బ్రిటిష్ దొరగారి గారాల భారతీయుడు

britishదేశ విభజన జరిగినప్పుడు –
వదల్లేక వదల్లేక, దూరమవుతూ, మనసు భారమవుతూ…
వలస వంతెన కూలిపోయేలా… కోట్ల టన్నుల ఉద్వేగాలు!
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు -వందల ఏళ్లనాటి దాస్యం నుండి విముక్తి పొంది…
‘వందేమాతరాన్ని’ ప్రతిధ్వనించిన దిక్కులు, చుక్కలు!
అంతేనా? ఫ్రీడమ్ ఒక్కటే ఆ వేళ అందరి ఫీలింగా?
వెళ్లిపోతున్న బ్రిటిష్‌వాళ్లకు, అంతవరకూ ‘పో… పొమ్మన్న’ ఇండియన్స్‌కి మధ్య…
ఎక్కడా చిన్న ఎమోషనైనా మిగలకుండా పోయిందా?
‘పోలేదు’ అంటున్నారు జి.పి.రెడ్డి!
‘మాతో వచ్చెయ్ కూడదా?’ అని బెంగగా అడిగిన
ఓ బ్రిటిష్ అధికారి కుటుంబంతో…ఈ ‘భారతీయుడికి’ ఉన్న పుత్రానుబంధమే ఇవాళ్టి స్పెషల్ స్టోరీ!
ఎనభైఏళ్ల కిందట రోడ్డుపై జరిగిన ఓ చిన్న సంఘటన జి.పి.రెడ్డి జీవితాన్నే మార్చేసింది. ఓ నిండు భారతీయుడిని బ్రిటన్‌కి ఆప్తుడిగా చేసింది. ‘తెల్లోలకున్న నిజాయితీ మనకాడ లేదు’ అని ఈ పెద్దాయనన్న మాటల్లో ఎంతో ఆవేదన తొణికిసలాడింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడ గ్రామంలోని ఒక వ్యవసాయక్షేత్రంలో (ప్రస్తుతం మౌలాలిలో ఉంటున్నారు) మొన్నటివరకూ కాలం గడిపిన ఈ పెద్దాయన గురించి ఆసక్తికరమైన విషయాలివి…ఆరేడేళ్ల వయసులో ఉన్న ఓ నలుగురు పిల్లలు రోడ్డుపక్కన ఫుట్‌బాల్ ఆడుతున్నారు. రోడ్డుపై బ్రిటిష్ అధికారుల కార్లు వరసగా వెళుతున్నాయి. సడెన్‌గా బాల్ రోడ్డుపైకి వెళ్లింది. కార్లన్నింటికీ సడెన్‌బ్రేకులు పడ్డాయి. కార్లోంచి దిగిన తెల్లదొరలను చూడగానే పిల్లలందరూ పారిపోయారు ఒక్క జి.పి.రెడ్డి (గుండారపు పెంటారెడ్డి) తప్ప. కల్నల్ ఆఫీసర్ ఆర్‌డబ్ల్యూ బెనెట్ కారు దిగి రెడ్డిని దగ్గరికి పిలిచేలోపే… ఈ కుర్రాడు కారు దగ్గరికి వెళ్లి ‘‘దిసీజ్ మై బాల్’’ అన్నాడు. బెనెట్ కాస్త కోపంగా మొహంపెట్టి ఇంగ్లీషులో ‘‘అయితే కారు కిందకు దూరి తీసుకో’’ అన్నాడు. రెడ్డి మొహం ఎర్రగా చేసుకుని ‘‘నేను మా అమ్మానాన్నల దగ్గర తప్ప ఇంకెవరి ముందూ తలదించను. కారు ముందుకు కదలకపోతే అద్దాలు పగలగొడతాను’’ అని వార్నింగ్ ఇచ్చిన బాలుడి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లదొరలు తెల్లమొహాలు వేశారు. బెనెట్ ఆ కుర్రాడిని ఎత్తుకుని ఓ ముద్దిచ్చి…‘‘మీ అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లు’’ అని అడిగాడు.

