వైద్యానికి స్నేహితులు

cid:image002.png@01CE0D1A.E4C01F30

మల్లెంపూటి ఆదినారాయణ

వీరెవరూ పెద్ద డాక్టర్లు కారు. పేర్ల వెనుక బారెడు డిగ్రీలు లేవు. సూదితో పోయేదాన్ని కత్తులతో కోసే తెలివితేటలున్న వాళ్లు కాదు. చావుబతుకుల మీద రూపాయిపెట్టిపది రూపాయలు ఆర్జించాలన్న ధనదాహమున్న వాళ్లూ కాదు. మరి వాళ్ల దగ్గర ఏముందిడబ్బు జబ్బు సోకని మానవత్వం‘ ఉంది. తమ రంగాన్ని తాము నిర్దాక్షిణ్యంగా ఆత్మపరిశీలన చేసుకునిబాగుచేయాలన్న తెగువ ఉంది. చట్టాలను నిలదీసే దమ్ము ఉంది. అందినోళ్లకు అందేది వైద్యం కాదు.. పేదోళ్లందరికీ అందినప్పుడే అది వైద్యం అవుతుందనే లక్ష్యంతో పని చేస్తోంది ఈ బృందం. వీరు మరి కొందరు సామాజిక సేవకులు కలిసి.. పూణే కేంద్రంగామెడికో ఫ్రెండ్ సర్కిల్‘ అనే వేదికను ఏర్పాటు చేసుకున్నారు. రోగుల కోసం రోగుల తరఫున నలభై ఏళ్లుగా పోరాడుతున్న ఈ సంస్థ.. ఏడాదికోసారి నిర్వహించే సమావేశాన్ని.. ఈ సారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అక్కడికొచ్చిన కొందరి అనుభవాలను తెలిపేదే ఈవారం కవర్‌స్టోరీ… 

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న సత్యోదయం రిట్రీట్ సెంటర్‌కు వెళుతుంటే… రోడ్డుకు అటూ ఇటూ కిరాణాకొట్లను తలపిస్తూ కనిపించాయి ప్రైవేటు ఆస్పత్రులు. వచ్చిపోయే పేషెంట్లతో బిజీగా ఉన్నారు డాక్టర్లు. అలాంటి బిజీ వైద్యం మాకొద్దు అనుకునే మెడికో ఫ్రెండ్ సర్కిల్ డాక్టర్లు మాత్రమే సత్యోదయంలో కలిశారు. డాక్టర్‌లకు మామూలుగా ఉండే గంభీరమైన ముఖం, ఖరీదైన దుస్తులు.. కనిపించలేదక్కడ. చౌక ఖద్దరు చొక్కాలు, లాల్చీలు, నేత చీరలు, చిరునవ్వుల ముఖాలే దర్శనమిచ్చాయి. పల్చటి ఆకారంలో మెత్తగా నవ్వుతూ పలకరించాడు ఆ బృందంలో ఒకరైన డాక్టర్ సునీల్‌కౌల్. ఈయనది అస్సాం. బోడోలాండ్‌లో గిరిజనులకు వైద్యుడు. “నేను సైన్యంలో పనిచేశాను. బయటికొచ్చాక తెలిసింది వైద్యం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉందో! ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కాని మన బడ్జెట్‌లో కేవలం ఒకటి నుంచి రెండు శాతమే వైద్యరంగానికి ఇస్తోంది. మనకంటే వెనుకబడిన దేశాలు ఆరు శాతం నిధులు కేటాయిస్తున్నాయి. ఇది సిగ్గుచేటు” అన్నాడాయన.

సైన్యం నుంచి వస్తూనే ఏ రద్దీ కూడళ్లలోనో క్లినిక్ తెరిచి రెండు చేతులా సంపాదించాలనుకోలేదు డాక్టర్ సునీల్‌కౌల్. ‘ద యాంట్’ అనే సంస్థతో కలిశారు. ఇది అసోంలోని మారుమూల గిరిజన గూడేల వారికి వైద్య సహాయం చేస్తుంది. “ఇక్కడి ప్రజలకు మలేరియా, టిబి, డయేరియా, వైరల్‌ఫీవర్ వస్తే దిక్కులేదు. వైద్యులు అందుబాటులో ఉండరు. చావొక్కటే శరణ్యం” అన్నారాయన. “వైద్యుల కొరతను తీర్చేందుకు మా సంస్థ ఒక ఉపాయం ఆలోచించింది. గ్రామాల్లో స్థానికంగా నివసించే యువతీయువకులను ‘విలేజ్ ఫార్మసిస్ట్’లుగా ఎంపిక చేసి.. ప్రాథమిక వైద్యానికి పనికొచ్చే 30 మందులపై శిక్షణ ఇస్తున్నాం. కొందరు కమ్యూనిటీ లాబొరేటరీ టెక్నీషియన్స్‌నూ సమకూర్చుకున్నాం. వీరివల్ల ఎంతోమంది గిరిజనులకు కష్టకాలంలో ప్రాథమిక వైద్యం లభిస్తోంది.. ” అని వివరించారు. ‘ద యాంట్’ లేకపోతే ఈ రోజు ఆ 150గ్రామాలకు వైద్యమే అందేది కాదు. ఆరోగ్య కార్యకర్తల బృందాలకు శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, వైద్యం అందించడం మొదలైన పనుల్లో బిజీగా గడుపుతుంటాడు సునీల్ కౌల్. ‘ద యాంట్’ అంటే ‘చీమ’కదా. ఆ పేరెందుకు పెట్టారు అంటే- ‘చీమ చాలా కష్టజీవి. తన బరువుకంటే యాభైరెట్లు ఎక్కువ బరువు మోస్తుంది. ప్రతి దశలోనూ మనిషికి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టాం” అన్నాడు ఆ గిరిజన డాక్టర్.

చీకట్లో కాంతిపుంజం
అడుక్కుతినే వాణ్ణి కూడా పీక్కుతినేవాడు మరొకడుంటాడు అన్నట్టు.. తయారైంది కోల్‌కతా రెడ్‌లైట్ ఏరియాలోని సెక్స్‌వర్కర్ల పరిస్థితి. బతకలేక పడుపువృత్తి చేస్తున్నవాళ్లు జబ్బులొచ్చి డాక్టర్ల దగ్గరికి వెళితే.. అక్కడ మరొక రకం నరకం అనుభవించాల్సి వస్తోంది. “విటుల దగ్గర దండుకుంటారు కదా! మాకు పైసలు ఇవ్వడానికి మీకేం మాయ రోగమొచ్చింది. తియ్యండి.. తియ్యండి పైసలు.. అని వాళ్లను వేధిస్తారు వైద్యులు. చికిత్సకని వెళితే.. బ్లాక్‌మెయిల్ చేయడం, బూతులు తిట్టడం, బలవంతపెట్టడం.. అన్నీ ఇక్కడ సర్వసాధారణం..” అంటున్నారు సెక్స్‌వర్కర్లకు వైద్యంతోపాటు కొత్త జీవితాన్ని అందిస్తున్న భారతీదేవ్. వయసు మీద పడుతున్నా ఎంతో శ్రమకోర్చి కోల్‌కతాలోని సోనాగాచ్చిలో ‘దుర్భర్ మహిళా సమన్వయ’లో కీలకపాత్ర పోషిస్తోందీ సంఘసేవకురాలు. “సెక్స్ వర్కర్లకు కూడా కొన్ని వైద్య హక్కులు ఉంటాయి. వాళ్లను హీనంగా చూసే మన సంఘం వారికున్న హక్కులను గౌరవిస్తుందా చెప్పండి?”అంటోందామె. “అందరు సెక్స్‌వర్కర్లకు కస్టమర్లు దొరకరు. దొరికినప్పుడు కూడా కండోమ్స్‌లాంటి రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. దానివల్లే ఎక్కువ వ్యాధులొస్తున్నాయి..” అని ఆవేదన వ్యక్తం చేశారు భర్దేవి. పడుపువృత్తితో బతికే వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరుకున్న సంస్థ ప్రతినిధుల్లో ఆమె ఒకరు.

బ్లాక్‌మెయిల్ చేసే వైద్యుల నుంచి తమను రక్షించాలంటే.. స్థానికంగా క్లినిక్‌లు పెట్టమని కోరారు సెక్స్‌వర్కర్లు. వారి కోరిక మేరకు ‘మమతా హెల్త్ కేర్’ ఆస్పత్రి ఏర్పాటైంది. మెల్లగా అక్కడ వైద్యం చేయించుకోవడం మొదలుపెట్టారు. కొంత ఊరట కలిగినప్పటికీ పడుపు వృత్తిలో ఆర్జించిన డబ్బులు దాచుకోవడం కష్టమవుతోంది. వయసులో ఉన్నంత కాలం సంపాదన ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? అన్న భయం మొదలైంది. ఆస్పత్రి ఎలాగూ పెట్టారు.. బ్యాంకునూ ఏర్పాటు చేయండి అని అడిగారు వాళ్లు. దీంతో దుర్భర్ మహిళా సమన్వయ కమిటీ కృషితో కేవలం సెక్స్‌వర్కర్ల కోసమే’ఉషా మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ లిమిటెడ్’ అనే బ్యాంకు వెలసింది. ఇందులో ఎనభై వేల మందికి అకౌంట్లు ఉన్నాయి. పదిహేను కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే స్థాయికి ఎదిగింది ఆ బ్యాంకు. “సెక్స్‌వర్కర్లు పడుపువృత్తి చేస్తున్నప్పుడు.. వారి పిల్లలను బయట కూర్చోమనాల్సి వచ్చేది. ఇదొక హింస. ఆ పరిస్థితిలో తల్లిని చూసిన పిల్లల మనస్తత్వం ఎంత కిరాతకంగా మారుతుందో ఊహిస్తే భయమేస్తుంది” అంటోంది భారతీదేవ్. దీంతో వాళ్ల సంస్థ విద్యార్థుల కోసం’హిందూవాలా’ అనే ఒక ప్రత్యేక భవనంతో పాటు ‘రాహుల్ విద్యానికేతన్’ అనే మరొక పాఠశాలను నెలకొల్పినట్లు ఆమె పేర్కొన్నారు.
ఇలా.. ఒక్కొక్క అభివృద్ధీ సెక్స్‌వర్కర్ల జీవితాలకు భరోసానిచ్చింది. వైద్యం అందడంతోనే వాళ్లలో ఆరోగ్యకరమైన మార్పు వచ్చింది.

మాతృభాషలో ఆరోగ్యమస్తు
రోగమొచ్చి ఆస్పత్రికి వెళితే- ఏ పూటకు ఏ మందు బిళ్లలు వేసుకోవాలో రోగికి తెలిసిన భాషలో రాసివ్వరు డాక్టర్లు. అలవాటు వల్లో ఓపిక లేకో ఆంగ్లంలో గీకేసి పంపిస్తారు. సామాన్యులకు వైద్యం చేరువ కావాలంటే ఈ మార్పుతోపాటు.. ఎవరి భాషలో వారికి వైద్యం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత డాక్టర్ల మీదే ఉందంటున్నాడు నాసిక్‌కు చెందిన డాక్టర్ శ్యామ్ ఆస్టేకర్. “సాంకేతిక విప్లవం వచ్చిందని సంబరపడుతున్నాం. కాని అది అన్ని రంగాల్లో కిందిస్థాయి ప్రజలకు ఉపయోగపడాలి. అప్పుడే ఫలితం లభించినట్లు. ఆ లక్ష్యంతోనే మేము ‘భారత్‌స్వస్త్య.నెట్’అనే వెబ్‌సైట్ పెట్టాం. ఇందులో సమాచారమంతా మరాఠీ, హిందీ భాషల్లోనే ఉంటుంది. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలను సైట్‌లో పొందుపరిచాం.

పాతిక వీడియోలు, రెండొందల యాభై వ్యాధుల వివరాలు, వైద్య పరీక్షలు, సాధారణ మందుల్లాంటి మొత్తం వెయ్యి అంశాలను అందుబాటులో ఉంచాం..” అని చెప్పుకొచ్చారాయన. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చేసి.. మహారాష్ట్రలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ హెల్త్ సైన్సెస్‌లో ఉన్నత హోదాలో పనిచేసిన శ్యామ్.. టెక్నాలజీ ద్వారా వైద్యాన్ని సామాన్యులకు ఇంకా ఎంత ప్రభావవంతంగా చేరవేయాలని ఆలోచిస్తున్నారు. “యాంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ధర ఎంత ఉంటుంది? ఈ విషయం తెలిస్తే గుండె జబ్బుల బాధితులు మోసపోరు. ఈ పని ప్రభుత్వం చేయాలి. కాని చేయదు. రోగుల్లో ఎంత చైతన్యం తీసుకొస్తే అంత మంచిది..” అని వివరించారీ నాసిక్ డాక్టర్.

cid:image003.png@01CE0D1A.E4C01F30

అసంఘటిత కార్మికులకు అండగా..
కంకర కొట్టే వాళ్లు, నగలకు రాళ్లు చెక్కేవాళ్లు, గాజు ఉత్పత్తుల కార్ఖానాలు.. ఇవన్నీ కంపెనీ వ్యాపారాలను తళతళలాడేలా చేస్తాయేమో కాని.. కార్మికుల బతుకుల్ని మాత్రం ఛిద్రం చేస్తున్నాయి. వీళ్లంతా అసంఘటిత కార్మికులు కావడంతో.. సరైన వైద్యసేవల్ని పొందలేకపోతున్నారు. పాతికేళ్ల నుంచి ఇలాంటి వారికి వైద్యం అందించడానికి పోరాటం చేస్తున్నాడు గుజరాత్‌లోని బరోడాకు చెందిన కెమికల్ ఇంజనీర్ జగదీశ్ పటేల్. ‘పీపుల్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (పిటిఆర్‌సి) నెలకొల్పాడీయన. “ఈ దేశంలో ఎన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నా.. కొన్ని వర్గాలకే వైద్యం పరిమితం అవుతోంది. అట్టడుగు వర్గాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. సమాజం వారి శ్రమను అనుభవిస్తున్నా.. కనీసం వైద్యసౌకర్యానికి కూడా నోచుకోవడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు గోద్రా, దావోద్,కంబాత్‌లలో స్టోన్ కట్టర్స్‌గా పనిచేస్తున్నారు.

అందరూ వెనుకబడిన వర్గాల వారే. గాజును పౌడరుగా మార్చడం, సిరామిక్ టైల్స్‌ను తయారు చేయడం, నగలలో పొదిగే రాళ్లను సానబెట్టడం వంటి పనులు చేస్తుంటారు వీళ్లు. ఉత్పత్తులన్నీ అమెరికా, యూరప్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దారుణం ఏమిటంటే.. ఈ రంగంలోకి వచ్చిన కార్మికులు పదేళ్లకంటే ఎక్కువ కాలం జీవించకపోవడం. ఊపిరితిత్తులు పాడైపోతాయి. సిలికోసిస్ అనే జబ్బు పట్టి పీడిస్తుంది. ఇప్పటికి ఎంత మంది చనిపోయారో లెక్కలేదు” అన్నారాయన. వారి కోసం ఆయన కంబాత్‌లో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. స్టోన్‌కట్టర్స్‌కు ప్రభుత్వం నుంచి గుర్తింపుకార్డులు ఇప్పించడం, ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించడం,ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఆరోగ్యకార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం చేస్తుంటుంది ఈ సంస్థ. “సిలికోసిస్‌కు గురైన కార్మికుల జీవితాల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాము. ఉత్తరాది పత్రికలన్నీ మానవీయ కథనాలను అచ్చు వేశాయి. ఆ క్లిప్పింగ్స్‌ను సుప్రీంకోర్టుకు పంపిస్తే, సుమోటో కేసుగా పరిగణించి విచారణకు స్వీకరించింది. ఆ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తోంది” అని వివరించారు.
స్టోన్‌కటింగ్ కంపెనీలమీద ఒత్తిళ్లు రావడంతో.. ఒక కంపెనీ ముప్పయి లక్షలు వెచ్చించి.. కార్మికులకు సురక్షిత సదుపాయాల కల్పన చేపట్టింది. మరిన్ని కంపెనీలు అదే మార్గంలో వెళుతున్నాయిప్పుడు.

ఎందుకివ్వరు చౌక మందులు?
మెడికో ఫ్రెండ్ సర్కిల్‌లోని అందరి నోళ్లలోనూ ఆయన పేరు నానుతూంటుంది. ఎవరు ఎదురుపడినా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తిరుగుతుండే అతని పేరు శ్రీనివాసన్. అందరూ ముద్దుగా ‘చిను’ అని పిలుస్తుంటారు. ఒక చిన్న ఖద్దరు సంచిని భుజాన వేసుకుని, ఓ సామాన్య మధ్య వయసు ఉద్యోగిలా కనిపించే ఆయన.. దేశంలోనే అత్యున్నత చదువులు చదివాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఖరగ్‌పూర్‌లో ఐఐటీ, బెంగళూరులో ఐఐఎం, పీహెచ్‌డి చేశారు. అయినా ఆయన తన మేథోసామర్థ్యాన్ని ఏ కంపెనీకో ఊడిగం చేసేందుకు వినియోగించలేదు. “నా తపన ఒక్కటే! వైద్యం పేరుతో బడా కంపెనీలు ప్రజల్ని ఎలా దోచుకుంటున్నాయో అందరికీ చెప్పడం. వాటిని శాస్త్రీయంగా నిరూపించడం. అందుకే పెద్ద కంపెనీల కంటే అతి తక్కువ ధరకు అదే నాణ్యతతో మందుల్ని ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తున్నాం” అన్నారు.

మనకు ఒంట్లో బాగలేక డాక్టర్ దగ్గరకు వెళితే.. ఆయన మందులు రాయాలి కాని, ఆ మందులు ఉత్పత్తి చేసే కంపెనీల పేర్లెందుకు రాయాలి? అన్నదే చిను ప్రశ్న! రోగులతో మితిమీరిన మందులు కొనిపించి.. అందులో కొంత కంపెనీకి… మరికొంత వైద్యుల ప్యాకేజీలకు ఖర్చు చేయడం ఎంతవరకు న్యాయం? అంటాడాయన. “1960లో ఆస్పత్రులు తక్కువ. ఆ రోజు ఒక ప్రసవం చేస్తే వంద రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు ఆస్పత్రులకు కొరత లేదు. అయినా ఒక ప్రసవం చేస్తే ఇరవై నుంచి ముప్పయి, నలభై వేలు తీసుకుంటున్నారు. వైద్య రంగంలో ప్రగతిని సాధించడమంటే ఇదేనా? పేదలు అంత డబ్బుపోసి వైద్యం చేయించుకోగలరా?” మనందరి తరఫున ఇలాంటి ప్రశ్నలు అడుగుతారాయన. కొనుగోలు దారునికి మందుల పట్ల అవగాహన లేకపోవడం వల్లే కంపెనీలు ఎన్నో రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నాయన్నది’చిను’ అభిప్రాయం.

అందుకే ఆయన గుజరాత్‌లోని బరోడాలో ‘లోకాస్ట్ ఇండియా’ అనే ఛారిటబుల్‌ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాటిని సరఫరా చేస్తున్నారు. “బయట మందులషాపులో అధిక రక్తపోటుకు వాడే ‘అటెనాల్’ పది మాత్రల ధర రూ.20 నుంచి రూ.25 ఉంటే.. అవే మాత్రల ప్యాకెట్ మా లోకాస్ట్ ఇండియాలో రూ.3 కే తయారు చేస్తున్నాం. పారాసెటమాల్ (పది మాత్రలు) బయట మార్కెట్‌లో రూ.20 కి అమ్మితే, లోకాస్ట్‌లో మూడు రూపాయలకే ఇస్తున్నాం. సిట్రిజన్ (పది) ముప్పయి రూపాయలైతే, మా దగ్గర కేవలం రెండు రూపాయలకే ఇస్తున్నాం. ఇది మాకు ఎలా సాధ్యమైంది..? అంటే లాభం లేకుండా అమ్ముతున్నాం కాబట్టి. కంపెనీలన్నీ వెయ్యి నుంచి మూడువేల శాతం అధిక ధరలకు మందుల్ని అమ్ముతున్నాయి. లేకపోతే మన దేశంలో ఏడాదికి రూ.68 వేల కోట్ల మందుల బిజినెస్ ఉంటుందా చెప్పండి..”అన్నారు నవ్వుతూ.
లోకాస్ట్ ఇండియా ఉత్పత్తి చేసే మందులు బయట మెడికల్‌షాపులలో దొరకవు. దేశవ్యాప్తంగా నిరుపేదలకు సేవ చేస్తున్న కొన్ని సంస్థలకు మాత్రమే ఇస్తారు వాళ్లు.
ఒక్కో వ్యక్తికి 40కిలోల మందులా?
శవాల మీద కాసులు ఏరుకోవడం అంటే ఇదే! ముప్పయి ఏళ్ల కిందట భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు… అక్కడ ముందుగా వాలిపోయింది ఎవరో తెలుసా? మందుల కంపెనీలు. ఈ మాట వినడానికి దారుణంగా అనిపించవచ్చు కాని అదే భోపాల్‌లో ‘సంభావనా ట్రస్ట్’ నెలకొల్పిన ఆయుర్వేద వైద్యుడు సాతీనాథ్ సారంగ్‌ను కదిపితే మరిన్ని దారుణాలు వినాల్సి వస్తుంది. “భోపాల్ గ్యాస్ బాధలు ఇప్పటికీ మానిపోలేదు. వేలల్లో చనిపోయారు. లక్షల్లో అవిటివారయ్యారు. వాళ్లందరూ మన దృష్టిలో బాధితులు. కాని మందుల కంపెనీల దృష్టిలో కస్టమర్లు. ఆ ఘోరం జరిగిన వెంటనే అతి పెద్ద బహుళజాతి ఔషధ కంపెనీలన్నీ భోపాల్‌లో వాలిపోయాయి. వాళ్ల వ్యాపారానికి డాక్టర్లు తోడయ్యారు. బాధితులకు మందులు రాసి.. రాసి.. మింగించి.. మింగించి.. జీవచ్ఛవాలను చేశారు తప్ప ఊరటనిచ్చింది ఏమీ లేదు. ఒక్కో బాధితుడు తన జీవిత కాలంలో నలభై కిలోల మాత్రల్ని మింగాడని మా సర్వేలో తేలింది.

జబ్బు పోగొట్టేందుకు మందుల్ని రాస్తున్నారా? కంపెనీలకు లాభాలు పండించేందుకు మందుల్ని రాస్తున్నారా? జవాబు డాక్టర్ల నిజాయితీకే వదిలేస్తున్నాను..” అంటున్నారు సాతీనాథ్. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ భోపాల్ బా«ధితులకు వరం. పాతికవేల మందికి పైగా అందులో సభ్యులయ్యారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలతో వారందరికీ చికిత్స చేయిస్తున్నారాయన. యోగాథెరపీ, హెర్బల్, ఆయుర్వేదాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆ రోజుతోనే భోపాల్ దుర్ఘటన మాసిపోలేదు. గ్యాస్ ప్రమాదంలో కాలిపోయిన వాటన్నిటినీ ఆ నేలలోనే పూడ్చిపెట్టారు.

ఆ రసాయనాలన్నీ భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలను విషతుల్యం చేశాయి. ఆ నీటిని తాగుతున్న వాళ్లంతా మళ్లీ కొత్త జబ్బులకు గురవుతున్నారు” అని చెప్పారు. మందుల కంపెనీలకు ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండవు. వాటిని వాడమని చెప్పే డాక్టర్లకు మనిషి ఆరోగ్యంతో పని లేదు. “యాంటీ బయాటిక్స్ వాడినవాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గింది. స్లీపింగ్‌పిల్స్ వేసుకున్న వాళ్లు వాటికి బానిసలై పోయారు. పెయిన్‌కిల్లర్స్‌తో అల్సర్స్ వచ్చాయి. స్టెరాయిడ్స్‌తో నరాలన్నీ బలహీనమైపోయాయి. ఇవన్నీ మోతాదుకు మించి వాడటం వల్ల వచ్చిన అనర్థాలు” అన్నది ఆయన వాదన.
చికిత్సలకు రేటెందుకు ప్రకటించరు? ఒక హోటల్‌కు వెళితే.. ఇడ్లీ, ఉప్మా, దోశ ఇలా ప్రతి దాని ధరను తెలిపే మెనూ ఒకటి కనిపిస్తుంది. అదే హాస్పిటల్‌కు వెళితే.. ఏ రోగానికి ఎంత రేటో తెలియదు. వైద్యం చేసేవరకు చేతిచమురు ఎంత వదులుతుందో అర్థం కాదు. అంత డబ్బును సమకూర్చుకోలేక, రోగిని వెనక్కి తీసుకెళ్లలేక నరకయాతన పడాల్సి వస్తుంది. అందుకే ” హోటల్‌లో ధరల పట్టికలాగ.. ఆస్పత్రిలో ఏయే వైద్యసేవలకు ఎంత ఖర్చు అవుతుందో తెలిపే వివరాలను చట్ట ప్రకారం ప్రకటించాలి..” అంటున్నాడు వైద్యరంగంలో పనిచేస్తున్న ఢిల్లీ సామాజిక కార్యకర్త సునీల్ నందరాజ్. “ప్రైవేటు హాస్పిటల్స్‌లో పారదర్శకత లేదు. మనం చెల్లించే బిల్లును ఎందుకు అంత గోప్యంగా ఉంచాలి. దేనికి ఎంత అవుతుందో తెలుసుకునే హక్కు రోగికి లేదా? ఆస్పత్రులన్నీ ఫీజుల వివరాలను బహిరంగపరచాలని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని రాష్ట్రాలు ఆమోదిస్తే అప్పుడు అది అమలులోకి వస్తుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏ మాత్రం చొరవ చూపడం లేదు. ఎందుకంటే ఇక్కడున్న కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఆ పని జరగనివ్వవు. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి..” అని చెప్పారాయన.

బోడోల్యాండ్ గిరిజనులకు పెద్దదిక్కైన డాక్టర్ సునీల్‌కౌల్, కోల్‌కతాలో సెక్స్‌వర్కర్లకు ఆశాదీపం భారతీదేవ్,మాతృభాషలో వైద్యవిజ్ఞానాన్ని పంచుతున్న శ్యామ్ ఆస్టేకర్, రాళ్ల బతుకుల్లో పూలు పూయిస్తున్న జగదీశ్‌పటేల్,లాభాపేక్ష లేకుండా మందుల్ని సరఫరా చేస్తున్న శ్రీనివాసన్, భోపాల్ జీవన స్మృతులకు స్వస్థత చేకూరుస్తున్న సాతీనాథ్ సారంగ్.. వైద్యసేవలకు చట్టబద్ధ రేట్లను ప్రకటించాలని కోరుతున్న సునీల్ నందరాజ్.. వీరంతా వైద్యరంగానికి పట్టిన జబ్బుకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్లు, సోషల్‌వర్కర్లు. ఇలాంటి వారి సంఖ్య వందలు, వేల రెట్లు పెరిగినప్పుడే.. మన దేశ ఆరోగ్యం బాగుపడుతుంది.

మల్లెంపూటి ఆదినారాయణ మెడికో ఫ్రెండ్ సర్కిల్ వెబ్‌సైట్ www.mfcindia.org

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s