కలతలు తీర్చే కమిటీలు

famly1

తమలపాకుతో ఆమె ఒకటంటుందితలుపుచెక్కతో ఈయన రెండంటాడు.
మీవాళ్లు అని మొదలుపెట్టి అత్త రెండు సూటిపోటి మాటలనగానే మీరేం తక్కువ తిన్నారా అని కోడలు పురాణం అందుకుంటుంది.
భార్యాభర్తల మధ్యనఅత్తాకోడళ్ల మధ్యన చిన్నచిన్న వెటకారాలే పెద్ద గొడవలయిపోతాయి.

అవిగాక కట్నం గొడవలుచిన్నాపెద్దా వేధింపులు అన్నిచోట్లా ఉండేవే. ఒకోసారి అవి కాపురాలను కూల్చేసేదాకా కూడా వెళతాయికోర్టుల్లో ఏళ్ల తరబడి సాగి మనుషులకు సుఖమూశాంతీ లేకుండా చేస్తుంటాయి. ఈ పరిస్థితి నుంచి జనాన్ని బయటపడెయ్యడానికి కుటుంబ కలహాలతో రచ్చకెక్కకండి. మనలోమనం మాట్లాడుకుందాం రండి‘ అని సర్దుబాటుకు పిలుపునిస్తున్నాయి ‘సోషల్ యాక్షన్ కమిటీలు‘. 

ఇవి రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలోనూ ఉన్నా పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కాస్త చురుగ్గా ఇప్పటికి దాదాపు నాలుగు వేల కేసులను పరిష్కరించి మిగిలిన వాటికి దారి చూపిస్తున్నాయి. కాపురాలను నిలబెట్టడమొక్కటే కాదుబాల్య వివాహాలువరకట్న వేధింపులుశిశువిక్రయాలుట్రాఫికింగ్తాగుడు తగాదాలు మొదలైన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నాయి ఈ సమాఖ్యలు. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు‘ అన్న సామెతకు విలువిస్తూ ఊళ్లో కమిటీతో తీరిపోయేదానికి జిల్లా కోర్టుకు ఎక్కడమెందుకు‘ అని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నాయి. దీని గురించే ఈ వారం కవర్‌స్టోరీ.

మనుషుల మధ్యన ప్రేమానురాగాలు ఎంత సహజమో అభిప్రాయభేదాలూ అంతే సహజం. ఆలుమగలు,అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, ఇరుగుపొరుగుల గొడవలు ఈనాటివా? పురాణకాలం నుంచీ ఉన్నవే. వాటిని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కుటుంబ పెద్దల, కులపెద్దల,గ్రామపెద్దల సలహాలు స్వీకరించని కుటుంబం ఉంటుందా! వీళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయితేనే న్యాయస్థానాల ముంగిట వాలే వి తగవు పక్షులు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. ఇద్దరు జగడమాడుతున్నారంటే ఇతరులెవరూ అందులో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ‘వాళ్లే చూసుకుంటార్లే. మనం మధ్యలో వెళ్లడమెందుకు’ అనుకుని తప్పుకుపోవడమే సాధారణ దృశ్యం. కాదూకూడదని ఎవరైనా వెళ్లి సమస్య ఏమిటో తెలుసుకోబోయినా ‘మీరేమైనా ఆర్చేవారాతీర్చేవారా…’ అని వెళ్లగొడతారు.

అలాగే వదిలేస్తే చిన్నచిన్న తగవులే పెద్ద సమస్యలైపోయి కుటుంబాలు విడిపోతాయి. ముదిరిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతాయి. ఇక ఆ కాపురం నరకానికి నకలుగా మారిపోతుంది. అలాకాకుండా చూస్తున్న కొత్త తరం పెద్దమనుషులు ఎవరంటే – ‘సోషల్ యాక్షన్ కమిటీలు’.కుటుంబ కలహాలు రచ్చకెక్కకుండా, జంటలు విడిపోకుండా వారికి సత్వర న్యాయాన్ని అందిస్తున్న సోషల్ యాక్షన్ కమిటీలు ఇప్పుడు జిల్లాల్లో, మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా విస్తరిస్తున్న ట్రెండ్.

