‘అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ

Photo
ఆరికెపూడి ప్రేమ్‌చంద్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పరిశోధకుడిగా పనిచేసిన అధ్యయనశీలి అంటే కాస్త తెలుస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘంలో ఉద్యోగం చేశారంటే ఇంకొంచెం తెలుస్తుంది. రిజర్వ్‌బ్యాంక్ పూర్వపు గవర్నర్ వై.వేణుగోపాలరెడ్డి వంటివారికి ఆప్తులైన ఆలోచనాపరుడని చెబితే మరికొంచెం తెలుస్తుంది.

ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టాల్సిన తీరు మీద ప్రేమ్‌చంద్ రాసిన పుస్తకాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రించిందంటే ఆయన గొప్పదనం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. వాటన్నిటికీ మూలాలు మా పల్లెటూళ్లో ఉన్నాయి‘ అంటూ తన సొంతూరు గురించి ఆరికెపూడి ప్రేమ్‌చంద్ చెబుతున్న కబుర్లు ఆయన మాటల్లోనే…

కృష్ణా జిల్లా కడవకొల్లు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కడవకొల్లు, వీరవల్లి, పొట్లపాడు… మూడూళ్లనూ కలిపి చెప్పాలి. ఆంధ్రా మాస్కో అని పిలిచే కాటూరు మాకు రెండు మైళ్ల దూరం. నేను 1933 ఆగస్ట్ 22న కడవకొల్లులో పుట్టాను. అప్పటికి అంతా కలిపి పాతిక ముప్ఫయ్యిళ్లు ఉండేవేమో మా ఊళ్లో. అందరూ అతి సాధారణ రైతులు. రెండెకరాలూ, మూడెకరాల వాళ్లు. తిండికీ బట్టకూ లోపం లేకుండా గడిచిపోయే కుటుంబాలు. విలాసమంటే ఏమిటో తెలియని మనుషులు.

అయితే నేను పుట్టడానికి ఆరేడేళ్ల ముందు ఉయ్యూరులో కేసీపీ వాళ్లు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించడంతో డెల్టా రైతుల దశ తిరిగింది. తిండిగింజల బదులు చెరుకు వేసి పంట చేతికి రాగానే ఫ్యాక్టరీకి తరలించడంతో డబ్బు రూపేణా ఆదాయాన్ని కళ్ల చూస్తున్న రోజులవి. మా నాన్న ఆరికెపూడి వెంకటరామయ్య జాతీయోద్యమంతో ప్రభావితులై తన వాటా రెండెకరాల పొలాన్ని అమ్మేసి మా ఊళ్లో పాఠశాల నిర్మించారు.

దీనికి ఉయ్యూరు రాజాగారు మరికొంత సొమ్ము సాయం చేశారు. తనకంటూ ఏ పదవీ లేకపోయినా మా నాన్న రోజంతా ఆ స్కూలు నిర్వహణలోనే గడిపేవారు. అందువల్ల మా నాన్నను అందరూ ‘పంతులుగారు’ అని, మా అమ్మను’పంతులుగారి భార్య’ అనీ అనేవాళ్లు. ఊరి బడి కోసం తన భూమిని అమ్మేసిన మా నాన్నను ఆయన అన్నదమ్ములు చాలా గౌరవంగా చూసేవారు.

ఉమ్మడి కుటుంబంలో అందరూ కష్టసుఖాలు పంచుకునేవారు. ప్రస్తుతం మూడొందల మంది విద్యార్థులున్నారా స్కూల్లో. మా నాన్న పుస్తకాలు కొనుక్కొచ్చి స్కూల్లో చిన్నపాటి గ్రంథాలయమూ నడిపేవారు. అప్పటికే ఆర్యసమాజంతో ప్రభావితులైన ఆయనకు కవిరాజు త్రిపురనేని రామస్వామి తోడయ్యారు. మా తాతగారిదీ అంగలూరే కావడంతో ఆ బంధం ఉండేది. నేను పుట్టకముందే మా పెద్దక్కకు పెళ్లయింది. మంత్రాలు, పురోహితుడి అవసరం లేకుండా జరిగిన తొలి పెళ్లి మా అక్కాబావలదే. కవిరాజు తాను రాసిన ‘వివాహవిధి’ పుస్తకం సాయంతో స్వయంగా చేసిన పెళ్లి అది.

కాలవ కబుర్లు కొన్ని
కడవకొల్లుకు ఆనుకుని కృష్ణా నది కాలువ రైవస్ కెనాల్ ఉండేది. మా ఈత సరదాలు అన్నీ అక్కడే. పిల్లలకు చిన్న తువ్వాలొకటి ఇచ్చేవాళ్లు. దాన్ని కట్టుకుని స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత పిండేసి ఒళ్లు తుడుచుకోవాలి. బైటకు ఒళ్లు కనిపించకుండా ఈ పని లాఘవంగా చెయ్యాలి. అందులో నేను సిద్ధహస్తుణ్ని. నిజానికి మా ఊరి కాలవలో దిగి స్నానం చెయ్యడం అసాధ్యం. ప్రవాహవేగం అంత తీవ్రంగా ఉండేది. కాలుపెడితే కొట్టుకుపోవడమే. అందుకని మా నాన్న ఊరికి దగ్గరగా మెట్లతో ఒక చిన్న రేవులాగా కట్టించి పెద్ద ఇనపగొలుసు పెట్టించారు.

దాన్ని పట్టుకుని నడుముల్లోతు దిగి స్నానం చేసేవాళ్లు పిల్లలూ, ఆడవాళ్లూను. కొద్దిగా తుప్పు పట్టిందిగానీ ఇప్పటికీ ఉందది. కాలవ దగ్గరగా ఉన్నందువల్ల మా ఊరి నూతుల్లో నీరు పుష్కలంగా ఉండేది. వానకాలంలోనయితే చేద అవసరమే ఉండేది కాదు. బకెట్లతో నేరుగా తోడుకోవడమే. వేసవికాలంలో కొబ్బరికాయలు కోసి తాడు కట్టి నూతిలో పడేసేవాళ్లం. చల్లగా అయ్యాక తాగేవాళ్లం. అదొక రిఫ్రిజిరేషన్ టెక్నిక్ అన్నమాట. చిన్నప్పుడు నా లాగు జేబులో ఉప్పు కారప్పొడి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి.

మామిడికాయల సీజన్‌లో తోటలకెళ్లినపుడు వెంటనే తినడానికి వీలుగా. ఊళ్లో అందరికీ అందరూ తెలిసినవాళ్లే కనుక ఏమీ అనేవారుకాదు. ఏడాది పొడుగునా రాచఉసిరి కాయలు, జామకాయలు, చెరుకుగడలు ఏదోటి తింటూనే ఉండేవాళ్లం. ఉయ్యూరు ఫ్యాక్టరీకి చెరుకు బళ్లు వెళుతుంటే రైతులే మేం కనబడినప్పుడు ఓ గడ తీసిచ్చేవాళ్లు. కాలవ ఒడ్డున ఊరికి చివరగా ఉండే కల్లుపాక సాయంత్రం శ్రమజీవులతో నిండిపోయేది. ఎందుకో ఆ దృశ్యం నాపై చెరగని ముద్రవేసింది. కనుచీకటి పడుతుండగా అక్కడికి చేరే మనుషులు, వాళ్ల మాటలు, సందడి వాతావరణం – చూసి తీరవలసిందేగాని మాటల్లో చెప్పలేనిది.

చెరువున్నా లాభం సున్నా
మా ఊరి చెరువుకు ఎదురుగానే మా ఇల్లు. ఆ చెరువులో చేపలు పుష్కలంగా దొరికేవి. అయితే మా నాన్న గాంధీగారిని కలిసి ఇచ్చిన మాట ప్రకారం శుద్ధ శాకాహారిగా మారిపోయారు. ఇంట్లోనూ మాంసాహారం వండకూడదని గట్టి నియమం పెట్టారు. తాలింపులో సైతం మసాలా వాసన వస్తే ఒప్పుకునేవారు కాదు. అందుకని మా అమ్మ వండేది కాదుగానీ ఆమె తోబుట్టువులు చెరువు చేపలో, చికెనో వంటివి వండి తెచ్చిస్తే ఇంట్లో పిల్లలకు పెట్టేది. నేను ముందునుంచీ శాకాహారినే.

ఇక కరెంటూ టీవీలూ ఏమీ లేని కాలంకదా అది. ఎండాకాలమైతే ఆడవాళ్లంతా పచ్చళ్లు పెట్టడంలో మునిగిపోయేవారు. ఒక ఇంట్లో ఉలవచారు చేస్తే, అన్ని ఇళ్లకూ పంచాల్సిందే. అందువల్ల ఉలవచారొక పెద్ద పని. వేసవిలో కూరగాయలకు మొహం వాచే కాలం.

అప్పుడు ఎక్కువగా పచ్చిపులుసు లాంటివి తినేవాళ్లు. నా చిన్నప్పుడు టమాటా పంటే తెలీదు ఊళ్లో. వానకాలం వస్తోందంటే ముందుగానే కంద, పెండలం వంటివి ఆరపెట్టుకునేవాళ్లు. వానల్లో బురదబురద అయిపోయే మా ఊరి మట్టి రోడ్డు ఆ తర్వాత ఎండాక నడవలేనంత గట్టిగా అయిపోయేది. దాంతో అందరి కాళ్లూ చీలిపోయి రక్తాలొచ్చేవి. ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్స్ కోర్సు పూర్తిచేసేవరకూ నాకూ చెప్పుల్లేవు.

బట్టలకూ రేషనే
మా పిన్నమ్మ తె ల్లవారుజాము నుంచే రాట్నం వడికేది. దాన్నుంచి వచ్చే ‘మ్‌మ్‌మ్…..’ అనే శబ్దానికి నిద్రలేచి, ఆపై రోజంతా ఊళ్లోని పాతిక గడపలూ తిరగడమే చిన్నప్పుడు మా వ్యాపకం. ఆకలి సమయానికి ఏ ఇంట్లో ఉంటే అక్కడ అన్నం పెట్టేసేవాళ్లు, మేం తినేసేవాళ్లం. కేవలం రాత్రి పడుకోబోయే ముందు పిల్లలందరూ ఉన్నారో లేదో చూసుకునేవాళ్లు పెద్దవాళ్లు. ‘ఉదయం ఎక్కడరా తిన్నావు?’ అనే ప్రశ్న అడిగితే అడిగేవారు, లేదంటే లేదు.

తెల్లవారుజాము ప్రమిదల వెలుగులో మా అమ్మ మజ్జిగ చిలకడం నాకింకా గుర్తుంది. అప్పట్లో కరెంటు లేక ఊళ్లో అందరూ నూనె దీపాలే వాడేవాళ్లు. వంటక్కూడా మట్టి పాత్రలే తప్ప కనీసం జర్మన్ సిల్వర్ కూడా తెలియదు. ’40ల్లో యుద్ధం వలన అన్నిటికీ కరువుగానే ఉండేది. గుడ్డి వెలుతురునిచ్చే కిరోసిన్ అయినా దొరికేది కాదు. చివరకు కట్టుకునే బట్టకూ కరువే. తయారైన బట్ట అంతా మిలిటరీకి తరలిపోయేది.

ఆ సమయంలో అందరికీ పీసీ కోటింగ్ గుడ్డలే గతి. రంగును బట్టి చొక్కాలు, ప్యాంట్లు కుట్టించుకోవడమే. ఆడవాళ్లకు చిన్న అంచున్న తెల్లటి చీరలు వచ్చేవి. ఇప్పట్లాగా డబ్బు పెట్టి బజార్లో కొనితెచ్చుకోవడం కాదు. మా ఊళ్లల్లో గుడ్డ కావాలంటే క్యూలో నిల్చోవాల్సిందే. మా అక్కయ్యలకు చీరల కోసం నేనూ అలా వరసలో నిలబడ్డవాణ్నే. పాప్లిన్ గుడ్డ కావాలంటే మన పేరివ్వాలి. లాటరీ తీసి అందులో మన పేరుంటే అప్పుడు ఇస్తారు.

గుట్టు తెలియని ఊరు
మా కడవకొల్లు వాళ్లే కాదు, డెల్టాల్లోని పల్లెటూళ్లలో ఎక్కువమంది ఏదో ఒక లిటిగేషన్‌లో ఉండేవాళ్లు. ఉదయం పూట బెజవాడ కోర్టుల చుట్టూ తిరగడంతో అలసిపోయేవారు. సాయంత్రం చీకటి పడ్డాక ఊరికెళ్లలేరు కనుక గన్నవరం,బెజవాడల్లో తమ ఊరివాళ్లెవరైనా కాపురమున్నారేమోనని ఆరా తీసి వాళ్లింటికి వెళ్లిపోయేవాళ్లు. ఆ ఇంటి ఇల్లాలు వచ్చినవాళ్లకు వేన్నీళ్లివ్వడం, వేడివేడిగా భోజనం పెట్టడం, మంచాలివ్వడం ఇవన్నీ చెయ్యాలి. ఉదయాన్నే లేచి ఎవరి తోవన వాళ్లు వెళ్లేవారు.

ఏ కాస్త లోపం జరిగినా ఊరికొచ్చాక ‘వెళ్లకవెళ్లక ఫలానా సుబ్బయ్య కూతురింటికి ఒక్కపూట వెళితే కూరయినా చేసి పెట్టలేదు, పడుకోను మంచమైనా ఇవ్వలేదు’ అని ఊరంతా చెప్పేసేవారు. అది పెద్ద అవమానం. చెప్పొచ్చేదేమంటే ఏ విషయమైనా ఉన్నదున్నట్టు మాట్లాడేసుకోవడమేగానీ దాచుకోవడం తెలియదు అప్పట్లో. కోపం వస్తే కేకలేసుకోవడం,మళ్లీ మామూలుగా పలకరించుకోవడం, ఏదైనా ఉంటే ఉందని లేకపోతే లేదని – ఇంతే అక్కడి తీరు.

అయితే మా నాన్న దీనికి మినహాయింపు. ఆయన చదువుకుని దేశమంతా తిరిగొచ్చారు కనుక మేం కొంత సంస్కారయుతంగా ప్రవర్తించాలని ఆయన ఆశించేవారు. అంటే జాగ్రత్తగా మాట్లాడడం, ఇంటికెవరైనా వస్తే లేచి నిలబడి సరిగా సమాధానం చెప్పడం, కోపం వచ్చినా అరవకపోవడం… ఇలాంటివి.

ఉయ్యూరులో ఒకరోజు బడికి వెళుతున్నప్పుడు మా బంధువు మైనేని కనకం అనే ఆవిడ దారిలో కనపడి ‘అబ్బాయ్,ఇవాళేం కూర?’ అనడిగింది. ‘కూరేం లేదు, మా అమ్మ ఆవకాయ కలిపి పెట్టింది’ అని చెప్పేశా. వెంటనే నన్ను పక్కకు లాగి ‘అదేం మాటరా అబ్బాయ్? కాస్తయినా గుట్టు తెలియదా నీకు? కూర లేకపోయినా ఏదోటి ఉందని చెప్పాలిగానీ అలా చెప్పుకుంటారా? గుట్టు నేర్చుకో’ అంది. మా ఊరు కడవకొల్లులో అలాంటివేమీ ఎరుగనివాణ్ని కనక నాకు ఆవిడ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

నన్ను నడిపింది ఆ బొమ్మే
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థలో విదేశీ పట్టాలేవీ లేకుండా, పేరు వెనుక కనీసం పీహెచ్‌డీ అన్న మూడక్షరాలైనా లేకుండా పనిచేసిన మనిషిని నేనొక్కణ్నేనేమో. కానీ దానికి అవసరమైన పునాదిని వేసింది, ప్రాథమిక విద్యనందించిందీ మా కడవకొల్లును, ఉయ్యూరులే. విదేశాల్లో నివసిస్తున్నా మా ఊరితో బంధమనే తల్లి వేరును తెంచుకోలేదు నేను. ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషణ్ రాసి, సత్యజిత్‌రే సినిమాగా తీసిన ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితుడు’ వంటి నవలల కథానాయకుడు ‘అపూ’ లాగానే నా లోపల కూడా మా ఊరికి సంబంధించి నా బాల్య జ్ఞాపకాలతో ఒక అందమైన చిత్రం ముద్రపడిపోయింది.

నేను పదేళ్లు ఢి ల్లీలో, మరో నలభయ్యేళ్లు అమెరికాలో నివసించిన సమయమంతా ఆ చిత్రమే నాకు ఊపిరినిచ్చేది. ఐఎమ్ఎఫ్‌లో పనిచేస్తున్నప్పుడు, వివిధ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వినియోగించే తీరు మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తున్నప్పుడు సైతం మా ఊరి చిత్రమే నాకు అవసరమైన బలాన్నిచ్చేది.

ఇప్పుడు మావాళ్లెవ్వరూ అక్కడలేరు. అయినా మా గ్రామానికి అవసరమైనది ఏదైనా చెయ్యడానికి నేను సిద్ధమే. ఒక బడో, గుడో, రోడ్డో… ఏ నిర్మాణమైనా చేస్తాం, ఏ సౌకర్యమైనా కల్పిస్తాం. కానీ దాన్ని పది కాలాల పాటు సరిగా నిర్వహించడానికి ముందుకొచ్చేదెవరు? కేవలం డబ్బు పెట్టి ఏదైనా చేసెయ్యగానే సరిపోతుందా చెప్పండి? బాధ్యత తీసుకునేవాళ్లుంటే గ్రామాల బాగు కోసం ముందుకొచ్చేవాళ్లు నేనే కాదు, చాలామందే ఉన్నారు.

