ప్రకృతి ఒడిలో….‘మహాసరస్వతి పాఠశాల’.

ఏసీ క్లాస్ రూమ్స్, టచ్ స్క్రీన్ టెక్నాలజీ…
పర్సనలైజ్డ్ అటెన్షన్, సీసీటీవీ ఎనేబుల్డ్… ఏమిటిదంతా?!
చెట్టుపుట్టా, చిన్న మొక్కాపువ్వూ లేకుండా… ఏం చదువులివి?
‘అడ్మిషన్స్ ఆర్ ఓపెన్’ అని ఉంటే చాలు…
ఓపెన్ ఎయిర్ లేకున్నా పిల్లల్ని చేర్పించేస్తున్నాం!
పర్యావరణ పరిరక్షణ చదువుల్ని కూడా…
సిమెంటు కట్టడాల నడుమే నేర్పించేస్తున్నాం! ఎంత అన్యాయం!
ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి… పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేమా?
ఈ ప్రశ్నకు ఒక పచ్చటి సమాధానమే…‘మహాసరస్వతి పాఠశాల’.
ప్రకృతే స్వయంగా నడుం బిగించి బడి కడితేఎలా ఉంటుందో చూడాలనుకుంటే…
వరంగల్ జిల్లా నర్సాపూర్ వెళ్లండి.
అక్కడి ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకోండి.
స్కూల్‌లో చేర్పించడానికైనా…
మీరే ఒక స్కూల్ నిర్మించడానికైనా…

ఎప్పుడూ లేనంతగా సూర్యుడెందుకు ఎండలు చిమ్ముతున్నాడో… వందలాది ప్రాణాలెందుకు వడ‘గాలిలో’ కలిసిపోతున్నాయో…తెలుస్తూనే ఉంది. కాని మన పచ్చని భవిష్యత్తుని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలుసా? హైదరాబాద్‌కు చెందిన పర్యావరణవేత్త జ్యోతిరెడ్డి ఇందుకు తన వంతుగా ఓ మార్గం ఎంచుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని రేపటి తరానికి పర్యావరణ పాఠాలు నేర్పుతున్నారు.

రాష్ట్ర రాజధాని నగరానికి దాదాపు 200కి.మీ దూరంలో ఉన్న ములుగు మండల పరిధిలోని చిన్ని గ్రామం నర్సాపూర్‌లో వ్యవసాయాధార కుటుంబంలో పుట్టిన జ్యోతిరెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, పచ్చదనాన్ని పంచేందుకు చేస్తున్న ఉదాత్త ప్రయత్నమే ‘మహాసరస్వతి ఎడ్యుకేషనల్ అండ్ ఎకొలాజికల్ ఫౌండేషన్ (ఎమ్‌ఇఇఎఫ్)’ ఆధ్వర్యంలోని మహాసరస్వతి పాఠశాల.

‘‘పచ్చటి పల్లె తల్లి నీడన వన్యప్రాణులతో చెలిమి చేస్తూ పెరిగినందుకేమో… పర్యావరణం మీద నాకు మక్కువ ఎక్కువ. సోషల్ సెన్సైస్, జర్నలిజంలో డిగ్రీ చేసినా, మనసు చూపిన మార్గంవైపే మొగ్గు చూపి, పర్యావరణంపై లండన్‌లో కోర్సు చేశాను.

కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరాల్లో ఎన్ని చెప్పినా, ఎంత చేసినా అంతా బూడిదలో పోసినట్టే. ఇంకా పచ్చదనాన్ని కోల్పోని కొన్ని గ్రామాల్లోనైనా పర్యావరణాన్ని కాపాడదామనుకున్నాను. ప్రకృతి ప్రాధాన్యతను భావితరాలు అవగాహన చేసుకోవాలని ఈ మారుమూల పల్లెలో పాఠశాల నిర్వహిస్తున్నాను’’ అంటారు జ్యోతిరెడ్డి.

పర్యావరణానికి ప్రాణం… విద్యకు వ(ంద)నం…

కొందరు బంధుమిత్రులతో కలిసి నర్సాపూర్‌లో దాదాపు 5 ఎకరాల స్థలంలో స్కూల్‌తోబాటు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు జ్యోతిరెడ్డి. నర్సరీ నుంచి 10వ తరగతి దాకా విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులతో, పర్యావరణ హితమైన రీతిలో పాఠశాల నిర్మితమైంది.