మమ్మీడాడీ…

జి.పి.రెడ్డి తండ్రి బుచ్చారెడ్డి. హైదరాబాద్‌లోని లాల్‌బజార్ ప్రాంతంలో బ్రిటిష్ దుస్తుల సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. బెనెట్ అతడిని చూస్తూనే… ‘‘ఓ… రెడ్డిసాబ్ ఈ కుర్రాడు నీ కొడుకా… చాలా హుషారుగా ఉన్నాడు’’ అనగానే… ‘‘ఏం హుషారో ఏమో సార్… ప్రతిరోజు ఏదో ఒక కంప్లయింట్’’ విసుగ్గా చెప్పాడు బుచ్చారెడ్డి. ‘‘ఒక పనిచెయ్యి, మీకు ఇంకా ముగ్గురు కొడుకులున్నారు కదా… వీడిని మాకు ఇచ్చెయ్. మా ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాను’’ అని బెనెట్ అడగ్గానే బుచ్చారెడ్డి తలూపాడు. ఇక అప్పటి నుంచి జి.పి.రెడ్డి లైఫ్‌స్టయిల్ మారిపోయింది. బెనెట్ భార్య మేరీవిల్సన్‌కి కూడా ఈ అబ్బాయి తెగ నచ్చేశాడు. ఇంకేం, రెడ్డికి అమ్మానాన్నలతో పాటు మమ్మీడాడీ కూడా వచ్చేశారు. అప్పటివరకూ చదివిన ఒకటోక్లాస్‌కి టాటా చెప్పి బెనెట్‌గారి వెంట తిరుగుతూ బతుకు పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

సొంతబిడ్డలా చూసుకునేవారు…

మా ప్రాంతంలో ఇరవైవేలమంది తెల్లోళ్లు ఉండేవాళ్లు. బెనెట్ దొర టీమ్‌లో నేనూ ఒకడినన్నమాట. తొమ్మిదేళ్ల వయసుకే… నిలబడి జీప్‌ని డ్రైవ్ చేసేవాడిని. రోజూ పొద్దున్నే రెండు గుడ్లు తిని, పాలు తాగాక పది కిలోమీటర్లు పరిగెత్తించేవారు. సాయంత్రం వాలీబాల్, హాకీ ఆడేవాడిని. బెనెట్‌సార్‌కి పిల్లలు లేరు. నన్ను సొంతబిడ్డలా చూసుకునేవారు. పనులు నేర్పించేదగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్. పదేళ్ల వయసొచ్చేసరికి బెనెట్‌సార్ జీపు డ్రైవర్ జాబ్ ఇచ్చారు. అప్పట్లో వారానికోసారి జీతం ఇచ్చేవారు. నాకు పద్నాలుగేళ్ల వయసప్పటికే యుద్ధ ట్యాంకర్ డ్రైవింగ్ శిక్షణ ఇప్పించారు బెనెట్‌సార్.

విదేశీయానం…

బెనెట్‌సార్‌తో షిప్‌లో ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, అరబ్ దేశాలన్నీ తిరిగాను. తెల్లవారి దగ్గర ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా… వారి మధ్య కాలక్షేపం మాత్రం భలే సరదాగా ఉండేది. జీతం అందగానే మా టీమ్ అందరినీ మూకీ సినిమాకి తీసుకెళ్లేవాడిని. పొద్దున్నే నాలుగింటికి స్నానం చేసి హనుమాన్ గుడిలో పూజ చేసుకునేవాడిని. బెనెట్‌సార్ నా పద్ధతులు చూసి మెచ్చుకునేవారు. ‘‘మా డిసిప్లిన్ వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది. మీ పద్ధతులు, ఆచారాలు మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి’ అనేవారు. ఒకరోజు మా టీమ్‌లోని జాన్సన్ అనే వ్యక్తి ‘‘నాకు తెలుగు నేర్పించవా’’ అని అడిగాడు. నేను సరదాగా ‘నీ కాల్మొక్త బాంచన్’ అని పలకమన్నాను. రెండు రోజులు నానా తంటాలు పడి ఆ పదం నేర్చుకుని, కనిపించిన ప్రతి తెలుగువాడి దగ్గర ఆ పదం పలకగానే అందరూ నవ్వేవారు. ఊహ తెలిసేనాటికే తెల్లోళ్లు నా కళ్ల ముందు ఉండేసరికి వారిపై నాకు కోపం కలిగేది కాదు. అయితే పెద్దయ్యాక మాత్రం… మన దేశంపై పెత్తనం చెయ్యడానికి వీళ్లెవరనే ఆలోచన వచ్చింది.

ఆ ఎనిమిది గంటలే…

మహాత్మాగాంధీ ఉప్పుసత్యాగ్రహం సమయం లో ఉద్యోగంలో భాగంగా బ్రిటిష్ అధికారులతో పాటు నేను కూడా వెళ్లాను. ‘వందే మాతరం’ అనే పదం తప్ప ఇంకేం వినిపించడం లేదు. జీప్ దిగకుండానే నేను కూడా రెండు చేతులూ ఎత్తి ‘వందే మాతరం’ అంటూ అరిచాను. పక్కనే కూర్చున్న ఓ బ్రిటిష్ అధికారి నా చేతులు పట్టుకుని ‘నువ్వు అరవకూడదు’ అంటూ కళ్లెర్రజేశాడు. సాయంత్రం బెనెట్‌సార్‌కి జరిగిందంతా చెప్పాను. ఆయన ‘‘డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పని మాత్రమే చేయాలి’’అన్నారు. అహ్మదాబాద్ నుంచి తిరిగొచ్చేటప్పుడు ఓ పది తెల్లటోపీలు తెచ్చుకున్నాను. పొద్దున్న తొమ్మిదింటి నుంచి ఐదు గంటలవరకూ బ్రిటిషర్స్ క్యాప్ పెట్టుకుని ఐదు దాటగానే గాంధీటోపీ పెట్టుకునేవాడిని. తెల్లదొరల కళ్లుగప్పి సుభాష్‌చంద్రబోస్ ఏర్పాటుచేసే రహస్య సమావేశాలకు హాజరయ్యేవాడిని. ఆ వివరాలు తెలిసి మా టీమ్‌లోవాళ్లు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. నేను నా కోతిచేష్టలతో వారిని ఏడిపించేవాణ్ణి. గట్టిగా ఏమన్నా అంటే బెనెట్‌సార్‌తో చెబుతానని బెదిరించేవాణ్ణి.

మమ్మీడాడీకి టాటా…

1947 ఆగస్టు 15. స్వాతంత్య్రం వచ్చింది. భారతీయుల మొహాలు కోటికాంతులతో వెలిగిపోతున్నాయి. ఆ ఉత్సవాల్లో నేను కూడా చేరాను. బెనెట్‌సార్ నుంచి కబురొచ్చింది. పరుగుపరు గున వెళ్లాను. మేరీమమ్మీ నన్ను దగ్గరికి తీసుకుని ‘‘మాతో వస్తావా’’ అని అడిగింది. ‘‘ఎందుకు రాడు’’ అన్నాడు బెనెట్‌సార్ ఎంతో నమ్మకంగా. ‘‘నేను మీతో వచ్చేస్తే… మా అమ్మానా న్నలు ఏమైపోతారు’’ అన్నాను. ‘‘వాళ్లను నువ్వు చూడ్డం ఏంటి?’’ అన్నారు. ‘‘మీదగ్గర ఉద్యోగం చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారు?’’ అని నేను చెప్పిన సమాధానానికి బెనెట్‌సార్ నోరు మెదపలేదు. ‘‘భారతీయుల కుటుంబ సంబంధాలు చాలా గొప్పవి. నువ్వెక్కడున్నా మా మనసు నీమీదే ఉంటుందిరా’’ అని బెనెట్‌సార్ నన్ను కౌగిలించుకున్నారు. ఆయన వెళ్తూవెళ్తూ యుద్ధట్యాంకర్ డ్రైవింగ్‌లో నాకున్న అనుభవం గురించి ఒక లెటర్ రాసి, అది చూపిస్తే భారతప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందన్నారు. వారి గుర్తుగా నా భవిష్యత్తుకి భరోసాగా రంగారెడ్డిజిల్లాలో ఐదెకరాల పొలం రాసిచ్చారు.