ముఖ్యమంత్రి ముచ్చట…కిందటి నెల నర్సాపురం లేసు పార్కును సందర్శించిన మన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఈ కమిటీల గురించి విని ఆశ్చర్యపోయారు. సాటి ఆడవారిని సమస్యల్లోంచి బయటపడెయ్యడానికి గ్రామీణ స్త్రీలు చొరవ చెయ్యడాన్ని విమలా నరసింహన్ ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఈ కమిటీలు ఇన్ని వేల సమస్యలను చిటికెలో పరిష్కరించాయంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికీ ఆశ్చర్యమే. ‘ఎలాగమ్మా ఇది సాధ్యపడింది?’ అని ఆయన ఆడిగితే పల్లె మహిళలు నవ్వు మొహాలు పెట్టారు. ‘ఎలాగంటే ఏమని సెబుతాం సార్? నిజమే, మాకు సదువులేదు. అయితే పక్కింట్లో కష్టాలు తెలియవా? మనకెందుకులే అని ఊరుకోకుండా ఇలాంటి కష్టానికీ ఒక పరిష్కారం ఉందని మాట్లాడుకుంటాం సార్.అంతే’ అన్నాక ఆయన వాళ్లను తెగ అభినందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే – సూటిగా స్పష్టంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించడమే సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు చేస్తున్న పని.

2006లో ‘మీ ఊళ్లో గొడవలను మీరే పరిష్కరించుకోకూడదూ?’ అంటూ నాటి కలెక్టర్ చొరవతీసుకున్నారు. అదే తొలి అడుగుగా ‘సోషల్ యాక్షన్ కమిటీలు’ప్రతి మండలంలోనూ ఏర్పడ్డాయి. దీనికి ప్రతి ఊళ్లోనూ కార్యకర్తలున్నారు. ‘జెండర్ కమిటీ’లుగా కూడా పేరున్న ఇవి ప్రజల అవగాహన, భాగస్వామ్యం పెరిగేకొద్దీ చురుగ్గా పనిచేస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ కమిటీల ముందుకు ఐదువేలకు పైగానే సమస్యలు వచ్చాయని అంచనా. వీటిలో అత్యధికం కుటుంబ తగాదాలే. అంటే సుమారు 3600మంది కేసులు. వీటిలో సుమారు 3501 కేసులను యాక్షన్ కమిటీలే ఒక కొలిక్కి తీసుకొచ్చేశాయి! తమ దృష్టికొచ్చిన454 వరకట్న వేధింపుల కేసులకుగాను 400కు పైగానే పరిష్కరించాయి సోషల్ యాక్షన్ కమిటీలు.

f2

ఎలాంటి సమస్యలు?

అమ్మాయిలు కాలేజీకెళుతుంటే ఆకతాయిల వేధింపులు. పెళ్లయి అత్తవారింటికెళితే కట్నం తక్కువైందనో,అనుకున్నంత ఇవ్వలేదనో వేధింపులు. మరొక అడుగు ముందుకు వెళ్లి చంపుతామనే బెదిరింపులు. ఇవేవీ లేదంటే కూరలో కారం ఎక్కువైందనో, పప్పులో ఉప్పు తక్కువైందనో సాధించే భర్తలు, అదీ కాదంటే అనుమానంతో కాల్చుకుతినడం – సగటు మహిళకు ఎన్ని కష్టాలో. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బెంగటిల్లుతారు ఆడవాళ్లు.

పోనీ పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేద్దామన్నా భయమే. ఉన్న కష్టాలు తీరుతాయనే భరోసా లేకపోగా కొత్త కష్టాలు మెడకు చుట్టుకుంటాయేమో తెలియదు. ధైర్యం తెచ్చుకుని ముందడుగేసినా న్యాయస్థానాల చుట్టూ తిరిగే స్తోమతా, ఓపికా ఉండవు. అవన్నీ ఉన్నా, న్యాయం జరుగుతుందన్న నమ్మకమే, ఉండదు. ఈ పరిస్థితిని చాలావరకూ మార్చేశాయి సోషల్ యాక్షన్ కమిటీలు.

