ఒక తల్లి విజయగాథ

 Description: http://sakshi.com/newsimages/contentimages/13052012/gggg12-5-12-13613.jpg

ఈ రోజుల్లో ఒక తల్లి నలుగురు పిల్లలకు భారం కావచ్చేమో గాని నలుగురు పిల్లలు ఏ రోజుల్లోనూ తల్లికి భారం కాదు. ఇది అమ్మతనానికి, అమ్మ త్యాగానికి, ఆమె గొప్పదనానికి నిదర్శనం. దీనిని అక్షరాలా నిరూపించిన ఓ తల్లి గాథ ఇది. ఈ పిల్లలను పెంచలేనురా దేవుడా!

నా తరం కాదు అంటూ తండ్రి చేతులెత్తేసినా ఒంటి చేత్తో ఓ అమ్మ తన ఐదుగురు పిల్లలనూ పెంచి పెద్ద చేసి, ప్రయోజకులను కూడా చేసింది. అది కూడా ఒకే కాన్పులో పుట్టిన ఐదుగురు పిల్లలను చిన్న ఉద్యోగం చేస్తూ పెంచింది ! మాతృదినోత్సవం సందర్భంగా ఆ అమ్మ గాథ మీ కోసం…

తిరువనంతపురం నుంచి వెంజరమూడు గ్రామం పాతిక కిలోమీటర్లు. మొన్న కేరళలో పదో తరగతి ఫలితాలు వచ్చిన వెంటనే మీడియా ఆ ఊరికెళ్లింది. ఆ ఊర్లో పెద్ద విద్యాసంస్థలు లేవు, ప్రభుత్వ కార్యాలయాలూ లేవు. పదో తరగతి చదువుతున్న ఐదుగురు పిల్లలున్నారు. వారి ఫలితం ఏమైందా అని మీడియా ఆ ఊరికెళ్లింది. శుభవార్త… అయిదుగురూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో చాలామంది పదో తరగతి చదువుతారు. మరి వారి గురించే ఎందుకు అంత ఆసక్తి అనే మీ సందేహాన్ని తీర్చాలంటే 1995కి వెళ్లాలి!

రమాదేవి, ప్రేమ్‌కుమార్ ఓ అన్యోన్యమైన జంట. చిన్న వ్యాపారం చేసుకుంటూ సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్న ఆ జంట 1995లో తల్లిదండ్రులయ్యారు. అయితే, అది సంతోషమో కాదో తేల్చుకోలేని విచిత్రమైన పరిస్థితి ఆ దంపతులది. వారికి ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు (క్వింటుప్లెట్) పుట్టారు. ఇలా ఒకే గర్భం నుంచి ఏకకాలంలో ఎక్కువ మంది పుట్టినప్పుడు వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండదు.

ఈ ఐదుగురు కూడా బలహీనంగా ఉన్నారు. చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. క్రమంగా పిల్లలందరూ బతికి బట్టకట్టారు. చాలా ప్రేమగా వారికి ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్ర, ఉత్రజ, ఉత్రజన్, ఉత్తమ, ఉత్తర అంటూ నామకరణం చేసి తమ ఇంటిపేరుకి కూడా ‘పంచరత్నం’గా మార్చుకున్నారు.
అయితే, ఐదుగురు పిల్లలనూ తరచూ చిన్నచిన్న వ్యాధుల కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. బేకరీ, స్టేషనరీ షాపు నడుపుతున్న ప్రేమ్‌కుమార్‌కు వారి ఆస్పత్రి ఖర్చులు భారంగా మారిపోయాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. వారిని పెంచలేక, కన్నప్రేమను వదిలించుకోలేక మథనపడుతూనే కన్నుమూశాడు. దీంతో అప్పటివరకు ఇంటి పనులు చేసుకుంటూ వస్తున్న రమాదేవికి వారి పోషణ భారం పెద్ద సమస్య అయ్యింది.

ఐదుగురినీ సాకాలంటే సంపాదించాలి. చదువు లేదు, కూలి డబ్బులతో వారిని చదివించలేదు. దీంతో ఆమె అనేక ప్రయత్నాలు చేసి చేసి చివరకు తిరువనంతపురంలోని ఓ స్థానిక బ్యాంకులో ప్యూన్‌గా ఉద్యోగం పొందింది. పంచరత్నాల బాధ్యతను తన భుజస్కంధాలపైన వేసుకుని ఉద్యోగం, ఇల్లు చక్కబెడుతూ వారిని పెంచి పెద్ద చేసింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడిందే కానీ ఒక్కరిని కూడా చదువు మాన్పించలేదు.

ఆస్పత్రి ఫీజులు, స్కూలు ఫీజులు, ఇంటి ఖర్చులు తడిసి మోపెడయినా జడవకుండా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఆమె మనో స్థైర్యాన్ని చూసి స్థానికులు విస్తుపోయారు. ఆమెకు ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చారు. కానీ, ఆమె అందరి నైతిక మద్దతు తీసుకుంది కానీ ఎవరి సాయాన్నీ పూర్తిగా వాడుకోలేదు. ఆ పిల్లలు కూడా తల్లికి తగ్గట్టు మసలుకుంటూ చదువుపై శ్రద్ధాసక్తులు పెట్టారు. వట్టపారలోని లార్డ్ మౌంట్ ఉన్నత పాఠశాలలో చదువుతూ, ప్రతి యేడూ మంచి గ్రేడ్లలో పాసవుతూ వచ్చారు.

ఈ మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారు. కొద్దిరోజుల క్రితమే ఆ ఫలితాలు వెలువడ్డాయి. అయిదుగురూ మంచి గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించారు. దీంతో వారికి ఉచిత విద్యను అందిస్తామంటూ అనేక కళాశాలలు ముందుకొచ్చాయి. అయితే, వారు చదువుతున్న పాఠశాల వారు తమ సొంత కళాశాలలో వారికి ఉచిత విద్యను అందిస్తామని చెప్పడంతో వారు ఇంటర్ కూడా అక్కడే చదవబోతున్నారు.

ఒక్కగానొక్క నలుసు పుడితే ప్రైమరీ స్కూల్లో చేర్చడానికి నానా ఇబ్బందులు పడుతున్న నేటి రోజుల్లో ఐదుగురిని కని, పెంచి, ప్రయోజ కులను చేస్తున్న ఆ మాతృమూర్తిని అభినందించడానికి ఈ మాతృ దినోత్సవమే మంచి సందర్భం.

-ప్రకాష్ చిమ్మల

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

2 thoughts on “ఒక తల్లి విజయగాథ”

  1. ఒక మలయాళీ తల్లికి ఒకేకాన్పులో ఐదుగురుపిల్లలు(క్విటు ప్లెట్)పుట్టి,తండ్రిచనిపోతే ఆ తల్లి తన ఒక్కచేతి మీద ఏదో చిరుద్యోగం చేసి ఐదుగురినీ ప్రయోజకులనుచేసిన ఒక తల్లి విజయగాథ ను ప్రకాశ్ చిమ్మల స్ఫూర్తిదాయకంగా టపా లిఖించారు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s