‘అమృతమే’ అమృతమైంది

‘అమృతమే’ అమృతమైంది

chnadamama

‘అమృతం’ అని పేరు పెట్టి సీరియల్ తీసినంత మాత్రాన నిర్మాతకది అమృతం అయిపోతుందా! అవ్వదు కాక అవ్వదు. కాకరకాయలా, కరక్కాయలా మహా చేదుగా ఉండీ ఉండీ అది చివరికెప్పుడో అమృతంగా మారిందట. ఆ తర్వాత ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘అమ్మ చెప్పింది’ తీసి సినిమాల్లో కూడా కాస్త అమృతాన్ని చిలకరించుకున్నారాయన. ఇప్పుడు ఏకంగా ‘చందమామలో(నే) అమృతా’న్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న గుణ్ణం గంగరాజు జీవితంలోని కొన్ని సంఘటనలే నేటి ‘అనుభవం’.

జీవితం అన్నప్పుడు ఎన్ని సంఘటనలైనా జరగవచ్చు. కానీ, కొన్ని సంఘటనలు జీవితాన్నంతా ఆవహిస్తాయి. నా విషయంలోనూ అదే జరిగింది. ‘అమృతం’ సీరియల్‌కు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనంతగా అది నా జీవితాన్ని ఆవ హించింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా అందులో ‘అమృతం’ ఛాయలే కనపడతాయి.

“ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడు ఒక రంగంలోకి ప్రవేశించడానికి వెనకాముందు ఆడుతుంటే, ఏ జ్ఞానమూ లేని వాడు ఆ రంగంలోకి అమాంతంగా దూకేస్తాడు ” అనే వ్యాఖ్య నా విషయంలోనూ రుజువైంది.

నేను సినిమా రంగంలోకి దూకడం కూడా అలాగే జరిగింది మరి! ఏదైనా సినిమా చూసినపుడు ఈ సబ్జెక్టుని ఇంతకన్నా బెటర్‌గా తీయొచ్చు కదా అన్న భావన కొన్నిసార్లు నాలో మెదులుతూ ఉండేది. నాకేదో గొప్ప ప్రతిభ ఉందనీ కాదు, వాటి ప్రమాణాలు పెద్ద తెలిసీ కాదు. కాకపోతే ఆయా సినిమాల స్థాయి నాలాంటి వాళ్లకే అంతకన్నా బెటర్ సినిమా తీయొచ్చన్న ఆత్మవిశ్వాసం కలిగించేలా ఉండేది. అదే నన్ను సినిమా రంగంలోకి ప్రవేశించేలా చేసింది.
తెగింపే లేకపోతే…
డైరెక్టర్‌గా నాకు ‘మాలుటి’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసే తొలి అవకాశం వచ్చింది. అయితే, ఓ వారం రోజుల షూటింగ్ తరువాత ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. ఆ తరువాత అయిదేళ్లు గడిచినా మరో అవకాశమే రాలేదు.

రోజులు గడిచే కొద్దీ ఇంతటితో సినిమా అధ్యాయం ముగిసినట్టేనన్న భావన బలపడుతూ వచ్చింది. అయినా, వెనుదిరిగిపోవడానికి మాత్రం మనసు అంగీకరించలేదు. చివరికి నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి డబ్బులున్నా లేకున్నా సొంతంగానే సినిమా తీయాలన్న నిర్ణయానికి వచ్చాను . చిన్న పిల్లల ఇతివృత్తాన్ని భిన్న కోణంలో చూపించి గొప్ప వ్యాపారం చేయొచ్చన్న ఒక ఆలోచన మొదలై ‘లిటిల్ సోల్జర్స్’ తీయడానికి సిద్ధమయ్యాను. మామూలుగా అయితే హీరో తనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 20 మందినో 30 మందినో టపటపా వాయిస్తాడు.

సమస్య పరిష్కారమవుతుంది. శారీరకంగా అంత బలంలేని మరెవరికైనా అదే సమస్య వస్తే ఎలా ఉంటుంది? అన్న దిశగా నా ఆలోచనలు సాగాయి. బలం లేని వాడు అంటే బక్కపలచగా ఉండే హీరోని పెడితే అదేమీ బాగుండదు. వాళ్లు సహజంగానే బలంలేని వాళ్ళయి ఉండాలి. అంటే చిన్న పిల్లలు. వీరికి తోడు సహజంగానే బలం లేని పెద్దవాళ్లు కావాలి. అంటే ఎవరు? వృద్ధులు. ఈ ఇరువురూ ఉండే ఇతివృత్తమే ‘లిటిల్ సోల్జర్స్’.

నా మట్టుకు నాకు ఇది చాలా భిన్నమైన ఐడియాగానే అనిపించింది. ఎంతో తార్కికంగా ఆలోచించానన్న మహా సంతోషం కూడా కలిగింది. ఆ తర్కంతోనే సినిమా తీసిన నేను ఫలితాలు చూసి తల బాదుకోవాల్సి వచ్చింది.

