అట్లాంటి లీడర్లనిప్పుడు చూస్తామా?

‘ఎన్టీయార్ అంటే రాముడు. నేను ఆయన దగ్గర పని చేసిన లక్ష్మణుడిని. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే హృదయం బరువెక్కి వారం రోజుల పాటు తిండి తినబుద్ధే కాదు…’ అంటారు క్యాతం లక్ష్మణ్. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీయార్ 90వ జయంతి సందర్భంగా ఆయన కారు డ్రైవర్ లక్ష్మణ్ అనుభూతులూ అనుభవాలూ…
“నేను ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో మామూలు డ్రైవర్ని. ఒకరోజు మా డిపార్ట్‌మెంట్ వాళ్లు పిలిచి సీఎం దగ్గర డ్రైవర్‌గా పంపించారు. ఎన్టీయార్‌గారికి నచ్చడంతో డ్యూటీకి రమ్మన్నారు. ఇక అప్పట్నుంచి పద్నాలుగున్నరేళ్లు ఆయన దగ్గరే పని చేశాను. అన్నేళ్లలో ఏ ఒక్కరోజూ ఆయన నన్ను కోప్పడలేదు. అంతేకాదు, తన సిబ్బందిని బయటవాళ్లు ఒక్కమాటన్నా సహించేవారు కాదు, చివరకు ఆయన సొంత పిల్లలైనా. క్రమశిక్షణ, పట్టుదల ఆయన దగ్గర నేను నేర్చుకున్న గుణాలు.
ఎన్టీయార్ తన ఏ అవసరాలకూ ప్రభుత్వ సొమ్ము వాడేవాళ్లు కాదు.
ఆయన ఖర్చులు ఆయనే పెట్టుకునే వారు. ప్రభుత్వం నుంచి ఆయన తీసుకున్న కారు కూడా ఒక్కటే. కుటుంబసభ్యులు కూడా దాన్ని వాడేందుకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. తమ సొంత కార్లనే వాడుకోమనే వారు. ఒకసారి జయబాబు ఏదో పని మీద మా కార్లో వచ్చారు. “నాన్నగారూ మిమ్మల్ని సెక్రటేరియట్‌లో దింపి నేను ఆబిడ్స్‌లో దిగిపోతాను” అన్నారు. దానికి సారు.. “ఇది సీఎం కారు. మీ వ్యక్తిగత అవసరాలకు కాదు” అన్నారు. అంతెందుకు సీఎం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఫోన్ కాల్స్ విషయంలో కూడా పట్టుదలగా ఉండేవారు. తన ఆఫీసు నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో ఆ లిస్టంతా పీఏతో ఉదయమే తెప్పించుకొని పరిశీలించేవారు.
కుటుంబ సభ్యులెవరైనా ఆ ఫోన్‌ని వాడితే మందలించేవారు. ప్రభుత్వ సొమ్ము వృధా చేయొద్దనే వారు. సార్ దగ్గర పని సూర్యోదయానికి ముందే షురువయ్యేది. ఉదయం నాలుగు గంటలకు ఆయన ఇంటి వద్ద ఉండాలి. గండిపేట లేదా నాచారం.. కొంతకాలం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 13లో ఉన్నారు. అక్కడి నుంచి ఆబిడ్స్ వచ్చేవాళ్లం. ఇంట్లో కారెక్కగానే భగవద్గీత లేదా శివస్తుతులు వినేవారు. ఆబిడ్స్‌కి రాగానే అక్కడ సుప్రభాతం. ఇల్లంతా సాంబ్రాణి పొగలతో నిండి ఉండేది. మాకు ఏదో పవిత్ర స్థలానికి వచ్చిన అనుభూతి కలిగేది. అక్కడో రెండు గంటలు పని చూసుకున్నాక ఏడింటికే సెక్రటేరియేట్ వెళ్దామనే వారు.
ఇంకా స్టాఫ్ ఎవరూ రారు సార్.. ఎనిమిది తర్వాత వెళ్దాం అంటే సరేననేవారు. లలిత కళా తోరణం, ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల పని నడుస్తున్నంత కాలం ప్రతి రోజు అక్కడికి వెళ్లాల్సిందే. ఆ పనులు స్వయంగా చూడాల్సిందే. ట్యాంక్‌బండ్ మీది విగ్రహాలనైతే ఎంతో సునిశితంగా పరిశీలించేవారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఆ విగ్రహాల నమూనాలను పట్టి పట్టి చూసేవారు. తనకు సంతృప్తి కలిగే వరకు నమూనాల్ని మార్పించేవారు.