నా దేశం కోసం…

బెనెట్‌సార్ లెటర్ చూపిస్తే నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. చేసేది లేక నాన్నతో పాటు సేల్స్‌మన్‌గా కొన్నాళ్లు పనిచేశాను. నాకు అప్పటికే పెళ్లయి ిపిల్లలు కూడా. స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకు చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని మన ఆర్మీని అక్కడికి పంపారు. అప్పుడు కొందరు ఆర్మీ అధికారులు నా దగ్గరకు వచ్చి చైనా సరిహద్దుల్లో యుద్ధట్యాంకర్లను నడపడానికి రమ్మన్నారు. నా దేశాన్ని కాపాడుకునే అవకాశాన్ని వదులుకోకూడదని రోజుకూలీగా చేరాను. నాలుగు నెలలపాటు యుద్ధట్యాంకర్‌ని నడిపాను. యుద్ధం లో భాగంగా ఇద్దరు చైనా జవాన్లను సజీవంగా పట్టుకుని మన అధికారులకు అప్పగించాను. ఆ సంఘటనను గుర్తుచేస్తూ రెండేళ్లక్రితం పంజాబ్ నుంచి కొందరు అధికారులు వచ్చి అక్కడి సైనికులకు పాఠాలు చెప్పమని అడిగారు. నేను వెళ్లలేదు. తొంభైఏళ్లు దగ్గరపడుతుండగా నేనేం చెప్పగలను? ఇన్నాళ్లకు మన దేశానికి నేను గుర్తొచ్చానా… అన్న బాధ కూడా నన్ను ముందుకు పంపలేదు. చైనావార్ తర్వాత ముంబైలోని ‘సారాబాయ్ కెమికల్స్’లో ఉద్యోగ అవకాశం వచ్చి, వెంటనే చేరిపోయాను. 35 ఏళ్లు అక్కడే ఉండి పనిచేశాను.

ఆనాటి బంధం ఈనాటికీ…

నాకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందర్నీ పెద్ద చదువులు చదివించాను. నేను ఉద్యోగం పేరుతో దూరంగా ఉండేవాడిని. నా భార్య ఉన్నంతవరకూ బిడ్డలదగ్గరే ఉండేవాడిని. ఆ తర్వాత కరీంగూడ గ్రామంలో నా కూతురు తోటలో ఉంటూ కాలక్షేపం చేశాను. ప్రస్తుతం మౌలాలిలో ఉన్న కూతురింటి దగ్గర ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాను. తెల్లదొరలిచ్చిన ఐదెకరాలు ఎప్పుడో కరిగిపోయాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. పేదవాడు… కొడుకులకు కూడా బరువే. నేను మాత్రం రాజీపడలేదు. మానవహక్కుల కమిషన్‌లో కేసు వేశాను. నా పోషణ నిమిత్తం ఇంత సొమ్ము కావాలని అడిగాను. అప్పటినుంచి ప్రతినెల వాళ్లు డబ్బులు పంపుతున్నారు. మన దేశం కోసం ఆ తెల్లదొరల దగ్గర పోరాడని పాపానికి ఈ రోజు బతకడానికి బిడ్డలతో పోరాడాల్సి వస్తోందా! అనిపిస్తుంటుంది.

మన దేశం వదిలింది మొదలు ఇప్పటివరకూ బ్రిటిష్‌వారు ఏటా నాకు డబ్బులు పంపిస్తున్నారు. రెండు మూడు నెలలకొకసారి పోస్టాఫీసు దగ్గర నుంచి కబురొస్తుంది. వెళ్లి తెచ్చుకుంటాను. ఒకోసారి రెండు వేలు, ఒకోసారి మూడువేల రూపాయలుంటాయి. ప్రతినెలా ఢిల్లీలో ఉన్న చీఫ్ ఇన్ కమాండర్‌కి నేను బతికున్నట్లు లెటర్ పంపుతాను. దాన్నిబట్టి బ్రిటిష్ అధికారులు నాకు పంపిన డబ్బుని నా అడ్రస్‌కి పంపుతారు. వాళ్ల దగ్గర పట్టుమని పాతికేళ్లు కూడా పనిచేసి ఉండను. అయినా నన్ను వారి మనిషిగా భావించి, పోషిస్తున్నారు. నిజంగా వాళ్లు దొరలే… అంటూ ఆ పెద్దాయన అనర్గళంగా ఆంగ్లంలో చెబుతుంటే వినసొంపుగా అనిపించింది.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి;
ఫొటోలు: గడిగె బాలస్వామి

**********

ఆదివారం వచ్చిందంటే మటన్ స్పెషల్ ఉండాలి వాళ్లకి. అయితే మేకనైనా, కోడినైనా కోసేముందు పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించి, ఆరోగ్యంగా ఉందంటేనే కోయించేవారు.

పొద్దున్న తొమ్మిదింటికి విధులకు హాజరయ్యేటప్పుడు షర్టు చేతులు మోచేతి వరకూ మడిచి, సాయంత్రం ఐదింటికి డ్యూటీ అయిపోయాక మడత విప్పేసి ఫుల్‌హ్యాండ్స్ బటన్ పెట్టేస్తారు. వారి మధ్యన పెరిగినవాడిని కదా! ఇప్పటికీ నాకు ఆ అలవాటు పోలేదు.
– జి.పి.రెడ్డి

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: