వీళ్ళ పెళ్లి కి ఊరంతా సందడే!

వధువు… చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనసూయతో వరుడు…చిరంజీవి అప్పరసుప్రభాకర్‌కు మే 4న పెళ్లి నిశ్చయమయింది.

వీళ్లది కులగోత్రాలన్నీ చూసిపెద్దలు కుదిర్చిన కల్యాణం కాదు.

అలాగని ప్రేమ వివాహం కూడా కాదు.ప్రభుత్వ స్టేట్‌హోం పూనుకుని చేస్తున్న పెళ్లి.

వాళ్లకేం పనిఅనుకోవద్దు… వధువు వాళ్లమ్మాయే.స్వర్గంలోనే వివాహాలు నిశ్చయమైపోతాయని చెప్పుకున్నా వేడుక మాత్రంభూమ్మీదే జరగాలి కదా!…

అందుకే హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని స్టేట్ హోమ్అనాథాశ్రమంలో ఒకటే హడావిడి కనిపిస్తోంది. పెళ్లిని ఒక సంబరంలాచేస్తున్నది ఆ స్టేట్‌హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న వాళ్లే. వాళ్లే ఈపెళ్లికి పెద్దలు మరి. ఇటీవలే అనసూయ, ప్రభాకర్‌లకు నిశ్చితార్థంజరిగింది. మే నాలుగోతేదీన వివాహం జరగనుంది.

‘పెళ్లికి ఇంకా సమయముంది కదాఅంటే’… “భలేవారే, వివాహం చేయడమంటే మాటలా… ఎన్ని పనులుంటాయి.అన్నిటినీ సర్దుకోవద్దూ” అంటారీ యువ పెద్దలు.అమ్మ, నాన్న.. స్టేట్ హోమ్…అనాథ బాలలకు అమ్మ, నాన్న అన్నీ తానై నిలుస్తుంది స్టేట్‌హోమ్. అక్కడిఉద్యోగులు తల్లిలా ప్రేమను పంచి, తండ్రిగా సంరక్షణ బాధ్యత వహిస్తారు.అయితే వీళ్లు అనాథలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం వరకే పరిమితం కాకుండావివాహంతో కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అలా ఇప్పటికిస్టేట్‌హోమ్‌లో రెండు వివాహాలు జరిగాయి. అలాంటి ఒక వేడుకలో అనసూయను చూసినప్రభాకర్ పెళ్లికి సిద్ధమవడంతో

.marg

స్టేట్‌హోమ్‌లో మళ్లీ పెళ్లి భాజాలుమోగనున్నాయి

స్నేహితులంతా మెచ్చుకున్నారు – అప్పరసు ప్రభాకర్, పెళ్లికొడుకుమాది మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకుంట్ల. మేము చిన్నప్పటి నుంచీ
హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మేము ముగ్గురు అన్నదమ్ములం. ముగ్గురిలో ఒకరం
అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నేను ముందుకొచ్చా. మా
ఇంట్లో ఆ విషయం చెబితే అంగీకరించారు. ఆ తర్వాత ఇంటిదగ్గర ఉన్న మహిళా
మండలి అధ్యక్షురాలికి చెప్పాం. అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని
చెప్పగానే నా స్నేహితులంతా మెచ్చుకున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని
అభినందించారు. త్యాగం చేస్తున్నానని అనుకోకుండా బాధ్యతగానే నిర్ణయం
తీసుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది.

లోటులేకుండా పెంచారు- అనసూయ, పెళ్లికూతురు
అమ్మానాన్నలు ఎలా ఉంటారో నేను చూడలేదు. ఆ లోటు లేకుండా స్టేట్ హోమ్‌లో
పెంచారు. పెళ్లి ప్రతిపాదన నేను పెట్టలేదు. స్టేట్ హోమ్ మేడమ్(గిరిజ)
ప్రతిపాదించారు. నేను అంగీకరించాకే పెళ్లి నిర్ణయమైంది. నా జీవితంలో
చాలా సంతోషకరమైన సమయమిది.

అన్ని కోణాల్లో విచారించాకే – గిరిజ, స్టేట్ హోమ్ ఇన్‌చార్జి
పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే అన్ని కోణాల్లో పరిశీలించాకే
ఆమోదం తెలుపుతాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు… అనాథ
అమ్మాయినే ఎంచుకోవడానికి గల కారణాలు అన్నీ ఆరా తీస్తాం. అన్నీ
పరిశీలించి, కుటుంబ నేపథ్యం, ఉద్యోగం ఇతరత్రా వివరాలన్నీ సేకరించాకే
వివాహం జరిపిస్తాం. అవతలి వ్యక్తి ఆరోగ్యంపై ఏ మాత్రం అనుమానం వచ్చినా
అన్ని వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉండాలి. అన్ని పరీక్షల్లో నెగ్గాకే
అంతిమ ఆమోదం ఇస్తాం.

స్టేట్ హోమ్ చరిత్ర
అమీర్‌పేట నుంచి యూసుఫ్‌గూడకు వెళ్లేదారిలో స్టేట్ హోమ్ ఉంది. మహిళా శిశు
సంక్షేమశాఖకు చెందిన బాలసదనం ఉంది. ఆరు నెలల నుంచి 16 ఏళ్ల లోపు బాలికలను
సంరక్షించి చదువు చెప్పించే సదనం ఇది. ఆ తర్వాత కాలేజీ చదువులు
చదవాలనుకునే వారికి కాలేజ్‌హోమ్, పాలిటెక్నిక్ చదువుల కోసం దుర్గాబాయి
దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ ఉన్నాయి. 1958లో దీన్ని ప్రారంభించారు.
బాధితులైన మహిళలకు పునరావాసం కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, మహబూబ్‌నగర్‌లలో స్టేట్
హోమ్‌లున్నాయి. 35 ఏళ్ల వయసుదాకా ఆశ్రయం కల్పిస్తారు. వయోధికుల కోసం కూడా
ప్రత్యేకంగా ఇందులోనే ఆశ్రమం ఉంది. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు వివాహం
చేసుకోదలుచుకుంటే స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివాహాలు జరిపిస్తారు.

ఔదార్య దేవతలు దిగివచ్చిన వేళ…
నెలరోజుల కిందటే అనసూయ, ప్రభాకర్‌ల పెళ్లికి అంగీకారం కుదిరింది.
అప్పటినుంచే ఎలా చేయాలనే హడావిడి స్టేట్ హోమ్‌లో మొదలయింది. ఈ పెళ్లికి
మంగళసూత్రం కావాలి కదా! అది ఎవరిస్తారు? అనుకుంటుండగా తిరుమల తిరుపతి
దేవస్థానం(టీటీడీ) వారు ‘మేం ఉన్నాం’ అన్నారు.

పెళ్లిలో కట్టుకోవడానికిపట్టుచీరలు లేకపోతే ఏం బావుంటుంది అంటూ ఆప్కో వాళ్లు ‘మా పట్టువస్త్రాలతో
కల్యాణమస్తు’ అంటూ ముందుకొచ్చారు. వరుడు మాత్రం ‘మా డిగ్‌జామ్ బట్టలతోనే
మెరవాలని’ ఆ షోరూమ్ నిర్వాహకులు పెళ్లికుమారుడికి దుస్తులు ఇవ్వడానికి
సిద్ధపడ్డారు. హమ్మయ్య! ఓ పనై పోయింది.

మరి పెళ్లికి వచ్చే అతిథులకు
భోజనం ఏం చేయాలా?… అనుకుంటుండగా, నాంది ఫౌండేషన్ కల్పించుకుని వచ్చిన
వారంతా ‘వివాహ భోజనంబు, వింతైన వంటకంబు వియ్యాలవారి విందు హహ్హహ్హ..
అనేలా మేం ఏర్పాటు చేస్తాం’ అని మాటిచ్చారు.

ఇప్పటి వరకు బాగానే ఉన్నా కాపురం పెట్టాక అవసరాలు తీరేదెలా? అని
స్టేట్‌హోమ్ పెద్దలు ఆలోచిస్తుండగా ఎల్పీజీ డీలర్ ఒకరు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పడం, సోని ఎలక్ట్రానిక్ డీలర్ ఎల్‌సీడీ టీవీ ప్రకటించడం,డాక్టర్ రాజేంద్ర అనే వైద్యుడొకరు రిఫ్రిజిరేటర్ హామీ ఇవ్వడంతో ఆ చింత
కూడా తీరిపోయింది. దాతలను తీసుకొని రావడంలో అదనపు జాయింట్ కలెక్టర్
జి.రేఖారాణి చూపించిన చొరవను జీవితాంతం మరచిపోలేమని అక్కడి వాళ్లు
అంటున్నారు. ఈ ‘వస్తు’ దాతల సంఖ్య రోజురోజుకీ మరింత పెరుగుతుండటంతో వారు
చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు.

వివాహం యోగానికి నాంది…
నిజానికి 18-35 ఏళ్లలోపు యువతులు, మహిళలకు ఆశ్రయం కల్పించి, వారికి
శిక్షణ ఇప్పించి, ప్రయోజకులుగా తీర్చిదిద్దడం మాత్రమే స్టేట్ హోం పని.
అయితే 2009లో తొలిసారిగా ఓ వివాహం స్టేట్ హోమ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ
జంట చూడముచ్చటగా సంసారం చే స్తుండటంతో, 2012లో రెండో సారి ఇంకో వివాహం
జరిపించారు. ఈ అమ్మాయికి విద్యాశాఖలో ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగం కూడా
ఇచ్చారు. స్టేట్‌హోమ్ చేస్తున్న మూడో పెళ్లి ఇది. ప్రస్తుతం
స్టేట్‌హోమ్‌లోనే స్వాతి అనే విభాగంలో ఆఫీస్ సబార్డినేట్‌గా అనసూయ
పనిచేస్తోంది. ఇక పెళ్లికుమారుడు నెక్లెస్‌రోడ్డులోని ఓ రెస్టారెంట్
స్టోర్‌కి మేనేజర్‌గా పనిచేస్తుండగా, అతని తండ్రి వాటర్‌బోర్డులో
ఉద్యోగి, తల్లి గృహిణి. అంతా కలిసిరావడం… మంచి సంబంధం కావడంతో స్టేట్
హోమ్‌లో నెలకొన్న సందడి అంతా ఇంతా కాదు. ఇక మిగిలింది ‘కల్యాణ
వైభోగమే’…

– సయ్యద్ మొహినుద్దీన్
ఆంధ్రజ్యోతి-హైదరాబాద్

ఫోటోలు: నరేష్, మునావర్‌ఖాన్

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

2 thoughts on “వీళ్ళ పెళ్లి కి ఊరంతా సందడే!”

  1. అనసూయ ప్రభాకర్ లకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. వారు ఆనందంగా, సుఖసంతోషాలతో వుండాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s