ఎక్కువగా వీటి ముందుకొచ్చేవి వరకట్నం వేధింపులు, లైంగిక వేధింపులు, కుటుంబ తగాదాలు, తాగుడు తగాదాలు, బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, బాలకార్మిక సమస్య… ఒకటారెండా ప్రతి ఊళ్లోనూ ఏదో ఒక తగాదా. వాటివల్ల సోషల్ యాక్షన్ కమిటీలకు చేతి నిండా పనే.

ఎవరెవరుంటారు?
ప్రతి ఊళ్లోనూ డ్వాక్రా బృందాల్లోని మహిళలే ముఖ్య కార్యకర్తలు. కొన్ని ఊళ్లలో మగవాళ్లు కూడా ముందుకొచ్చి ఈ పని చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్ యాక్షన్ కమిటీ సమన్వయకర్త ఒకరుంటారు. వారి ఫోన్ నెంబరే బాధితులకు హెల్ప్‌లైన్. ఈ నెంబర్లు ప్రతి గ్రామంలోనూ ఉండే డ్వాక్రా సంఘాల సభ్యుల వద్ద అందుబాటులో ఉంటాయి. మండల స్థాయి సోషల్ యాక్షన్ కమిటీలో అక్కడి తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, వైద్యుడు, న్యాయవాది సభ్యులుగా ఉంటారు.

జిల్లా స్థాయి కమిటీలో కలెక్టరు, ఎస్పీ, ప్రధాన న్యాయవాదులు, వైద్యులు సభ్యులు. ఊళ్లో పరిష్కారం కాని సమస్యలు మండల కమిటీకి, మండలంలో కానివి జిల్లా కమిటీ దృష్టికీ వస్తాయి. వచ్చిన సమస్యలను పరిశీలించడం, ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం, తప్పొప్పులను బేరీజు వేయడం, కేసు నమోదు చెయ్యాలోవద్దో, ఏయే కేసుల్లో ఎలా వ్యవహరించాలో తమలో తాము సంప్రదించుకుంటారు.

ప్రతి మంగళవారం ఒక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. ‘ప్రతి సమస్యకూ సరైన పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే కుటుంబాన్ని నిలబెట్టినట్టే’ అని మనస్ఫూర్తిగా నమ్ముతారు ఈ కమిటీల్లోని సభ్యులు. తమ దగ్గరకు వచ్చినవారి కష్టాలను ఆమూలాగ్రం అర్థం చేసుకుని చట్ట పరిధిలో వీరికి ఎలా సాంత్వన చేకూర్చవచ్చో ముందుగా ఆలోచిస్తారు. అటువంటి అవగాహన ఉన్నవారే కమిటీలో కార్యకర్తలుగా ఉంటారు.

ఎలా పనిచేస్తారు?

ఎక్కడైనా సమస్య ఉన్నట్టుగా కార్యకర్తలకు సమాచారం అందిన వెంటనే కమిటీ రంగంలోకి దిగుతుంది. పరిస్థితి చెయ్యి దాటిపోతోందంటే మాత్రం కార్యకర్తలే నేరుగా ఎస్సైలకు, సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తారు. జిల్లాలోని 46మండలాల్లో సుమారు 1700 మంది మెరికల్లాంటి మహిళలే కార్యకర్తలు. ఆడదానికి ఆడదే శత్రువనే పాత సామెతకు చెల్లుచీటీ రాస్తున్న చురుకుదనం వీరి సొంతం.

