మా చెవుల్లో చెప్పేవాళ్లు దర్శకులు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లకి చాలా గౌరవం ఇచ్చేవాళ్లు. ‘నీకేం తెలుసు.. నువ్వెవరు చెప్పడానికి’ అనేవాళ్లు కాదు. అందుకని ఉచ్ఛారణ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే స్వేచ్ఛ ఉండేది. రకరకాల సన్నివేశాలు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు… ఇలా అనుభవం సంపాదించుకోవడానికి చాలా స్కోప్ దొరికింది.

సంగీతం అంటేనే ‘శబ్దమయం’. మీకు నచ్చిన దాంతో కెరీర్ ఆరంభం కావడం ఎలా అనిపించింది?

కె.విశ్వనాథ్: అప్పుడు కెరీర్ ఇలా ఉండాలి.. అని ప్రత్యేకంగా అనుకున్నది లేదు. సౌండ్ రికార్డిస్ట్‌గా చేరినప్పుడు డెరైక్టర్ అవుతానని అనుకోలేదు. నా ప్రతిభ, ఆసక్తి ప్రవర్తన, చొరవ గమనించి అక్కినేని నాగేశ్వరరావులాంటి మహానుభావులు ‘సౌండ్ రికార్డింగ్‌కే ఎందుకు పరిమితం కావడం.. క్రియేటివ్ సైడ్ ఎందుకు రాకూడదు’ అన్నారు. ‘మూగమనసులు’తో పాటు కొన్ని చిత్రాలకు సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా పని చేశాను. అలాగే ఆదుర్తి సుబ్బారావుగారితో స్క్రిప్ట్స్‌కి కో-ఆర్డినేట్ చేశాను. వీటిని గమనించి… ఈ వ్యక్తిలో ఈ టాలెంట్ ఉంది కాబట్టి.. ఇటువైపు మళ్లిస్తే బాగుంటుందనుకుని ఆయన సజెస్ట్ చేశారు.

మీ సినిమాల ద్వారా ఏదో ఒక ‘నీతి’ చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు చెప్పిన విషయాన్ని ఎవరైనా ఆచరించినట్లు మీ దృష్టికి వచ్చిందా?

కె.విశ్వనాథ్: ఓ పెద్ద రేంజ్ ఉన్న హీరో ‘నువ్వు రోజూ పాలు తాగకు.. విస్కీ తాగు’ అని సినిమాలో డైలాగు చెబితే వినడానికి బాగుంటుంది. జర్దా అమ్ముడుపోయినట్లుగా మంచిగంధం అమ్ముడుపోదు కదా. ఎందుకంటే నెగటివ్ థింగ్స్‌ని గ్రహించడం ఎప్పుడూ బాగానే ఉంటుంది. అయితే ఇంకా మన రక్తంలో ఎలా ఉందంటే ‘ఆ.. ఏదో దరిద్రం చెబుతున్నాడులే.. ఏంటిలే వినేది?’ అనే లెక్కకు రాలేదు. నేను మద్రాసులో ఒక అపార్ట్‌మెంట్ కొనడానికి వెళితే.. ఆ సూపర్‌వైజర్ ఇల్లు చూపిస్తూ. ‘మీ సిరిసిరి మువ్వ’ చూసిన తర్వాత నేనొక మూగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను’ అన్నాడు. అంతకంటే ఏం కావాలి? తెలిసీ తెలియక సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఉంటుంది. వెయ్యిలో ఒకడైనా దానికి ప్రభావితం అయ్యాడంటే అది చాలు. సినిమా అనేది వినోదం మాత్రమే అంటారు. ఎవరి నమ్మకం వారిది. కానీ నీతి, వినోదం రెండూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని, ఇహం పరం రెండూ ఉంటాయన్నది నా అభిప్రాయం.

కరెంట్ ఎఫైర్స్‌ని ఫాలో అవుతుంటారా?

కె.విశ్వనాథ్: కరెంట్ అఫైర్స్.. అంటే ఏంటి? రోజూ ఏదో గొడవ జరుగుతుంటుంది. రాష్ర్ట విభజన కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరోటి కావచ్చు. పేపర్ తీయాలంటే భయం వేస్తోంది. ఇక రాజకీయాల గురించి అస్సలు తెలియదు. నా అసిస్టెంట్లను అడుగుతుంటాను. తెలంగాణ అంటున్నారు. వస్తుందా? ఏ పార్టీలో ఏమేం జరుగుతున్నాయని అడిగి తెలుసుకుంటుంటాను.

ప్రస్తుతం ‘సూర్యపుత్రుడు’ చేస్తున్నారు… బుల్లితెర అనుభవం ఎలా అనిపిస్తోంది?

కె.విశ్వనాథ్: నేను వేటూరి సుందరామ్మూర్తిగారి కోసం టీవీకొచ్చాను. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా చేయలేదు. వీళ్లు తమిళ నిర్మాతలు. ఒక మంచి ప్రయోజనం కోసం నా దగ్గరకొచ్చారు. కానీ అది ఆచరణలో పెట్టలేదు. మళ్లీ వాళ్లు ‘సూర్యపుత్రుడు’ ప్రాజెక్ట్‌తో వచ్చారు. ఇది మీరు చేస్తే చాలా బాగుంటుందన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు. నాకు చిన్నా పెద్దా అని కాదు. అలాగే భయమూ లేదు. ఈయనకు సినిమాల్లో వేషాల్లేక చేస్తున్నాడని ఎవరూ అనుకోరు. టీవీ సీరియల్ అంటే ఒత్తిడి అని విన్నాను. రాత్రింబగళ్లు చేయాలంటారు. నా వల్ల కాదన్నాను. కానీ అలా ఉండదని, మీకు సౌకర్యవంతంగానే ఉంటుందని అన్నారు. చివరికి ఒప్పుకున్నాను.

వాణిజ్య ప్రకటనల్లో సైతం చేస్తున్నారు? కారణం ఏంటి?

కె.విశ్వనాథ్: దీనికి రకరకాల కారణాలు చెప్పొచ్చు. చన్నీళ్లకు వేడినీళ్లు తోడులా విశ్వనాథ్ యాడ్స్ చేస్తున్నాడని చెప్పుకునేవాళ్లు ఉంటారు. ఏదో సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టే చేశాడనేవాళ్లు ఉంటారు. నేను ఫస్ట్ చేసిన యాడ్ ‘మెడ్విన్’ది. మణిశంకర్ దర్శకత్వం వహించారు. ఆ యాడ్‌లో నేను ఫ్యామిలీ డాక్టర్‌లా చేశాను. నాకు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఓ నమ్మకం. అందుకని కాన్సెప్ట్ నచ్చి, ఆ యాడ్‌లో చేశాను. ఆ తర్వాత కొంత టైమ్ గడిచింది. ‘సువర్ణభూమి’ వాళ్లు వచ్చారు. చాలా చిన్న స్థాయి నుంచి వస్తున్నామండి. మీరు చేసి పెడితే మాకు ఉపయోగం ఉంటుందన్నారు. చాలారోజులు చెయ్యనన్నాను. కానీ వాళ్లు పట్టు వదల్లేదు. సరే చేశాను. మరి.. వాళ్ల అదృష్టమో నా అదృష్టమో అది బాగా అందుకుంది. అది చూసి, మరికొంతమంది వచ్చారు. సరే… అమితాబ్‌బచ్చన్ అంతటివాడు చేయగా లేనిది మనమెందుకు చెయ్యకూడదు అనుకున్నాను. పంచతులసి యాడ్‌లో కూడా చేశాను.

‘శంకరాభరణం’ని మళ్లీ తీయాలనుకుంటే ఏ ఆర్టిస్ట్‌తో తీస్తారు?

