గురుదేవో’భవనం’

guru

చదువుల తల్లి గూడు చెదిరితే తమ గుండె పగిలినట్లు బాధపడే టీచర్లు వీళ్లు. ప్రభుత్వ నిర్ణయంతో ఒక పాఠశాల మూతపడినప్పుడు.. తమ ఉద్యోగానికొచ్చిన ముప్పేమీ లేదని ఊరుకోలేదు. పేదపిల్లలకు చేరువలోనే మరో చదువుల గుడిని కట్టించేందుకు రెండేళ్లు పెద్ద పోరాటమే చేశారు. ఎక్కడా ఖాళీ స్థలమే దొరక్కపోతే, ఆఖరికి మరుగుదొడ్డిని కూల్చి, కొత్త పాఠశాలకు ప్రాణం పోసిన హైదరాబాద్‌లోని మేకలమండి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కథ ఇది.

ఇదొక ప్రభుత్వ పాఠశాల. చదువు చెబుతున్న అయ్యవారు, బుద్ధిగా వింటున్న పిల్లలు.. ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న దృశ్యమిది. రెండేళ్లు వెనక్కి వెళితే- ఇదొక మరుగుదొడ్డి అంటే నమ్మగలరా? అవును అప్పుడిది ఇది పబ్లిక్ టాయ్‌లెట్. మనస్ఫూర్తిగా ఒక మంచి పనికి పూనుకోవాలేగానీ,ఎంతటి దుర్గంధాన్నైనా కడిగేసి, సుగంధాలను వెదజల్లడం సాధ్యమే అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాఠశాల. దీని వెనక పెద్ద కథే నడిచింది. పాఠాలు చెప్పే టీచర్లు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కాళ్లకు బలపం కట్టుకుని ఆఫీసులన్నీ తిరగాల్సి వచ్చింది.

రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు ప్రజాప్రతినిధుల దగ్గరికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. చదువులు చెప్పడమే కాదు, ఆ చదువుల తల్లి గూడు చెదిరిపోతే గుండె పగిలినట్లు భావించిన ఆ టీచర్లు మల్లికార్జునరెడ్డి, బదిరీనారాయణరావులు. వీరికి అండగా మరో ఐదుగురు రవీందర్‌రెడ్డి, శౌరి, గీతాదేవి, రామసుబ్బారావు, త్రినేత్రి టీచర్లు ఉన్నారు. లేకపోతే ఒక పాఠశాల ప్రాణం పోసుకునేదే కాదు.

బడి కోసం..
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ‘తిగుల్’కు చెందిన పొణ్యాల మల్లికార్జునరెడ్డి ఒక సెకండరీగ్రేడ్ టీచర్. హైదరాబాద్ జూబ్లీబస్టాండ్‌కు దగ్గర్లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ నాలుగేళ్లు పనిచేశాక బోలక్‌పూర్‌లోని మేకలమండి ప్రభుత్వ పాఠశాలకు బదిలీఅయ్యాడు.

బడికొచ్చే వంద మంది పిల్లల్లో అందరూ నిరుపేదలే! చదువులన్నీ సాఫీగా నడుస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కాంపౌండ్‌లో రెండు మూడు స్కూళ్లుంటే వాటిని ఒక స్కూల్ కిందకు తీసుకురావాలన్నది దానిముఖ్యఉద్దేశ్యం. ఆ ప్రక్రియలో మేకలమండి ప్రభుత్వ పాఠశాలను మూసేశారు. పిల్లలందర్నీ ఏకీకృత పాఠశాలకు బదలాయించారు.

అయితే గదుల కొరత తలెత్తింది. దాంతో కాలనీవాసులు భారమైనా సరే, ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించక తప్పలేదు. కొందరైతే ఫీజులు కట్టలేక పిల్లల్ని బడిమాన్పించాల్సి వచ్చింది. ఈ బాధలేవీ పట్టించుకోకపోయినా తమ జీతం తమకు వస్తుంది కదాని ఊరుకోలేదు మల్లికార్జునరెడ్డి, బదిరీనారాయణరావు. మేకలమండీలోనే మరో కొత్త బడి పెడితే సమస్యలన్నీ తీరిపోతాయని భావించారిద్దరూ.ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు.

పేదలందరూ ‘కాలనీ నడుమ పాఠశాల ఉంటేనే పిల్లల్ని పంపిస్తాము’ అని ముక్తకంఠంతో తీర్మానించారు. బడి కావాలంటూ ప్రభుత్వాన్ని అడిగితే సరిపోదు. భవన నిర్మాణానికి స్థలం కావాలి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేగంగా స్పందించిఅనుమతులు మంజూరు చేయాలి. అప్పుడే పాఠశాల సిద్ధమవుతుంది. ఇవన్నీ ఇప్పట్లో సాధ్యమయ్యే పనులా? అన్నారు చాలామంది.

“ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడితే ముగ్గురు లేదా నలుగురు టీచర్లకు ఉపాధి పోతుంది. డ్రాపౌట్లు పెరుగుతాయి. ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది పేద పిల్లలే! అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేశాం. ఆఖరికి ప్రభుత్వం స్పందించి పదకొండువందల మురికివాడల్లో అవసరమైన చోట కొత్త పాఠశాలలు పెట్టేందుకు సమ్మతించింది”అని చెప్పారు మల్లికార్జునరెడ్డి. ఒకవైపు అది చేస్తూనే- మేకలమండి పాఠశాల మూతపడగానే జయనగర్‌కాలనీ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలిక పాఠశాలను ప్రారంభించారీ ఉపాధ్యాయులు. కాని పిల్లలెవ్వరూ రాలేదు. మరోవైపు పాఠశాల స్థలం కోసం అన్వేషణా మొదలైంది. అధికారుల దగ్గరికి వెళితే “ఎక్కడున్నాయయ్యా ఖాళీ స్థలాలు? ఉంటే మీరే వెతికిపెట్టండి..” అన్నారు.

గజం స్థలమే వేలల్లో పలికే మహానగరంలో ఖాళీ జాగా దొరకడం ఎంత కష్టం! “అసలే బోలక్‌పూర్ ఇరుకైన ప్రాంతం. ఎంత వెదికినా రవ్వంత జాగా కూడా కనిపించలేదు. అధికారులను, స్థానిక నేతలను.. ఇలా ఎవరు కనిపిస్తే వాళ్లనల్లా అడిగాము. ఆఫీసులకు తిరగని రోజు లేదు. ఆ ప్రయత్నంలో మాకు అపురూపంగా కనిపించింది ఒక ప్రభుత్వ మరుగుదొడ్డి. కాలనీకి దాని అవసరం తగ్గిపోయిందని విన్నాం. ఆ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చేసి ఆ స్థానంలో పాఠశాల కడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది..” అన్నారు టీచర్లు.

కాళ్లకు బలపం కట్టుకుని..
ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళితే, అక్కడ గ్రంథాలయం పెట్టాలనుకుంటున్నామన్నారు. పాఠశాలకు ఒప్పుకోలేదు. మళ్లీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు టీచర్లు. “స్థానిక నేతల్ని కూడగట్టి డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనుమతితో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించాం. ఫైలు కదిలేందుకు ఆఫీసుల చుట్టూ యాభై అరవైసార్లు తిరిగుంటాం. ఆఖరికి స్థలాన్ని కేటాయించారు. దాంతో ఆ ఫైల్ సర్వశిక్ష అభియాన్‌కు వెళ్లింది.

అప్పుడు ఆ ప్రాజెక్టు ఆఫీసర్ “ఉన్నదే రెండొందల ఇరవై గజాల స్థలం. అంత తక్కువ స్థలంలో పాఠశాల కట్టడం కుదరదు. నిబంధనలు అంగీకరించవు” అన్నారు. అయినా మేము నిరుత్సాహపడలేదు.

“సార్ ఇది పిల్లల కోసం పడుతున్న తపన. సిటీలో ఎనభై గజాల్లో నడుస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఒప్పుకోండి” అని ప్రాధేయపడ్డాము” అన్నారు మల్లికార్జున్, బదిరీనారాయణరావు. అంతటితో ఊరుకోకుండా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఇల్లు,ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు వీళ్లు. “మర్రిశశిధర్ రెడ్డి చొరవ చూపారు. ఒక పాఠశాల కోసం ఇన్నిసార్లు నా వద్దకు వచ్చిన టీచర్లు మీరేనయ్యా అన్నారాయన” అని చెప్పుకొచ్చారీ మేస్టార్లు. మున్సిపల్ అనుమతి కోసమూ తిరిగారు. భవన మంజూరు జరిగాక.. నిధులు ఇవ్వాల్సింది సర్వశిక్ష అభియాన్. ఉపాధ్యాయుల పట్టుదల చూసి 31 లక్షల నిధులను కేటాయించారు అధికారులు.

“కాంట్రాక్టర్‌తోనూ సమస్యలొచ్చాయి. మూన్నెళ్లు అవాంతరాలొచ్చాయి. ఒకటో అంతస్థు పూర్తయ్యాక పనులన్నీ అర్థాంతరంగాఆగిపోయాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. విషయాన్ని ఆరాతీసిన కలెక్టర్ ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు కాంట్రాక్టర్లు పనిని పూర్తి చేశారు” అని గుర్తు చేసుకున్నారు.

అడ్డంకులను అధిగమిస్తూ..
ఎట్టకేలకు మరుగుదొడ్డిని కూల్చిన స్థలంలో భవన నిర్మాణం పూర్తయింది. దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆటస్థలంగా మార్చాలన్నది ఉపాధ్యాయుల మరో ఆలోచన. అప్పటికే అది ఆక్రమణకు గురైనందువల్ల ఆ కబ్జాదారులకు అది ఇష్టం లేదు. “ఏంఅయ్యవార్ల్లూ, చదువులు చెప్పుకోకుండా జాగాల మీద పడ్డారు. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది” అని కొందరు వీరిని బెదిరించారు కూడా. దేనికీ భయపడని ఉపాధ్యాయులు ఎమ్మార్వో స్పందించే వరకు ఊరుకోలేదు.

చివరికి “పోలీసులు జోక్యం చేసుకుని స్థలాన్ని పాఠశాలకుస్వాధీనం చేశారు. అప్పుడు కబ్జాదారులు మమ్మల్ని తిట్టని తిట్టు లేదు. పాఠశాల కోసమే అవన్నీ భరించాం” అని తెలిపారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభమైన తమ మేకలమండి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నది టీచర్ల లక్ష్యం.”ఎల్‌కేజీ నుంచి అయిదు వరకు ఇంగ్లీషు మీడియం పెట్టించాము. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్ కొన్నాళ్లు అందులో నడిచి మూతపడింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) వాళ్లను సంప్రదించాము. సాయానికి అంగీకరించారు. ఇక, పాఠశాలలో చదివే పిల్లలంతా పేదలు కావడంతో యూనిఫాం కొనుక్కోలేని పరిస్థితి. ఎన్‌టిపిసి అధికారులే చొరవ తీసుకుని 150 మందికి ఒక జత చొప్పున దుస్తులు ఇచ్చారు. మా తపనను అర్థం చేసుకున్న ఆ సంస్థ ‘పవర్ కిడ్స్’ పేరుతో 3-5 ఏళ్ల పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేందుకు ఇద్దరు టీచర్లు, మరో ఇద్దరు ఆయాల్ని ఏర్పాటు చేసింది..” అని చెప్పారు మేకలమండి టీచర్లు.

ఆదర్శవంతంగా..
పార్లమెంటు సభ్యుల నిధులతో కంప్యూటర్స్, నీటిపంపులు, గ్రిల్స్ ఏర్పాటయ్యాయి. ఎవరు సాయం చేస్తారన్నా సరే వెళ్లి అర్థించే ఉపాధ్యాయుల్ని చూసి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కదిలొచ్చింది. డెస్కులు, టేబుళ్లను కొనిచ్చింది. మరుగుదొడ్డి స్థలంలో పాఠశాల నిర్మించేందుకు కృషి చేసిన టీచర్లను అభినందిస్తూ ‘డీక్యూ స్మైల్ ఫౌండేషన్’ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్‌కు ఊతం ఇచ్చింది. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి.. చైతన్యవంతుల్ని చేసింది. నాంపల్లిలోని ఎస్‌బీఐ శాఖ తాగునీటి వసతికిఆసరాగా నిలిచింది.

“మేము ఇంత కష్టపడింది ప్రభుత్వ పాఠశాల కోసం మాత్రమే కాదు. అందులో చదివే పిల్లల భవిష్యత్తు బాగుపడాలని. అందుకోసం ఏ అవకాశాన్నీ వదులుకోలేదు” అని చెప్పారు ప్రస్తుతం స్కూల్‌లో పని చేస్తున్న టీచర్ నూర్జహాన్. తండ్రిలేని పిల్లలకు లుంబా ఫౌండేషన్ నెలకు ఐదొందలు ఇస్తుందని తెలిసి వారిని సంప్రదించి సాయం తెచ్చుకున్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లప్రావీణ్యం తక్కువ. ఆ సమస్యను పరిష్కరించేందుకు ‘టీచ్ ఫర్ ఇండియా’ను కలిశాము మేము.

వాళ్ల తరఫున ఒక టీచర్‌ను మాకిచ్చారు. ఆమె రోజూ స్కూలుకు వచ్చి ఆంగ్లంలో పిల్లలకు తర్ఫీదు ఇస్తోంది” అని ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు మాధవి చెప్పారు. ‘ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, మేకలమండి’ అన్న బోర్డు తగిలించుకుని ఠీవిగా నిల్చున్న మూడంతస్థుల ఆ పాఠశాలను కళ్లారా చూసుకుని, సంతృప్తిపడే మల్లికార్జున్, బదిరీ.. మొన్న బదిలీలప్పుడు కొత్త పాఠశాలలకు వెళ్లకతప్పలేదు. కాని వాళ్లు వెళుతూ వెళుతూ నూటాఅరవై మంది పిల్లలకు సరస్వతినిచ్చి వెళ్లడమంటే.. అంతకంటే గొప్ప స్ఫూర్తిపాఠంఇంకేముంటుంది?

– మల్లెంపూటి ఆదినారాయణ,
ఫోటోలు : బాబూరావు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “గురుదేవో’భవనం’”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s