ఇబ్బందుల్లో ఉన్న సాటి మహిళలను వాటి నుంచి బైట పడెయ్యడానికి నిర్విరామంగా పనిచేస్తున్నారీ కమిటీ కార్యకర్తలు. పల్లె, పట్నమనే తేడా లేదు. అనారోగ్యం పాలైతే 108కి ఫోన్ చేసినట్టే వేధింపులు ఉన్నాయంటే చాలు కమిటీ కార్యకర్తలకు ఫోన్ వెళ్లిపోతుంది. వాళ్లు వెంటనే స్పందిస్తారు. ఇబ్బందులకు తక్షణం అడ్డుకట్ట వేయడమే యాక్షన్ కమిటీల ప్రధాన లక్ష్యం. ఏదో ఒకటి చెప్పి ఆ రోజుకు పంచాయితీ ముగించడం కాదు, సమస్యను పూర్తిగా పరిష్కరించడం, వారికి శాంతియుత భవిష్యత్ ఉండేలా చూడటం కమిటీల తుది లక్ష్యం.

కౌన్సెలింగ్ ముఖ్యం
సమస్యలపై ఇరు పక్షాలకూ విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ అంటే – ‘కష్టాలు కలకాలం కాపురముంటాయా? ఏదో రోజు తీరిపోతాయి, అందాకా సర్దుకుపోండి’ అంటూ సాచివేత కబుర్లు చెప్పడం కాదు. అలాగని’ప్రతి చర్యకూ సమానమైన ప్రతిచర్య’ అనే తీవ్రమైన సిద్ధాంతాలనూ చెప్పరు. బాధించేవారిపై చట్టపరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో, తీరు మార్చుకోకపోతే ఎలాంటి శిక్షలు పడతాయో వివరిస్తారు.

famly

ఈ తరహా కౌన్సిలింగ్‌తో చాలామంది మారతారు. భార్యనో, కోడలినో వేధించడానికి జంకుతారు. ‘మాట్లాడితే మనుషులు మారిపోతారా,సమస్యలు సమసిపోతాయా’ అని పెదవి విరిచేయనక్కరలేదు. కౌన్సిలర్లు తమకున్న చట్ట అవగాహనతో పాటు,కుటుంబ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్, పరువు ప్రతిష్టలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వివరించిన తర్వాతే కలహాల కాపురాలు గట్టెక్కుతున్నాయి.

మరీ మొండి ఘటాలైతే తప్ప పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవసరం ఉండదు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసుల్లోనూ కమిటీలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తున్నాయి. ఇరువర్గాలకూ కౌన్సెలింగ్ చేసి కేసులు ఉపసంహరించుకునేలా చొరవ చేస్తున్నాయి. భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య ఉప్పూనిప్పూగా సాగిన వివాదాలెన్నో ఇక్కడ చల్లారిపోయి కుటుంబాల్లో శాంతి నెలకొంటోంది.

బాల్యవివాహాలకు చెక్…
ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇంతకుముందు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. తమ కళ్లెదుటే పిల్లలకు పెళ్లిళ్లు అయిపోవాలని పట్టుమని పన్నెండేళ్లు రాని ఆడపిల్లలకు కూడా ఎవరితో ఒకరి చేత తాళికట్టించేవారు. తర్వాత ఆ అమ్మాయిలు జీవితంలో పడరాని పాట్లు పడేవారు.

సోషల్ యాక్షన్ కమిటీల పుణ్యమా అని ఇప్పుడు అవి తగ్గిపోయాయి. గడచిన రెండేళ్లలో 28 బాల్య వివాహాలను అడ్డుకోవడమే కాదు, ఆ బాలికలకు కొత్త జీవితాన్ని అందించగలిగాయి ఈ కమిటీలు. బాల్యవివాహాల బారి నుంచి తప్పించుకున్న చిన్నారి బాలికలు పాఠశాలల్లో చదువు కొనసాగిస్తున్నారంటే ఆ ఘనత సోషల్ యాక్షన్ కమిటీలదే. వీటి ముందుకొచ్చిన కేసులు ఒక కొలిక్కి వచ్చేందుకు రెండు నుంచి ఆరు నెలల వ్యవధి పడుతుంది. కొన్ని రెండు మూడు వారాల్లోపే పరిష్కారం అవుతుంటాయి. పెద్ద పెద్ద ఆస్తి తగాదాలు, తీవ్రమైన నేరాల వంటివి వీళ్ల పరిధిలో పరిష్కారం కావడం తక్కువ.