భారీ నష్టాలతో బతుకు బరువెక్కింది. మనకున్న రెండు కళ్లతో కోటానుకోట్ల హృదయాల్ని అంచనా వేసే ప్రయత్నంలో అన్నిసార్లూ మనం విజయమే సాధిస్తామన్న గ్యారంటీ ఏదీ లేదు. కాకుంటే, అపజయానికి ఉన్నన్ని అవకాశాలు విజయానికీ ఉంటాయని మనం నమ్మాలి. నేనూ అదే నమ్ముతాను. లేకపోతే అంత భారీనష్టాల తరువాత కూడా ఒక సీరియల్ నిర్మాణానికి సిద్ధం కావడమేమిటి?
నమ్మకమే నడిపించింది
‘లిటిల్ సోల్జర్స్’ తరువాత మళ్లీ దాదాపు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఒక కామెడీ సీరియల్ చేద్దామని ‘అమృతం’ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాం. విషయ పరిజ్ఞానం పెద్దగా లేకుండానే సినిమా నిర్మాణంలోకి దూకేసినట్టే, టీవీ సీరియల్ రంగంలోకి కూడా దూకేశాను.

తీసిన సీరియల్‌ను ఎలా మార్కెట్ చేసుకోవాలో, యాడ్స్ ఎలా వస్తాయో ఆ వ్యవహారమేమిటో అప్పటిదాకా ఏమాత్రం తెలియదు. ఏడ్పులూ తూడ్పులూ లేకుండా ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునే థీమ్ కదా! విజయానికి మినిమం గ్యారెంటీ ఉంటుందన్న ఏదో ఒక న మ్మకం నన్ను ఆ వైపు వెళ్లడానికి ప్రేరేపించింది. వెనకా ముందూ చూడకుండా ఏడు ఎపిసోడ్స్ షూట్ చేసేశాం. ప్రతి ఎపిసోడ్‌కూ లక్షన్నర దాకా ఖర్చు. తీసుకు వెళ్లి అందరిలాగే అమ్ముకుందామని ఒక ఛానల్‌ను కలిస్తే, వాళ్లు చూసి ” ఏమీ బాగోలేదండి.మాకు అక్కరలేదు” అంటూ డివిడి తిరిగి ఇచ్చేశారు.

వెళ్లీ వెళ్లగానే అమాంతం కొనేస్తారన్న పెద్ద ధీమాతో ఉన్న నన్ను ఆ తిరస్కారం నిర్ఘాంత పోయేలా చేసింది. ఏంచేయాలో బోధపడని స్థితి. మనసును కాస్త కుదుట పరుచుకుని మరో ఛానల్‌కు వెళితే. అక్కడా అదే పరిస్థితి. ఇక ఆ హక్కులు ఎవరికీ అమ్మకూడదనుకుని, మేమే స్లాట్ తీసుకుని ప్రసారం చేయడానికి సిద్ధపడ్డాం. దాదాపు రెండేళ్ల దాకా నష్టాల్లోనే గడిచింది.

వారానికో అగ్నిపరీక్ష
వారం వారం డబ్బులు సమకూర్చుకోవడం ఒక సమస్య అయితే, ప్రతి వారం ఒక కొత్త కథను సిద్ధం చేసుకోవడం మరో సమస్య. ఇదేమి నరకంరా బాబూ అనిపించేది. అలా అని ఆగిపోతే బతుక్కి ఆక్సిజనే ఉండదు. మరో రంగమూ తెలియదు. మరోలా బతకడమూ చేతకాదు. బలవంతంగా బండి లాగాల్సి వచ్చింది. సీరియల్ నడుస్తున్న కాలమంతా రోజూ నన్ను నేను తిట్టుకునేవాడ్ని.

సినిమాల కోసం వచ్చి సీరియల్ తీయడం ఏమిటి? వారం వారం గ్యాప్ రాకుండా ప్రతివారం ఒక కొత్త కథ రాసే ఈ నరకమంతా ఏమిటి? కనుచూపు మేరలో ఆ నరకానికి అంతమే కనిపించేది కాదు. ఏ ఉద్యోగంలోనో చేరినా సీరియల్ కోసం ఇప్పటిదాకా చేసిన అప్పులన్నీ ఎలా తీరతాయి? ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మేము కట్టాల్సిన వడ్డీలే ఆ వచ్చే జీతం కన్నా చాలా ఎక్కువ.

అరుగు మీది నుంచి పడితే తిరిగి లేవొచ్చు. కాని పర్వతం పై నుంచి నేల మీద కాదు, ఏకంగా పాతాళంలో పడిన ట్టుగా ఉంది మా పని. ఏడాదికి 52 ఎపిసోడ్లు అంటే దాదాపు ఏడెనిమిది సినిమాలంత నిడివి. దీనికన్నా ఏడాదికి ఓ సినిమా తీయడం ఎంతో సులువు. అందుకే సీరియల్ తీస్తున్న కాలంలోనే మళ్లీ సినిమా ఆలోచనలు వచ్చాయి.