అరుణ పప్పు ఫోటోలు : రాజ్‌కుమార్డి.కోటేశ్వరరా

నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!—–వంశీ

పసలపూడి, అరకులోయ, తిరువణ్ణామలై.
ఇల్లు, పుస్తకాలు, సినిమాలు.
గోదావరి, బలభద్రపురం రైల్వేస్టేషన్.
ఇళయరాజా, బాపు-రమణ.
కూసుమంచి అగ్రహారంలో
నాగయ్య హోటల్ భోజనం.
మనసుని బాధపెట్టే సంగీతం…
ఇవీ… వంశీ ఇష్టాలు. భావోద్వేగాలు.
ఆకుపచ్చని జ్ఞాపకాలు.
ఐతే,
ఈ ఇష్టాలను, ఉద్వేగాలను ఫీల్ కావాలంటే వంశీకి ఒంటరితనం తోడుగా ఉండాలి!
స్నేహాలలో, సమూహాలలో
ఆయన ఇమడలేరు.
ఏకాంతం లేకపోతే…
గుండె నిండా పచ్చటి గాలినైనా పీల్చుకోలేరు!
‘నాదొక సీరియస్ లైఫ్’ అంటున్న వంశీ జీవితంలోని నలుపు తెలుపుల సమ్మేళనమే ఇవాళ్టి స్టారిస్ట్రీ.

vamsi2

30 ఏళ్ళ కెరీర్‌లో పాతిక సినిమాలే చేశారు. మీతోపాటే వచ్చిన వాళ్ళు, మీ తర్వాత వచ్చినవాళ్లు ఎక్కువ సినిమాలు చేశారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ముఖ్యమనుకున్నారా?
వంశీ: టార్కవస్కీ పేరుతో ఓ దర్శకుడున్నాడు. ఆయన తన లైఫ్‌లో తీసింది ఆరేడు సినిమాలంతే. అన్నీ క్లాసిక్సే. వరల్డ్ గ్రేట్ డెరైక్టర్స్‌లో ఆయన పేరూ చెబుతారు. అలాగని నేను ఆయనతో పోల్చుకోవడం లేదు. కట్టలు కట్టలుగా సినిమాలు తీయడం నా మనస్తత్వానికి విరుద్ధం. క్వాలిటీ అనొచ్చు, లేక వేరే కారణాల రీత్యానో నేను తక్కువ సినిమాలే చేశాను. అయినా నేను మిగతా వాళ్ళంత స్పీడుగా సినిమాలు చేయలేను. ఒకేసారి రెండు, మూడు సినిమాలు తీయడం కూడా నావల్లకాదు.

మీ వర్కింగ్ స్టయిల్ చాలా వేగంగా ఉంటుందంటారు. చాలా తక్కువ సమయంలోనే సినిమా తీసేయగల సమర్థులు మీరు. అయినా కూడా ఒక్కో సినిమాకి ఎందుకంత సమయం తీసుకుంటారు?
వంశీ: సినిమా తీయడానికి నాకు పెద్ద సమయం పట్టదు. కానీ స్క్రిప్టు తయారీకే ఎక్కువ సమయం పడుతుంది.

పతి దర్శకుడికీ శిష్యగణం ఉంటుంది. కానీ మీ దగ్గర నుంచి పెద్దగా శిష్యులు వచ్చినట్టు కనబడరెందుకని?
వంశీ: నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెద్దగా పని దొరకదు. ఎందుకంటే ఒన్‌మేన్ ఆర్మీలాగా అన్నీ పనులూ నేనే చేసేసుకుంటుంటాను.

అంటే మీ పనిని ఎవ్వరికీ నేర్పడానికి ఇష్టపడరా?
వంశీ: అబ్బబ్బే…అదేం కాదు. అయినా నేనేమన్నా రహస్యంగా పనిచేస్తానా ఏంటీ? అందరిముందే కదా చేసేది. పని నేర్చుకోవడం, నేర్చుకోకపోవడమనేది వాళ్ళ సమస్య.

సినిమాలు, పుస్తకాలు, ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేనట్టుగా కనిపిస్తారు..?
వంశీ: ఈ ప్రపంచంలో నాకు స్నేహితులెవ్వరూ లేరు. ఎవ్వరితోనూ కలిసి మెలిసి తిరగడాలు లేవు. ఇల్లు,సినిమాలు, పుస్తకాలు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్, శంకర్‌పల్లిరోడ్… ఇవే నా ప్రపంచం.

ఔటర్ రింగ్ రోడ్డు… శంకర్‌పల్లి రోడ్డు ఏంటి?
వంశీ: హైదరాబాద్ చుట్టూ ఓ గొలుసు కట్టులాగా ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఆ విశాలమైన రోడ్డు మీద కారులో అలా వెళ్తూ ఉంటే అదొక ఆనందం. ఈ ఔటర్ రింగ్ రోడ్ లేనప్పుడు శంకర్‌పల్లి, వికారాబాద్ వరకూ వెళ్తుండేవాణ్ణి. అది కూడా ఒంటరిగానే. నేను, నా కారు డ్రైవరూ అంతే.

ఈ ఒంటరి ప్రయాణమంటే ఎందుకంత ఆసక్తి?
వంశీ: ఈ ఆసక్తి ఈనాటిది కాదు. మద్రాసులో ఉన్నప్పుడూ అలా మహాబలిపురం వరకూ వెళ్లొచ్చేసేవాణ్ణి. అదొక ఆనందం నాది. ఇప్పుడు అదొక అలవాటైపోయింది. నాకు రైలు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కిటికీపక్కనే కూర్చుని కదులుతున్న ప్రకతిని వీక్షిస్తుంటా. ఇదివరకూ ప్రతి నెలా టూర్ వెళ్ళేవాణ్ణి. ఇప్పుడే కొంచెం తగ్గించాను.

ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. మరి మీరేంటి?
వంశీ: అందరూ ఒకలా ఉండరు కదా. నాకు స్నేహితులు లేరు. ఎందుకంటే నాకు స్నేహం చేయడం చేతకాదేమో! ఇప్పుడన్నీ అవసరార్థపు స్నేహాలే. అందుకే నేను స్నేహానికి వ్యతిరేకం.

చిన్నప్పుడు కూడా స్నేహితుల్లేరా?
వంశీ: మా ఊర్లో ఒకే ఒక్క మిత్రుడు ఉండేవాడు. అతనిప్పుడు లేడు.

మరి మీ మనసులో బాధల్ని, సంతోషాల్ని ఎవరితో పంచుకుంటారు?
వంశీ: నాకూ ఆనందాలూ బాధలూ ఉంటాయి. వాటిని ఎవ్వరితోను పంచుకోబుద్ధేయదు. అవన్నీ నా రచనల్లో ఎక్కడో ఒకచోట మెరుస్తుంటాయ్.

సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనబడరెందుకని?
వంశీ: నాకు ఆసక్తి లేదు. జనం మధ్య నేను ఉండలేనేమో!

మరి మీ ఫ్యామిలీ ఫంక్షన్లకైనా వెళ్తుంటారా?
వంశీ: లేదు. అస్సలు వెళ్ళను. మేం ఎవరింటికీ వెళ్ళం. మా ఇంటికి ఎవ్వరూ రారు. అందుకు నిదర్శనం ఏంటంటే మా ఇంటి సోఫాలే. ఎప్పుడో కొన్నాం వాటిని. ఇప్పటికీ కొత్తవాటిలాగా తళతళలాడుతూనే ఉన్నాయి చూడండి.

మీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్..
వంశీ: మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మ మొన్నీ మధ్యనే కాలం చేశారు. మా అక్క, తమ్ముడు ఉన్నారు. వాళ్ళతో కూడా అంత సంబంధ బాంధవ్యాలు లేవు.

మీ నాన్నగారు ఏం చేసేవారు?
వంశీ: చెల్లూరు షుగర్‌ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయన చాలా చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆయనదో పెద్ద ఫెయిల్యూర్ లైఫ్. ఆయన దగ్గర ఎర్రటి అట్టతో ఓ చిన్నపుస్తకం ఉండేది. ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవాడు. అదేంటో చూద్దామని ఆ పుస్తకం కోసం చాలాసార్లు వెతికా. ఎక్కడో రహస్యంగా దాచి పెట్టుకున్నాడాయన. డిప్రెషన్‌లో ఎక్కువ తాగేసి మా అమ్మను కొడుతున్నాడని ఇక జన్మలో నాన్నతో మాట్లాడకూడదని ఒట్టుపెట్టుకున్నా. అది జరిగిన కొద్దిరోజులకే ఆయన పోయాడు.

మీ అమ్మగారి గురించి చెప్పండి?
వంశీ: అమ్మ పేరు సూరాయమ్మ. నేనెప్పుడు అమ్మని నా దగ్గరకు రమ్మని అడగలేదు. తనూ రాలేదు. అలా రాకుండానే వెళ్లిపోయింది.

మీ సొంత ఊరు పసలపూడితో ఎక్కువ అనుబంధం ఉన్నట్టుంది?
వంశీ: అందుకేగా ‘మా పసలపూడి కథలు’ పేరుతో 72 కథలు రాసింది. ఆ ఊళ్ళో వెలగల అప్పారావుగారింటి వెనుక దొడ్లో ఉన్న పాత ఇంట్లో నెలకు రెండురూపాయలకు అద్దెకుండేవాళ్ళం. ఆ ఇంటి ముందు జామచెట్టు, రెండు నారింజ చెట్లూ ఉండేవి. మా అమ్మ పుల్లటి నారింజకాయలు తెంపి, వాటి రసంతో పులిహోర చేసి పొట్లాలు కట్టిచ్చేది. నేను మా తమ్ముడు. మిషన్ కుట్టే త్యాగరాజు కలిసి మా అమ్మమ్మ గారి ఊరైన బలభద్రపురం స్టేషన్‌లో రాత్రిపూట పాసింజర్ రెలైక్కి అన్నవరం వెళ్ళేవాళ్లం. స్టేషన్ దగ్గర నుంచి కొండమీదకు నడిచెళ్ళి గుళ్లు చేయించుకుని అన్నవరం ప్రసాదాన్ని కడుపునిండా తినేసేవాళ్ళం.

ఇప్పుడు కూడా తరచుగా పసలపూడి వెళ్తుంటారా?
వంశీ: లేదు. ఏడాది క్రితం వెళ్ళా. అప్పటికీ, ఇప్పటికీ ఊళ్ళోనూ, మనుష్యుల్లోను చాలా మార్పులొచ్చేశాయి. మార్పు మంచిదే కానీ మరీ ఇంత మార్పా? మా ఊరు అనే కాదు, అన్ని పల్లెటూళ్ళు అలాగే మారిపోయాయి.

ఇంతకూ మీ తొలి కథ ఎప్పుడు రాశారు?
వంశీ: నా 14 ఏళ్ళ వయసులో ‘సత్యసుందరి నవ్వింది’ పేరుతో మొదటి కథ రాశా. 1974లో ఆల్ ఇండియా రేడియోలో ‘యువవాణి’ కార్యక్రమానికి పంపితే ఎంపికైంది. నేనే బస్సులో బెజవాడ వెళ్ళి రేడియోలో కథ చదివొచ్చా. పాతిక రూపాయల పారితోషికమిచ్చారు. ఆ తర్వాత, ‘నల్ల సుశీల’ కథ రాశాను. దానికీ మంచి పేరొచ్చింది.

ఆ వయసులో కథలు రాశారంటే, ఊళ్ళో చాలా స్టార్ వేల్యూ ఉండేదేమో?
వంశీ: లేదు. నేను రాస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పేవాణ్ణి కాదు. మా ఊరి లాకుల దగ్గర మొండి అనే చోట పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఒంటరిగా కూర్చుని రాసుకునేవాణ్ణి. మా ఊళ్లో నన్నెవరూ పట్టించుకునేవారు కాదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ.

మీకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టమేనా?
వంశీ: సినిమాలు బాగా చూసేవాణ్ణి. కానీ, సినిమా ఫీల్డ్‌కి రావాలని మాత్రం ఏనాడూ అనుకోలేదు. టూరింగ్ టాకీస్‌లో మా అమ్మతో కలిసి ‘అమరశిల్పి జక్కన’ సెకండ్ షో చూశాను. ఆరోజు జోరువాన. తడుసుకుంటూనే వెళ్ళాం. అదీ నా జీవితంలో చూసిన తొలి సినిమా. ఆ తర్వాత ‘తోబుట్టువులు’చూశాను. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ‘మొనగాళ్ళకు మొనగాడు’. మోడరన్ థియేటర్స్ వారి సినిమా అది. రామచంద్రపురంలోని రాజగోపాల్ పిక్చర్ ప్యాలెస్‌లో చూశాను.

మీకు ఆసక్తి లేని సినిమా ఫీల్డ్‌కి రావడానికి బలమైన కారణం ఏదైనా..?
వంశీ: నా 18వ ఏట నా కంటే పదేళ్ళు పెద్దదైన అమ్మాయిని ఇష్టపడ్డాను. తనూ నన్ను ఇష్టపడింది. ఓ రోజు నేను వేరే ఊరు వెళ్లి వచ్చేసరికి ఏదో జబ్బు చేసి ఆ అమ్మాయి చనిపోయింది. ఇక అక్కడ ఉండలేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ టైమ్‌లోనే ఒకాయన ‘నీ టాలెంట్‌కి సినిమా ఫీల్డ్ కరెక్ట్’ అని దారి చూపారు. అప్పటికే నేను ‘మంచుపల్లకి’, ‘కర్మసాక్షి’ నవలలు రాశా. వాటిని తీసుకుని దర్శకుడు విక్టరీ మధుసూదనరావు గారి దగ్గరకు వెళ్తే టెస్ట్ పెట్టారు.

లూయిస్ గిల్‌బర్ట్ తీసిన ‘ఫ్రెండ్స్’సినిమా మద్రాసు కేజినో థియేటర్‌లో ఆడుతోంది. దాన్ని పదిసార్లు చూసి వన్‌లైన్ ఆర్డర్ వేసుకురమ్మన్నారు. నేను ఒక్కసారి చూసి రాసి తీసుకువెళ్ళా. ఆయనకు నచ్చి‘ఎదురీత’ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా తీసుకున్నారు. నా తొలి క్లాప్ ఎన్టీఆర్‌గారిపై కొట్టాను. ఆ తర్వాత ఏయన్నార్ ‘విచిత్ర జీవితం’కు పని చేశా. ఇలా ఓ 10, 15 సినిమాలు చేశా. అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా ఆఖరి సినిమా ‘సీతాకోక చిలక’.

మీరు కె.విశ్వనాథ్, భారతీరాజా… ఇద్దరి దగ్గర పని చేశారు కదా. కానీ మీపై భారతీరాజా ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది?
వంశీ: నేనాయన్ని అంతగా ప్రేమించాను కాబట్టి. అయితే మొదట్లోనే ఆయన ముద్ర నాపై ఉండేది. తర్వాత తర్వాత నాకంటూ ఓ శైలి ఏర్పడింది.

ఈ మధ్యకాలంలో మీ గురువులను కలిసారా?
వంశీ: ఆ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు రేణిగుంట ఎయిర్‌పోర్టులో విశ్వనాథ్‌గారు కనిపించారు. అయితే ఆయన నన్ను మరిచిపోయినట్టున్నారు. గుర్తుపట్టలేదు. భారతీరాజాగారు ఆమధ్య హైదరాబాద్‌లో దర్శకుల సంఘం సమావేశానికి వస్తే వెళ్ళి కలిశాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. నేనంటే ఆయనకిష్టం. ఆయనంటే నాకు ప్రాణం.

మీ పాటలు విన్నా, షాట్స్ చూసినా ఇది వంశీది అని సులువుగా తెలిసిపోతుంది. అలా మీకంటూ ఓ ప్రత్యేకతను ఎలా సంపాదించుకోగలిగారు?
వంశీ: ప్రతి కళాకారునికీ తనకంటూ ఓ సిగ్నేచర్ ఉండాలని ఓ రచయిత్రి ఓ పుస్తకంలో రాశారు చిన్నతనంలోనే ఆ కొటేషన్ నాపై గాఢ ముద్ర వేసేసింది. నేను వివిధ బాషల్లో చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, వెళ్లిన ఆర్ట్ ఎగ్జిబిషన్లు, నాకిష్టమైన చిత్రకారులు పద్మశ్రీ బాపుగారు గీసిన బొమ్మలు…ఇవన్నీ కలబోసి నాకంటూ ఓ సిగ్నేచర్ ఏర్పడిందేమో!

అయితే ఒకటే శైలిలో వెళ్ళడం వల్ల మీ సినిమాల్లో కూడా ఓ మొనాటనీ వచ్చినట్టుంది. గమనించారా?
వంశీ: నిజమేనేమో… ఎందుకంటే ఈ మాట చాలామంది అన్నారు. ఇప్పుడు నా శైలి మార్చే ప్రయత్నంలో ఉన్నాను.

