నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!—–వంశీ

పసలపూడి, అరకులోయ, తిరువణ్ణామలై.
ఇల్లు, పుస్తకాలు, సినిమాలు.
గోదావరి, బలభద్రపురం రైల్వేస్టేషన్.
ఇళయరాజా, బాపు-రమణ.
కూసుమంచి అగ్రహారంలో
నాగయ్య హోటల్ భోజనం.
మనసుని బాధపెట్టే సంగీతం…
ఇవీ… వంశీ ఇష్టాలు. భావోద్వేగాలు.
ఆకుపచ్చని జ్ఞాపకాలు.
ఐతే,
ఈ ఇష్టాలను, ఉద్వేగాలను ఫీల్ కావాలంటే వంశీకి ఒంటరితనం తోడుగా ఉండాలి!
స్నేహాలలో, సమూహాలలో
ఆయన ఇమడలేరు.
ఏకాంతం లేకపోతే…
గుండె నిండా పచ్చటి గాలినైనా పీల్చుకోలేరు!
‘నాదొక సీరియస్ లైఫ్’ అంటున్న వంశీ జీవితంలోని నలుపు తెలుపుల సమ్మేళనమే ఇవాళ్టి స్టారిస్ట్రీ.

vamsi2

30 ఏళ్ళ కెరీర్‌లో పాతిక సినిమాలే చేశారు. మీతోపాటే వచ్చిన వాళ్ళు, మీ తర్వాత వచ్చినవాళ్లు ఎక్కువ సినిమాలు చేశారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ముఖ్యమనుకున్నారా?
వంశీ: టార్కవస్కీ పేరుతో ఓ దర్శకుడున్నాడు. ఆయన తన లైఫ్‌లో తీసింది ఆరేడు సినిమాలంతే. అన్నీ క్లాసిక్సే. వరల్డ్ గ్రేట్ డెరైక్టర్స్‌లో ఆయన పేరూ చెబుతారు. అలాగని నేను ఆయనతో పోల్చుకోవడం లేదు. కట్టలు కట్టలుగా సినిమాలు తీయడం నా మనస్తత్వానికి విరుద్ధం. క్వాలిటీ అనొచ్చు, లేక వేరే కారణాల రీత్యానో నేను తక్కువ సినిమాలే చేశాను. అయినా నేను మిగతా వాళ్ళంత స్పీడుగా సినిమాలు చేయలేను. ఒకేసారి రెండు, మూడు సినిమాలు తీయడం కూడా నావల్లకాదు.

మీ వర్కింగ్ స్టయిల్ చాలా వేగంగా ఉంటుందంటారు. చాలా తక్కువ సమయంలోనే సినిమా తీసేయగల సమర్థులు మీరు. అయినా కూడా ఒక్కో సినిమాకి ఎందుకంత సమయం తీసుకుంటారు?
వంశీ: సినిమా తీయడానికి నాకు పెద్ద సమయం పట్టదు. కానీ స్క్రిప్టు తయారీకే ఎక్కువ సమయం పడుతుంది.

పతి దర్శకుడికీ శిష్యగణం ఉంటుంది. కానీ మీ దగ్గర నుంచి పెద్దగా శిష్యులు వచ్చినట్టు కనబడరెందుకని?
వంశీ: నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెద్దగా పని దొరకదు. ఎందుకంటే ఒన్‌మేన్ ఆర్మీలాగా అన్నీ పనులూ నేనే చేసేసుకుంటుంటాను.

అంటే మీ పనిని ఎవ్వరికీ నేర్పడానికి ఇష్టపడరా?
వంశీ: అబ్బబ్బే…అదేం కాదు. అయినా నేనేమన్నా రహస్యంగా పనిచేస్తానా ఏంటీ? అందరిముందే కదా చేసేది. పని నేర్చుకోవడం, నేర్చుకోకపోవడమనేది వాళ్ళ సమస్య.

సినిమాలు, పుస్తకాలు, ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేనట్టుగా కనిపిస్తారు..?
వంశీ: ఈ ప్రపంచంలో నాకు స్నేహితులెవ్వరూ లేరు. ఎవ్వరితోనూ కలిసి మెలిసి తిరగడాలు లేవు. ఇల్లు,సినిమాలు, పుస్తకాలు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్, శంకర్‌పల్లిరోడ్… ఇవే నా ప్రపంచం.

ఔటర్ రింగ్ రోడ్డు… శంకర్‌పల్లి రోడ్డు ఏంటి?
వంశీ: హైదరాబాద్ చుట్టూ ఓ గొలుసు కట్టులాగా ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఆ విశాలమైన రోడ్డు మీద కారులో అలా వెళ్తూ ఉంటే అదొక ఆనందం. ఈ ఔటర్ రింగ్ రోడ్ లేనప్పుడు శంకర్‌పల్లి, వికారాబాద్ వరకూ వెళ్తుండేవాణ్ణి. అది కూడా ఒంటరిగానే. నేను, నా కారు డ్రైవరూ అంతే.