భూకంపాలు సైతం తట్టుకునే అద్భుత సాంకేతిక ప్రమాణాలతో స్కూల్ భవనం నిర్మితమైందని జ్యోతిరెడ్డి సగర్వంగా చెపుతారు. నిర్మాణంలో అతి తక్కువ చెక్క వినియోగించడంతో పాటు కాలాలకతీతంగా నిత్యం చల్లగా ఉండేందుకు పాఠశాల భవనాన్ని ప్రత్యేకమైన ఇటుకలతో నిర్మించారు.

‘‘విజ్ఞానాన్ని మానవాళి వినాశనానికి కాకుండా చిరకాలమనుగడకు ఉపయోగించాలనేదే మా ఫౌండేషన్ ధ్యేయం’’ అంటారు జ్యోతిరెడ్డి. ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పాఠాలూ బోధిస్తారు. పక్షుల కిలకిలారావాలు, పిల్లల కేరింతలతో జతకట్టే ఈఆవరణలో పాఠశాల సీలింగ్‌పై ఎక్కడ చూసినా పిచ్చుక గూళ్లు కన్పిస్తాయి. స్కూలుకు 24గంటలూ విద్యుత్ అందించే సోలార్ సిస్టమ్ ఉంది. స్కూల్ల్లో ఉన్న దిగుడు బావుల్లో నుంచే నీళ్లు వాడతారు.

నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులు…

‘‘పక్షులు, పిట్టలు, బాతులు, కొంగలు… వంటి ప్రాణులన్నీ పిల్లలకు పాఠాలే. కాని ఇపుడు అవి కనపడకపోవడానికి కారణం ఆధునిక వ్యవసాయమే’’ అనే జ్యోతి ప్రస్తుతం అదే ఊర్లో సేంద్రియ వ్యవసాయం కూడా చేపట్టారు.

విద్యార్థులకు పాఠాలతో పాటు వ్యవసాయం, చెట్లపెంపకం, చేతివృత్తులు… వంటి అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న విద్యార్థులకు వందలాది పండ్లమొక్కలు వరంగల్ యూనివర్సిటీలో కొనుగోలు చేసి మరీ అందించారు. తంగేడు, కొబ్బరి, మర్రి, రావి, బొడ్డుమల్లె, కానుగ… ఇంకా సీతాఫలం, మామిడి వంటి పండ్లమొక్కలు 1000 దాకా నాటారు. ఆ చెట్లకు కాసిన ఫలాలను విద్యార్థులే అనుభవిస్తారు.

పొలమూ పాఠమే…

‘‘పాఠశాలకు ఆనుకుని ఉన్న రెండెకరాల పొలంలో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల పెంపకం విద్యార్థులకి నేర్పిస్తాం. ముల్లంగి, క్యారట్, టొమాటో, ఉల్లిపాయలు… వంటివి పిల్లలే పండిస్తారు. ఇళ్లకి తీసుకువెళతారు’’ అని చెప్పారు జ్యోతి. ‘‘కానుగ వంటి చెట్ల ఆకులతో తయారుచేసిన కంపోస్ట్‌ను పొలానికి వాడతాం. స్కూల్లోని చిన్నపాటి చేపల కొలనులో పిల్లలు చేపలు పట్టడాన్ని నేర్చుకుంటారు’’ అంటూ తాము విద్యార్థులకు బోధిస్తున్న పర్యావరణ పాఠాలను వివరించారామె.

నెలకు రూ.100, 200కు మించని నామమాత్రపు ఫీజుతో ఈ పాఠశాల రేపటి ప్రకృతి ప్రేమికులను తీర్చిదిద్దుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు… ‘ఓ అయిదుగుర్ని విద్యావంతుల్ని చేసి, కనీసం ఓ రెండు చెట్లను పెంచగలిగితే మనిషి పుట్టుక సార్థ్ధకమైనట్టే’. ఈ రెండిటినీ మేళవించిన సేవల్ని అందిస్తూ జ్యోతిరెడ్డి తన జన్మను సార్థకం చేసుకున్నారని అనిపించకమానదు.

– ఎస్.సత్యబాబు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

2 thoughts on “ప్రకృతి ఒడిలో….‘మహాసరస్వతి పాఠశాల’.”

  1. చాలా మంచి ప్రయత్నమండీ . ఆమె ఘనవిజయం సాధించాలి .ఇంకా అన్ని రకాలుగా ప్రచారం కల్పించాలి .ఇదంతా మన రాష్ట్రంలోనే జరుగుతోంది అంటే నమ్మబుధ్ధి కావడం లేదు .మరొక్కసారి జ్యోతి రెడ్డి గారికి అభినందనలు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s