మీ సినిమాల్లో పాత్రలు కొంచెం టిపికల్‌గా ఉంటాయి. వాటినెలా సష్టిస్తారు?
వంశీ: జీవితం నుంచే. మన చుట్టూ సమాజంలో బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి. వాటినే సంగ్రహిస్తుంటాను.

కానీ, మీరెవ్వరితోనూ కలవరు కదా?
వంశీ: కలవకపోవడానికి, చూడ్డానికి సంబంధం లేదు కదా. కళ్లుంటే చాలు.

బాపు రమణలంటే మీకు బాగా ఇష్టమట?
వంశీ: ఇష్టం కాదు. మహాభక్తి. వాళ్ళ దగ్గర పని చేయకపోయినా నేను ఈ ఇండస్ట్రీలో ఎక్కువసార్లు ఎవరినన్నా కలిశానంటే అది వాళ్ళనే. బాపుగారి బొమ్మలు నా దగ్గర బోలెడంత కలెక్షన్ ఉంది. వందల్లో కాదు… వేలల్లోనే. వాటిని రోజూ చూస్తే ఉంటే అదొక ఎనర్జీ నాకు.

మీ దగ్గర బుక్స్, వీడియోస్ కలెక్షన్ కూడా ఉందట?
వంశీ: అవును. పదివేల సినిమా డీవీడీలు, చాలా పుస్తకాలుఉన్నాయి. హార్డ్‌డిస్కుల్లో అయితే బోలెడెంత మ్యూజిక్ కలెక్షన్ ఉంది. ఎక్కువ సింఫనీస్, త్యాగరాయకతులు, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నాయి.

చదివేంత… వినేంత… చూసేంత తీరిక మీకుందా?
వంశీ: బయట పనులు పెట్టుకోపోవడం వల్ల నాకు బోలెడంత టైమ్ దొరుకుతుంది. ఇక మొబైల్ ఫోన్ కూడా నేను పెద్దగా వాడను. చాలా మంది పని ఉన్నా, లేకున్నా గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేసుకుంటుంటారు. నాకు రోజులో చాలా తక్కువ కాల్స్ వస్తుంటాయి. అందుకే నాకు టైమ్ వేస్ట్‌కాదు. ఆ టైమ్‌లో పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా. మ్యూజిక్ వింటా.

మీ ఆత్మకథ రాసుకునే ఉద్దేశం ఉందా?
వంశీ: ఛీఛీ.. ఆత్మకథ రాసుకునేంత గొప్పవాణ్ణి కాదు.

ఓ హీరోయిన్ ఆత్మకథ రాస్తానని అప్పుడెప్పుడో చెప్పారు. దాని సంగతేంటి?
వంశీ: చెప్పానా? నాకైతే గుర్తులేదు. ఏ మూడ్‌లో, ఏ సందర్భంలో చెప్పి ఉంటానో!

ఓ దశలో మీరు సినిమా ఫీల్డ్ వదిలేసి యానాం వెళ్ళిపోయారు. ఎందుకని?
వంశీ: అప్పుడు నాకు సినిమాలు చేయబుద్దేయలేదు. ఏదో ఒక డిప్రెషన్. మద్రాసులో ఉండాలనిపించలేదు. మా ఫ్యామిలీ అంతా యానాం వెళ్ళిపోయాం. అక్కడికెళ్లగానే నాకు మలేరియా ఎటాకైంది. తర్వాత జాండిస్‌లోకి దిగింది. కాకినాడ సాలిపేటలో ఒక హాస్పిటల్లో కొన్నాళ్ళు కోమాలో ఉండి చచ్చిబతికాను.

అప్పుడు ఇండస్ట్రీవాళ్ళు వంశీకి పిచ్చెక్కిందని రకరకాలుగా అనుకున్నారు. నేనవేవీ పట్టించుకోకుండా హాయిగా నాకిష్టమైన చోటుకల్లా తిరిగేసేవాణ్ణి. కాకినాడ వెళ్ళి సినిమాలు చూసేవాణ్ణి. అమలాపురం,పెదబ్రహ్మదేవం ప్రాంతాల్లో పరిషత్తు నాటకాల పోటీలకు వెళ్ళొచ్చేవాణ్ణి. అక్కడే కొండవలస లక్ష్మణరావు. ద్రాక్షారామం సరోజ పరిచయమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసి ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. తర్వాత మీకు తెలిసిందే.

మీలో మంచి సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు కదా. ఎందుకు కంటిన్యూ కావడం లేదు?
వంశీ: ‘జోకర్’ సినిమా కోసం నిర్మాత గొట్టిముక్కల పద్మారావుగారు చేయమంటే ఫస్ట్‌టైమ్ మ్యూజిక్ చేశా. ఆ తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంతో వచ్చిన ‘కన్నయ్య-కిట్టయ్య’కు చేశాను. ఒక్క ఇళయరాజా మినహాయిస్తే, నేను ఏ సంగీత దర్శకునితో పనిచేసినా నా సహకారం కొంత ఉంటుంది. అయితే నాకిప్పుడు మ్యూజిక్ చేయాలన్న ఆలోచన లేదు.

సంగీతం నేర్చుకున్నారా?
వంశీ: మద్రాసులో ఉన్నప్పుడు సముద్రాల అనే ఆయన దగ్గర కర్ణాటిక్ వోకల్ నేర్చుకున్నాను. అది కొన్ని నెలలు.

ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా?
వంశీ: ‘మనుషులు-మట్టిబొమ్మలు’ సినిమాలో ఓ అద్భుతమైన డ్యూయెట్ ఉంది. దాన్ని ఫ్లూట్‌పై ప్లేచేసేవాణ్ణి. కొంతకాలం హార్మోనియం ప్రాక్టీస్ చేశాను. ఈ మధ్య నాకు బాగా ఆప్తులైన ఎత్నిక్ వెంకట్రావ్‌గారు కీబోర్డ్ గిఫ్ట్ ఇచ్చారు. తెల్లవారు జామున లేచి దాంతో ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను.

కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్‌తో సినిమాలు చేయాలనుకుని, ఎందుకు వదిలేశారు?
వంశీ: కమల్‌హాసన్‌తో నా దర్శకత్వంతో సినిమా చేయాలని స్రవంతి రవికిషోర్‌గారు, ‘తమ్ముడు’ సత్యం,సాయిబాబా చాలా ముచ్చటపడ్డారు. కమల్‌ని కూడా కలిశాం మేం. నేనో కథ చెప్పాను. అది నా మొట్టమొదటి కథ. కమల్ ఏడాది వరకూ డేట్స్ లేవనడంతో అది అలా ఆగిపోయింది. వెంకటేశ్‌తో‘గాలికొండపురం రైల్వే గేట్’ సినిమా అనుకున్నాం. పాటల రికార్డింగ్ కూడా చేశాం. లతా మంగేష్కర్ రెండు పాటలు పాడారు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయిపోతుందని వెంకటేశ్ ఆఖరి నిమిషంలో చేయనన్నారు. నాగార్జునది కూడా ఇలాగే ఏదో జరిగింది.

రాజేంద్రప్రసాద్, భానుప్రియతో ఎక్కువ సినిమాలు చేశారు కదా… వాళ్ళతో మీ అటాచ్‌మెంచ్ ఎలా ఉండేది?
వంశీ: అంతా ప్రొఫెషనల్ ఎటాచ్‌మెంటే.

అప్పట్లో మహేశ్‌బాబు, డింపుల్ కపాడియా కాంబినేషన్‌లో ‘నళినీ ఆంటీ… నీకు ఫోనొచ్చింది’ సినిమా ప్లాన్ చేసినట్టున్నారు?
వంశీ: అప్పుడు కష్ణగారిని అడిగాం. మహేష్ చదువుకుంటున్నాడని ఇప్పుడు వద్దన్నారు.

మరి కష్ణగారితో సినిమా ఎందుకు చేయలేకపోయారు?
వంశీ: కుదర్లేదు. ‘గూఢచారి 116’ ఎన్నిసార్లు చూశానో. దాంతోనే ఆయనకు ఫ్యాన్ అయిపోయా. ఆ విషయం కష్ణగారికి చెప్పాను కూడా.

మీ తొలి కథానాయకుడు చిరంజీవితో మళ్ళీ సినిమా చేయలేదెందుకని?
వంశీ: అవకాశం రాలేదు.

క్లాస్, మాస్ కమర్షియల్, ఆర్ట్… ఇలా సినిమా గురించి చాలా వర్గీకరణలు చెబుతుంటారు. మరి మీ దష్టిలో సినిమా అంటే?
వంశీ: బాగా ఆడే సినిమా, ఆడని సినిమా… అంతే తేడా. నేను చాలా కాలంగా ఓ ఆర్ట్ సినిమా చేయాలనుకుంటున్నా. మొన్నీమధ్య కూడా కష్ణభగవాన్‌తో చేద్దామనుకున్నా. కుదర్లేదు. ఎప్పటికైనా చేయాలి. దానికి మ్యూజిక్ కూడా నేనే చేసుకుంటాను.

కేవలం 17 మంది టెక్నీషియన్లతో సినిమా చేసే ఆలోచన ఉందట. నిజమేనా?
వంశీ: దానికో స్కీమ్ ఉంది. ఎప్పటికైనా చేస్తాను. ఫారిన్ వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది యూనిట్‌తో పాటలు తీయడం లేదా? ఇదీ అంతే. అదేం పెద్ద గగనం కాదు.

పాపికొండల దగ్గర సెట్స్ వేసి జానపద సినిమా చేయాలని ఉందని అప్పట్లో చెప్పారు. ఏమైంది?
వంశీ: చేస్తే చాలా బావుంటుంది. అవకాశం వస్తే మాత్రం చేస్తాను. చేస్తే మాత్రం అద్భుతం అవుతుంది.

మీరు కథలు రాసే పద్ధతి ఏ తీరులో ఉంటుంది?
వంశీ: ఏదో ఒక లైన్ అనుకుంటాను. రాస్తున్నప్పుడే డెవలప్ చేసేస్తాను. ఒక్కోసారి రెండుగంటల్లో కథ రెడీ అయిపోవచ్చు. ఇంకోసారి చాలా రోజులు పడుతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. నా అభిమాన రచయితలు కాళీపట్నం రామారావు, అల్లం శేషగిరిరావు. వాళ్ళు రేర్‌గా రాస్తారు. రాస్తే చాలా అద్భుతంగా ఉంటాయి కథలు, అల్లం శేషగిరిరావు ‘చీకటి’ కథ చదవండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో.

సుప్రసిద్ధ రచయితల కథలు చదివి ఎప్పుడైనా సినిమాగా చేయాలని అనుకున్నారా?
వంశీ: అల్లం శేషగిరిరావు గారి ‘చీకటి’ చదివినప్పుడు మాత్రం సినిమాగా చేయాలనిపించింది. ఆయనక్కూడా ఉత్తరం రాశాను. అయితే ఆర్ట్ ఫిల్మ్ చేద్దామంటే నిర్మాతలు అంత సుముఖంగా ఉండరు కదా.

మీకెప్పుడైనా నాటకం రాయాలనిపించిందా?
వంశీ: రాయాలని లేదు కానీ, నాటకం డెరైక్ట్ చేయాలని ఉంది. నా సన్నిహితుడైన వెంకట్రావు గారిని హీరోగా పెట్టి ఆ నాటకం చేద్దామని ఉంది.

సినిమా మీకిష్టం లేదు. అయినా మంచిదర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. హాస్యం ఇష్టంలేకున్నా కామెడీలో ట్రెండ్ సెట్ చేశారు. మరి మీకిష్టం అనిపించి చేసే పనులేంటి?
వంశీ: మనం ఏం చేసినా క్రియేటివ్‌గా చేయాలనే పద్ధతిని నమ్ముతాను. నిజంగా నాకు సినిమాలంటే ఇష్టంలేదు. కానీ ఈ ఫీల్డ్‌కొచ్చాను. వచ్చాక బతుకు పోరాటం చేయాలి. దానికి మనకంటూ ఓ సొంత దస్తూరి, ముద్ర కావాలి. ఆ ప్రయత్నమే చేశాను. అలాగే నాకు కామెడీ ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే నా జీవితంలోనే కామెడీ లేదు. నా కెరీర్ తొలినాళ్లలో చేసిన మంచుపల్లకీ, సితార, అన్వేషణ …కామెడీ ఫిల్మ్స్ కావు. ‘లేడీస్ టైలర్’ తర్వాత కామెడీ వైపు టర్న్ కావాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో నేను‘లేడీస్ టైలర్’ చేసి ఉండకపోతే నా మార్గం వేరేలా ఉండేదేమో. అయినా బతకాలి కాబట్టి చేసుకుంటూ వెళ్లిపోతున్నాను.

గోదావరి అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎందుకంత ఇష్టం?
వంశీ: అమ్మంటే ఇష్టం ఎందుకనడిగితే ఏం చెప్తారు…నాకు గోదావరి కూడా అంతే! ఈత కొట్టడం రాదుకానీ,గోదావరిలో నేను మునిగినన్నిసార్లు ఇంకెవరూ మునిగి ఉండరు.

vamsi1

మీకిష్టమైన వంటకం?

వంశీ: అదీ ఇదనీలేదు. నేను ‘స్వాతి’ వీక్లీలో ‘శ్రీసీతారామా లాంచీ సర్వీస్, రాజమండ్రి’ పేరుతో ఓ నవలిక రాశాను. దాంట్లో మొక్కజొన్నపొత్తు వంటకం గురించి రాశా. దానికి మసాలా రాసి, నెయ్యితో కాలుస్తారు. అది చదివి అందరూ ట్రై చేశారు. నాకు అన్ని రుచులూ తెలుసు. అయితే ఇప్పుడు తగ్గించేశా. మొన్న చేవెళ్ళ వరకూ కారులో వెళ్లి ఓ చిన్న ఉడిపి హోటల్‌లో భోజనం చేశా. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. అలాగే ఖమ్మం వెళ్ళే దారిలో కూసుమంచి అగ్రహారం అనే పల్లెటూళ్లో నాగయ్య హోటల్ ఉంది. అక్కడ 26రకాల కూరలతో భోజనం పెడతారు. నేను రెగ్యులర్‌గా వెళ్తుంటాను. ఇంతా చేసి రూ. 40 మాత్రమే. అంతా వెజిటేరియన్నే. ఖమ్మం దాటాక వైరావెళ్ళే రోడ్డులో కల్లూరులో ‘ఇదే చౌదరి మిలట్రీ హోటల్’అనిఉంటుంది. అక్కడ గోంగూర బాగుంటుంది. చికెన్, ఫిష్ కూడా. వాళ్లకు రెండు చెరువులున్నాయి. అందులో చేపలతోనే పులుసు చేస్తారు. నిజంగా అమతమే. అక్కడ భోజనం చేయడానికి అప్పుడప్పుడూ వెళ్లొస్తుంటాను. ఆత్రేయపురంలో కష్ణంరాజు గారి హోటల్ బావుంటుంది. అన్నవరం నుంచి తుని వెళ్లే దారిలో తూటిగుంట హోటల్లో ఫుడ్ బావుంటుంది.

సమాజంలో బోలెడన్ని జరుగుతుంటాయి. స్పందిస్తారా? లేక తామరాకుమీది నీటిబొట్టులాగా ఉంటారా?
వంశీ: ఎందుకు స్పందించను. అయితే దాని గురించి స్పీచ్‌లు ఇవ్వాలని, సినిమాలు తీయాలని మాత్రం అనుకోను. అప్పుడప్పుడు యదార్థ సంఘటనలతో కొన్ని కథలు రాశాను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చంటి పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది అడుక్కుంటుంటారు. ఆ పిల్లల్ని ఎక్కడో అద్దెకు తెస్తారని, వాళ్ళకి నల్లమందు ఇచ్చి పడుకోబెడతారని తెలిసి ‘రోడ్‌షో’ అనే కథ రాశాను. నేను, సుభాష్ అనే ఆర్టిస్టు కలిసి కొంతమందిని ఇంటర్వ్యూ చేశాం.

వందసార్లు ‘షోలే’, ‘దొంగరాముడు’ చూస్తే ఎవరైనా డెరైక్షన్ చేసేయొచ్చని చెబుతుంటారు. నిజమేనా?
వంశీ: ఎందుకు చేయలేరు. నాకు తెలిసి తెలుగులో వచ్చిన అత్యంత గొప్పసినిమా ‘దొంగరాముడు’. ఇక‘షోలే’ గురించి చెప్పక్కర్లేదు. ఈ రెండు గొప్ప స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలే. ఆ రెండూ చూస్తే సినిమా తాలూకు లోతుపాతులన్నీ తెలిసిపోతాయి.

– పులగం చిన్నారాయణ

**********

మీ సినిమాల్లో కథానాయికలంతా పెద్ద కాటుక కళ్ళు, చామన ఛాయ, నేత చీరలతో ఎక్కువ కనిపిస్తారెందుకని?
నా రెండో సినిమాలో యాక్ట్‌చేసిన హీరోయిన్‌వి (భానుప్రియ) కొంచెం పెద్ద కళ్ళు, చామన ఛాయ. తనతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అందరికీ ఆ ఫీలింగ్ అలా ఉండిపోయినట్టుంది. కానీ నిజంగా దీనికో ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. నా టీనేజ్‌లో ఓ సారి వాల్తేరు-కిరండోలు పాసింజరెక్కా. నిజానికదో బొగ్గు తీసుకెళ్లే గూడ్సు. దానికి నాలుగు పాసింజర్ బోగీలు తగిలించారు. బొడ్డవర స్టేషన్ తర్వాత టన్నెల్స్ దాటాక తైడ అనే చిన్న స్టేషనొస్తుంది. అక్కడంతా ట్రైబల్స్ ఉంటారు. ఓ గ్రూపు నేనున్న పెట్టెలోకి ఎక్కారు. అందులో ఓ అమ్మాయి. బాగా ఛామన ఛాయ, పెద్ద కళ్లు, పెద్దబొట్టు, పెద్ద జడ. ఒరియాలో పాట పాడ్డం మొదలెట్టింది. అందరూ ముగ్ధులైపోయి డబ్బులిచ్చారు. నేనూ జేబులోంచి రూపాయి తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి గుప్పిట గట్టిగా మూశా. పెద్దగా నవ్వింది. ఆ నవ్వు, ఆ రూపం ఎప్పటికీ మర్చిపోలేకపోయా. ఆ ప్రభావమే నా కథానాయికలపై పడింది.

మీరు అప్పట్లో చాలా గ్లామరస్‌గా ఉండేవారట. మిమ్మల్ని హీరోగా చేయమని ఎవ్వరూ అడగలేదా?
ఒకరిద్దరు అడిగారు. ఏదైనా చేస్తాను కానీ, సినిమాల్లో వేషాలు మాత్రం వేయనన్నాను.

మీ టైటిల్స్‌పై ‘వంశీ’ అని ట్యాగ్ పెట్టుకోవడం ఎప్పటినుంచి మొదలైంది?
‘ఆలాపన’ సినిమా టైమ్‌లో కాకినాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ లోగో రాసిచ్చాడు. అది అందరికీ బాగా నచ్చేసింది. టైటిల్‌పై నా పేరు ఉంటుంది. అప్పటినుంచీ ఆ పద్ధతినే అనుసరిస్తున్నాను.

***********

వంటల పుస్తకం రాస్తా…
ఇష్టపడే ప్రదేశాలు – తిరువణ్ణామలై, అరకులోయ.

ఇష్టమైన డైలాగ్ రైటర్ – త్రివిక్రమ్! గంధం నాగరాజు (బతికుంటే) మంచి డైలాగులు రాసేవారు.

వంటల గురించి – మంచి ఆసక్తి ఉంది. నాకు చాలా వంటలొచ్చు. పుస్తకం రాసే ఆలోచన కూడా ఉంది.

గాడ్జెట్స్ గురించి – లేటెస్ట్ ఆప్స్, డౌన్ లోడ్స్ చేస్తుంటాను. ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్ కూడా ఉన్నాయి.

పామాణికమైన సినిమా – దొంగరాముడు. అంత పర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‌ప్లే చేశారు కేవీరెడ్డిగారు!

ఇష్టమైన హీరోయిన్స్ – సావిత్రి, జయంతి, వెన్నిరాడై నిర్మల, కష్ణకుమారి.

ఫేవరేట్ మ్యూజిక్ డెరైక్టర్ – ఓన్లీ ఇళయరాజా!

ఇష్టమైన పాట – ‘పుట్టింటి గౌరవం’లో తాగు…మనసైతే తాగు… వీల్లేకుంటే విషం తాగు.. మధువు మత్తెక్కిస్తుంది… విషం గట్టెక్కిస్తుంది’ పాట. ఆత్రేయగారు గొప్ప ఫిలాసఫీ చెప్పారు.

ఈ మధ్య చదివిన పుస్తకాలు – చివటం అమ్మ, వెంకయ్యస్వామి, రాకలపాటి గురువుగారు, టిబెట్‌యోగి మిలారేపా చరిత్ర, శ్రీ ఆనందమాయి అమ్మ… ఇలా గొప్పగొప్ప మహానుభావుల ఆత్మకథలు!

పిల్లల గురించి- ఇద్దరమ్మాయిలు. శ్రుతి, శైలి.

శ్రావణ చంద్రులు

‘నీ నగుమోమే ఎక్స్‌ట్రార్డినరీ…’ అని
హేమచంద్ర అందుకుంటే…‘మంచి పిల్లాడివి నువ్వూ…’ అంటూ
కితాబులిచ్చేసింది శ్రావణభార్గవి.

ఇద్దరూ సింగర్సే!
నాలుగేళ్లు స్నేహితులుగా, ప్రేమికులుగా ఉన్న ఈ జంట
మూడు నెలల క్రితం వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ఒకే వృత్తిలో కొనసాగుతున్న తమ మధ్య చిగురించిన ప్రేమ, పెళ్లి…
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక తమలో
చోటుచేసుకున్న మార్పులు… వీటి గురించి…
హైదరాబాద్ మాదాపూర్‌లోని సొంత ఇంట్లో
నవ్వుల విరిజల్లుల మధ్య ఆనందంగా వివరించింది
ఈ కొత్త జంట.

hema1

ప్రేమికులైన మీరు ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు (ఫిబ్రవరి 14, 2013) ముహూర్తం మీరే సెట్ చేసుకున్నారా?! అని అడిగితే- ‘‘అనుకోకుండానే అలా సెట్ అయ్యింది. సెట్ కాదేమో అని అప్పుడు మేం పడిన టెన్షన్ చూడాలి. ఇప్పటికీ ఆ సీన్ గుర్తుకొస్తే నవ్వాపుకోలేం’’ నవ్వుతూ అన్నారు హేమచంద్ర. శ్రావణభార్గవి నవ్వుతూనే …‘‘ఏ ఒక్క విషయంలోనూ మాకు మ్యాచ్ కాదు.

అలాంటిది జాతకాలు మ్యాచ్ అవుతాయా?! అని మాకే పెద్ద డౌట్. మొత్తానికి మ్యాచ్ ఓకే అయ్యింది’’ఎందుకు టెన్షన్‌పడ్డారో నవ్వుతూనే అసలు విషయం చెప్పారు శ్రావణభార్గవి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి నందననామ ఉగాదికి నాలుగేళ్లయ్యింది. ఆ ప్రేమ గురించి హేమచంద్ర చెబుతూ…

‘‘మొన్నే భార్గవిది పాత ఫొటో ఒకటి చూసి, ‘ఏం చూసి లవ్ చేశానబ్బా’ అనుకున్నా!!’’ అంటూ శ్రావణభార్గవి వైపు చూసి నవ్వారు. ‘‘రికార్డింగ్‌లో చూసినప్పుడు లుక్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కాలేజీ దగ్గర చూసినప్పుడు టైట్‌గా జుట్టు కట్టేసి… ఇంకా డిఫరెంట్‌గా కనిపించింది.

ఆ తర్వాత కలిసి మాట్లాడినప్పుడు ఇంకాస్త డిఫరెంట్… బాప్‌రే మూడు షాక్‌లిచ్చింది. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను!’’ అంటుంటే ఆ మాటలకు… శ్రావణభార్గవి పడీపడీ నవ్వుతూనే… ‘‘ఉగాదిరోజు సాయంత్రం రికార్డింగ్‌కి వెళ్లాను! అక్కడే ఫస్ట్‌టైమ్ చందూని చూశా! ‘బోణీ’ సినిమాకు పాట పాడి వచ్చేశాను. మరుసటిరోజు పొద్దున్నే ‘సాంగ్ బాగుంది’ అని మెసేజ్ వచ్చింది. రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పటికో‘థాంక్యూ’ అని ఇచ్చాను! ’’

భార్గవి మాటలను హేమచంద్ర కొనసాగిస్తూ… ‘‘తర్వాత మెసేజ్ ఇంకేం ఇవ్వాలో తోచలేదు. ఆడియో రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. రేపు రిలీజ్ అనగా ఫోన్ చేస్తే ‘మానాన్నతో మాట్లాడండి’ అంది. అలా మొదలు… మెల్లగా మాట్లాడుతూ మాట్లాడుతూ లవ్ అని రియలైజ్ అయ్యాను.

అసలు విషయం చెబితే ‘అప్పుడే చెప్పద్దు.. చెప్పద్దు ప్లీజ్! ఇంకా టైమ్ ఉంది’ అంటూ దాటేసింది. కాని నేను వింటానా… మన్మథుడు సినిమాలో డైలాగ్‌లాగ… మొదట నేను తనను ప్రేమించాను. తర్వాత తను నన్ను ప్రేమించాల్సి వచ్చింది’’ మాటలు, నవ్వులతో వారి కబుర్లు సెలయేరులా పరవళ్లు తీశాయి. సంగీతం తనకు స్వతహాగా అబ్బిన కళ అని వివరించారు శ్రావణభార్గవి.

హేమచంద్ర తల్లి శశికళ సంగీతంలో డిప్లమా చేశారు. ఆమె నేర్పిన సంగీత పాఠాలే తనను గాయకుడిని చేశాయి… అన్నారు హేమచంద్ర. భార్గవి ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్… కెరియర్ మొదట్లోనే ఉండటంతో ప్రేమ,పెళ్లి అంటే ఇబ్బందులు పడతామేమో అనీ, ఒకే వృత్తిలో ఉంటే ఈర్ష్య, అసూయలు తమ మధ్య రాజ్యమేలుతాయేమోనన్న భయాన్నీ మొదట్లో చవిచూశామని వివరించారు ఇద్దరూ- ‘‘అందుకే ఇద్దరం కలిసి కొన్ని ప్రోగ్రామ్‌లు చే శాం.

ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకున్నాం, అంతా బాగానే ఉందనుకున్నాక ఇంకో అడుగు వేయవచ్చు అని డిసైడ్ అయ్యాం’’ శ్రావణి చెబుతుంటే హేమచంద్ర ‘‘సంగీతపరంగా ఇద్దరి టేస్ట్ ఒకటే! కాని మిగతావేవీ మా ఇద్దరికీ మ్యాచ్ కాలేదని అర్థం చేసుకున్నాం. నాకు పిజ్జా, బర్గర్‌లంటే ఇష్టం. తను పప్పు, సాంబార్ అన్నం… అంటుంది. ఒక్కటేమిటి కలర్స్ నుంచి కాంబినేషన్ దాకా అంతా రివర్సే! నాలుగేళ్లుగా సరదాగా కొట్టుకుంటూ, గిల్లుకుంటూనే అడ్జెస్ట్ అయిపోయాం’’ పెద్దగా నవ్వుతూ వివరిస్తుంటే, శ్రావణి మరిన్ని సరదా విషయాలు పంచుకున్నారు. శ్రావణిని కలవడానికి తెగ ముస్తాబై వెళ్లేవాడినని, చొక్కాలు విపరీతంగా మార్చేవాడినని,

తనలో వచ్చిన మార్పు చూసి ఇంట్లో వారికి సందేహం వచ్చిందని చెప్పారు హేమచంద్ర. ఫోన్లు,చాటింగ్‌లతో గంటలుగంటలు గడుపుతుంటే తమ ఇంట్లోనూ విషయం అర్థమై ఇరువైపులా మాట్లాడేసి,పెళ్లి ఫిక్స్ చేశారని చెప్పారు శ్రావణి. ఎవరి ప్రాక్టీస్ వారిదే!’ అంటూ తమ కాపురంలోని సంగీత గమకాలనూ సరదాగానే వివరించారు ఇద్దరూ!

‘‘పెళ్లినాటికే ప్రోగ్రామ్స్, సాంగ్స్… అంటూ చాలా బిజీగా ఉన్నాం. రికార్డింగ్స్ వల్ల ఇప్పటికీ ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుతుంటాం. ఒక్కోసారి విడివిడిగా ప్రోగ్రామ్స్ కోసం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపూ మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడమే ఉంటుంది తప్ప, పాటల గురించి ఊసే ఉండదు. సింగిల్‌గా ఎవరి ప్రాక్టీస్ వారిదే! ఒక్కడినే ఉంటే మాత్రం శ్రావణి పాడిన పాటలు వింటుంటాను!

తను పాడిన వాటిలో ‘నువ్వు మంచి పిల్లాడివి…’ అనే పాట నాకోసమే అన్నట్టు ఉంటుంది. అలాగే ‘జ్వరం వచ్చింది…’ పాటలో శ్రావణి వాయిస్ భలేగా నచ్చుతుంది. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో కోపం వచ్చి గొడవపడాలనుకుంటాం. ఆ గొడవకు బదులు ఇంకేదో గుర్తుకువస్తుంది. ఇద్దరం అంత పెద్ద గజినీలం అన్నమాట. దాంతో అసలు గొడవ ఎక్కడికో వెళ్లిపోతుంది. యాంకరింగ్ చేసేటప్పుడు కూడా కో-ఆర్డినేషన్ మాకు అస్సలు కుదరదు.

అక్కడా గొడవపడుతుంటాం’’ అంటూ హేమచంద్ర చెబుతుంటే ‘‘ఎక్కడైనా నేను మాట్లాడుతుంటే చందూ వింటూ ఉంటాడు. గుడ్ లిజనర్. అంతకు మించి గుడ్ సింగర్! హేమూ పాడిన ‘ప్రేమ దేశపు యువరాణి…’అనే పాట నాకోసమే పాడినట్టుగా ఉంటుంది’’ అని చెబుతున్న శ్రావణి మాటలను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు హేమచంద్ర.

పెళ్లి తర్వాత మార్చుకున్న పద్ధతుల గురించి హేమచంద్ర – ‘‘రికార్డ్ సెషన్‌లో గమకాల విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. తను చాలా డిఫరెంట్. మొదట్లో చెప్పేవాడిని. అయితే ఆ విషయాన్ని సరిగా కన్వే అయ్యేది కాదు. దీంతో కన్‌ఫ్యూజన్ చేయడం ఎందుకు? అని నేనే మానుకున్నాను’’ అని చెబుతుంటే‘‘నాలో మాత్రం విపరీతమైన బద్దకం వచ్చేసింది. అదే పెద్ద మార్పు!’’ అంటూ గలగలా నవ్వేశారు శ్రావణి.మంచి మంచి పాటలు పాడుతూ, సరదాగా, నవ్వుకుంటూ ఇలా ఉండిపోతే చాలు… అని చెప్పిన ఈ కొత్తజంట ఆకాంక్ష తప్పక ఫలించాలని కోరుకుందాం.

ఒకరినొకరు సరదాగా ఇంటర్వ్యూ చేసుకోండి అని అడిగినప్పుడు…
శ్రావణభార్గవి: హేమచంద్రగారూ! మీకు రీసెంట్‌గా పెళ్లయింది కదా! పెళ్లికి ముందు మీ లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలనుకున్నారు.
hema2
హేమచంద్ర: అంటే జనరల్లీ, బోలెడు ఊహించుకుంటాం. కాని అన్నీ జరగవు కదా! (ఈ క్వశ్చన్ ఇప్పటికే ఎన్నోసార్లు… మళ్లీ అడుగుతుంది చూడండి)

శ్రా.భార్గవి: ఇప్పుడు ఎలాంటి ఆవిడ వచ్చిందనుకుంటున్నారు?
హేమచంద్ర: ఏదో… 70 టు 80 పర్సెంట్ క్యాండిడేట్ అంతే! (ఇది రాశారంటే ఇద్దరం మళ్లీ గొడవలు పెట్టుకుంటాం)

హేమచంద్ర: శ్రావణిగారూ! మ్యారేజ్ తర్వాత గర్ల్స్‌కి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి.

శ్రా.భార్గవి: చాలా ఉన్నాయి. రోజూ పొద్దున్నే మా ఆయన 5 గంటలకు లేచి, కాఫీ కలిపి నన్ను నిద్ర లేపి ఇవ్వాలి. తర్వాత వంటచేసి, లంచ్‌టైమ్‌కి పిలిచి, సాయంత్రం షాపింగ్‌కి తీసుకెళ్లి, క్రెడిట్‌కార్డ్ ఇచ్చి పండగ చేసుకో అనాలి…

హేమచంద్ర: ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇక క్రెడిట్ కార్డ్ ఎక్కడ నుంచి వస్తుంది…)
శ్రా.భార్గవి:: వర్క్ ఫ్రమ్ హోమ్! ఆ ఫెసిలిటీ పెట్టింది మీలాంటి వారికోసమే! చేయాలనుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి.

హేమచంద్ర: మరి, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా ఉంటున్నాడా మీ ఆయన?!
శ్రా.భార్గవి: ఏం చెబుతాం లెండి, పీత బాధలు పీతవి. పెళ్లయిపోయాక ఇక ఏం చేయగలుగుతాం,సర్దుకుపోవడం తప్ప. అవన్నీ తలుచుకోవడం ఎందుకులెండి.
హేమచంద్ర: సో సారీ అండీ! మీకు చాలా అన్యాయం జరిగినట్టుంది.
శ్రా.భార్గవి: ఏం చేస్తాంలెండి! ఏదో ఇలా అడ్జెస్ట్ అయిపోతాను.. (నవ్వులే నవ్వులు)

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు — భువనచంద్ర

ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం‘ ‘అందమైన భామలు లేత మెరుపు తీగలు…‘ ‘గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట‘ వంటి హిట్ పాటలు విన్నప్పుడు ఆ పదాల అర్థాల్లో పడి వాటిని రాసిన భువనచంద్ర గురించి కాసేపు మర్చిపోతాం. మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు చింతలపూడి‘ అంటున్నారు భువనచంద్ర.