ఈ ఒంటరి ప్రయాణమంటే ఎందుకంత ఆసక్తి?
వంశీ: ఈ ఆసక్తి ఈనాటిది కాదు. మద్రాసులో ఉన్నప్పుడూ అలా మహాబలిపురం వరకూ వెళ్లొచ్చేసేవాణ్ణి. అదొక ఆనందం నాది. ఇప్పుడు అదొక అలవాటైపోయింది. నాకు రైలు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కిటికీపక్కనే కూర్చుని కదులుతున్న ప్రకతిని వీక్షిస్తుంటా. ఇదివరకూ ప్రతి నెలా టూర్ వెళ్ళేవాణ్ణి. ఇప్పుడే కొంచెం తగ్గించాను.

ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. మరి మీరేంటి?
వంశీ: అందరూ ఒకలా ఉండరు కదా. నాకు స్నేహితులు లేరు. ఎందుకంటే నాకు స్నేహం చేయడం చేతకాదేమో! ఇప్పుడన్నీ అవసరార్థపు స్నేహాలే. అందుకే నేను స్నేహానికి వ్యతిరేకం.

చిన్నప్పుడు కూడా స్నేహితుల్లేరా?
వంశీ: మా ఊర్లో ఒకే ఒక్క మిత్రుడు ఉండేవాడు. అతనిప్పుడు లేడు.

మరి మీ మనసులో బాధల్ని, సంతోషాల్ని ఎవరితో పంచుకుంటారు?
వంశీ: నాకూ ఆనందాలూ బాధలూ ఉంటాయి. వాటిని ఎవ్వరితోను పంచుకోబుద్ధేయదు. అవన్నీ నా రచనల్లో ఎక్కడో ఒకచోట మెరుస్తుంటాయ్.

సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనబడరెందుకని?
వంశీ: నాకు ఆసక్తి లేదు. జనం మధ్య నేను ఉండలేనేమో!

మరి మీ ఫ్యామిలీ ఫంక్షన్లకైనా వెళ్తుంటారా?
వంశీ: లేదు. అస్సలు వెళ్ళను. మేం ఎవరింటికీ వెళ్ళం. మా ఇంటికి ఎవ్వరూ రారు. అందుకు నిదర్శనం ఏంటంటే మా ఇంటి సోఫాలే. ఎప్పుడో కొన్నాం వాటిని. ఇప్పటికీ కొత్తవాటిలాగా తళతళలాడుతూనే ఉన్నాయి చూడండి.

మీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్..
వంశీ: మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మ మొన్నీ మధ్యనే కాలం చేశారు. మా అక్క, తమ్ముడు ఉన్నారు. వాళ్ళతో కూడా అంత సంబంధ బాంధవ్యాలు లేవు.

మీ నాన్నగారు ఏం చేసేవారు?
వంశీ: చెల్లూరు షుగర్‌ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయన చాలా చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆయనదో పెద్ద ఫెయిల్యూర్ లైఫ్. ఆయన దగ్గర ఎర్రటి అట్టతో ఓ చిన్నపుస్తకం ఉండేది. ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవాడు. అదేంటో చూద్దామని ఆ పుస్తకం కోసం చాలాసార్లు వెతికా. ఎక్కడో రహస్యంగా దాచి పెట్టుకున్నాడాయన. డిప్రెషన్‌లో ఎక్కువ తాగేసి మా అమ్మను కొడుతున్నాడని ఇక జన్మలో నాన్నతో మాట్లాడకూడదని ఒట్టుపెట్టుకున్నా. అది జరిగిన కొద్దిరోజులకే ఆయన పోయాడు.

మీ అమ్మగారి గురించి చెప్పండి?
వంశీ: అమ్మ పేరు సూరాయమ్మ. నేనెప్పుడు అమ్మని నా దగ్గరకు రమ్మని అడగలేదు. తనూ రాలేదు. అలా రాకుండానే వెళ్లిపోయింది.

మీ సొంత ఊరు పసలపూడితో ఎక్కువ అనుబంధం ఉన్నట్టుంది?
వంశీ: అందుకేగా ‘మా పసలపూడి కథలు’ పేరుతో 72 కథలు రాసింది. ఆ ఊళ్ళో వెలగల అప్పారావుగారింటి వెనుక దొడ్లో ఉన్న పాత ఇంట్లో నెలకు రెండురూపాయలకు అద్దెకుండేవాళ్ళం. ఆ ఇంటి ముందు జామచెట్టు, రెండు నారింజ చెట్లూ ఉండేవి. మా అమ్మ పుల్లటి నారింజకాయలు తెంపి, వాటి రసంతో పులిహోర చేసి పొట్లాలు కట్టిచ్చేది. నేను మా తమ్ముడు. మిషన్ కుట్టే త్యాగరాజు కలిసి మా అమ్మమ్మ గారి ఊరైన బలభద్రపురం స్టేషన్‌లో రాత్రిపూట పాసింజర్ రెలైక్కి అన్నవరం వెళ్ళేవాళ్లం. స్టేషన్ దగ్గర నుంచి కొండమీదకు నడిచెళ్ళి గుళ్లు చేయించుకుని అన్నవరం ప్రసాదాన్ని కడుపునిండా తినేసేవాళ్ళం.