మీరు రాజులు ప్రజలు పేదలు
ఒకరోజుమంత్రి అశోక గజపతిరాజుని సార్ కార్లో కూర్చోబెట్టుకున్నారు. ‘బ్రదర్.. ఏంటి విశేషాలు’ అని అడిగారు. ఆయన కొన్ని కబుర్లు చెప్పి ‘రెండు రూపాయలకు కిలో బియ్యంతో ఖజానా మీద చాలా భారం పడుతోంది. కొంచెం రేటు పెంచుదామా’ అన్నారు. అంతే… సార్ సీరియస్ అయిపోయారు. “ఏం బ్రదర్ ఏంటి మీరు మాట్లాడుతున్నది. మీరు రాజులు. ప్రజలు పేదలు. వీలైతే మరింత తగ్గించవచ్చేమో చెప్పండి . పెంచమని సలహాలు ఇవ్వకండి’ అని ఆగ్రహంగా అన్నారు. అంతే ఇక సెక్రటేరియేట్‌లో బండి దిగేవరకు అశోక గజపతిరాజు ఒక్క మాట మాట్లాడలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి సెంటు భూమి సస్యశ్యామలం కావాలి లచ్చన్నా’ అంటూ ఉండేవారు ఎన్టీయార్.
హైదరాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల సమయంలో కూడా చాలా పట్టుదలతో వ్యవహరించారు. ఉదయం మూడు గంటలకే రోడ్ల మీదకు వచ్చేవారు. ఆయనతో పాటు అధికారులు కూడా. ‘చార్మినార్ కింద కూర్చుని చూస్తే ఫలక్‌నుమా ప్యాలెస్ కనిపించాలి. రోడ్డు అలా తీర్చిదిద్దండి’ అనేవారు. ఒకసారి చార్మినార్ దగ్గరున్న యునాని ఆసుపత్రి పైకి వెళ్లాం. అక్కడ రోడ్డు విస్తరణ ప్రయత్నం చేస్తున్నారు. షాపులు, తోపుడు బండ్ల వాళ్లు, ఎంఐఎం కార్యకర్తలూ, నాయకులూ వచ్చేశారు. ఎన్టీయార్ డౌన్‌డౌన్ అనే నినాదాలు మొదలయ్యాయి. సార్ కిందికి వచ్చారు. మల్గీల వాళ్లని పిలవమన్నారు. వాళ్లతో ‘మీకొచ్చిన నష్టం ఏముంది? రోడ్డు వెడల్పు చేశాక మల్గీలు కట్టిస్తాం.
అవి మీకే అప్పజెప్పుతాం. మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు’ అని నచ్చజెప్పారు. అక్కడే ఉన్న అధికారులతో వాళ్ల పేర్లు నమోదు చేసుకోమన్నారు. దాంతో వెంటనే ‘ఎన్టీయార్ జిందాబాద్’లు మిన్నుముట్టాయి. నిజాం కాలేజీ రోడ్డు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో ఉన్న గుడిని చూసి ‘లచ్చన్నా ఇక్కడ గుడి ఇంతకుముందు లేదు కదా. కొత్తగా వచ్చినట్లుందే’ అన్నారు. ‘అవున్సార్ ఇక్కడ నిజాం కాలేజీ వాచ్‌మెన్ రూం ఉండేది.’ అన్నాను. ‘లచ్చన్నా దీన్ని కూల్పించేయ్! నీ విగ్రహం ట్యాంక్‌బండ్ మీద పెడతా’ అన్నారు. అదే వాహనంలో ఉన్న ఆనాటి పోలీస్‌కమిషనర్ విజయరామారావు గట్టిగా నవ్వేశారు. ‘సార్ నా వల్ల కాదు’ అన్నాను మెల్లగా. రోడ్డుకు అడ్డంగా అప్పటికప్పుడు వెలసిన గుడులన్నా, మసీదులన్నా కోపంగా ఉండేది ఎన్టీయార్‌గారికి.
తప్పును ఒప్పుకునే మనిషి
ఎవరైనా తప్పు చేస్తే ఎంత సున్నితంగా మందలించే వారో, తాను తప్పు చేస్తే అంతే నిజాయితీగా ఒప్పుకునే వారు సార్. ఒకరోజు ఆబిడ్స్ ఇంట్లో ఉన్నాం. మధ్యాహ్నం రెండింటికి సెక్రటేరియట్ వెళ్దామని చెప్పారు. టైముంది కదా అని నాకు తెలిసిన వాళ్లొస్తే పక్కకు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ లోపున సార్ కారు దగ్గరకు వచ్చేశారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ‘ఏంటీ ఎటువెళ్లారు’ అని అడిగారాయన కొంచెం కోపంగా. క్షణం ఆలస్యమైనా సహించరు ఆయన. క్రమశిక్షణ గల మనిషి. సార్ రెండు గంటలకు వెళ్దామన్నారు కదా. ఇపుడు ఒకటిన్నరే అయ్యింది అని వాచీ చూపించాను. దానికాయన ‘సారీ లచ్చన్న, నిద్ర పట్టలేదు. అందుకే తొందరగా బయలుదేరాను’ అన్నారు.
అప్పుడేకాదు ఆయన కుటుంబ సభ్యులుగానీ, అధికారులు, నాయకులుగానీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు అని తెలిస్తే చాలు సారీ చెప్పేవారు. ‘మీరు పెద్దవాళ్లు..’ అన్నాగానీ తప్పు తప్పే అనేవారు. ఒకసారి ఆబిడ్స్ నుంచి జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్తున్నాం. తాజ్‌కృష్ణా అప్‌లోకి రాగానే.. ‘లచ్చన్నా.. బాబు పాలన ఎలా ఉందీ’ అని అడిగారు. ‘రాజకీయాల గురించి నాకేంతెల్సు సార్’ అన్నాను. ‘బయట అనుకుంటారుగా’ అన్నారు. దాంతో నేను ‘బాగానే ఉంది సార్’ అన్నాను. ‘బాబు రాజకీయ చాణుక్యుడులే’ అన్నారు. ఆ మాటల సందర్భంలోనే నేను కొంచెం చొరవ తీసుకున్నాను. ‘మన దగ్గరా తప్పులున్నాయి కదా సార్’ అంటూ ‘ఎంతో తపోశక్తి కలిగిన రావణాసురుడు సీతను చెర పట్టగానే పేరు చెడిపోయింది కదా సార్’ అన్నాను. ఆయన ‘అందరూ అన్నారు లచ్చన్నా. నీవొక్కడివే మిగిలిపోయావనుకున్నా. చివరకు నువ్వూ అనేశావు’ అనే ఒక్కమాట మాట్లాడి తల కిందికి దించేసుకున్నారు. ఇంటి వద్ద దిగే వరకు మళ్లీ ఆయన తలపైకెత్తలేదు. ఆయనలోని సంస్కారం అలాంటిది. అట్లాంటి లీడర్లని ఇప్పుడు చూస్తామా?
ఆప్యాయంగా చూసేవారు
ఆయన దగ్గర పని అంటే మా ఇంట్లో పని చేసుకున్నట్లే ఉండేది. అంతటి ఆప్యాయత చూపేవారు. ‘లచ్చన్నా భోజనం చేశారా? ఏం తెచ్చుకున్నారు? ఇంత చిన్న బాక్సు ఏం సరిపోతుందీ?’ అని పలకరించేవారు. ఆయన కార్లో ఏదైనా తింటూంటే గేర్ రాడ్ మీద ఉన్న నా చేయిని కొట్టి ‘ఊ’ అని సైగ చేసి నాకూ పెట్టేవారు. భోజన ప్రియుడు. ఉదయం నాలుగు గంటలకే ఓ కోడి, చిక్కగా మరగబెట్టిన లీటర్ పాలు, రాత్రి కిలో చేపలు, సాయంత్రం రసమలై, కోవా గర్జ్, అపుడపుడు పల్లీలు, బెల్లం… ఇట్లా మంచి బలమైన ఆహారం తీసుకునేవారు. ప్రతి ఆదివారం కొడుకులూ, కూతుళ్లూ, మనువలూ, మనవరాళ్లందరినీ పిలిచి అందరితో కలిసి భోంచేసేవారు. సార్ తిరిగి అధికారంలోకి వస్తే సత్యనారాయణస్వామి వత్రం చేస్తానని నా భార్య మొక్కుకుంది. ఆయన విజయం సాధించారు.