ఏలియ మాస్టారు బడిపేడ చెప్పులుచిన్నప్పటి సంపాదన,మొదట చేసుకున్న పెళ్ళిళ్లుఊళ్లో కురిసిన వాన మొదలుకొని ఊరివారి నుంచి నేర్చుకున్న విలువైన జీవిత పాఠాలను కూడా వివరిస్తున్నారాయన. భువనచంద్ర చెబుతున్న తన సొంతూరు చింతలపూడి విశేషాలు…. 
bh1
ఊరి గురించి చెప్పేముందు తమ్మిలేరు గురించి చెప్పాలి. తమ్మిలేటికి ఇవతలవైపు కృష్ణా జిల్లాఅవతలవైపు పశ్చిమగోదావరి జిల్లా. మా పూర్వీకులదినేను పుట్టిందీ కృష్ణా జిల్లాలోని గుళ్లపూడి గ్రామమే. ఆ ఊళ్లో ఉన్న రెండొందల కుటుంబాలూ మా చుట్టాలూపక్కాలేఅందరూ కరణాలే. మా ఇంటిపేరే ‘ఊరకరణం‘. మా తాతగారి సమయంలో పన్నెండొందల ఎకరాలుమా నాన్నకు వచ్చేసరికి మూడొందల ఎకరాలు ఉండేవని విన్నాను. స్వాతంత్య్రానికి పూర్వం మా నాన్న సుబ్రమణ్యేశ్వర శర్మ ఊరికి సర్పంచ్‌గా పనిచేశారట. దానిలో విశేషమేమీ లేదుగానీమా అమ్మ చంద్రమౌళీశ్వరీదేవి కూడా గ్రామపెద్దగా పనిచేయడమే చెప్పుకోవలసిన సంగతి.

అప్పట్లో ఆమె ఐదారు తరగతులు చదువుకున్నదేమో. అయినా మంచి గొంతుతో చక్కగా పాడేదిస్వాతంత్య్ర ఉద్యమ పాటలెన్నో వచ్చావిడకు. మా అమ్మానాన్నా ఒకసారి గాంధీగారిని దర్శించుకున్నారనిమా అమ్మ తన ఒంటి మీదున్న ఏడు వారాల నగలూ తీసి ఆయన జోలెలో వేసిందని గుళ్లపూడిలో చెప్పుకునేవారు. తమ్మిలేటి మీద వంతెనఊళ్లో రామాలయం… అన్నీ మా నాన్నే కట్టించారని అంటారు. చెప్పొచ్చేదేమంటే నా తల్లిదండ్రులు వైభవంగా బతికిన రోజులు నేను చూడలేదు. నేను పుట్టేసరికే ఆస్తులన్నీ హరించుకుపోయాయి. నాకు ముగ్గురన్నయ్యలునలుగురు అక్కలు. నేను ఎనిమిదోవాణ్ని. ఊళ్లోని సీమచింతచెట్ల కింద నన్నెవరో ఎత్తుకుని తిప్పుతున్నట్లు… గుళ్లపూడి కి సంబంధించి లీలగా నాకు గుర్తున్న జ్ఞాపకం అదే.

పేడ చెప్పులు తెలుసా
నాకు రెండేళ్లు దాటక ముందే మా నాన్న కుటుంబాన్నంతా తీసుకుని తమ్మిలేటి కి అటువైపునున్న చింతలపూడి వెళ్లిపోయారు. ఆ ఊళ్లోని మేడుకొండూరు వేంకటేశ్వరరావుగారు చనిపోతూ దగ్గర్లోని ‘తీగలవంచ నరసాపురం‘ గ్రామ కరణీకాన్ని మా నాన్నకు అప్పజెప్పారు. మొత్తానికి నాకు ఊహ తెలియకముందే చింతలపూడి మా ఊరయిపోయింది. ఇంట్లోనే శతక పద్యాలూస్తోత్రాలూ వంటివి నేర్పించిన తర్వాత ఐదేళ్లు నిండాక ఏ బడిలో వెయ్యాలి అన్నది ప్రశ్న. మేడ బడిసుబ్బరాజు బడి అని ఉండేవి. వాటికైతే రెండు వీధులు దాటాలి. కాని మా వీధిలోనే ‘ఏలియ‘ అనే క్రైస్తవుడొకాయన బడి నడిపేవారు. అందులో వేశారు నన్ను.

ఆయన నెలకు పావలానో అర్థో – ఎంతిస్తే అంతే తీసుకునేవాడు. బడి అంటే భవనమూ బెంచీలూ ఉన్నాయనుకుంటారేమో. అదొక పశువుల పాక. దాన్లోనే ఒక వారగా మాకు పాఠాలు. మా పలకలు అక్కడ పెట్టి అన్నానికి వెళ్లొచ్చేసరికి పశువులు వాటి పనులవి కానిచ్చేసేవి. అయితే మాకేం అసహ్యం ఉండేది కాదు. పైగా ‘అరేయ్ ఇవాళ సుబ్బరాజు మేస్టారిగారమ్మాయి అమ్ములు పలక మీద గేదెలు పేడ వేశాయిరోయ్‘ అని సంబరపడేవాళ్లం.

జయలక్ష్మివిజయలక్ష్మిపుష్పవతిఅమ్మాజీహైమవతికాకుండా ఇద్దరు ముగ్గురు భారతులు నాకు సహాధ్యాయులుగా ఉండేవాళ్లు.

అబ్బాయిల్లో నల్లమూరి పాండురంగమూర్తి – ఎన్పీఆర్ అనేవాళ్లంజిజ్జు అని మేం పిల్చుకునే బర్మా వెంకటేశ్వర్రావు,హరిఉపాధ్యాయుల సుబ్బయ్యకేడీవీఎల్ కాంతారావుఘంటా గంగాధర్… ఇదీ మా పిల్ల సైన్యం. వీళ్లలో కొందరు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చిన్నప్పుడు మాకెవరికీ కాళ్లకు చెప్పులుండేవి కావు. హైస్కూలుకెళ్లేప్పుడు కాళ్లు కాలుతుంటే దార్లో ఎక్కడైనా పేడ కనబడితే పరుగెత్తుకుంటూ పోయి దాన్ని తొక్కేవాళ్లం. కాస్త ఆరాక నడుచుకుని వెళుతుంటే కాళ్లకున్న పేడ చెప్పుల్లాగా మమ్మల్ని రక్షించేది.

అదే శీతాకాలంలోనో వానాకాలంలోనో నడుస్తున్నప్పుడు పచ్చగడ్డిదాని చివరన నిలిచిన మంచుబిందువులుఏవేవో గడ్డిపూలు కాళ్లకు తగిలి గిలిగింతలు పెట్టి ఒళ్లు పులకరించింది నాకిప్పటికీ జ్ఞాపకమే.

మేమూ కాటన్ దొరలమే
ఆ రోజుల్లో మా నాన్నకు నెలకు ఎనిమిది రూపాయల జీతం అనుకుంటా. విలువైన వస్తువులతో కాకుండా వచ్చిపోయే రైతులుగ్రామస్తులతో మా ఇల్లు కళకళలాడేది. తాను అనుభవించిన ఐశ్వర్యాన్ని పిల్లలకి ఇవ్వలేకపోయాననే బాధతోనో ఏమోమా నాన్న ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారు. ‘నేను మీకు కష్టపడటం నేర్పుతున్నాను. జీవితంలో అసలైన టీచర్లు కష్టాలే. సుఖపడటం ఎవరూ నేర్పకుండానే వచ్చేస్తుంది‘ అన్నారొకసారి. హైస్కూలుకు వెళ్లేప్పటికి నాకున్నవి రెండే నిక్కర్లు. అవీ చిరుగులు పడి కుట్టుకున్నవే.

ఒక మేస్టారు ‘సిండరెల్లా‘ అని నన్ను గేలిచేశారు. అప్పుడు నాన్న మాటలనే గుర్తు చేసుకున్నాను. ఆ మాటల ప్రభావంతోనే నేనిప్పుడు కోటీశ్వరుడితోనైనా,కూటికి లేనివాడితోనైనా – ఎవరితోనైనా హాయిగా మాట్లాడగలనుభోజనం చెయ్యగలను.

పేద – గొప్ప ఇవి ఈ సమాజానికి రెండు ముఖాలు. ఎన్నాళ్లయినా అవి ఒకదాన్నొకటి చూసుకోవు. ఇదంతా చెబుతున్నానని నా బాల్యమేదో బీదబీదగా గడిచిందని అనుకోకండి. మా ఊరు నాకే కాదుమా గ్యాంగ్ అంతటికీ అద్భుతమైన బాల్యాన్ని బహుకరించింది. వాటిలో ముందు చెప్పుకోవలసింది చెరువుదాన్ని ఆనుకుని ఉండే మామిడి తోటఆపైన ఉండే బూడిద గుంట (శ్మశానం)తర్వాత మైదానం. వర్షాకాలం వచ్చిందంటే చాలుమాకు తోచిన దగ్గర ఆనకట్టలు కట్టేసి నీరు నిలవచేసి కాటన్ దొరలా పోజులు కొట్టేవాళ్లం.

మా చెరువు ఒడ్డున మేడిచె ట్లుతుమ్మచెట్లు ఉండేవి. మాకు ఖాళీ దొరికినప్పుడల్లా తుమ్మ చెట్లకు గాటు పెట్టి జిగురు తీసేవాళ్లం. ఆ జిగురును కోమటి కొట్లో ఇస్తే అణాలుకానీలు ఇచ్చేవారు. అణాకు నాలుగు కానులు. కానీకి రెండు పప్పుండలులేదా గిద్దెడు మరమరాలు,వేయించిన శెనగపప్పు వచ్చేవి. ఇక అర్థణాకు రెండు బజ్జీలు వచ్చేవి. అంత గొప్ప ఆదాయ మార్గాన్ని పిల్లలెవరైనా వదులుకుంటారా చెప్పండి?

చింతలపూడే మాకు మద్రాసు
మా ఊరి చెరువు ఒడ్డున నేను పసిరిక పామును చూశాను. గట్టు మీద రాళ్ల కింద చుట్టలు చుట్టుకుని పడుకున్న బురద పాములను చూశాను. వానాకాలంలోనైతే అక్కడ కప్పల సంగీతం మారుమోగిపోయేది. ఊళ్లో చాకలివాళ్లకు గాడిదలుండేవి. వాళ్లు చూడకుండా వాటిని ఎక్కి స్వారీ చెయ్యడం మాకు భలే సరదాగా ఉండేది. అవి ఎక్కనివ్వకుండా తన్నేవి. అయినా సరేకూర్చున్న ఆ ఒక్క నిమిషమే మేం ప్రపంచానికి రాజుల్లా ఫీలయ్యేవాళ్లం. ఇక గేదె స్వారీలయితే చెప్పక్కర్లేదు. అసలు చింతలపూడి మావరకూ మాకు మరో మద్రాసు కిందే లెక్క. విపరీతంగా వచ్చే జానపద సినిమాల ప్రభావంతో మమ్మల్ని మేం సినిమా తారల్లాగా ఊహించుకునేవాళ్లం.

వెదురు కత్తులు తయారుచేసుకుని యుద్ధాలు చేసేవాళ్లం. ఆ సమయంలో మేం ఎన్టీయార్ఏయన్నార్రాజనాల,కాంతారావుల్లా మారిపోయేవాళ్లం. అలాగే మాకు జోడీలు కూడా ఉండేవారు! ఉదాహరణకు ‘అరేయ్ నీ పెళ్లాం ఎవర్రాఅని ఏడెనిమిదేళ్లవాణ్ని ఎవణ్ననడిగినా బి.సరోజకృష్ణకుమారిసావిత్రిజమున… వీటిలో ఏదొక పేరు చెప్పేవాళ్లు. అలాగే అమ్మాయిలు కూడా తమకు నచ్చిన హీరోలను పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడేవాళ్లు. వీటివల్ల మాలో మాకు చాలా తగువులొచ్చేవి. ఉదాహరణకు అప్పటికే హరనాథ్ అనే హీరోని ఒకమ్మాయి ఎంచుకుందనుకోండిమరో అమ్మాయిని ‘నీ మొగుడెవరే‘ అనడిగితే హరనాథ్ అందనుకోండివెంటనే మేం పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ‘సేయ్నీ మొగుణ్నే అదీ ఎంచుకుంది‘ అని చెప్పేసేవాళ్లం. ఇంక భీకరమైన యుద్ధం మొదలయ్యేది. అలానే కొత్త కుర్రాడెవరైనా వచ్చి ఏ సావిత్రోనా పెళ్లాం‘ అన్నాడాఅంతకు ముందే సావిత్రిని కలల్లో ప్రతిష్టించుకున్నవాడి చేతిలో తన్నులు తినాల్సిందే.

అప్పుల అప్పారావులం అవొద్దు
మా ఊరి వైశ్యుల నుంచి నేనొక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాను. దాన్ని అమల్లో పెడితే ప్రపంచమే మారిపోతుంది. అదేంటంటే – మా కుటుంబాల్లో ఒకాయన ఇంట్లో పిల్ల పెళ్లికి సరుకులు కావాల్సొచ్చాయి. చిట్టా ఇచ్చి దుకాణానికి నావంటి కుర్రాడొకణ్ని పంపారు. ఆ శెట్టిగారు ఈ పెద్దాయన ఇంటికొచ్చి ‘ఎందుకండే అన్ని సరుకులూ ఇంత ఖర్చూనూరేప్పొద్దున ఊళ్లో మరో గొప్ప పెళ్లి జరుగుతుందిఅప్పుడు మీరు పెట్టిన భోజనాన్ని మర్చిపోతారు జనాలు. ఆపైనాడు పక్కూళ్లో అంత కన్నా మంచి భోజనం పెడితే ఈళ్లదీ మర్చిపోతారు. ఆమాత్రం దానికి మీరెందుకండే అప్పులైపోవడం?’ అంటూ అందులో మూడో వంతు సరుకులు పంపించాడు. వాటితోటే పెళ్లి బ్రహ్మాండంగా అయింది. మా శెట్టిగారి మాటల్లో ఎంత గొప్ప ఆర్థిక సూత్రం ఇమిడి ఉందో తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

అప్పు అంటే అవతలివాడు తీర్చగలిగినంత ఇవ్వాలిగానీవాడు ఆస్తులమ్మేసే పరిస్థితికి తీసుకురాకూడదు. అలాగే తాహతును మించి అనవసరమైన ఖర్చులెందుకు అన్నదే అందులోని పరమార్థం. ఇప్పుడు చూడండిఅందరి జేబుల్లోనూ క్రెడిట్ కార్డులే. అందరూ అప్పుల అప్పారావులే. ప్రభుత్వాలు సైతం తిరిగి తీర్చలేనంత అప్పులు చేస్తున్నాయి. నాకు చింతలపూడి మరో విషయం కూడా నేర్పింది. నిత్య జీవితంలో అవసరం లేని వస్తువును చచ్చినా కొనేవారు కాదు మా ఊరివాళ్లు. ఎవరైనా కొంటే ‘ఏంరోయ్ బలే ఎచ్చులకు పోతున్నావని వేళాకోళం చేసేవారు. ఇప్పుడు అవసరం ఉన్నవీ లేనివీ కొనడంపోగు చెయ్యడం ఫ్యాషనయిపోయింది. నేనిప్పటికీ పూర్వపు పద్ధతిలోనే ఉన్నాను. అత్యవసరమైనవే కొంటాను. పాటకు లక్ష రూపాయలు పారితోషికం అందుకున్నా సరే నా పద్ధతి మారదు.

నోరు మూసుకుని కళ్లు తెరిచాను
మా చింతలపూడి నాకు ప్రకృతిలోని అందాలను చూపెట్టింది. నక్షత్రాల జల్లెడలోంచి కురిసే చీకటిపండు వెన్నెల సోనలుజామచెట్ల మీదకు వచ్చివాలే రామచిలుకలుఊరవతల తోటల్లోని పిచ్చుకగూళ్లువానకురిసే ముందు ఆకాశంరాతిలోంచి వచ్చిన కప్ప…. చెప్పుకుంటూ పోతే ఎన్నో. అవే నా పాటలోలనూ ప్రతిఫలిస్తాయి. మా అన్నయ్య డిటెక్టివ్ నవలలు చదువుతూ మధ్యలో ఆపేసి నిద్రపోయేవాడు. తర్వాత కథేమైందో చెప్పరా అంటే ‘నోర్మూసుకోవాయ్అనేవాడు. వాడు నోర్మూసుకోమనడం వల్లనే నేను కళ్లు తెరుచుకున్నాను. విపరీతంగా చదవడం మొదలెట్టాను.

మా ఊరి గ్రంథాలయంలో దాశరథిగారని ఉండేవారుఆయన నాకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఆ సమయంలోనే మా ఊరివాళ్లంతా కలిసి బోధానందపురి మహరాజ్ అనే సాధువొకరిని తీసుకొచ్చి విశ్వనాథ మఠం నిర్మించారు. ఆయన కూడా శంకరాచార్యలాగానే కేరళలోని కాలడి గ్రామస్తులుచిన్నవయసులోనే సన్యాసం తీసుకుని హిమాలయాల్లో సంచరించినవారు. బడిగ్రంథాలయం పోను మిగిలిన సమయమంతా నేను ఆశ్రమంలోనే గడిపేవాణ్ని. ఆయన శిష్యరికం వల్లఅక్కడికి వచ్చిపోయే పండితుల వల్ల నేను మన సంప్రదాయ సాహిత్యంతాత్వికతల గురించి బాగా తెలుసుకున్నాను. అప్పుడే గుడిలో రాజేశ్వరీదేవిని ప్రతిష్ఠించారు.

ఉదయం పువ్వులు కోసి పెట్టడంభక్తులకు ప్రసాదాలు పంచడం ఇలాంటివన్నీ నా పనులన్నమాట. అవి చేస్తున్నప్పుడు నాకు ప్రకృతి అంతా శక్తిమయమని అర్థమయింది. అయినా జీవితమంటే ఏమిటిమనమంతా ఎవరుఎక్కణ్నించి వచ్చాంఎక్కడికి వెళుతున్నాం… ఇవన్నీ తెలుసుకోవాలని తపనగా ఉండేది. వీటి గురించి ఆలోచిస్తూ నేను సన్యాసి అవాలని తీర్మానించుకున్నాను. ముందుగా భారతీయ వైమానిక దళంలో చేరి పద్దెనిమిదేళ్లు పనిచేశాను.

తర్వాత పాదచారినై చాలా కాలం హిమాలయాల్లో ఒంటరిగా సంచరించాను. మనస్సు చేసే అద్భుతాలను చూశాక ఎక్కడున్నా ఒకటే అనిపించి చెన్నైకి చేరుకుని ఇదిగో మీముందిలా పాటల రచయితగా నిలబడ్డాను. మా ఊళ్లో మా అన్నయ్యఅక్క కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్లకోసంమా గుళ్లోని అమ్మవారిని చూడటం కోసం నేను ఏడాదికోసారైనా చింతలపూడి వెళుతుంటాను. అక్కడ చెరువు పూడ్చేసి మరీ ఇళ్లు కట్టేసుకున్నారు. మామిడి తోటల ఆనవాలే లేదు. మైదానం తగ్గిపోయింది. నేను ఊరికేమీ చెయ్యలేకపోవచ్చుకానీ దాన్ని మరింత చెడగొట్టలేదు.

పేరు మారిందిలా!
ఇంతకూ నా అసలు పేరు శేష పూర్ణానంద ప్రభాకర గురురాజు. మా అమ్మ పేరులోని చంద్రచెన్నైలో నన్ను తల్లిలాగా చూసుకున్న భువనేశ్వరమ్మ పేరులోని సగం తీసుకుని నేను ‘భువనచంద్రనయ్యాను.

మా తిండి పురాణం
ఊళ్లోని చెరువులో దొరికే తామరాకులను ఎండబెట్టి దాచుకునేవాళ్లు అందరూ. హోటల్లో ఇడ్లీలుబజ్జీలు వంటివన్నీ వాటిలోనే పెట్టిచ్చేవారు. మిరపకాయ బజ్జీలను తినడానికో పద్ధతి ఉంది. మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా కోసి,అందులో ఉల్లిచెక్కునిమ్మకాయ పిండి కాస్త ఉప్పూకారం వేసి బాగా కలిపి తింటే నా సామిరంగా… అసలు రుచి బజ్జీల్లో ఉందో ఎండిన తామరాకులో ఉందో ఇప్పటికీ అర్థం కాదు. అలాగే వేసవి కాలం వచ్చిందంటే చాలుపిల్లల జేబుల్లో బ్లేడు,ఉప్పూకారం ఉండాల్సిందే. అది చాలా పెద్ద రహస్యం. నైపుణ్యాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌లోనూ ఆరేడుగురు ఉండేవారు.

ఇద్దరు కాపలా ఉండటానికిఒకరు చెట్టెక్కడానికిఒకరు కోసిన కాయలను క్యాచ్ పట్టడానికి. కాయలు చేతుల్లోకి రావడమే ఆలస్యంవాటిని బ్లేడుతో చెక్కిచిన్నచిన్న ముక్కలుగా కోసి ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో పోసి ఉప్పూకారం కలిపి లొట్టలేసుకుంటూ తినేవాళ్లం. ఇక ఊళ్లో ఎవరింట్లో అరటి గెల కాసినా పిల్ల సైన్యానికి ఉప్పందేది. గెల మొత్తం ఎత్తుకెళితే తన్నులు పడతాయని తెలుసుగనక చాలా నేర్పుగా పళ్లు దొంగిలించేవాళ్లం. ఇక పంపరపనస కాయలు ఒలిచి వాటి డిప్పలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగేవాళ్లం. వామన చింతకాయలను బచ్చలితో కలిపి పచ్చడి చేసుకుని తింటే అబ్బో ఇది చింతలపూడి కాదుస్వర్గం అన్నట్టుండేది.

ఊళ్లో మరీ విసుగు పుడితే నాలుగు కిలోమీటర్ల దూరంలోని తమ్మిలేరు దగ్గరకు నడిచి వెళుతూ అడవి కరివేపాకు,జామకాయలు ఏరుకునేవాళ్లం. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల ఆహారపదార్థాలు దొరికేవి కాదు. అందుకని ఇళ్లలో కొన్ని నిలవ చేసేవారు. ఆ పనిలో పిల్లల భాగస్వామ్యం చాలానే ఉండేది. ఉదాహరణకు కొబ్బరినువ్వులు వంటివి మిల్లుకిచ్చి నూనె తీసి తేవడంఅవసరమైనప్పుడల్లా ధాన్యాన్ని ఆడించడంకూరగాయల ఒరుగులు పెడుతుంటే సాయం చెయ్యడంఆవకాయలు పెడుతున్నప్పుడు కారంపసుపుఆవపిండి వంటి వాటిని వస్త్రకాయితం చెయ్యడం (జల్లెడ పట్టడం) ఇవన్నీ మా పనులే.

 

నా ‘బొమ్మల’ బలం ‘బూరుగుపెల్లే’

తెలంగాణ పద్దతే వేరుంటదమ్మా. వాళ్ల పనిపాటలుకూసొని ముచ్చట్లు చెప్పుకొనే తీరుసాయం జేసుకొనుడు… నాకుదెల్సిన లోకం అదే. అన్నిటినీ బొమ్మలుగా గీస్తున్న. ఎన్ని ఏశానో! ఎంత ఏసినా అయిపోయేది కాదీ ముచ్చట.

ఊరూరూ తిరిగి సరుకుల వ్యాపారం చేశాడు తాత తోట నర్సయ్య.
ఊరొదిలి పెట్టి వెళ్లి నీళ్లు తోడి నిలదొక్కుకున్నాడు తండ్రి తోట వెంకయ్య.
ఊరివాళ్లను బొమ్మలుగా వేసి ప్రపంచమంతా పేరు సంపాదించాడు – తోట వైకుంఠం.
‘ఏంజేసినా తెలంగాణకెల్లి పక్కకుపోను’ అని తన చిత్రాల మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్న చిత్రకారుడు తోట వైకుంఠం తన పల్లెటూరి గురించి అలాంటి మరికొన్ని ఊళ్ల గురించి చెబుతున్న జ్ఞాపకాల సమాహారమే ఈ వారం ‘మాఊరు’

మాది కరీంనగర్ జిల్లా వేములవాడ తాలూకాలోని బూరుగుపెల్లి. ఆ జిల్లాలో నాకు తెలిసి ఐదారు బూరుగుపెల్లిలున్నాయి కనుకనే ఇంత వివరంగా చెప్పిన. మా తాత తోట నర్సయ్య ఎక్కడివాడో తెలియదుగని బతుకుదెరువు కోసం ఆ ఊరికి వచ్చాడని మా నాయినమ్మ జెప్పేది. పొరుగునున్న ‘విలాసాగరం’ ఊరి నుంచి తను పెళ్లయి కాపురానికి వచ్చేనాటికి బూరుగుపెల్లి చాల చిన్న ఊరు అట. దొర కుటుంబం కాక, సుంకరి పని చేసే కొందరు తెనుగోళ్లు, కొందరు పద్మశాలీలు, చాకలివాళ్లు మాత్రమే ఉండేవారట. ఐదుగురు పిల్లల్లో మా నాయిన మూడోవాడు.

వీళ్లు పుట్టకముందే మా తాత నాలుగు పెద్దపెద్ద ఇళ్లు కట్టించాడు. ఎక్కడంటే అక్కడ వడ్ల బస్తాలు, సరుకుల సంచులు పెట్టేటోళ్లట. అంత వ్యాపారం చేస్తున్న మనిషి హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ భారం మా పెదనాయిన మీద పడింది. ఇద్దరు ఇల్లరికం పోయిన్రు, మరొక తమ్ముడు చనిపోయిండు. చివరకు మిగిలింది మా నాయిన.

ఆయనకేం అర్థం కాలేదు. పదమూడేళ్ల వయసులోనే పెళ్లయింది. కాని ఏం జెయ్యడానికీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇగ ఎవరికీ చెప్పకుండా ఊరిడిసిపెట్టిండు. వెళ్లిన ఊళ్లో ధనవంతులైన వైశ్య కుటుంబాలు నలభైయాభై ఉండేవి. ఆరోజుల్లో కొత్తవాళ్లు కనపడిన వెంటనే కులగోత్రాలు ఆరా తీసేటోళ్లు కదా. అలా మా నాయిన అక్కడ అడుగుపెట్టిన వెంటనే షావుకారు బిడ్డని తెలుసుకొని వాగు నుంచి నీళ్లు తెచ్చి ఇళ్లలో పోసే పని చెప్పిన్రు.
‘దినానికి నలభై బిందెలు మోసిమోసి గట్టిపడిపోయిన బుర్రరా ఇది’ అనేవాడు మా నాయన చివరి వరకూ. ఒకరాత్రి అలసిపోయి నరసింహశతకంలోని పద్యమొకటి పాడుతూ పడుకున్నాడట. దాన్ని విన్న సేటు అబ్బురపడి నాన్న కోసం వేరే కొంత సొమ్ము దాచడం ప్రారంభించాడు.

ఈలోగా మా నాయినమ్మ బిడ్డ కనిపించడం లేదని రోజూ ఏడ్చేది. ఒకసారి మా ఊరి పద్మశాలీలు చీరలమ్ముకుంటూ అటుపక్క పోయినప్పుడు నాన్న కన్పడిండు. వాళ్లు బూరుగుపెల్లి వచ్చి ‘మీ బిడ్డ ఫలానా ఊళ్లో ఉన్నాడ’ని ఆమెకు చెప్పిన్రు. కబురు తెలిసి మా పెదనాన్న, మా తాత (అమ్మ తండ్రి ) ఆయన్ని వెతుకుతూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చిన్రు. అప్పటి వరకూ నీళ్లు మోసి సంపాయించి దాచుకున్న వంద రూపాయలే మా నాన్న వ్యాపారానికి పెట్టుబడి అయింది.

vaikuntam

మా అమ్మది శాతరాజుపల్లి. ‘నీ మొగుడు ఊరిడిసి పోయిండంట… ఇగ రాడట… నువ్వెప్పటికీ పుట్టింట్లోనే ఉండాలో ఏమో’ అంటూ ఊరివాళ్లు అనే సూటిపోటి మాటలు ఆమె చిన్న మనసును ఎంతో గాయపరిచాయి. మా నాన్న బూరుగుపెల్లొచ్చి వ్యాపారం పెట్టి సొంతింట్లోకి కాపురం వచ్చినంక ఇగ మా అమ్మ ఎప్పుడూ పుట్టింటికి పోనే లేదు. ఒకవేళ తండ్రిని చూడాలని వెళ్లినా ఒక్కరోజులోనే తిరిగొచ్చేటిది.
మెట్టినూరే సర్వస్వం
అట్లా వచ్చిన అమ్మ తన ఇల్లు, సంసారం, వ్యాపారం నడవటానికి ఎంత పనిజేసేదో చెప్పలేను. ఉదయం మబ్బుల్నే (చీకట్నే) లేసి పని షురూజేసేది, రాత్రి అందరూ పండుకున్నాక పడుకునేది. నాకొక అన్న, అక్క. మరో ముగ్గురు పుట్టిపోయారు. అక్కకు పదేళ్లకే పెళ్లి చేసి పంపేశారు. పెద్దవుతున్నకొద్దీ నేను, మా అన్న అమ్మకు అన్ని పనుల్లోనూ సాయం చేసేవాళ్లం. ఉదయాన్నే లేచి ఇల్లు తుడవడం, వంటకు కట్టెలు కొట్టడం – ఇలా అన్నీ చే సేవాళ్లం.

నా కన్నా మా అన్న ఇంకా ఎక్కువ చేసేవాడు. ముఖ్యంగా పుట్నాల పప్పు తయారుచెయ్యడం అంటే ఎంతో పని. అది మబ్బుల్తోనే మొదలుపెట్టేటిది. కల్లుతాగేవాళ్లకు పుట్నాలంటే ఇష్టం. అప్పుడప్పుడు కొంచెం కారం ఉప్పు కలిపి ఇస్తే ఆనందంగా తీస్కపోయేవారు.

అన్నమంటే ఆనందం
నేను పెద్దగయ్యేవరకూ మూడుపూటలా మక్కగటకనే మా ఆహారం. సోమవారం శివునికిష్టమైనదని మా నాయిన ఆరోజు ఒక్కపొద్దులుండెటోడు. ఇగ ఆరోజు మాకు పండగేపండగ. ఎందుకంటే ఆరోజే కదా మేమన్నం తినేటిది. ఆయన మద్యాన్నానికల్లా పూజగీజ చేసి, ఇంత విబూది బొట్టు పెట్టుకుని అన్నం తినడానికి కూసొని, పిల్లలు ముగ్గురికీ ఇంతింత ముద్దలు అన్నం కలిపి పెట్టినంకనే తాను తినేటోడు. అందుకే మేం సోంవారమెప్పుడొస్తదా అని చూసెటోళ్లం. ఆ వేళకు బడి నుంచి పరుగెత్తుకొచ్చేటోళ్లం. ‘వీడు పుట్టాకనే మనమన్నం తింటున్నాం’ అనె టోడు మా నాయిన.

అందుకే నేనంటే మరీ ముద్దు. మాకు ముందు పాడి లేకపోయేది. అప్పుడు ఎవరింటికి పోయి అడిగినా ఒక గిన్నె నిండా చిక్కని మజ్జిగ పోసిచ్చేటోళ్లు. మా నాయిన బర్రె కొన్నంక ఇగ ఎక్కడికీ పోయి అడగాల్సిన అవసరం పడలే. తర్వాత పాడి కూడ పెరిగింది.

ఎంతజేసినా మా అమ్మ మాత్రం ‘వ్యాపారాల్లేముంది బిడ్డా, బాగా సదువుకోండ్రి’ అంటూ మమ్మల్ని బడిలో వేసింది. ఇప్పుడు వ్యాపారాల్లెక్క ఆమెకు తె లిసుంటే అవే చేసుకోమనేదేమో. నేను బడికి పోయిన మొదటి దినం నాకింకా గుర్తే. స్నానం పోసి మంచి నిక్కరు చొక్కా ఏసి తల దూసి మెడలో కండువాలాగా తువ్వాలొకటి వేసి పలకాబలకం చేతిల పెట్టి సారు దగ్గర దింపింది మా అమ్మ. ఆ రోజుల్లో నెలకో పావలానో ఏమో కట్టేది. ఉదయం లేచి మొహం కడుక్కొని ఆరింటికల్లా బళ్లోకి పోవడమే.

మజ్జానం ఇంటికి పోయి స్నానం చేసి అన్నం తిని మళ్లీ బడి కొచ్చేయాలి. సాయంత్రం చీకటి పడుతుండగా ‘దీపం జ్యోతి పరంబ్రహ్మ’ అని పాడుకుంటూ ఇంటి కిపోవడం. అప్పట్లో శుక్రవారం సెలవుండేది. కాలాన్ని బట్టి మా ఆటలుండేటివి. వర్షకాలమొస్తె బొంగరాలు, సలపలాట. దసరాల సమయంలో కబాడీ.

వేసవి అయితే కోతికొమ్మచ్చి, గిల్లలాట. ఎంతాడుకున్నా సరిపోనన్ని ఆటలు. అసలు సదవడానికి మాకు టైమే దొరికేదిగాదు. మొట్టమొదట నాకు చదువుచె ప్పినాయన్ను ఇప్పటికీ మర్సిపోను. పోశెట్టి సారని పిల్లలంటే గొప్ప ప్రేమగా ఉండేటోడాయన. ఆ తర్వాత వచ్చిన సార్లందరూ కర్రదీస్కుని కొట్టేటోళ్లే. అందుకేనేమో నాకు సదువంటే ఇష్టం లేకుండ పోయింది. ఎంతసేపు నాటకాలు, హరికతలు విందామనిపించేది.

ఆ పద్దతే వేరుంటది
అప్పట్లో నాటకాల మనుషులు, పాండవుల కత, హరికత జెప్పేవాళ్లంతా మా ఊరికొచ్చి రెండుమూడు నెలలు ఉండిపోతుండిరి. మా ఊళ్లో నాటకాలు అవుతున్నప్పుడిక మాకు పండగేపండగ. బడి ఎగ్గొట్టి మరీ వీధి బాగోతాలు చూడటానికి పోయేవాళ్లం పిల్లలందరం. నేను చాలా చిన్నప్పటి నుంచే భీముడు, ఆంజనేయుడు వంటి పాత్రలంటే చాల ఇష్టపడేవాణ్ని. వాళ్ల బలమైన ఆకారాలు నన్ను ఆకర్షించేటివి. చేతయినట్టు వాళ్లను బొమ్మలుగా గీసేవాన్ని. అందుకేనేమో ఇప్పటికీ నా బొమ్మల్లో ఆడవాళ్లు, మగవాళ్లు బలంగా కనిపిస్తారు.
vaikuntam1
నేను బొమ్మలకు గాఢమైన రంగులు వాడటంలోనూ నాటకాల ప్రభావం కనిపిస్తుంది. మా ఊళ్లో వెంకటనర్సయ్య అనే అయ్యగారుండేవాడు. ఆయన నాటకాలు రాసేవాడు. జిల్లా అంతా తిరిగి ప్రదర్శించేవాడు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఆ వాతావరణం ఉండేది. అందుకే మా ఊరివాళ్ల మీద నాటకాల ప్రభావం ఎక్కువ. నా బొమ్మల మీద మా ఊరి ప్రభావం ఎంతుందంటే మాటల్లో చెప్పలేను.

చిన్నప్పుడు మా ఇంటి పక్కనున్న అవుసులోళ్లు (కంసాలులు) నగల కేటలాగులు తెస్తే వాటిని చూసి వేసేవాణ్ని. వాళ్లలో బ్రహ్మయ్య అనే ఆయన చిన్న కాయితమ్ముక్క కనిపిస్తే చాలు అందమైన దృశ్యమేదో ఒకటి గీసేవాడు. దాన్ని చూసి అబ్బురపడి ‘నాకిట్లా గియ్యొస్తదా’ అని అడిగేవాన్ని. ‘ అన్నీ ఒక్కరోజులో ఒస్తాయి? నెమ్మదిగ గీస్తే ఒస్తదిరా’అనేటోడాయన.

మా అమ్మకు బాగలేనప్పుడు నేను మూడు నెల్లు హైద్రాబాద్‌ల, మరో మూడునెల్లు మా ఊళ్ల ఉండేటోణ్ని. ఆమెను ఎన్ని బొమ్మలు గీసానో లెక్కలేదు. అప్పుడే మా ఊరివాళ్లను ఒక ఆర్టిస్టు దృక్కోణం నుంచి గమనించే వీలు కలిగింది. ఆడవాళ్లు, పాలేర్లు, దొరలు… అందర్నీ విపరీతంగా స్కెచింగ్ చేసిన. ఇక అప్పట్నుంచి వాళ్లనే గీస్తూ వస్తున్న. అంతకుముందు వరకూ ల్యాండ్‌స్కేపింగ్‌లనీ అవనీఇవనీ గీసినగానీ, ఒక పీరియెడ్ తర్వాత నా బొమ్మల్లో కుక్కనక్క గుడిసె ఏం కన్పించవు చూడండి.

ఏం గీసినా తెలంగాణ మనుషులే. వాళ్లనుంచి పక్కకు పోను. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చినాగానీ చేసింది తక్కువే. తెలంగాణ పద్దతే వేరుంటదమ్మా. వాళ్ల పనిపాటలు, కూసొని ముచ్చట్లు చెప్పుకొనే తీరు, సాయం జేసుకొనుడు… నాకుదెల్సిన లోకం అదే. అన్నిటినీ బొమ్మలుగా గీస్తున్న. ఎన్ని ఏశానో! ఎంత ఏసినా అయిపోయేది కాదీ ముచ్చట. తెలంగాణ విమెనే నా ఐకన్. అలాగే మురళి ఊదే బొమ్మలు ఎక్కువుంటయి. పల్లెటూళ్లకు పోయి చూస్తే పోరగాళ్లందరు మురళి కొనుక్కస్తరు. వచ్చినరాకున్న ఊదుతునే ఉంటరు. అందుకనే నా బొమ్మల్లో మురళి కూడా కన్పిస్తది.

కతలని తెలియని కాలమది
ఐదోతరగతి తర్వాత మాఊళ్లో లేదుగనుక వేములవాడలో చేరినా. నేను మా అన్న ఒక బ్రాహ్మల ఇంట్లో గదిలో ఉండి వండుకుని తిని బడికెళేటోళ్లం. మేం వాళ్లకు కట్టెలు కొట్టివ్వడమో, నీళ్లు తోడటమో చేసేటోళ్లం. వాళ్లేమో ‘అరేయ్ ఇవ్వాళ ఏం తింటార్రా’ అని అడిగి ఇంత కూరో, పచ్చడో ఏదో ఇచ్చేవాళ్లు. దాంతో మాకు వంటపని సులువయ్యేది. ఇక మిగిలిన టైమంతా బొమ్మల మీదే. ఆరోజుల్లో సినిమా బ్యానర్లు, పోస్టర్లు, దుకాణాల పేర్లు అన్నీ ఆర్టిస్టుల పనే. అక్కడ కొండయ్య అనే ఒకాయన సావిత్రి బొమ్మెయ్యమంటే ఐదు నిమిషాలల్ల అచ్చు గుద్దినట్టు ఏసేసేవాడు. అది చూసి నేను పరేషానయిపోయేవాణ్ని.

నేనెప్పుడు అలా గీస్తానా అని. వేములాడ గుళ్లో కూచుని శిల్పాలన్నిటినీ గీస్తూ ఉండటమే పని. నాతోపాటు కొండయ్య,సత్యనారాయణ… ఇలా కొందరు దోస్తులుండేవాళ్లు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసేవాళ్లం అందరం. ‘వోట్ ఫర్…’అని రాసే అవకాశం రావడమే ఎక్కువన్నట్టు ఉండేది. కమ్యూనిస్టులేగానీ, ఇంకెవ్వరేగానీ అందరు సెప్పేటివి కతలే అని తెలియని కాలంగదా అది. సిరిసిల్ల పోయి ఏడో క్లాసులో జాయిన యినప్పుడు అక్కడ డ్రాయింగు సారు నా ప్రతిభ చూసి నువ్వు మెట్రిక్ జేసి మేస్టరయేది వద్దు, హైద్రాబాద్ పోయి ఫైనార్ట్స్ చదువు అని చెప్పాడు.

కులాలెక్కడివి?
ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవడం సంగతటుపెడితే, నేనసలు బతికి బట్టకడతనా అని మా అమ్మ ఏడ్సిన రోజొకటి ఉన్నదట. చిన్నప్పుడు ఊళ్లో అందరు పిల్లలకు ‘మంజేరు నొప్పి’ అని కాలు నొప్పి వచ్చేది. నాకూ అలాగే వస్తే ఒకాయన నెమలినార కర్ర, పసుపు, ఆముదం వేసి కట్టు కట్టాడట. మూడు రోజుల తర్వాత చూస్తే నొప్పి తగ్గకపోగా, బొక్క (ఎముక) కనిపించేంత మేర మాంసం ఊడిపోయింది. దాంతో మా నాయినమ్మ పరేషానయిపోయి దగ్గర్లోని ఆసంపెల్లిలో వైద్యుడున్నాడని ఆయన దగ్గరకు తీస్కపొమ్మంది.

మా అమ్మానాయినా కచ్చురం కట్టి గడ్డి పరిచి నన్ను పడుకోబెట్టి తీసుకెళుతుంటే ఊరి పొలిమేర దగ్గరున్నప్పుడే నా శ్వాస ఆగిపోయిందట. ఇగ నేలన గడ్డి పరిచి పడుకోబెట్టి గోలుగోలని ఏడుస్తుంటే ఆ వైద్యుడే అటువైపు వస్తూ మా అమ్మ ఏడుపు విని నన్ను చూసిండట. అప్పటికప్పుడే ఏదో తీగ తెంపి నలిపి వాసనజూపించి లేచేలా చేశాడు. తర్వాత కట్టుకట్టి నా కాలినొప్పినీ తగ్గించేసిండు.

నేను పెద్దయినంక ఆయన్ని కలవాలని అనుకున్నగనీ, అప్పటికే చనిపోయిండని తెల్సింది. ఊళ్లల్లో సాటి మనిషి పట్ల స్పందన అట్లా ఉండేది. మా చిన్నప్పుడు కులాలుగిలాలు ఏమీ తెలిసేటివి కాదు మాకు. అదే మా ఊరి శ్రేష్ఠత. ఎవ్వర్నయినా చిన్నాయినా పెద్దాయినా అని పిలవటమే. ఆడవాళ్లయినా అంతే. మా ఇంటి చాకలామెను మేం అక్కా అనో వదినా అనో అనేవాళ్లం.

మా ఊళ్లో పోశవ్వ అనే మాదిగామె ఇప్పటికీ నన్ను బావా అని అంటది. అలాంటి అభిమానం, ఆప్యాయత,ఆత్మీయతలు ఇప్పుడెక్కడున్నాయి? రాజకీయాలు, వైను షాపులు వచ్చి పల్లెటూళ్లను కూడా పాడుచేసినయి. ఏదయినా ఊరు ఊరేగద, ఏడాదికి రెండుమూడుసార్లు పోయొస్త. మా ఊరికి నేను ప్రత్యేకంగా ఏం జెయ్యలేదుగని ఏ పని ఉన్నదని వచ్చి చందాలు అడిగినా ఇచ్చినా.

అరుణ పప్పు
ఫోటోలు : నాని

మా ఊరివాళ్ళు కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది—అంజలీదేవి

అంజలీదేవి… పరిచయం అక్కరలేని పేరు. సీతమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో
అనిపించేలా నటించిన ఆమె దేశ విదేశాల్లో తిరిగినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు
గడించినా తన స్వస్థలం పెద్దాపురం పేరు వింటే పులకించిపోతారు. స్వస్థలం
గురించి చెబుతున్నప్పుడు ఐదేళ్ల పసిపాపలా సంబరపడిన ఎనభైఐదేళ్ల అంజలీదేవి
ఊరి విశేషాలు ఆమె మాటల్లోనే…
“కన్నతల్లి, పుట్టినూరు – ఎవరి జీవితంలోనైనా ఎంతో ముఖ్యమైనవంటారు,
ఎప్పటికీ మరపురానివంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచీ జన్మభూమికీ,
జన్మనిచ్చిన తల్లికీ దూరంగానే ఉండాల్సి వచ్చింది. బాల్యంలోనే కళాకారిణి
అయినందుకు సంతోషించాలో, అద్భుతమైన ఆటపాటల కాలాన్ని కోల్పోయినందుకు
బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది.

anjali

ఇప్పుడు నా మనవళ్లను, మనవరాళ్లను చూస్తుంటే నా బాల్యాన్ని ఎంత పోగొట్టుకున్నానో అర్థమవుతోంది. ఇంత పెద్దదాన్నయినా, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించినా, వందల మైళ్ల దూరం తరలి వచ్చేసినా నా బాల్యం, మా ఊరి స్మృతులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే
వుంటాయి.

బొమ్మల పెళ్లిళ్లు
మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. పూర్వం నుంచే అభివృద్ధి చెందిన
పట్టణం. 1928లో నేను అక్కడే పుట్టాను. మా అమ్మ సత్యవతి, నాన్న నూకయ్య.
నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. నా అసలు పేరు అంజనీకుమారి. సినిమా
రంగంలోకి వచ్చిన తరువాత అంజలీదేవిగా పేరు మార్చారు. సంతానంలో పెద్దదాన్ని
కావడంతో ఇంట్లో నాకు హక్కులు కొంచెం ఎక్కువగానే వుండేవి. మాది వ్యవసాయ
కుటుంబం.

కొంచెం పొలం ఉండేదనుకుంటా. మాకు మొన్నటి వరకూ అక్కడ ఇల్లు వుండేది.
ఇటీవలే దానిని అమ్మేశాం. మేమున్న వీధిలో ప్లీడర్లు ఎక్కువగా వుండేవారు.
అందుకే దానికి ప్లీడర్ వీధి అని పేరొచ్చింది. మా ఇంటి చుట్టూ బ్రాహ్మణ
కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. అందుకే నా స్నేహితురాళ్లంతా వారే ఉండేవారు.
జగదాంబ, మాణిక్యం అని ఇద్దరు స్నేహితురాళ్లు నాకు బాగా యిష్టం. మేమంతా
కలసి కొత్తకొత్త ఆటలు కనిపెట్టేవాళ్లం.

ఏదో ఒక పాత ఆట చూసి దానికి వెనుకాముందూ ఏవేవో జోడించి అదే కొత్త ఆటగా
ఆడేవాళ్లం. దాంతో మిగతావాళ్లు కొత్తకొత్త ఆటల కోసం మాదగ్గరకొచ్చేవాళ్లు.
ముఖ్యంగా బొమ్మల పెళ్లిళ్లు బాగా చేసేవాళ్లం. పెళ్లికొడుకు పెళ్లి కూతురు
బొమ్మలను అందంగా ముస్తాబు చెయ్యడం, పెళ్లి భోజనాలకు కావలసిన దినుసులన్నీ
సమకూర్చుకోవడం… వీటితో ఊపిరి తిరగనంత పని ఉండేది. బొమ్మల పెళ్లిళ్లలో
‘చెంగల గౌరీ…’ లాంటి పాటలు పాడేవాళ్లం. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఇలాంటి
పాటలు బోలెడు వచ్చు నాకు. ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్టం. మిగిలిన లోకం
పట్టేదే కాదు.

ఆంజనేయుడంటే ఇష్టం
అప్పట్లో బ్రాంచ్ గర్ల్స్ స్కూలు ఉండేది. అందులో నేను నాల్గవ తరగతి వరకూ
చదువుకున్నాను. మా ఇల్లు పెద్దాపురం మొదట్లోనే వుండేది. ఇంటి నుంచి
స్కూలుకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేదాన్ని.
అప్పట్లో నాకు ఆ దేవుడంటే మహా ఇష్టం. అందుకే స్వామికి దండం పెట్టుకున్న
తర్వాతే బడికి వెళ్లేదాన్ని. ఆ మమకారంతోనే అనుకుంటా, ఆ స్వామివారు తరువాత
నన్ను తనకిష్టమైన జగజ్జనని సీత పాత్ర లో నటించే అవకాశం కల్పించారు.

మా ఊళ్లో ముప్పనాస్ వారి థియేటరుండేది. అందులో సినిమాలు, నాటకాలు
వేసేవాళ్లు. నేను కూడా ఎప్పుడన్నా వెళ్లి సరదాగా చూసి వచ్చేదాన్ని. నేను
నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఓ రోజు మా నాన్న స్కూలుకొచ్చారు.
రెక్కపట్టుకుని గబగబా ఈడ్చుకెళ్లినంత పని చేశారు. ఆయన ఎందుకలా
తీసుకెళ్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకర్థం కాలేదు. ముప్పనాస్
థియేటరు రిహార్సల్ గది వద్దకు తీసుకెళ్లి నన్ను నిలబెట్టేశారు.

అప్పటికి నాకసలు విషయం అర్థమైంది. భద్రాచార్యులవారు వేస్తున్న
హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు పాత్రధారి రాలేదని ఆ వేషం కోసం నన్ను
తీసుకెళ్లారు. అది మగపిల్లాడి పాత్ర కావడంతో ఒక్కసారిగా నా జుట్టు
కత్తిరించేశారు. దాంతో నేను ఒకటే ఏడుపు. ఆ తరువాత రెండు రోజులు
రిహార్సల్స్ చేయించారు. హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు చనిపోతాడు. అంటే
నేను స్టేజ్‌మీద కదలకుండా చనిపోయినట్లు పడుకోవాలి.

అలా కొద్దిసేపు పడుకునేటప్పటికి నేను నిద్రపోయాను. కొద్దిసేపటి తరువాత
ఎవరో నన్ను కదుపుతుంటే కళ్లు తెరిచాను. నా చేతిలో కర్పూరం పెట్టి
చంద్రమతి పాత్రధారి దానిని వెలిగించి నామీద పడి పెద్దగా ఏడుస్తోంది. ఆ
మంటతో నేను కాలిపోతానేమోనని భయమేసింది. కానీ చంద్రమతి వేషం వేసినావిడ
బాగా మేనేజ్ చేసింది. ఏదైతేనేం, ఆ రోజు లోహితుని పాత్రధారి రాకపోవడం నా
జీవితానికి కొత్త మలుపు అయింది.

జీవితం మారిపోయింది…
ఆ డ్రామా అయిపోయింది కానీ, ఆ తర్వాత నా జీవన శైలి మాత్రం మారిపోయింది. ఆ
రోజు నుంచీ ఆటలు పాటలు, స్నేహితురాళ్లతో తిరుగుళ్లు – అన్నీ ఆగిపోయాయి.
తెల్లవారేసరికి నాట్యం నేర్పే గురువుగారి దగ్గరకెళ్లాలి. సాయంత్రం మళ్లీ
నాట్యం. మధ్యలో సంగీత సాధన. ఇదే నా నిత్యకృత్యం. నాన్న తబలా వాయించేవారు.
ఆయనకు సంగీతమంటే భలే ఆసక్తి. నాకేమో ఆటలు తప్ప మరి దేనిమీదా ఇష్టముండేది
కాదు. కానీ నాట్యం, సంగీతమంటూ మా నాన్న నన్ను తెగ విసిగించేవారు.
చిన్నతనం కదా, నేను బాగా మొండికేసేదాన్ని.

నా మొండితనాన్ని సహించలేకనో లేదంటే నాకు ఇంకా బాగా శిక్షణనిప్పించాలన్న
ఉద్దేశమో తెలియదుగానీ నన్ను కాకినాడలో వున్న ‘యంగ్‌మెన్స్ హ్యాపీ
క్లబ్’లో చేర్పించారు నాన్న. ఇప్పటి రెసిడెన్షియల్ స్కూళ్లలాగా అన్నమాట.
అక్కడే భోజనాలు పడక అంతా. అప్పటికి నా వయసు తొమ్మిదేళ్లు. అక్కడ నటనలో
మంచి శిక్షణ లభించేది. అయినా నేను కొంటె చేష్టలు మానలేదు. తెగ అల్లరి
చేసేదాన్ని. అక్కడున్న సైకిళ్లకు గాలి తీసేయడం, దుస్తుల్ని దాచేయడం
వంటివి ఒకటా రెండా…! అలా చేస్తే ఇంటికి పంపించేస్తారన్న నమ్మకమేమో
బహుశా! 1939లో అనుకుంటా మా క్లబ్ ఆధ్వర్యంలో ‘కుచేల’ డ్రామా వేశాం.

అందులో నాది రాఘవ పాత్ర. అయితే ఆఖరి నిమిషంలో రుక్మిణి పాత్రధారి
రాకపోవడంతో ఆ వేషం నాకు వేసి కృష్ణుని పక్కన నిలుచోబెట్టారు. నేను
అప్పటికి చిన్నపిల్లను, అందునా ఎత్తు తక్కువ. దాంతో కాళ్ల కింద చెక్కలు
వేసి నిల్చోబెట్టారు. ఆ డ్రామాలోనే అక్కినేని నాగేశ్వరరావుగారు సత్యభామ
వేషం వేశారు. మరో విషయం కూడా చెప్పాలి, కాకినాడలోని ‘యంగ్‌మెన్స్ హ్యాపీ
క్లబ్’లోనే ఆదినారాయణరావుగారు సంగీతం అందించేవారు. ఆ తరువాత కొంత
కాలానికే ఆదినారాయణరావుగారితో నాకు వివాహమైంది.

రావద్దనేవాళ్లు…
నటన అనే ప్రవాహంలోకి నన్ను బలవంతంగా నెట్టేసి, నన్నో కళాకారిణిగా మలచింది
మా నాన్నే. ముందు కష్టంగానే అనిపించిందిగానీ నెమ్మదిగా దాన్నే ఇష్టంగా
మలచుకుని ఈదుకుంటూ వచ్చేశాను. అయితే చిన్నవయసులోనే నన్ను తల్లికీ, ఇంటికీ
దూరం చేశానన్న భావన ఆయనలో ఉండేదేమో అనిపిస్తుంది ఆలోచించినప్పుడు. అందుకే
కాబోలు, అప్పుడప్పుడూ నాన్న నా దగ్గరకొచ్చి స్వయంగా నాకు భోజనం
తినిపించేవారు. చిన్నప్పుడే నేను మా ఊరిని వదిలేసినా చాలా పెద్దయ్యేవరకూ
నా మనసంతా అక్కడే తిరుగుతుండేది.

ఆ తరువాత అదే అలవాటైపోయింది. నాటకాలనీ, సాంస్కృతిక కార్యక్రమాలనీ ఊళ్లు
తిరగాల్సి వచ్చేది. అయితే వీలున్నప్పుడల్లా నా స్వస్థలానికి
వెళ్తుండేదాన్ని. ఉన్న కొద్ది సమయంలోనే నా చిన్ననాటి స్నేహితురాళ్లతో
గడిపేదాన్ని. నేను తిరుగాడిన ప్రాంతాలన్నీ చూసుకునేదాన్ని. మద్రాస్ వచ్చి
సినీ ఆర్టిస్టుగా మంచి పేరు వచ్చిన తరువాత మా ఊరు ఎక్కువగా
వెళ్లలేకపోయాను.

సినిమా హీరోయిన్ అయిన అమ్మాయి వస్తే గలాభా జరుగుతుందని ఇంట్లోవాళ్లు
వద్దనేవారు. నా స్నేహితురాలు జగదాంబ మాత్రం ఇక్కడకు వస్తుండేది. ఆవకాయ
దబ్బలు,వారికి పండిన కాయగూరలు తెచ్చేది. జగదాంబ ఒక్కతే కాదు, మా ఊరి
వాళ్లెవరు మద్రాసు వచ్చినా మా ఇంటికొచ్చి వెళ్లేవారు. ఇప్పటికీ
పెద్దాపురం మనుషులెవరు కనిపించినా నాకు ప్రాణం లేచొచ్చినట్లుంటుంది.
వారెవరో తెలియకపోయినా, నాకు మాత్రం చాలా ఆత్మీయులుగానే అనిపిస్తుంటారు.

ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, ఆంధ్రజ్యోతి, చెన్నై
ఫోటోలు : కర్రి శ్రీనివాస్, నలజర్ల పానకాల శేషవినాయక్

65 ఏళ్ళు గడిచినా తడియారని అమ్మ కళ్ళు

నవమాసాలు మోసి కనడంతోనే… కమలక్క పేగుబంధం తెగిపోలేదు.
అరవై ఐదేళ్లుగా… ఆ బిడ్డ జ్ఞాపకాలను మోస్తూనే ఉంది!!
మనసు నిలువనప్పుడు బొగ్గుబావి దగ్గరికెళ్లి చూస్తూనే ఉంది.
నెలల బిడ్డను అడవికి వదిలి, ఉద్యమ ప్రమాణాన్ని నెరవేర్చేందుకు
తుపాకీని భుజం మార్చుకున్న క్షణాలవి. నేటికీ తడియారని అమ్మ కళ్లవి! 
‘‘ఎర్ర గోపయ్య అనే కామ్రేడ్ ఎదురై ఒక కోయవ్యక్తి గురించి చెప్పాడు. అతను గార్ల జాగీరు (ఇప్పుడు వరంగల్ జిల్లాలోని డోర్నకల్ ప్రాంతం) గుట్ట సమీపంలో ఉన్న బొగ్గుబావి దగ్గర ఉన్నాడని తెలిసి వెళ్లాను. ఆ కోయ అతనికి ముగ్గురూ ఆడపిల్లలే, మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్నాడట. నా బిడ్డని చూడగానే ఎంతో సంతోషంగా తీసుకున్నాడు. నేను మాత్రం కంటికీ, మింటికీ ఏకధారగా ఏడ్చాను’’

‘‘ఆ సమయంలోనే నా భర్త నాతో అన్న మాట కూడా చెప్పాలి. ‘అతనికి నీ బిడ్డని ఇచ్చేటపుడు నువ్వెంత ఏడ్చావో… ఇప్పుడు నీ బిడ్డని తిరిగి ఇవ్వడానికి అతను కూడా అంతే ఏడుస్తాడు కదా’ అని. నిజమే ఎంతో ఇష్టంగా నా బిడ్డను నా దగ్గరనుంచి తీసుకున్నాడు’’

ఓ మనిషి ఒంట్లో ఎంత నీరుంటుంది? ఏ వైద్యుడినడిగినా చెబుతాడు. ఓ మహిళ కంట్లో కన్నీరెంతుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఏ వైద్యుడూ చెప్పలేడు. బిడ్డను దూరం చేసుకున్న మహిళ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదు. ‘‘ఆరు నెలల బిడ్డను చేతిలో పెట్టుకుని ఎవరు తీసుకుంటారా… అని రెండు కిలోమీటర్లు అడవిబాటలో నడిచాను. మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఓ కోయదంపతులు కంటబడగానే వారిచేతిలో బిడ్డను పెట్టాను. ఆ తర్వాత అమ్మపాల కోసం ఏడ్చే ఆ పసిబిడ్డ కంటే బిగ్గరగా ఏడుస్తూ వెనుదిరిగాను. వెక్కి వెక్కి ఏడ్చాను. చేతులతో తలబాదుకుంటూ ఏడ్చాను. ఆ బిడ్డను వదులుకుని ఇప్పటికి 65 ఏళ్లవుతోంది. ఆ రోజు నా కన్నీటి చెమ్మ ఇప్పటికీ నా ఒంటిపై తడిగానే ఉంది’’ తెలంగాణ సాయుధపోరాటంలో దళసభ్యురాలిగా పనిచేసిన చెన్నబోయిన కమలమ్మ మనసు లోతుల్లో గూడుకట్టుకుపోయిన జ్ఞాపకం ఇది.

తెలంగాణ సాయుధపోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన మహిళల గురించి వినే ఉంటారు. కమలమ్మ రజాకార్లపై కత్తిదూయడంతో పాటు తన కన్నపేగును కూడా కోసేసుకుంది. కమలమ్మకు ఊహ తెలిసేనాటికే తన అన్నలు మందాటి వెంకటయ్య, నారాయణ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. కమలమ్మకు ఎనిమిదేళ్లకే చెన్నబోయిన ముకుందం అలియాస్ అప్పన్నతో పెళ్లయిపోయింది. ఇద్దరూ ఆడుతూ పాడుతూ పెరిగి ఉద్యమంలోకి అడుగుపెట్టారు. పదిహేనేళ్ల వయసుకే ఒక బిడ్డకు తల్లయిన కమలమ్మ రెండేళ్ల పిల్లాడిని ఆడపడచుకి అప్పగించి భర్తతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

దళ సభ్యురాలిగా తుపాకీపట్టడం, గుర్రపుస్వారీ చేయడం వంటి వాటిలో చాలా చురుగ్గా ఉండేది. ‘‘నేనొక్కదాన్నే కాదు చాలామంది మహిళలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. నా ఆచూకి చెప్పమని పద్నాలుగేళ్ల మా చెల్లి (మోహినమ్మ)ని జైల్లో పెట్టారు. వయసుతో పనిలేకుండా ప్రతి మహిళా ఉద్యమం కోసం ముందుకొచ్చి నిలబడేది. నేను రెండోసారి నెలతప్పాక ఇంటికి వెళదామనుకున్నాను. కాని అప్పటికి ఉద్యమం చాలా వేడిగా ఉంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయడానికి రజాకార్లు కోటి కన్నులతో వెతుకుతున్నారు. దాంతో చేసేది లేక దళంలోనే కొనసాగాను’’ ఉద్యమంలో మహిళ పోరాటానికి కమలమ్మలాంటివారెందరో ఉన్నా ఆమె చేసిన త్యాగానికి ప్రతి ఒక్క మహిళా సలామ్ చెప్పకమానదు.

పురిటినొప్పుల వేళ…
అప్పట్లో రజాకార్ల ఆకృత్యాల గురించి చాలా కథలు ఉన్నాయి. గర్భిణిగా ఉన్న కమలమ్మను జనజీవనంలోకి పంపిస్తే రజాకార్లకు దొరికిపోతుందేమోనని వెంటనే పెట్టుకున్నారు. ‘‘మా దళ నాయకుడు మద్దికాయల ఓంకార్. ఉపనాయకుడు నా భర్త అప్పన్న. వీరి అడుగుజాడల్లోనే పోరాటాన్ని సాగించేవాళ్లం. నేను తొమ్మిదినెలల గర్భంతో ఉన్నప్పుడు గుండాల దగ్గర వెంకటాపురం అడవిలో ఉన్నాం. నాకు నొప్పులు వస్తున్నాయని తెలియగానే మా వాళ్లు వెళ్లి ఒక గిరిజన మహిళను తీసుకొచ్చినా దగ్గరుంచారు. బిడ్డ పుట్టాక నేను బయటికి వద్దామనుకున్నాను కాని ఉద్యమానికి అది చాలా ముప్పు తెస్తుందని తెలిసి ఊరుకున్నాను.

కోయ అతని చేతిలో…
ఒకరోజు ఓంకార్ నన్ను…‘కమలక్కా…నీకు బిడ్డ కావాలా…ఉద్యమం కావాలా’ అని అడిగారు. నాకు నోట మాట లేదు. ‘రజాకార్లు మన ఆచూకీ కోసం అడవిలోకి మనుషుల్ని పంపారు. బిడ్డ ఏడుపు వల్ల మన జాడ వారికి తెలిసే ప్రమాదం ఉంది. నిజంగా అలానే జరిగితే మనల్ని నమ్ముకున్న వేలాదిమందికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన చెబుతుండగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘ఇక్కడే ఎవరైనా గిరిజనులకు పెంచుకుంటానంటే వారికి నీ బిడ్డను ఇచ్చేయ్’ అని సలహా ఇచ్చారు. నా భర్త అప్పన్న కూడా ఓంకార్ మాటల్ని సమర్థించారు.

ఏం చేస్తాను… ఆ సమయంలో ఉద్యమానికి నా అమ్మతనం అడ్డమయింది. దళనాయకుడి ఆజ్ఞమేరకు అడవిలో ఉన్న గిరిజనులందరికీ నా బిడ్డను చూపించి పెంచుకోమంటే వద్దన్నారు. జాంపండులా మెరిసిపోతూ ఉన్న నా బిడ్డ వారిలో కలవడని వద్దన్నారు. ఇంతలో ఎర్ర గోపయ్య అనే కామ్రేడ్ ఒక కోయ అతని గురించి చెప్పాడు. అతనికి నా పిల్లాడిని ఇచ్చేశాను’’ కమలమ్మ కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ క్షణంలో ఆరునెలల బిడ్డను తలచుకుంటూ పచ్చిబాలింతగా మారిపోయింది.

ఆరుగురు సంతానంలో…
‘‘పోరాటంలో భాగంగా ఎక్కడెక్కడికో తిరిగాం. కొన్నాళ్లు జనాల్లో, కొన్నాళ్లు అజ్ఞాతంలో అవిశ్రాంతంగా పోరాటం… అలా కొన్నేళ్లకు రజాకార్ల పీడ విరగడైయింది. మేమంతా జనంలో కలిసి మామూలు జీవితాలు సాగించాం. మా ఆడపడుచు దగ్గరున్న పెద్దబ్బాయిని తీసుకుని వరంగల్‌లో స్థిరపడ్డాం. ఆ తర్వాత నాకు మరో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. భార్యాభర్తలమిద్దరం కష్టపడి పిల్లలందరినీ చదివించాం. పెద్దబ్బాయి సత్యనారాయణ మున్సిపల్ కౌన్సెలర్‌గా పనిచేశాడు. మూడోవాడు విజయకుమార్ పియుసి చదివాడు, నాలుగోవాడు రవీందర్ ఆరోజుల్లో డిగ్రీ పూర్తిచేశాడు.

ఐదు మా అమ్మాయి పద్మావతి పీజీ చేసి బ్యాంకులో పనిచేస్తోంది. ఆఖరివాడు సుధాకర్ ఎమ్‌ఏ ఎంఫిల్ చేసి మాస్కోలో రష్యన్ లిటరేచర్‌పై ఒక కోర్సు చేసి అక్కడినుంచి జర్మనీ వెళ్లాడు. మా రెండోవాడు ఎక్కడున్నాడో… ఎలా ఉన్నాడో…’’ మళ్లీ కమలమ్మ స్వరంలో నీరు ప్రవహించింది. ‘‘ఇంతమందిని కని… అంతవాళ్లను చేశాను. వాడు కూడా నా దగ్గరే ఉంటే ఏమయ్యుండేవాడో… వాడిని వదిలాక చాలాసార్లు గార్లగుంట బొగ్గుబావి దగ్గరికి వెళ్లి వెతికాను. అతని ఆచూకీ దొరకలేదు. అయితేనేం… నాకన్న గొప్పగా పెంచగలడా? అని నా మనసు నన్ను వేధిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది కమలమ్మ.

తెలంగాణ సాయుధపోరాటంలో కమలమ్మ ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని నోబుల్‌ప్రైజ్ ఎంపికకు కూడా ఈమె వివరాలు పంపారు. ప్రస్తుతం కమలమ్మ వయసు 83 సంవత్సరాలు. తన బిడ్డలకంటే ఆరోగ్యంగా, హుషారుగా ఉన్న ఈమె దగ్గర కూర్చుంటే బోలెడు విషయాలు, ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ కన్నతల్లి కళ్లు వెతికే ఆ బిడ్డ ఇప్పటికైనా ఆమె కంటబడితే ఎంతబాగుండునో కదా!

– భువనేశ్వరి, ఫొటో: పి. వరప్రసాద్