ఇప్పుడు కూడా తరచుగా పసలపూడి వెళ్తుంటారా?
వంశీ: లేదు. ఏడాది క్రితం వెళ్ళా. అప్పటికీ, ఇప్పటికీ ఊళ్ళోనూ, మనుష్యుల్లోను చాలా మార్పులొచ్చేశాయి. మార్పు మంచిదే కానీ మరీ ఇంత మార్పా? మా ఊరు అనే కాదు, అన్ని పల్లెటూళ్ళు అలాగే మారిపోయాయి.

ఇంతకూ మీ తొలి కథ ఎప్పుడు రాశారు?
వంశీ: నా 14 ఏళ్ళ వయసులో ‘సత్యసుందరి నవ్వింది’ పేరుతో మొదటి కథ రాశా. 1974లో ఆల్ ఇండియా రేడియోలో ‘యువవాణి’ కార్యక్రమానికి పంపితే ఎంపికైంది. నేనే బస్సులో బెజవాడ వెళ్ళి రేడియోలో కథ చదివొచ్చా. పాతిక రూపాయల పారితోషికమిచ్చారు. ఆ తర్వాత, ‘నల్ల సుశీల’ కథ రాశాను. దానికీ మంచి పేరొచ్చింది.

ఆ వయసులో కథలు రాశారంటే, ఊళ్ళో చాలా స్టార్ వేల్యూ ఉండేదేమో?
వంశీ: లేదు. నేను రాస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పేవాణ్ణి కాదు. మా ఊరి లాకుల దగ్గర మొండి అనే చోట పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఒంటరిగా కూర్చుని రాసుకునేవాణ్ణి. మా ఊళ్లో నన్నెవరూ పట్టించుకునేవారు కాదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ.

మీకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టమేనా?
వంశీ: సినిమాలు బాగా చూసేవాణ్ణి. కానీ, సినిమా ఫీల్డ్‌కి రావాలని మాత్రం ఏనాడూ అనుకోలేదు. టూరింగ్ టాకీస్‌లో మా అమ్మతో కలిసి ‘అమరశిల్పి జక్కన’ సెకండ్ షో చూశాను. ఆరోజు జోరువాన. తడుసుకుంటూనే వెళ్ళాం. అదీ నా జీవితంలో చూసిన తొలి సినిమా. ఆ తర్వాత ‘తోబుట్టువులు’చూశాను. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ‘మొనగాళ్ళకు మొనగాడు’. మోడరన్ థియేటర్స్ వారి సినిమా అది. రామచంద్రపురంలోని రాజగోపాల్ పిక్చర్ ప్యాలెస్‌లో చూశాను.

మీకు ఆసక్తి లేని సినిమా ఫీల్డ్‌కి రావడానికి బలమైన కారణం ఏదైనా..?
వంశీ: నా 18వ ఏట నా కంటే పదేళ్ళు పెద్దదైన అమ్మాయిని ఇష్టపడ్డాను. తనూ నన్ను ఇష్టపడింది. ఓ రోజు నేను వేరే ఊరు వెళ్లి వచ్చేసరికి ఏదో జబ్బు చేసి ఆ అమ్మాయి చనిపోయింది. ఇక అక్కడ ఉండలేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ టైమ్‌లోనే ఒకాయన ‘నీ టాలెంట్‌కి సినిమా ఫీల్డ్ కరెక్ట్’ అని దారి చూపారు. అప్పటికే నేను ‘మంచుపల్లకి’, ‘కర్మసాక్షి’ నవలలు రాశా. వాటిని తీసుకుని దర్శకుడు విక్టరీ మధుసూదనరావు గారి దగ్గరకు వెళ్తే టెస్ట్ పెట్టారు.

లూయిస్ గిల్‌బర్ట్ తీసిన ‘ఫ్రెండ్స్’సినిమా మద్రాసు కేజినో థియేటర్‌లో ఆడుతోంది. దాన్ని పదిసార్లు చూసి వన్‌లైన్ ఆర్డర్ వేసుకురమ్మన్నారు. నేను ఒక్కసారి చూసి రాసి తీసుకువెళ్ళా. ఆయనకు నచ్చి‘ఎదురీత’ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా తీసుకున్నారు. నా తొలి క్లాప్ ఎన్టీఆర్‌గారిపై కొట్టాను. ఆ తర్వాత ఏయన్నార్ ‘విచిత్ర జీవితం’కు పని చేశా. ఇలా ఓ 10, 15 సినిమాలు చేశా. అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా ఆఖరి సినిమా ‘సీతాకోక చిలక’.