ఈ లోగా ఒక కొత్త ఏజె న్సీతో ఒప్పందం కుదరడంతో మా నష్టాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2001 నుంచి 2007 దాకా ఆరేళ్లపాటు ధారావాహికగా ప్రసారమైన ఈ సీరియల్ చివరి మూడేళ్లు మాత్రం లాభాలతో సాగింది.
తిరస్కారమే మేలు చేసింది
అమృతం సీరియల్ హక్కుల్ని మేము ఎవరికీ అమ్ముకోలేదు. మరో రకంగా చెప్పాలంటే ఎవరూ కొనలేదు కాబట్టి ఆ ప్రాపర్టీ మాకే ఉండిపోయింది. ఆ రోజు వాళ్లు సరే అని ఉంటే ఆ సీరియల్ శాశ్వతంగా వాళ్ల సొంతమయ్యేది. ఆరేళ్ల ప్రసారం తర్వాత దాన్ని వన్ టైమ్ ప్రసారానికి అడిగారు. ఆ వెంటనే మరో ఛానల్ వాళ్లు కొత్తగా షూట్‌చేసిన సీరియల్‌కే సర్వహక్కులూ సొంతం చేసుకుని ప్రతి ఎపిసోడ్‌కు 65 వేల రూపాయలు ఇచ్చే ఆ రోజుల్లో అప్పటికే ఒకసారి ప్రసారమైన మా సీరియల్‌కు అంతకంటే ఎక్కువ ఆఫర్ ఇచ్చారు. ఒకే ఒక్కసారి ప్రసారం చేసుకుని చివరికి మా ప్రాపర్టీ మాకు ఇచ్చేలా ప్రతి ఎపిపోడ్‌కు లక్షరూపాయల చొప్పున ఒప్పందం కుదిరింది.

మొత్తం 300 ఎపిసోడ్స్ నిడివిగల ఈ సీరియల్‌కు ఆ ఒప్పందం కుదరడం నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ చానల్‌లో సీరియల్ ముగియగానే అప్పటిదాకా వారానికి ఒకరోజే ప్రసారమయ్యే ఈ సీరియల్‌నే మరో ఛానల్ వారు డెయిలీ సీరియల్‌గా వేసుకోవడానికి ముందుకొచ్చారు. అక్కడ అది 18 మాసాలు ప్రసారమైంది.

మొత్తంగా చూస్తే వేరు వేరు ఛానల్స్‌లో దాదాపు 12 ఏళ్లకు పైగా ఈ సీరియల్ ప్రసారమవుతూ వచ్చింది. ఆ త రువాత అదే సీరియల్‌ని యూ-ట్యూబ్‌లో పెట్టాం. నేడు దాన్ని దాదాపు పది దేశాలు వీక్షిస్తున్నాయి. యూ-ట్యూబ్‌తో పాటు అక్కడి టీవీల్లోనూ ప్రసారమవుతోంది.
చందమామలో అమృతం
అమృతం సీరియల్ నన్ను అలా గట్టెక్కించి ఉండకపోతే లిటిల్ సోల్జర్స్ తర్వాత అసలు సినిమాలే ఉండేవి కాదు. ఏమైనా ‘అమృతం’ సీరియల్ ఇంకా అందమైన జ్ఞాపకంలా మిగిలేలా ఇప్పుడు దానికో కొత్త రూపం ఇచ్చాం. ఆ సీరియల్ ఇతివృత్తాన్నే తీసుకుని ‘చందమామలో అమృతం’ అన్న సినిమా తీశాం. అది ఇప్పుడు విడుదలకు సన్నద్ధమవుతోంది. ‘అమృతం’ సీరియల్ నా జీవితానికి పెద్ద ఎదురు దె బ్బ అనుకుంటే ఒక మహాశక్తిగా మారి అదే మమ్మల్ని ముందుకు నడిపించింది.

అంతకన్నా మించి ఆ రోజు మా సీరియల్‌ను తిరస్కరించిన వాళ్లే ఆ తర్వాత గొప్పగా ఆదుకున్నారు. ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తుంటే అప్పటికప్పుడు మనకు ఏమీ చేయని వాళ్లే ఆ తరువాత కాలంలో మహా మేలు చేస్తారేమో అనిపిస్తుంది.

ఎవరికైనా వ్యతిరేక శక్తి ఒకటి ఎదురుకాకుంటే అంత బలంగా ముందుకు వెళ్లాలనిపించదేమో! తిరస్కారానికి గురైన తరువాత తీసిన ప్రతి ఎపిసోడ్ వెనుక దాని తాలూకు ఉక్రోషం, తిరిగి పడిపోకుండా నిలదొక్కుకోవాలన్న పట్టుదలే మమ్మల్ని ముందుకు నడిపించాయనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వెనుకనుంచి తోస్తూ ఉంటే ఒక్కోసారి బోల్తాపడవచ్చు. ఎదుటి నుంచి తోస్తూ ఉంటే పడిపోం సరికదా, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు.’ అమృతం’ విజయం వెనుక అదే ఉందనిపిస్తుంది.
– బమ్మెర
ఫోటోలు: రాజ్‌కుమార్

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s