కె.విశ్వనాథ్: అప్పుడు కూడా బోల్డంతమంది ఆర్టిస్టులున్నారుగా. మరి సోమయాజులుగారితోనే ఎందుకు చేశాను. మళ్లీ అలాంటి కొత్త ఆర్టిస్టుని చూడాల్సిందే. ఇప్పుడు ప్రతివాళ్లకీ ఓ ఇమేజ్ ఉంటుంది కదా. నాగార్జునని తీసుకున్నామనుకోండి.. ఆయన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఫైట్లు చేయాలి, ఇద్దరు హీరోయిన్లు ఉండాలి. ఇలా ఒక సెటప్ ఉంటుంది. దాన్నుంచి దూరంగా వెళ్లలేం. ఒకవేళ అమితాబ్‌బచ్చన్ ఫ్రీగా ‘శంకరాభరణం’ చేస్తానన్నా… ఆయన్ను తీసుకుంటే ‘మిస్ కాస్టింగ్’ అవుతుంది. సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఎన్టీఆర్, భానుమతి ఫ్రెష్‌గా ఉన్నారు కాబట్టి ‘మల్లీశ్వరి’ కుదిరింది. ‘మాయాబజార్’ మళ్లీ తీయలేం. కొన్ని సబ్జెక్ట్స్ చేయలేం. ఒకవేళ ‘శంకరాభరణం’ చేస్తే అప్పుడెలా తీశానో ఇప్పుడూ అలానే తియ్యాలి. ఆరోజు సోమయాజుల్ని పెడితే కచ్చితంగా సినిమా ఆడుతుందనే నమ్మకంతో తీయలేదు. ఆ టైమ్ బాగుంది. మా టైమ్ బాగుంది. మా అందరి నక్షత్రాలు ఫేవర్ చేశాయి. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పుడూ ‘శంకరాభరణం’ చేయొచ్చు… కాదనడంలేదు..

జాతకాలను నమ్ముతారా?

vish2

కె.విశ్వనాథ్: నమ్ముతాను. కానీ ప్రతి విషయానికీ జాతకాలు చూడను. ఏదో ఒక పవర్ ఉంటుందనే నమ్మకం మాత్రం ఉంది. అష్టమి,నవములలో మంచిపనులు ప్రారంభించను. చూస్తూ చూస్తూ చెయ్యడం ఎందుకని. అంటే… ధైర్యం లేక… విల్‌పవర్ లేక. అది ఒక విధంగా బలహీనత కావచ్చు.. ఏమో అదే బలమూ కావచ్చు. వర్జ్యంలో ఎన్ని రైళ్లు పరిగెత్తడంలేదు… యమగండంలో ఎన్ని విమానాలు ఎగరడంలేదు. అందరికీ జరగవు కదా. తెలిసి తెలిసి ఎందుకు చెయ్యాలని. తప్పించాల్సినవి ఎందుకు తప్పించకూడదని. అంతే తప్ప మరే కారణం లేదు.

మీ ఇష్టదైవం ఎవరు?

కె.విశ్వనాథ్: మా అమ్మానాన్న. ఇవాళ నేనీ స్థాయిలో ఉన్నానంటే హండ్రెడ్ పర్సంట్ వాళ్ల ఆశీర్వచనమే. నా పరిధి ఏంటో, నా చదువెంతో నాకు తెలుసు. నేను సినిమాలు చూసి నేర్చుకున్నానా? లేక ఫారిన్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌కి వెళ్లానా? లేదా చాలా గ్రంథాలు చదివేసి, ఆకళింపు చేసుకుని, ఆ ఘట్టంలోంచి ‘పాండవ వనవాసం’ని సోషియలైజ్ చేసి, అర్జునుణ్ణి ఎన్టీ రామారావుగా మార్చి తీశానా?కాదు కదా. మరి.. దీనికి కారణం ఏమై ఉండాలి? ఏదో ఒక శక్తి నాలో ఉండాలి కదా. మా అమ్మానాన్నలు చేసిన పుణ్యం, పూజలే ఇవాళ ఫలిస్తున్నాయి. కాపాడుతున్నాయని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను.

మీ నాన్నగారి గురించి చెబుతున్నప్పుడు మీ కళ్లు చెమర్చుతున్నాయి…?

కె.విశ్వనాథ్: మా నాన్నగారు చాలా గమ్మత్తయిన మనిషి. చాలా మితభాషి. ఏదీ పైకి చెప్పే మనిషి కాదు. జ్యోతిషం ఆయన హాబీ. మా కుటుంబంవరకు మాత్రమే చెప్పేవారు. అయితే ఏ సినిమా ప్రారంభం గురించీ నేను ఆయన్ను అడగలేదు. ‘నువ్వీ రోజు చేస్తున్నావు కాబట్టి దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది’ అని ఆయనా ఎప్పుడూ చెప్పలేదు. నేను పని చేసే కంపెనీలు నియమించుకున్న పురోహితులు పెట్టిన ముహూర్తానికే చేసేవాణ్ణి.

ఇంట్లో గొప్ప జ్యోతిష్యుణ్ణి పెట్టుకుని మీకెందుకు అడగాలనిపించలేదు?

కె.విశ్వనాథ్: సినిమా అనేది ఊహకందని వ్యాపారం. నేనో ముహూర్తం పెట్టించి, సినిమా ఆడకపోతే ‘ఆయన అనవసరంగా చెప్పారు’అంటారు. అందుకే అడిగేవాణ్ణి కాదు.

మీ విజయాలను మీ నాన్నగారు ఎలా ఆస్వాదించేవారు?

కె.విశ్వనాథ్: మా నాన్నగారు నా విజయాన్ని చూసి లోలోపల ఆనందించేవారు. ఆయన పోయిన తర్వాత పాత పుస్తకాలను చూస్తే..‘శంకరాభరణం ఈరోజున ఈ నక్షత్రం, ఈ ఘడియల్లో రష్ చూశాను. దీనికి ఈ యోగం ఉంది’ అని రాసుకున్నారు. ఇలా నా సినిమాల గురించి రాసుకున్నారు. నా అదృష్టం ఏంటంటే… నాకు చాలా మంచి కుటుంబం ఉంది. నా చెల్లెళ్లు కానీ, నేను కానీ ఉన్నదాంతో ఆనందపడతాం. ‘మా అన్నయ్య ఇంత పైకొచ్చాడు’ అని వాళ్లు ఆనందపడతారు తప్ప.. దాన్ని నలుగురికీ తెలియపర్చి, తద్వారా లాభం పొందాలని ఏనాడూ అనుకోలేదు. అలాంటి కుటుంబం మాది. వాస్తవానికి చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. నా 19వ ఏట నేను మద్రాసు వెళ్లాను. చెడిపోవడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఏది కావాలంటే అది. కానీ మా అమ్మనాన్నలకు తెలిస్తే ఏమవుతుంది? అనే భయం ఉంటుంది కాబట్టి క్రమశిక్షణగా ఉండేవాడ్ని. ఆ భయం ఇవాళ చాలా అవసరం. కొంతమంది అంటుంటారు.. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అని. ఒక మంచి కుటుంబానికి చెందినవాళ్లయితే తల్లిదండ్రులు బతికున్నంతకాలం అమ్మానాన్నలకు భయపడతారు. వాళ్లు పోయిన తర్వాత ఎవరో ఒకరుండాలి కదా. అదే దేవుడు. ఆ దేవుడు మనల్ని గమనిస్తున్నాడనే ఫీలింగ్ తప్పు చేయనివ్వదు.

మీ బాల్యం గురించి తెలుసుకోవాలని ఉంది…

కె.విశ్వనాథ్: అమ్మానాన్న ఏమంటారో అనే ఒక జోన్‌లో బతికిన పిల్లలం మేం. నా చిన్నప్పుడు జరిగిన ఓ చిన్ని సంఘటన నాకు బాగా గుర్తు. విజయవాడలో చదువుతుండగా కాలువ దాటి స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చేది. మా ఇంటి ఎదురుగానే కాలువ ఉండేది. వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం నీళ్లే ఉండేవి. నాతో పాటు వచ్చే పిల్లలందరూ.. బ్రిడ్జి మీద నుంచి కాకుండా కాలువలోంచి వెళ్లిపోదాం అన్నారు. నిక్కర్లు పైకి మడుచుకుని కాలువలో దిగాం. మా మేనమామ కూతురు ఆ విషయం మా నాన్నగారికి చెప్పేసింది. దాంతో మా నాన్నగారు బయటికొచ్చి. ‘రేయ్’ అని అరిచారు. అందరూ అలా నిలబడిపోయారు. ఆ భయానికి నేను చేసిన పనులన్నీ నీళ్లలోనే కలిసిపోయాయనుకోండి (నవ్వుతూ). పిల్లలందరూ అవతలి ఒడ్డుకు పరిగెత్తుకు వెళ్లిపోయారు. నేను మాత్రం ఇవతలి ఒడ్డుకు వచ్చేశాను. ఆయన పక్కనుంచే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిపోయాను. కొంతమంది ఇళ్లల్లో నరికి పాతేస్తానని.. ఇలా ఏవేవో పిల్లలను తిడుతుంటారు. కానీ మా నాన్నగారు ‘రాస్కెల్’ అని తప్ప మరో తిట్టు తిట్టేవారు కాదు. మా నాన్నగారికి ఓ బంట్రోతు ఉండేవాడు. పేరు భద్రుడు. బట్టలు మార్చుకుని వెళ్లు.. భద్రుడు సైకిల్ మీద దింపేస్తాడన్నారు. ఇంకేమీ అనలేదు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ కాలువ సైడ్ వెళ్లలేదు. మమ్మల్ని మౌల్డ్ చేసిన విధానం అలా ఉండేది.

ఇంకా చిన్నప్పటి సంగతులు ఏమైనా గుర్తున్నాయా?

కె.విశ్వనాథ్: మా ఊరి స్కూల్లో నన్ను ఒకటో క్లాసు నుంచి మూడోతరగతికి ప్రమోట్ చేశారు. మాది రేపల్లె దగ్గర పెదపులివర్రు. మొన్నా మధ్య తానా ప్రెసిడెంటు తోటకూర ప్రసాద్‌గారు, గంగాధర్ అని మేమంతా కలిసి మా ఊరెళ్లాం. చిన్నతనం గుర్తొచ్చింది. ఊరి శివాలయం,ఎదురుగా విష్ణు ఆలయం… చిన్నప్పుడు నేను శివాలయం నుంచి బయటికొస్తుంటే.. ఒకడు మాస్కు వేసుకుని జడిపించాడు. మూడురోజులు జ్వరంతో పడుకున్నాను.

చిన్నప్పుడు సినిమాలు చూసేవారా?

కె.విశ్వనాథ్: యాక్చువల్‌గా మేం సినిమా చూడాలంటే పెదపులివర్రు నుంచి రేపల్లె వెళ్లాలి. ఆ సినిమా చూడాలంటే మోతుబరి దగ్గర ఎద్దుబండి తీసుకుని, అందులో గడ్డి వేసుకుని, దాంట్లో కూర్చుని.. ఓ పెద్ద కారులో వెళుతున్నట్లుగా వెళ్లేవాళ్లం. దారిమధ్య ఎక్కడైనా పొలంలో ఆంబోతు కనిపిస్తే బండి ఆపేసేవాడు. మేమంతా బండి దిగి, చెట్లచాటున దాక్కునేవాళ్లం. అంత భయంగా ఉండేది. ఆ రోజుల్లో ఆంబోతు వస్తోందంటే.. బండి వెళ్లడానికి లేదు. రెండు కొమ్ములతో లేపేసేది.

చిన్నతనంలో మీకు ప్రత్యేకంగా ఏదైనా వాహనం ఉండేదా?

కె.విశ్వనాథ్: మా నాన్నగారు నాకు మూడుచక్రాల సైకిలు కొనిపెట్టారు. దాన్నే మెర్సిడెస్ బెంజ్‌లా ఫీలయ్యేవాణ్ణి. అందులో తిరుగుతుంటే గర్వంగా ఉండేది. నేను డెరైక్టర్ అయిన తర్వాత కూడా నాకు చాలా సంవత్సరాలు కారు ఉండేది కాదు. అలాంటిది ఆ మూడు చక్రాల సైకిలు మీద వెళుతుంటే.. అందరూ చూడాలని టింగుటింగుమంటూ బెల్లు కొట్టుకుంటూ వెళ్లేవాడ్ని. ఇవన్నీ తీపి గుర్తులు. రీకాల్ చేసుకుంటుంటే ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ పిల్లలకు మనం 20వేలు పెట్టి ఐపాడ్ కొనిపెట్టినా విలువ తెలియడంలేదు. కానీ మూడు చక్రాల సైకిలుకే పరమానంద పడిపోయేవాడ్ని. ఇప్పుడంతా స్పీడు యుగం.

అప్పటి స్నేహితులెవరయినా టచ్‌లో ఉన్నారా?

కె.విశ్వనాథ్: ఊరెళ్లినప్పుడు ఒకాయన కనిపించి, పలకరించారు కానీ నాకు గుర్తురాలేదు. ఎవరూ టచ్‌లో లేరు. మొన్న ఎవరో మా మనవరాలికి సంబంధం చూస్తుంటే.. మీ తాతగారికి కాలేజీలో నేను వన్ ఇయర్ సీనియర్‌ని అని ఒకావిడ చెప్పిందట. ఆవిడెవరో గుర్తులేదు. నేను బాగా పైకొచ్చిన తర్వాత గుంటూరెళ్లాను. అక్కడ ఒక సభ నుంచి బయటికొస్తుంటే.. ఒక పెద్దాయన.. చాలా పొడుగ్గా ఉన్నాడు. ‘విశ్వనాథ్.. యు రిమంబర్ మీ’ అన్నాడాయన. నాకు గుర్తు రాలేదు. వైఎస్సీ కాలేజీలో నా లెక్చరర్ అట. అది చెప్పగానే నాకెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను.

ఫైనల్‌గా… డబ్బు విషయానికొద్దాం. మీ సక్సెస్ రేటు, మీరు చేసిన సినిమాల సంఖ్యను బట్టి చూస్తే మీకు కచ్చితంగా ఫిల్మ్‌నగర్‌లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉండాలి…

కె.విశ్వనాథ్: నేను మొదటినుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోయాను. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా సినిమా తర్వాత సినిమానే చేసేవాణ్ణి. ‘శంకరాభరణం’ తర్వాత నాకొచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే, సగం హైదరాబాద్‌ని కొనేసి ఉండేవాణ్ణి. నేను చేసినవన్నీ రిస్కీ ప్రాజెక్టులే. అందుకే ఏనాడూ భారీ పారితోషికాలు కావాలని డిమాండ్ చేసేవాణ్ణి కాదు. వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవాణ్ని. నా జీవితం మొత్తం ఇలానే గడిచిపోయింది.

ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉందా?

కె.విశ్వనాథ్: చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నవాళ్లతో పోల్చుకుంటాం కదా. అది మానవనైజం కూడా. ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. మళ్లీ వెంటనే నా మనసు సర్దిచెబుతుంది. ఒక్కసారి ఆ డబ్బు మాయలో పడిపోతే సృజతనాత్మకత పక్కకు వెళ్లిపోయేది. ఓసారి చిరంజీవి ‘మేమంతా ఉంటాం. సొంతంగా సినిమా చేసుకోండి’అన్నాడు. నేను నా వల్ల కాదని చెప్పేశాను.

మీరు తీసుకున్న అత్యధిక పారితోషికం ఎంత?

కె.విశ్వనాథ్: అది మీరడగకూడదు. నేను చెప్పకూడదు. నిజంగానే నేనెప్పుడూ ఎక్కువ తీసుకోలేదు. నా సినిమాల్లో పాటలకు ఒక్కోసారి నేనే నృత్యదర్శకత్వం చేసేవాణ్ణి. దానికి అదనంగా పారితోషికం తీసుకోవచ్చు. కానీ అడగలేదు. అయితే అప్పుడు అడిగి ఉండాల్సిందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. నాకున్న అనుభవాలతో పరిశ్రమ మనస్తత్వం పూర్తిగా అవగతమైంది. అడగకపోతే అడగనట్టే ఉంటుంది. తొమ్మిది గంటలకు కారు వస్తుందని ఎదురు చూసేవాణ్ణి. పావుగంట ఆలస్యమైతే నేను ఆటోలో వెళ్లిపోయేవాణ్ణి. నిర్మాత ఖర్చు తగ్గిందనుకుంటే ఏం చేయగలను. నా సమకాలీన దర్శకులు ఎంత తీసుకుంటున్నారో నేనేనాడూ పట్టించుకోలేదు. మనకు రావాల్సింది అడిగితే డబ్బు మనిషి అని ముద్రవేసేస్తారు. ఒకవేళ అడగకపోతే వీడో దద్దమ్మ అని తీసిపారేస్తారు. అయినా మనకు భగవంతుడు ఎంతవరకూ ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. నేను హ్యాపీగానే ఉన్నాను. వేళకు భోంచేయగలుగుతున్నాను. ఎవరైనా ఇంటికొస్తే పెట్టగల స్థాయిలో ఉన్నాను. అది చాలు నాకు. ఆ రకంగా నాకు ఆత్మసంతృప్తి ఉంది.

సంభాషణ: డి.జి.భవాని

నేను చాలా తెలివిగలవాడ్ని అని ఏనాడూ అనుకోలేదు. అదే నన్ను రక్షిస్తోంది. ఇన్నాళ్లూ ఎవరైనా ‘మీ సినిమాలు చాలా గొప్పగా ఉంటాయండి.. మీరు చాలా గొప్ప వ్యక్తి’ అంటే.. ఏమోనండీ అని వినయంగా అనేవాడ్ని. కానీ ఇప్పుడు ‘ఓన్’ చేసుకోవాలనిపిస్తోంది.‘యస్… దిసీజ్ మై క్రియేషన్. మై థాట్. ఎందుకనుకోకూడదు’ అనిపిస్తోంది.

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

6 thoughts on “కే. విశ్వనాధ్ అంతరంగం”

  1. “. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అని. ఒక మంచి కుటుంబానికి చెందినవాళ్లయితే తల్లిదండ్రులు బతికున్నంతకాలం అమ్మానాన్నలకు భయపడతారు. వాళ్లు పోయిన తర్వాత ఎవరో ఒకరుండాలి కదా. అదే దేవుడు. ఆ దేవుడు మనల్ని గమనిస్తున్నాడనే ఫీలింగ్ తప్పు చేయనివ్వదు..”–అద్భుతమైన ఇంటర్వ్యూ.. ఏ భేషజాలూ లేకుండా,ఆయన సినిమాలలాగానే ఉంది.

  2. ఆయన సినిమాల్లాగా చాలా నిజాయితీగా చెప్పారు. Down to the earth person, hats off విశ్వనాధ్ గారు. ఈ వ్యాసం అందించిన మీకు, సంభాషించిన భవాని గారికి నా శుభాభినందనలు. విశ్వనాధ్ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s