మీరు కె.విశ్వనాథ్, భారతీరాజా… ఇద్దరి దగ్గర పని చేశారు కదా. కానీ మీపై భారతీరాజా ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది?
వంశీ: నేనాయన్ని అంతగా ప్రేమించాను కాబట్టి. అయితే మొదట్లోనే ఆయన ముద్ర నాపై ఉండేది. తర్వాత తర్వాత నాకంటూ ఓ శైలి ఏర్పడింది.

ఈ మధ్యకాలంలో మీ గురువులను కలిసారా?
వంశీ: ఆ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు రేణిగుంట ఎయిర్‌పోర్టులో విశ్వనాథ్‌గారు కనిపించారు. అయితే ఆయన నన్ను మరిచిపోయినట్టున్నారు. గుర్తుపట్టలేదు. భారతీరాజాగారు ఆమధ్య హైదరాబాద్‌లో దర్శకుల సంఘం సమావేశానికి వస్తే వెళ్ళి కలిశాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. నేనంటే ఆయనకిష్టం. ఆయనంటే నాకు ప్రాణం.

మీ పాటలు విన్నా, షాట్స్ చూసినా ఇది వంశీది అని సులువుగా తెలిసిపోతుంది. అలా మీకంటూ ఓ ప్రత్యేకతను ఎలా సంపాదించుకోగలిగారు?
వంశీ: ప్రతి కళాకారునికీ తనకంటూ ఓ సిగ్నేచర్ ఉండాలని ఓ రచయిత్రి ఓ పుస్తకంలో రాశారు చిన్నతనంలోనే ఆ కొటేషన్ నాపై గాఢ ముద్ర వేసేసింది. నేను వివిధ బాషల్లో చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, వెళ్లిన ఆర్ట్ ఎగ్జిబిషన్లు, నాకిష్టమైన చిత్రకారులు పద్మశ్రీ బాపుగారు గీసిన బొమ్మలు…ఇవన్నీ కలబోసి నాకంటూ ఓ సిగ్నేచర్ ఏర్పడిందేమో!

అయితే ఒకటే శైలిలో వెళ్ళడం వల్ల మీ సినిమాల్లో కూడా ఓ మొనాటనీ వచ్చినట్టుంది. గమనించారా?
వంశీ: నిజమేనేమో… ఎందుకంటే ఈ మాట చాలామంది అన్నారు. ఇప్పుడు నా శైలి మార్చే ప్రయత్నంలో ఉన్నాను.

మీ సినిమాల్లో పాత్రలు కొంచెం టిపికల్‌గా ఉంటాయి. వాటినెలా సష్టిస్తారు?
వంశీ: జీవితం నుంచే. మన చుట్టూ సమాజంలో బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి. వాటినే సంగ్రహిస్తుంటాను.

కానీ, మీరెవ్వరితోనూ కలవరు కదా?
వంశీ: కలవకపోవడానికి, చూడ్డానికి సంబంధం లేదు కదా. కళ్లుంటే చాలు.

బాపు రమణలంటే మీకు బాగా ఇష్టమట?
వంశీ: ఇష్టం కాదు. మహాభక్తి. వాళ్ళ దగ్గర పని చేయకపోయినా నేను ఈ ఇండస్ట్రీలో ఎక్కువసార్లు ఎవరినన్నా కలిశానంటే అది వాళ్ళనే. బాపుగారి బొమ్మలు నా దగ్గర బోలెడంత కలెక్షన్ ఉంది. వందల్లో కాదు… వేలల్లోనే. వాటిని రోజూ చూస్తే ఉంటే అదొక ఎనర్జీ నాకు.

మీ దగ్గర బుక్స్, వీడియోస్ కలెక్షన్ కూడా ఉందట?
వంశీ: అవును. పదివేల సినిమా డీవీడీలు, చాలా పుస్తకాలుఉన్నాయి. హార్డ్‌డిస్కుల్లో అయితే బోలెడెంత మ్యూజిక్ కలెక్షన్ ఉంది. ఎక్కువ సింఫనీస్, త్యాగరాయకతులు, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నాయి.

చదివేంత… వినేంత… చూసేంత తీరిక మీకుందా?
వంశీ: బయట పనులు పెట్టుకోపోవడం వల్ల నాకు బోలెడంత టైమ్ దొరుకుతుంది. ఇక మొబైల్ ఫోన్ కూడా నేను పెద్దగా వాడను. చాలా మంది పని ఉన్నా, లేకున్నా గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేసుకుంటుంటారు. నాకు రోజులో చాలా తక్కువ కాల్స్ వస్తుంటాయి. అందుకే నాకు టైమ్ వేస్ట్‌కాదు. ఆ టైమ్‌లో పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా. మ్యూజిక్ వింటా.

మీ ఆత్మకథ రాసుకునే ఉద్దేశం ఉందా?
వంశీ: ఛీఛీ.. ఆత్మకథ రాసుకునేంత గొప్పవాణ్ణి కాదు.

ఓ హీరోయిన్ ఆత్మకథ రాస్తానని అప్పుడెప్పుడో చెప్పారు. దాని సంగతేంటి?
వంశీ: చెప్పానా? నాకైతే గుర్తులేదు. ఏ మూడ్‌లో, ఏ సందర్భంలో చెప్పి ఉంటానో!

ఓ దశలో మీరు సినిమా ఫీల్డ్ వదిలేసి యానాం వెళ్ళిపోయారు. ఎందుకని?
వంశీ: అప్పుడు నాకు సినిమాలు చేయబుద్దేయలేదు. ఏదో ఒక డిప్రెషన్. మద్రాసులో ఉండాలనిపించలేదు. మా ఫ్యామిలీ అంతా యానాం వెళ్ళిపోయాం. అక్కడికెళ్లగానే నాకు మలేరియా ఎటాకైంది. తర్వాత జాండిస్‌లోకి దిగింది. కాకినాడ సాలిపేటలో ఒక హాస్పిటల్లో కొన్నాళ్ళు కోమాలో ఉండి చచ్చిబతికాను.

అప్పుడు ఇండస్ట్రీవాళ్ళు వంశీకి పిచ్చెక్కిందని రకరకాలుగా అనుకున్నారు. నేనవేవీ పట్టించుకోకుండా హాయిగా నాకిష్టమైన చోటుకల్లా తిరిగేసేవాణ్ణి. కాకినాడ వెళ్ళి సినిమాలు చూసేవాణ్ణి. అమలాపురం,పెదబ్రహ్మదేవం ప్రాంతాల్లో పరిషత్తు నాటకాల పోటీలకు వెళ్ళొచ్చేవాణ్ణి. అక్కడే కొండవలస లక్ష్మణరావు. ద్రాక్షారామం సరోజ పరిచయమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసి ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. తర్వాత మీకు తెలిసిందే.

మీలో మంచి సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు కదా. ఎందుకు కంటిన్యూ కావడం లేదు?
వంశీ: ‘జోకర్’ సినిమా కోసం నిర్మాత గొట్టిముక్కల పద్మారావుగారు చేయమంటే ఫస్ట్‌టైమ్ మ్యూజిక్ చేశా. ఆ తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంతో వచ్చిన ‘కన్నయ్య-కిట్టయ్య’కు చేశాను. ఒక్క ఇళయరాజా మినహాయిస్తే, నేను ఏ సంగీత దర్శకునితో పనిచేసినా నా సహకారం కొంత ఉంటుంది. అయితే నాకిప్పుడు మ్యూజిక్ చేయాలన్న ఆలోచన లేదు.

సంగీతం నేర్చుకున్నారా?
వంశీ: మద్రాసులో ఉన్నప్పుడు సముద్రాల అనే ఆయన దగ్గర కర్ణాటిక్ వోకల్ నేర్చుకున్నాను. అది కొన్ని నెలలు.

ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా?
వంశీ: ‘మనుషులు-మట్టిబొమ్మలు’ సినిమాలో ఓ అద్భుతమైన డ్యూయెట్ ఉంది. దాన్ని ఫ్లూట్‌పై ప్లేచేసేవాణ్ణి. కొంతకాలం హార్మోనియం ప్రాక్టీస్ చేశాను. ఈ మధ్య నాకు బాగా ఆప్తులైన ఎత్నిక్ వెంకట్రావ్‌గారు కీబోర్డ్ గిఫ్ట్ ఇచ్చారు. తెల్లవారు జామున లేచి దాంతో ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను.

కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్‌తో సినిమాలు చేయాలనుకుని, ఎందుకు వదిలేశారు?
వంశీ: కమల్‌హాసన్‌తో నా దర్శకత్వంతో సినిమా చేయాలని స్రవంతి రవికిషోర్‌గారు, ‘తమ్ముడు’ సత్యం,సాయిబాబా చాలా ముచ్చటపడ్డారు. కమల్‌ని కూడా కలిశాం మేం. నేనో కథ చెప్పాను. అది నా మొట్టమొదటి కథ. కమల్ ఏడాది వరకూ డేట్స్ లేవనడంతో అది అలా ఆగిపోయింది. వెంకటేశ్‌తో‘గాలికొండపురం రైల్వే గేట్’ సినిమా అనుకున్నాం. పాటల రికార్డింగ్ కూడా చేశాం. లతా మంగేష్కర్ రెండు పాటలు పాడారు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయిపోతుందని వెంకటేశ్ ఆఖరి నిమిషంలో చేయనన్నారు. నాగార్జునది కూడా ఇలాగే ఏదో జరిగింది.

రాజేంద్రప్రసాద్, భానుప్రియతో ఎక్కువ సినిమాలు చేశారు కదా… వాళ్ళతో మీ అటాచ్‌మెంచ్ ఎలా ఉండేది?
వంశీ: అంతా ప్రొఫెషనల్ ఎటాచ్‌మెంటే.

అప్పట్లో మహేశ్‌బాబు, డింపుల్ కపాడియా కాంబినేషన్‌లో ‘నళినీ ఆంటీ… నీకు ఫోనొచ్చింది’ సినిమా ప్లాన్ చేసినట్టున్నారు?
వంశీ: అప్పుడు కష్ణగారిని అడిగాం. మహేష్ చదువుకుంటున్నాడని ఇప్పుడు వద్దన్నారు.

మరి కష్ణగారితో సినిమా ఎందుకు చేయలేకపోయారు?
వంశీ: కుదర్లేదు. ‘గూఢచారి 116’ ఎన్నిసార్లు చూశానో. దాంతోనే ఆయనకు ఫ్యాన్ అయిపోయా. ఆ విషయం కష్ణగారికి చెప్పాను కూడా.

మీ తొలి కథానాయకుడు చిరంజీవితో మళ్ళీ సినిమా చేయలేదెందుకని?
వంశీ: అవకాశం రాలేదు.

క్లాస్, మాస్ కమర్షియల్, ఆర్ట్… ఇలా సినిమా గురించి చాలా వర్గీకరణలు చెబుతుంటారు. మరి మీ దష్టిలో సినిమా అంటే?
వంశీ: బాగా ఆడే సినిమా, ఆడని సినిమా… అంతే తేడా. నేను చాలా కాలంగా ఓ ఆర్ట్ సినిమా చేయాలనుకుంటున్నా. మొన్నీమధ్య కూడా కష్ణభగవాన్‌తో చేద్దామనుకున్నా. కుదర్లేదు. ఎప్పటికైనా చేయాలి. దానికి మ్యూజిక్ కూడా నేనే చేసుకుంటాను.

కేవలం 17 మంది టెక్నీషియన్లతో సినిమా చేసే ఆలోచన ఉందట. నిజమేనా?
వంశీ: దానికో స్కీమ్ ఉంది. ఎప్పటికైనా చేస్తాను. ఫారిన్ వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది యూనిట్‌తో పాటలు తీయడం లేదా? ఇదీ అంతే. అదేం పెద్ద గగనం కాదు.

పాపికొండల దగ్గర సెట్స్ వేసి జానపద సినిమా చేయాలని ఉందని అప్పట్లో చెప్పారు. ఏమైంది?
వంశీ: చేస్తే చాలా బావుంటుంది. అవకాశం వస్తే మాత్రం చేస్తాను. చేస్తే మాత్రం అద్భుతం అవుతుంది.

మీరు కథలు రాసే పద్ధతి ఏ తీరులో ఉంటుంది?
వంశీ: ఏదో ఒక లైన్ అనుకుంటాను. రాస్తున్నప్పుడే డెవలప్ చేసేస్తాను. ఒక్కోసారి రెండుగంటల్లో కథ రెడీ అయిపోవచ్చు. ఇంకోసారి చాలా రోజులు పడుతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. నా అభిమాన రచయితలు కాళీపట్నం రామారావు, అల్లం శేషగిరిరావు. వాళ్ళు రేర్‌గా రాస్తారు. రాస్తే చాలా అద్భుతంగా ఉంటాయి కథలు, అల్లం శేషగిరిరావు ‘చీకటి’ కథ చదవండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో.

సుప్రసిద్ధ రచయితల కథలు చదివి ఎప్పుడైనా సినిమాగా చేయాలని అనుకున్నారా?
వంశీ: అల్లం శేషగిరిరావు గారి ‘చీకటి’ చదివినప్పుడు మాత్రం సినిమాగా చేయాలనిపించింది. ఆయనక్కూడా ఉత్తరం రాశాను. అయితే ఆర్ట్ ఫిల్మ్ చేద్దామంటే నిర్మాతలు అంత సుముఖంగా ఉండరు కదా.

మీకెప్పుడైనా నాటకం రాయాలనిపించిందా?
వంశీ: రాయాలని లేదు కానీ, నాటకం డెరైక్ట్ చేయాలని ఉంది. నా సన్నిహితుడైన వెంకట్రావు గారిని హీరోగా పెట్టి ఆ నాటకం చేద్దామని ఉంది.

సినిమా మీకిష్టం లేదు. అయినా మంచిదర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. హాస్యం ఇష్టంలేకున్నా కామెడీలో ట్రెండ్ సెట్ చేశారు. మరి మీకిష్టం అనిపించి చేసే పనులేంటి?
వంశీ: మనం ఏం చేసినా క్రియేటివ్‌గా చేయాలనే పద్ధతిని నమ్ముతాను. నిజంగా నాకు సినిమాలంటే ఇష్టంలేదు. కానీ ఈ ఫీల్డ్‌కొచ్చాను. వచ్చాక బతుకు పోరాటం చేయాలి. దానికి మనకంటూ ఓ సొంత దస్తూరి, ముద్ర కావాలి. ఆ ప్రయత్నమే చేశాను. అలాగే నాకు కామెడీ ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే నా జీవితంలోనే కామెడీ లేదు. నా కెరీర్ తొలినాళ్లలో చేసిన మంచుపల్లకీ, సితార, అన్వేషణ …కామెడీ ఫిల్మ్స్ కావు. ‘లేడీస్ టైలర్’ తర్వాత కామెడీ వైపు టర్న్ కావాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో నేను‘లేడీస్ టైలర్’ చేసి ఉండకపోతే నా మార్గం వేరేలా ఉండేదేమో. అయినా బతకాలి కాబట్టి చేసుకుంటూ వెళ్లిపోతున్నాను.

గోదావరి అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎందుకంత ఇష్టం?
వంశీ: అమ్మంటే ఇష్టం ఎందుకనడిగితే ఏం చెప్తారు…నాకు గోదావరి కూడా అంతే! ఈత కొట్టడం రాదుకానీ,గోదావరిలో నేను మునిగినన్నిసార్లు ఇంకెవరూ మునిగి ఉండరు.

vamsi1

మీకిష్టమైన వంటకం?

వంశీ: అదీ ఇదనీలేదు. నేను ‘స్వాతి’ వీక్లీలో ‘శ్రీసీతారామా లాంచీ సర్వీస్, రాజమండ్రి’ పేరుతో ఓ నవలిక రాశాను. దాంట్లో మొక్కజొన్నపొత్తు వంటకం గురించి రాశా. దానికి మసాలా రాసి, నెయ్యితో కాలుస్తారు. అది చదివి అందరూ ట్రై చేశారు. నాకు అన్ని రుచులూ తెలుసు. అయితే ఇప్పుడు తగ్గించేశా. మొన్న చేవెళ్ళ వరకూ కారులో వెళ్లి ఓ చిన్న ఉడిపి హోటల్‌లో భోజనం చేశా. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. అలాగే ఖమ్మం వెళ్ళే దారిలో కూసుమంచి అగ్రహారం అనే పల్లెటూళ్లో నాగయ్య హోటల్ ఉంది. అక్కడ 26రకాల కూరలతో భోజనం పెడతారు. నేను రెగ్యులర్‌గా వెళ్తుంటాను. ఇంతా చేసి రూ. 40 మాత్రమే. అంతా వెజిటేరియన్నే. ఖమ్మం దాటాక వైరావెళ్ళే రోడ్డులో కల్లూరులో ‘ఇదే చౌదరి మిలట్రీ హోటల్’అనిఉంటుంది. అక్కడ గోంగూర బాగుంటుంది. చికెన్, ఫిష్ కూడా. వాళ్లకు రెండు చెరువులున్నాయి. అందులో చేపలతోనే పులుసు చేస్తారు. నిజంగా అమతమే. అక్కడ భోజనం చేయడానికి అప్పుడప్పుడూ వెళ్లొస్తుంటాను. ఆత్రేయపురంలో కష్ణంరాజు గారి హోటల్ బావుంటుంది. అన్నవరం నుంచి తుని వెళ్లే దారిలో తూటిగుంట హోటల్లో ఫుడ్ బావుంటుంది.

సమాజంలో బోలెడన్ని జరుగుతుంటాయి. స్పందిస్తారా? లేక తామరాకుమీది నీటిబొట్టులాగా ఉంటారా?
వంశీ: ఎందుకు స్పందించను. అయితే దాని గురించి స్పీచ్‌లు ఇవ్వాలని, సినిమాలు తీయాలని మాత్రం అనుకోను. అప్పుడప్పుడు యదార్థ సంఘటనలతో కొన్ని కథలు రాశాను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చంటి పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది అడుక్కుంటుంటారు. ఆ పిల్లల్ని ఎక్కడో అద్దెకు తెస్తారని, వాళ్ళకి నల్లమందు ఇచ్చి పడుకోబెడతారని తెలిసి ‘రోడ్‌షో’ అనే కథ రాశాను. నేను, సుభాష్ అనే ఆర్టిస్టు కలిసి కొంతమందిని ఇంటర్వ్యూ చేశాం.

వందసార్లు ‘షోలే’, ‘దొంగరాముడు’ చూస్తే ఎవరైనా డెరైక్షన్ చేసేయొచ్చని చెబుతుంటారు. నిజమేనా?
వంశీ: ఎందుకు చేయలేరు. నాకు తెలిసి తెలుగులో వచ్చిన అత్యంత గొప్పసినిమా ‘దొంగరాముడు’. ఇక‘షోలే’ గురించి చెప్పక్కర్లేదు. ఈ రెండు గొప్ప స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలే. ఆ రెండూ చూస్తే సినిమా తాలూకు లోతుపాతులన్నీ తెలిసిపోతాయి.

– పులగం చిన్నారాయణ

**********

మీ సినిమాల్లో కథానాయికలంతా పెద్ద కాటుక కళ్ళు, చామన ఛాయ, నేత చీరలతో ఎక్కువ కనిపిస్తారెందుకని?
నా రెండో సినిమాలో యాక్ట్‌చేసిన హీరోయిన్‌వి (భానుప్రియ) కొంచెం పెద్ద కళ్ళు, చామన ఛాయ. తనతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అందరికీ ఆ ఫీలింగ్ అలా ఉండిపోయినట్టుంది. కానీ నిజంగా దీనికో ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. నా టీనేజ్‌లో ఓ సారి వాల్తేరు-కిరండోలు పాసింజరెక్కా. నిజానికదో బొగ్గు తీసుకెళ్లే గూడ్సు. దానికి నాలుగు పాసింజర్ బోగీలు తగిలించారు. బొడ్డవర స్టేషన్ తర్వాత టన్నెల్స్ దాటాక తైడ అనే చిన్న స్టేషనొస్తుంది. అక్కడంతా ట్రైబల్స్ ఉంటారు. ఓ గ్రూపు నేనున్న పెట్టెలోకి ఎక్కారు. అందులో ఓ అమ్మాయి. బాగా ఛామన ఛాయ, పెద్ద కళ్లు, పెద్దబొట్టు, పెద్ద జడ. ఒరియాలో పాట పాడ్డం మొదలెట్టింది. అందరూ ముగ్ధులైపోయి డబ్బులిచ్చారు. నేనూ జేబులోంచి రూపాయి తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి గుప్పిట గట్టిగా మూశా. పెద్దగా నవ్వింది. ఆ నవ్వు, ఆ రూపం ఎప్పటికీ మర్చిపోలేకపోయా. ఆ ప్రభావమే నా కథానాయికలపై పడింది.

మీరు అప్పట్లో చాలా గ్లామరస్‌గా ఉండేవారట. మిమ్మల్ని హీరోగా చేయమని ఎవ్వరూ అడగలేదా?
ఒకరిద్దరు అడిగారు. ఏదైనా చేస్తాను కానీ, సినిమాల్లో వేషాలు మాత్రం వేయనన్నాను.

మీ టైటిల్స్‌పై ‘వంశీ’ అని ట్యాగ్ పెట్టుకోవడం ఎప్పటినుంచి మొదలైంది?
‘ఆలాపన’ సినిమా టైమ్‌లో కాకినాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ లోగో రాసిచ్చాడు. అది అందరికీ బాగా నచ్చేసింది. టైటిల్‌పై నా పేరు ఉంటుంది. అప్పటినుంచీ ఆ పద్ధతినే అనుసరిస్తున్నాను.

***********

వంటల పుస్తకం రాస్తా…
ఇష్టపడే ప్రదేశాలు – తిరువణ్ణామలై, అరకులోయ.

ఇష్టమైన డైలాగ్ రైటర్ – త్రివిక్రమ్! గంధం నాగరాజు (బతికుంటే) మంచి డైలాగులు రాసేవారు.

వంటల గురించి – మంచి ఆసక్తి ఉంది. నాకు చాలా వంటలొచ్చు. పుస్తకం రాసే ఆలోచన కూడా ఉంది.

గాడ్జెట్స్ గురించి – లేటెస్ట్ ఆప్స్, డౌన్ లోడ్స్ చేస్తుంటాను. ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్ కూడా ఉన్నాయి.

పామాణికమైన సినిమా – దొంగరాముడు. అంత పర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‌ప్లే చేశారు కేవీరెడ్డిగారు!

ఇష్టమైన హీరోయిన్స్ – సావిత్రి, జయంతి, వెన్నిరాడై నిర్మల, కష్ణకుమారి.

ఫేవరేట్ మ్యూజిక్ డెరైక్టర్ – ఓన్లీ ఇళయరాజా!

ఇష్టమైన పాట – ‘పుట్టింటి గౌరవం’లో తాగు…మనసైతే తాగు… వీల్లేకుంటే విషం తాగు.. మధువు మత్తెక్కిస్తుంది… విషం గట్టెక్కిస్తుంది’ పాట. ఆత్రేయగారు గొప్ప ఫిలాసఫీ చెప్పారు.

ఈ మధ్య చదివిన పుస్తకాలు – చివటం అమ్మ, వెంకయ్యస్వామి, రాకలపాటి గురువుగారు, టిబెట్‌యోగి మిలారేపా చరిత్ర, శ్రీ ఆనందమాయి అమ్మ… ఇలా గొప్పగొప్ప మహానుభావుల ఆత్మకథలు!

పిల్లల గురించి- ఇద్దరమ్మాయిలు. శ్రుతి, శైలి.

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

2 thoughts on “నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!—–వంశీ”

  1. వంశీ గారి ముఖాముఖి సహజసుందరంగా ఉంది సినిమా దర్శకులకు ఉండే భేషజాలు లేవు .ఒక కథారచయిత interview చదువుతున్నట్లు అనిపించింది !!నాలా ఆయన introvert కావడం నాకు నచ్చింది!పులగం చిన్నారాయణగారు సంధించిన ప్రశ్నలు intelligent గా ఉన్నాయి!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s