వ్రతం విషయం చెప్పాను. ‘నేను వస్తాను’ అన్నారు. మంచిది సార్ అన్నాను కానీ నాకు నమ్మకం లేకుండె. కానీ ఆయన నిజంగానే వచ్చారు. ఏ ఫంక్షన్లో కూడా కొద్ది నిమిషాలకు మించి ఉండని ఆయన రెండు గంటల పాటు నా ఇంట్లో ఉన్నారు. పార్సీ గుట్టలో చిన్న రెండు గదుల ఇల్లు నాది. వచ్చేముందు ఫోన్ చేసి ఏమేం వంటకాలు చేయించారని అడిగారు. ఆలు ఫ్రై, పప్పు, సాంబారు అని చెప్పాను. వచ్చి భోంచేశారు. నా పిల్లల్ని దీవించారు. నాకు బట్టలు కూడా పెట్టారు. అవి నేను కుట్టించుకోలేదు. నేను చనిపోయినప్పుడు వాటిని నా శవం మీద కప్పాలని నా కోరిక. మా నాన్న చనిపోయినపుడు కారు ఇచ్చి మరీ నన్ను ఇంటికి పంపించారు. కార్యక్రమాలన్నీ చూసుకొని రండి అని చెప్పారు. ఆ పదిరోజులే నేను ఆయన వద్ద పనిచేసిన కాలంలో డ్యూటీకి దూరంగా ఉన్నది. అలాంటి మనిషి మళ్లీ పుట్టడు.
అభిమానులంటే గౌరవం..
సార్ ఎంత బిజీగా ఉన్నా అభిమానులకూ, అవసరం రీత్యా వచ్చిన వారికి టైమ్ ఇచ్చేవారు. ఒకసారి ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. లంబాడీ. ఆజానుబాహుడు. ఆయన్ను చూసి ఎందుకొచ్చారని అడిగారు సార్. ‘నా కూతుర్ని చెట్టుకు కట్టేసి చెరిచారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు స్పందించడం లేద’ని చెప్తే 24 గంటలు తిరగక ముందే నిందితుల్ని అరెస్ట్ చేయించి, అక్కడి పోలీసు అధికారిని సస్పెండ్ చేయించారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందని చెవినబడితే వెంటనే స్పందించేవారు. యాక్షన్ తీసుకునే వరకు మర్చిపోకుండా అధికారుల్ని ఆరా తీసేవారు.
ఆబిడ్స్ నివాసానికి సార్‌ని చూసేందుకు చాలా మంది వచ్చేవారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని సార్‌కి తెలియనిచ్చేవారు కాదు. ప్రతిరోజు మేము ఇంట్లోంచి బయలుదేరగానే వెనుక మూడు, నాలుగు బస్సులు ఫాలో అయ్యేవి. అందరూ అభిమానులే. సార్‌ని ఒక్కక్షణమైనా చూద్దామని వాళ్ల కోరిక. నేనొకరోజు ఈ విషయాన్ని సార్‌కి చెప్పాను. ఆయన మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి అభిమానుల్ని కలిసారు. ఆ తర్వాత ఆబిడ్స్‌లో వాళ్లకో పెద్ద హాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి.. ఏవైనా ఫిర్యాదులుంటే స్వీకరించే ఏర్పాట్లు చేయించారు. ప్రతిరోజు ఒకసారి అక్కడికి వెళ్లి వాళ్లందర్నీ చూసి చేయి ఊపి వెళ్లేవారు.
అలాంటి మనిషి డల్ అయితే…
ఎప్పుడూ హుషారుగా ఉండేవారాయన. సెక్యూరిటీవాళ్లు వచ్చి డోర్ తీసేలోపు జింకపిల్లలా చటుక్కున స్వయంగా డోర్ తీసుకొని కూర్చునేవారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా అంతే. నేను కారు రివర్స్ తీసుకునే లోపున తిరిగి వచ్చేసేవారు. ఎంతో వేగంగా, చలాకీగా ఉండేవి ఆయన పనులు. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా డల్ అయ్యారు. చాలా నెమ్మదిగా కారు దిగేవారు. కిందికి దిగడానికి నేను సాయం పట్టాల్సిన పరిస్థితి.
– పి. శశికాంత్

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: