నిలబడ్డం కాదు నిలబెట్టడమే ముఖ్యం

tulasi

ఎవరో సాయం చేస్తే తప్ప ఎస్ఎస్ఎల్‌సి పరీక్ష ఫీజు కూడా కట్టలేని ఒకనాటి పేద విద్యార్థి, నేడు ఏటా 6500 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేస్థాయికి చేరుకున్నాడు. అతనే తులసీ రామచంద్ర ప్రభు. ఐఐటిలో తనకు రావలసిన ఉద్యోగం ఎప్పటికీ రాదని తెలుసుకుని నీరసించిపోకుండా, రుణసాయంతో చిన్న అట్టపెట్టెల (కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమను మొదలెట్టి, ‘కోస్టల్ ప్యాకేజింగ్నుంచి తులసీ సీడ్స్దాకా దాదాపు డజను కంపెనీలకు పైగా అధిపతి అయ్యారాయన. 67 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఆయనకు ఎదురైన సంఘటనలే ఈ వారంఅనుభవం

పేదతనం వల్ల ఎదురయ్యే అవమానాలు, ఆటుపోట్లకు పెద్దవాళ్లయితే ఎలోగోలా తట్టుకుంటారు కానీ, అవి పసిబిడ్డలను భరించలేని బాధకు గురిచేస్తాయి. నేను పుట్టింది గుంటూరులోని జగ్గాపురం. పెరిగింది మాత్రం గుంటూరులోనే. మాది మొదట్లో సంపన్న కుటుంబమే అయినా, నాన్నగారి పొగాకు వ్యాపారంతో ఉన్న ఆస్తులన్నీ పోయి కుటుంబం అప్పుల పాలయ్యింది. నా హైస్కూలు రోజుల నాటికే కుటుంబ పరిస్థితి పుస్తకాలు, స్కూలు ఫీజు కట్టలేని స్థితికి చేరుకుంది. ఒక జత బట్టలకు మించి నాకు ఎప్పుడూ ఉండేవి కాదు. నా చిరిగిన దుస్తులకేసి జనం చూసే చూపులు చిత్రంగా ఉండేవి.

ఎస్ఎస్ఎల్‌సి పరీక్షకు కట్టాల్సిన 16 రూపాయల ఫీజుకే బంధువుల్ని ఆశ్రయించాల్సిన స్థితి మాది. ఇక కాలేజ్‌లో చేరేనాటికి స్కాలర్‌షిప్‌లు వస్తే తప్ప నాలాంటి వాడు చదువు కొనసాగించడం సాధ్యం కాదనే విషయం నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. ఆ ఆలోచన నన్ను మరింత కష్టపడేలా చేసింది. ఐఐటి ప్రవేశ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ రావడంతో నాకు మద్రాసు ఐఐటిలో సీట్ వచ్చింది. మెరిట్ స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. ఫస్ట్ ర్యాంక్‌తో మెకానికల్ ఇంజినీరింగ్ పాసయ్యాను. నాకైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత ఆనందం వే సింది కానీ, ఆ తర్వాత జరిగిందంతా అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగానే.

అక్కడే ఆగిపోయి ఉంటే….

పట్టా చేతికి వచ్చీ రాగానే బిహెచ్ఇఎల్‌లో టెక్నికల్ మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపిక య్యాను. వెంటనే వచ్చి చేరిపొమ్మన్నారు. వెళ్లే ముందు ఆనవాయితీగా జరిగే ఒక వైద్య పరీక్షకు పిలిచారు. అయితే, ఆ పరీక్షల్లో నాకు కలర్ బ్లైండ్‌నెస్ ఉందంటూ ఒక రిపోర్టు ఇచ్చారు. అప్పటిదాకా నాకు తెలియని ఒక దృష్టిలోపాన్ని వాళ్లు ఎత్తిచూపినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కలర్ బ్లైండ్‌నెస్ అంటే ఇతరత్రా ఏ దృష్టిలోపమూ ఉండదు. ఆకుపచ్చ, ఎరుపు వర్ణాల మధ్య ఉండే తేడా తెలియదంతే. సామాన్య జీవనంలో ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ, టెక్నికల్ మేనేజ్‌మెంట్‌లో ఈ లోపం చాలా ప్రమాదం అంటూ సెలక్షన్ లిస్ట్‌లోంచి నా పేరు తొలగించారు. నా కాళ్ల కింది భూమి కదిలిపోయింది. ఈ ఉద్యోగం పోతే పోయిందిలే అనుకుని మరో ఉద్యోగానికి వెళ్లినా అక్కడా ఇదే సమస్య కదా! అలాంటప్పుడు సొంతంగానే ఏమైనా చేసుకుంటే పోలా అనిపించింది.

ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, కేవలం 4 లక్షల పెట్టుబడితో అట్టపెట్టెల ( కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమ స్థాపించాను. బ్యాంకు రుణం పోగా అందులో నేను పెట్టింది 45 వేలే. అందులోనూ నా స్నేహితులూ, ఆత్మీయులు ఇచ్చిందే ఎక్కువ. ఏమైనా, 1977లో ప్రారంభమైన ఆ పరిశ్రమ విజయవంతం కావడంతో వెనక్కి తిరిగిచూసే అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత 84లో ఒకటి, 2001లో మరొకటి మొత్తం మూడు పరిశ్రమల్ని గుంటూరులోనే నెలకొల్పాను. ప్రస్తుతం 450 కోట్ల టర్నోవర్‌తో ఈ పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కోస్టల్ ప్యాకేజింగ్, చంద్రాట్రాన్స్‌పోర్టు, తులసీ సీడ్స్ ఇలా పలు సంస్థల్ని ప్రారంభించాను.
http://s3-ap-southeast-1.amazonaws.com/ajposts/articles/2013-9-26/pid_madhu_20139261932_2
అవన్నీ కూడా విజయవంతంగానే నడుస్తున్నాయి. ఆ రోజే కనుక నేను ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే, నాకు అదే ప్రపంచమైపోయేది. జీవితం అక్కడే ముగిసిపోయేది, ఆ ఉద్యోగంలో ఎంత కష్టపడినా నేను ఈ స్థితికి వచ్చే వాడ్నే కాదు. వాస్తవానికి, ఇంతటి విశాల ప్రపంచంలో ఒక దారి మూసుకుపోయినంత మాత్రాన ప్రపంచమే చేజారిపోయినట్లు విషాదంలో కూరుకుపోవలసిన అవసరం లేదు. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా వేల మార్గాలు కనిపిస్తాయి. ఇదీ ఆ సంఘటన ఫలితంగా నేను గ్రహించిన అనుభవం.

అలా మొదలయ్యింది

19 ఏళ్ల క్రితం ఒక రోజు నేను గుంటూరులోని నా కార్యాలయంలో ఉన్న సమయంలో ఎవరో ఒక స్టూడెంట్ నా కోసం వచ్చాడని ఆఫీస్ బాయ్ చెప్పాడు. వేచి ఉండమని చెప్పి మళ్లీ పనిలో నిమగ్నమైపోయాను. పని ముగించుకునేసరికి రాత్రి అయ్యింది. ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక కుర్రాడు బయట కనిపించాడు. ఉదయం నుంచి నాకోసం ఎదురుచూస్తున్న విద్యార్థి అతడేనని తెలుసుకుని, వెంటనే ఛాంబర్‌లోకి పిలిపించాను. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా డబ్బుల్లేక బి. ఎస్‌సిలో చేరిన ఆ కుర్రాడి గా«థ విని డిడి తీసి ఇంజనీరింగ్‌లో చేర్పించాను. దానితో మొదలైన ఆలోచన ప్రతిభ ఉండీ చదువుకోలేకపోయిన వాళ్లకు సహకరించేందుకు శ్రీకృష్ణ దేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలెజ్డ్అన్న పేరుతో ఒక సంస్థకు శ్రీకారం చుట్టేలా చేసింది.

ఓ పదేళ్ల క్రితం కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్న రోజుల్లో జరిగిన ఓ సంఘటన నన్ను విపరీతంగా కదిలించివేసింది. వేరే చోట 90 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8.30 అయ్యింది. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా, అడ్మిషన్ ఫీజు కట్టలేని స్థితిలో ఓ 55 ఏళ్ల పెద్దమనిసి తన కొడుకును వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. “వాళ్లను చూడగానే ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి?” అన్నాను ” రేపల్లెనుంచి పొద్దున 8.30 కు వచ్చామయ్యాఅన్నారు.ఎప్పుడు బయల్దేరారు?”అంటే “ఉదయం 3.30కు అయ్యాఅన్నారు.

