ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న కోటేశ్వరమ్మ.. తన జీవన ఆరోగ్య సూత్రాలను ఇలా చెప్పుకొచ్చారు..
‘ఇతరులకు అపకారం చేయని వారు, సమాజానికి మేలు చేసే వారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటు పడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. చాలా మంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు- ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు- అనేక మంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు- కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో.. వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవించానేమోనని కూడా అనిపిస్తుంది. కొందరు వృద్ధాప్యం నరకంలాంటిదంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతూ నిరాశతో నిత్యం బతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా- మంచి పనిచేశాననుకుంటూ, మనిషిలా బ్రతికాననుకుంటూ మనశ్శాంతితో కన్నుమూయటం మంచిదేమో అనిపిస్తుంది. ఇలా బతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉంటే సమయానికి తిండిలేకపోయినా, నిద్ర లేకపోయినా అనారోగ్యం దరిచేరదు.
మానసిక స్థయిర్యమే ప్రధానం..
సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. అందుకే బాలవితంతువైౖన నాకు కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిగింది. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో చురుకైన పాత్ర వహించేదాన్ని. ఉద్యమాలంటే తెలిసిందే కదా! సమయానికి తిండి దొరకదు. నిద్ర ఉండదు. ఇక యూజీ (అండర్ గ్రౌండ్)లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి ఒక ఎత్తు అయితే- వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురయిన సవాళ్లు మరో ఎత్తు. అలాంటి సమయంలో కూడా నాకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక సైర్థ్యమే ప్రధాన కారణం.
నలభై ఏళ్లు హాస్టల్‌లోనే..
ఉద్యమాల సమయంలో తిండి, నిద్ర ఉండేది కాదని చెప్పాను కదా. ఆ తర్వాత ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే హాస్టల్ అంటే క్రమశిక్షణ. సమయానికి తిండి ఉండేది. నిద్ర ఉండేది. దీనితో తిండి విషయంలో క్రమశిక్షణ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ! చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. ఏ రోజూ ఆహార నియమాలను పాటించలేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అన్న నిబంధనలేవీ లేవు నాకు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మితాహారిగా మారాను. అవసరం మేరకే తింటున్నాను. ఏదైనా నచ్చింది కదాని మితిమీరి తినే అలవాటు లేదు. రాత్రి పడుకునే ముందు మాత్రం పుస్తకాలు చదువుతాను. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. వీటన్నిటికీ తోడు.. నన్ను అభిమానించేవాళ్లను ఎంతో మందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారిని పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం అనిపిస్తుందిప్పుడు. ఆ బలం ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తితోనే నేటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.
బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఎందుకంటే అసలే ఆ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటారు. దానికి తోడు మరింత కుంగిపోతే మరీ బలహీనపడతారు. ఆ వెనకే అనారోగ్యం చుట్టుముడుతుంది.
జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉన్నంత కాలం సంతృప్తిగా బతకడమే తెలుసు. ఆ సంతృప్తే జీవాయుష్షును పెంచుతుంది అన్నది నా అభిప్రాయం.
మంచి పని చేశాననుకుంటూ, మనిషిలా బతికాననుకుంటూ.. మనశ్శాంతితో కన్ను మూయడం మంచిది అనిపిస్తుంది..
నా జీవిత చరిత్ర ‘నిర్జన వారధి’కి సంబంధించిన రాయల్టీని రెండు సంస్థలకు విరాళంగా ఇచ్చాను. ఇటువంటి పనులు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఉద్యమ నేపథ్యం..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాల్య వితంతువును. ఆ రోజుల్లో నేను చదివింది కేవలం ఎనిమిదో తరగతే! పాటలు బాగా పాడేదాన్ని. దీంతో అందరూ నన్ను ‘నైటింగేల్.. నైటింగేల్’ అంటూ ఏడిపించేవారు. ఆ బాధ పడలేక చదువు మానేశాను. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాతీయోద్యమంలో పాల్గొనడం బాధ్యతగా భావించేవారు. ఆ విధంగా నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అదే నా జీవనమార్గం అయ్యింది. సీతారామయ్యగారితో వివాహం అయిన తర్వాత సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాను. మా సంస్థలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాం. ఈ ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించుకుంటూ- ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాత కూడా అనేక రచనలు చేశాను. వాటికి లభించిన ప్రశంసలు నా ఆయుష్షును మరింత పెంచాయనిపిస్తుంది! ఇప్పుడు పుస్తకం నాకు తోడు.. నాకున్న గొప్ప నేస్తం. అందుకే వైజాగ్‌లో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు కూడా వెళ్లా.. ఆ పుస్తకాలను చూస్తుంటే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
వాసు, విశాఖపట్టణం
ఫోటోలు : విజయ్