మహిళలదే కీలక పాత్ర
వాస్తవానికి సోషల్ యాక్షన్ కమిటీలన్నవి ప్రతి జిల్లాలోనూ ఉన్నవే. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇవి ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ సత్ఫలితాలనివ్వడానికి కారణం స్త్రీ శక్తి. కలెక్టర్ వాణీమోహన్ ఒక మహిళగా ఈ ప్రక్రియ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దాంతో గడచిన రెండేళ్లలో ఈ కమిటీలు చైతన్యవంతమయ్యాయి. డీఆర్‌డీఎ పీడీ రామకృష్ణ,సోషల్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు జీవమణి, వివిధ మహిళా సమాఖ్యల నేతలు చురుకుగా వ్యవహరించడం ద్వారా జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా మలిచారు.

గ్రామస్థాయిలో కార్యకర్తలూ చురుకైన మహిళలే. వాళ్ల కృషి ఫలితంగానే చాలా సమస్యలు అక్కడికక్కడే సమసిపోతున్నాయి. ఉదాహరణకు భార్యాభర్తలు కలహించుకుని విడిపోవడానికి సిద్ధపడినప్పుడు వారిని అనునయించడం, విడిపోతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో వివరించడం వంటివి ఓపిగ్గా చేసేది మహిళా కార్యకర్తలే. ఆడవాళ్లకైతే ‘ఒంటరిగా బతకడమంటే అంత సులువనుకున్నావా? డబ్బు కష్టాల మాట అలా ఉంచు.మొగుడు వదిలేసినదానివని ఎవరూ పెళ్లీపేరంటాలకు పిలవరు. అలుసు తీసుకునే మగవాళ్లకూ తక్కువేముంది చెప్పు,కాస్త సర్దుకుపోతే సుఖంగా ఉంటావు కదా’ అని నచ్చచెబుతారు.

మగవాళ్లకైతే ‘పదిహేను రోజులు జైల్లో ఉండొచ్చావంటే ఊళ్లో ఎవరూ పనిలోకి తీసుకోరు. బెయిలు మీద బైటికొచ్చినా ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. అప్పటికి నీ పిల్లలు గాలికి పోతారు. ఎందుకివన్నీ?’ ఇలా చెబుతారు. మరీ భయపెడతారని కూడా కాదు. సామాజిక పరిస్థితుల గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగని అన్ని జంటలనూ కలిపేస్తారని కాదు. తప్పనిసరి అనుకున్నప్పుడు న్యాయబద్ధంగా విడాకులు వచ్చేలా కూడా సాయం చేస్తున్నారు.

మనసులో ఉన్న భావోద్వేగాలు, పట్టింపులు తగ్గడానికి, ఒకరినొకరు అహంకారపూరిత దుర్భాషలాడటానికి స్వస్తి పలికేలా చేయడంలో కౌన్సిలింగ్ కీలకపాత్ర పోషిస్తోంది.

భారం లేదు

సమస్యలతో కమిటీ ముందుకు వచ్చేవారిలో అత్యధికులు చిన్నా చితకా కుటుంబాలకు చెందిన వారే. ఎక్కువమంది స్త్రీలే. కమిటీల సేవలు పూర్తిగా ఉచితం కనుక ఆర్థిక భారమేదీ మీద పడకుండా వాళ్లు మానసిక క్షోభ నుంచి బయట పడగలుగుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో వరకట్న వేధింపులు, శారీరక హింస, మద్యపానం తగాదాలు అన్నీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి.

ఇవిగాక మాట పట్టింపులు జిల్లాలో ఎక్కువ. మాటల్లో వెటకారం పాలెక్కువైపోయి కలహాల బాట పట్టిన కాపురాలెన్నో. అలా కలతబారిన సంసారాలు పూర్వం పోలీస్‌స్టేషన్ల దాకా వెళ్లేవి. ఇంకొన్ని గ్రామపెద్దల ముంగిటనో, కులపంచాయితీల్లోనో వాలేవి. కానీ అక్కడ పెద్దలు వినీవినక ఏకపక్ష తీర్పులిచ్చేసేవారు. అవి సంసారాలను కలపక పోగా ‘బలవంతపు కాపురాలు’గా మార్చేసేవి. ఇలాంటి కేసులు ఒక్కో ఊరిలోనూ డజన్ల సంఖ్యలోనే ఉండేవి.

మొదట్నుంచీ వస్తున్న కులాచారాల పేరిట ‘అతి’ తీర్పులు ప్రకటించడంతో మనసులు గాయపడి పూర్తి శత్రుత్వం పెంచుకున్న దంపతులూ ఎక్కువగానే ఉండేవారు. సోషల్ యాక్షన్ కమిటీలు రావడంతో పరిస్థితి మారిపోయింది. వీటికి పక్షపాతం ఉండదు. కులమూ ధన బలమూ కమిటీల ధర్మవైఖరి ముందు తోక ముడవక తప్పడం లేదు.

నిమ్మలగూడేనికి చెందిన భవానీకి పదో తరగతి చదువుతున్న కూతురుంది. ఒకబ్బాయి ఆ కూతుర్ని ప్రేమించాడు. కానీ అమ్మాయి ఓకే అన్నాక తనకొద్దన్నాడు. సమస్య కమిటీ ముందుకెళితే మైనారిటీ తీరేదాకా చదువుకొమ్మని అమ్మాయికి చెప్పాయి. తన చదువుకు కావల్సిన ఖర్చులను కూడా అబ్బాయి వైపు నుంచే అందేలా చేశారు. అమ్మాయి ఇంటర్ పూర్తయ్యేక పెళ్లి. ఆలోపు ఆ యువకుడు మరెవరినీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరికొద్దిరోజులు గడిస్తే ఈ అమ్మాయికి వివాహాన్ని సోషల్ యాక్షన్ కమిటీయే స్వయంగా దగ్గరుండి నిర్వహించబోతోంది.

కట్నం బాధలు తీరాయి
ముడియం రాణికి పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినా, భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం కష్టపెట్టడం మాత్రం ఆపలేదు. పెద్దలు పంచాయితీ చేసి తీర్పిచ్చినా వాళ్లు పట్టించుకోలేదు. శారీరక, మానసిక కష్టాలతో అల్లాడిపోయిన రాణి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. ఇక చివరకు సోషల్ యాక్షన్ కమిటీని ఆశ్రయించింది. వాళ్లు ఇచ్చిన తీర్పుకు కట్నం మొగుడు దిగొచ్చాడు. నెలకు ఐదు వేల రూపాయల మనోవర్తి చెల్లించడానికి సిద్ధపడ్డాడు. రాణి ఇప్పుడు సోషల్ యాక్షన్ కమిటీలోనే చిరుద్యోగిగా చేరారు. తన వంటి మహిళలకు సాయం చేస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు.

తల్లి లేని దుర్గ తాపీ పనికి వెళ్లేది. అక్కడ ఒక వ్యక్తి మోజు పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అవసరం తీరాక కాదు పొమ్మన్నాడు. జరిగిన మోసం ఒక ఎత్తయితే పెద్దలు కూడా కులాల గీతాలు గీసి పెళ్లిగిళ్లీ కుదరదన్నారు. ఈ విషయాన్ని దుర్గ యాక్షన్ కమిటీ ఎదుట మొరపెట్టుకుంది. నమ్మించి మోసం చేసినందుకు శిక్ష ఏమిటో, ఏయే చట్టాల ద్వారా అతణ్ని పట్టించవచ్చో కార్యకర్తలు అతడికి తెలిసేలా చెప్పారు. దెబ్బకు అతనొక్కడే కాదు, పెద్దలు కూడా దిగొచ్చి పెళ్లికి ఓకే చెప్పారు.

పులిరామన్నగూడెం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి పదోతరగతిలోనే పెళ్లయింది. పై చదువులు చదవడానికి భర్త సహకారం లభించలేదు సరికదా వేధింపులు కూడా తోడయ్యాయి. దీంతో సోషల్ యాక్షన్ బృందం కౌన్సెలింగ్ చేసింది. భార్య బాగా చదివితే కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందో అతని మనసుకు నాటేలా చెప్పగలిగారు. ఇప్పుడు వెంకటలక్ష్మి ఎఎన్ఎం ్రటైనింగ్ పూర్తి చేసుకుని బిఇడి చేసేందుకు సిద్ధమైంది.

పైలె ట్ ప్రాజెక్టుగా ప.గో.లో మొదలైన సోషల్ యాక్షన్ కమిటీలు తర్వాత రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో ఆడ మగ నిష్పత్తిలో వస్తున్న మార్పులను అధ్యయనం చెయ్యడానికి పూనుకున్నారు వరంగల్ జిల్లా చిట్యాల మండలం సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు. చిన్నచిన్న గ్రామాల్లో పర్యటించి గర్భస్థ శిశువులు ఆడపిల్లలని తెలిస్తే చిదిమెయ్యడం కూడదని అందరికీ నచ్చజెప్పారు. పరకాల ప్రాంతంలో అటువంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆస్పత్రులనూ గుర్తించి తగిన చర్యలు తీసుకోబోతున్నారు.

***

అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో నిరక్షరాస్య మహిళలను మాయమాటలు చెప్పి మోసం చేసి పూణె,ముంబైల్లోని వ్యభిచార గృహాలకు అమ్మేయడం (ట్రాఫికింగ్) ఎక్కువ. వాటి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చినా,ఉన్న ఊళ్లో ఉపాధి దొరకడం ఆ మహిళలకు చాలా కష్టం. ఈ దశలో సోషల్ యాక్షన్ కమిటీలు దీనిలో కల్పించుకున్నాయి. దాదాపు 45మందిని స్వయంసహాయక సంఘాల్లో చేర్పించారు.

ఇతరులు వారిని చూసే దృక్పథాన్ని నెమ్మదిగా మార్చడానికి ఈ కమిటీల్లోని మహిళా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. దాంతో నెమ్మదిగా తిరిగొచ్చిన వారిని వ్యవసాయకూలీలుగా పనిలోకి పిలవడం మొదలైంది. మరికొందరు కుట్టుమిషన్లు పెట్టుకొని గౌరవంగా జీవించడానికి మార్గం చూపెట్టిందీ కమిటీలే. ఇంకొందరు గొర్రెల పెంపకాన్ని చేపట్టి ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే, వారి పిల్లలు బడుల్లో చదువుకుంటున్నారంటే అదంతా కమిటీల చలవేనని చెప్పక తప్పదు.

***

భర్త మద్యానికి బానిసయితే ఇక కాపురం కూలిపోవడం ఎంతసేపు? కృష్ణా జిల్లా గొల్లపూడిలోనూ జరిగిందదే. భర్త రాజారావు తాగుడితో ఇబ్బందులు పెరిగిపోవడంతో భార్య కమలకుమారి ఐదేళ్లుగా విడిగా ఉండటం ప్రారంభించింది. సోషల్ యాక్షన్ కమిటీ చొరవ చేసి అన్నేళ్ల అంతరాన్నీ చెరిపేసి ఆ జంటను ఒకటి చేసింది. అక్కడే మైలవరం మండలానికి చెందిన భద్రారెడ్డి ఇల్లరికం వస్తానని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఉల్లంఘించడంతో కలతలు మొదలయ్యాయి.

అక్కడ కమిటీయే కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని నిలబెట్టింది. ఖమ్మం జిల్లాలో పురుటి కందును అమ్మేసే యత్నాన్ని అడ్డుకోవడం, ఆదిలాబాద్ జిల్లాలో ముదుసలి అక్కచెల్లెలి ఆస్తిని అన్నదమ్ముడు కబ్జా చేయకుండా కాపాడడం – ఒకటారెండా… చెబుతూపోతే యాక్షన్ కమిటీల జోక్యంతో సమసిపోయిన సమస్యలెన్నో.

జీవీఎస్ఎన్ రాజుఏలూరు

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s