నేను ఇచ్చే 5వేల రూపాయల కోసం ఉదయం 3.30కు బయల్దేరి వచ్చి రాత్రి 8.30 దాకా వేచిచూస్తున్నారా? నేనో మహాదాతలా ఇన్ని గంటలు వెయిట్ చేయించానా?’ నాలో ఏదో తెలియని బాధ. ఒక అపరాధ భావన.మీకు నా మీద కోపం రావడం లేదా?” అన్నాను. ఊహించని నా ప్రశ్నకు ఆ పెద్దాయన ఉలిక్కిపడ్డట్లు చూశాడు. కొద్ది క్షణాల్లో అతని కళ్లల్లో నీళ్లు తిరగడం మొదలెట్టాయి. ” మీ మీద నాకు కోపమా అయ్యా! నేనెవరో మీకు తెలియదు. అయినా నా కొడుకు చదువు కోసం మీరు 5 వేలు ఇస్తున్నారు. మీ మీద నాకు కోపం ఏమిటి సామీ! కోపం కాదుగానీ, భయమేసిందయ్యా! అన్నాడు.

ఎందుకూ అంటే “ఇంత రాత్రయింది కదా ! రేపు రమ్మంటారేమోనని భయమేసిందయ్యా! ఎందుకంటే రేపు మళ్లీ రావ డానికి నా దగ్గర డబ్బుల్లేవయ్యా!అన్నాడు. ఇంక నేను నిగ్రహించుకోలేకపోయాను, నా కళ్లల్లోంచి బొటబొటా నీళ్లొచ్చేశాయి. పిల్లాడి చదువు మీద ఎంత శ్రద్ధ లేకపోతే ఇక్కడ ఇన్ని గంటలు నిరీక్షిస్తాడు? సమయానికి ఒక సహాయం అందకపోతే ఎంతో ఉజ్వలంగా వెలగాల్సిన జీవితాలు ఎలా కొడిగట్టుకుపోతాయో కదా అనిపించింది. ఈ పనికి ఎవరో కొద్దిమంది చేయూత ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఆర్థికంగా ఎంతో కొంత నిలదొక్కుకున్న ప్రతి ఒక్కరూ తమ శ క్తి మేరకైనా ఆదుకోకపోతే బంగారం లాంటి పిల్లల మనుగడ మట్టిపాలవుతుందని నేను నిత్యం అనుకుంటాను.

మనుషుల్ని చేయడం ముఖ్యం

నేను ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టూ సక్సెస్ అయ్యింది. వ్యక్తిగతంగా నేను విజేతనే. కానీ, ఒక వ్యక్తి విజయం దేశ విజయం కాదు కదా! వ్యక్తిగత విజయం సంతోషదాయకమే కావచ్చు గాక సామాజిక దృష్టితో చూస్తే నిత్యం ఆందోళన పడుతున్న మనిషిన్నేను. కొంతమందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ద్వారా నేనేదో మహాయజ్ఞం చేశానని అనుకోవడం లేదు. జరుగుతున్న విపరిణామాల్ని చూసి లోలోపల ఎంతో ఆవేదనకు గురవుతుంటాను. ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని చెప్పుకునే మనం భావితరాల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన పిల్లలకు, స్త్రీలకు ఏమైనా భవిష్యత్తూ, భద్రతా ఉన్నాయా? మన బిడ్డలు రేపు ఎక్కడ అత్యాచారాలకు గురవుతారో, ఎక్కడ గొంతు పిసికేయబడతారో, ఎప్పుడు రక్తపు ముద్దలై మన కళ్లముందు కుప్పపడతారో ఏమీ తెలియకుండా పోతోంది.

మన అతి పెద్ద బాధ్యత వీటిని నివారించడంలోనే ఉందని నాకు తరుచూ అనిపిస్తూ ఉంటుంది. పొట్ట పోసుకోవడం కోసం ఎవరూ అంత క ష్టపడక్కర్లేదు. ఏ చిన్న పనితోనైనా బతికేయొచ్చు. నిజంగానే ఏమైనా చేయాల్సి ఉంటే అది దేశం కోసమే. ఎవరికి వాళ్లు డబ్బుల లెక్కల్లోనే సతమతమైపోతున్నారు. ఒక్కోసారి నాకే లెక్కలు సరిగా రాక వెనకబడిపోతున్నానేమో ? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ, డబ్బే సమస్తం అనుకోవడం వల్లే కదా మనిషి మనిషి కాకుండాపోతున్నాడు. ఏదో సాయం అందించి శరీరాల్ని నిలబెట్టడం చేయవచ్చు. కానీ, అంతకన్నా ముఖ్యంగా మనిషిని నిలబెట్టాలి. మనీషిగా నిలబెట్టాలి. ఈ విషయంలో ఎవరెంత ఎక్కువ చేసినా అది తక్కువేనని నాకనిపిస్తుంది.

బమ్మెర ,
గింజుపల్లి భాస్కరరావు-గుంటూరు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “నిలబడ్డం కాదు నిలబెట్టడమే ముఖ్యం”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: