జ్ఞాపకాల వరండా మెట్ల మీద నిలబడి…

vamsi
ఆ రోజుల్లో
పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో… కాలవ నీళ్లల్లో చంద్రుణ్ని చూస్తా కాలవగట్టు మీంచి మచ్చుమిల్లిదాకా నడిచి,అక్కణ్నించి రాంపురం వెళ్లడం సరదా నాకు. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వెలగల భూమిరెడ్డి గారింటి చుట్టూ, వెలగల అప్పారెడ్డిగారి దొడ్డితోనూ అల్లుకున్నాయి. ఎందుకంటే వాళ్లిళ్లల్లో అద్దెకుండేవాళ్లం. వాళ్ల దొడ్లో నారింజ చెట్లుండేవి. కొన్ని కాయలేమో తియ్యగా… కొన్ని పుల్లగా ఉండేవి. వాటి రసంతో మా అమ్మ పులిహోర చేసిస్తే… నేను, మా తమ్ముడు, మా ఫ్రెండు ముమ్మిడివరపు త్యాగరాజు ఆ పులిహోరట్టుకుని మా అమ్మమ్మగారి ఊరైన బలభద్రపురం వెళ్లి అక్కణ్ణించి నైన్‌డౌన్ ప్యాసింజర్లో అన్నవరం బయల్దేరేవాళ్లం.

తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అన్నవరం స్టేషన్‌లో దిగితే అక్కణ్ణించి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఊరు. వెన్నెల్లో ఆ కొండమీద గుడి దీపాల్ని చూస్తా నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. గుళ్లు చేయించుకుని సత్యదేవుడి దర్శనం చేసుకున్నాక, గుడిమెట్ల మీద కూర్చుని మా అమ్మిచ్చిన పులిహోర క్యారేజీ విప్పి తింటుండేవాళ్లం.

బెన్నిబాబని నాకో ఫ్రెండుండేవాడు. ఆడికో లవ్‌స్టోరీ. తాతారెడ్డిగారి సైకిల్ షాపులో సైకిల్ అద్దెకి తీసుకుని,నన్నెక్కించుకుని రాంపురం హైస్కూల్ గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లేవాడు. చీకట్లో ఆ అమ్మాయితో చెరుకుతోటల్లోకెళ్లిపోయి మాట్లాడేవాడు. నిద్రగన్నేరు చెట్టు కింద చిన్న పాకుంటే అందులో కూర్చునేవాణ్ని నేను. తెల్లవారుజామున ఏ నాలుగు గంటలకో తిరిగొచ్చేవాళ్లం. ఓసారి సీతాఫలం తింటా ఓ గింజ నా చెవులో పెట్టేసుకున్నాను.

గాంధీ డాక్టర్ (మోహన్ కందాగారి మేనమామ, మామగారు కూడా) గారి ఆస్పత్రికి తీసుకెళ్లి చెవి కోయించి గింజ తీయించాలన్నారంతా. కానీ మేడపాటి నర్సిరెడ్డిగారింటిరుగు మీద డిస్పెన్సరీ పెట్టిన మందుల అప్పన్నగారు సైకిల్ ఊచతో నిమిషాల మీద ఆ పిక్కని బయటికి తీసేశాడు. నాకు ఆ గింజ మీద చాలా కోపం వచ్చేసి, పచ్చడి బండ తీసుకుని పొడుం పొడుం చేసేశాను దాన్ని.

మా ఊరి చివరి పొలాల్లో బెల్లం వండేవారు. నాలాంటి కుర్రాళ్లం… కొబ్బరికాయల కళ్లు పొడిచి, నీళ్లు పారబోసి వాళ్లకిస్తే వాటిని పెనంలో ఉడుకుతున్న బెల్లం పాకంలో వేసేసేవాళ్లు. అది బెల్లంతో కలిసి బాగా ఉడికి, కొబ్బరి సున్ని తయారయ్యేది. రెండో రోజుకో, మూడో రోజుకో మేమెళ్తే బెల్లంతో పేరుకుపోయిన కొబ్బరికాయను మాకిచ్చేవారు. అది పగలగొట్టుకుని తింటా ఉంటే గొప్ప రుచిలే.

రాంపురంలో కొత్తగా కట్టిన అన్నపూర్ణా టాకీసు తిక్కశంకరయ్య సిన్మాతో మొదలయ్యింది. ఓపెనింగ్‌కిఎన్టీవోడూ, కృష్ణకుమారి వస్తే వాళ్లని చూడ్డానికొచ్చిన జనాన్ని లెక్కెయ్యడం ఎవడి తరమూ కాలేదు. ఆ జనాల్లో నలిగిపోతున్న నన్ను కుళ్లు కాలవలోకి తోసేసేరు. అదొక జ్ఞాపకం.

రికార్డింగ్ డ్యాన్సులు రాంపురం రాజుగారి హాలూ, కిషోర్ టాకీసుల్లో సెకండ్ షోలూ అబ్బో… ఎన్ని ఆకుపచ్చటి జ్ఞాపకాలు!

పండగలప్పుడు ఇంట్లో ఏవైనా పిండి వంటలు చేసుకుంటే వాటిని గిన్నెలో పెట్టి, పైన ఒక అరిటాకు ముక్కతో మూతేసి కప్పి ఆ పక్కవాళ్లకి, ఈ పక్కవాళ్లకి ఇచ్చుకునేవాళ్లం. వాళ్లొండుకుంటే మాకుపంపేవాళ్లు.

కానీ, కాలం మారిపోయింది. ఇప్పుడు పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలీదు.
మొన్న మేం పసలపూడి పెళ్లికెళ్లినప్పుడు చూశాను… ఓ పదేళ్ల పిల్ల మాసిపోయిన చుడీదారేసుకుని గేదెలు కాస్తోంది. ఒకప్పటి పరికిణీలూ ఓణీలూ ఎక్కడా కనబడలేదు.

ఒకప్పుడు గుర్రపు బళ్ల చప్పుళ్లు, రిక్షాల గలగలలు చిత్రమైన సందడి. ఎప్పుడన్నా చిన్న కారు ఊళ్లోకొస్తే అందరూ ఇళ్లల్లోంచి తొంగి చూసేవారు. కానీ ఇప్పుడు ఒక ఇన్నోవా వెళ్తుంటే, ఇంకో స్కార్పియో దానికెదురొస్తుంది. మా ఊళ్లో తీర్థం జరిగినప్పుడు… వంద మీటర్ల పెద్ద తాడుని ఉత్సవ రథానికెడా పెడా కట్టి చిన్నా పెద్దా, పేదా గొప్పా అన్న తేడా లేకుండా పెద్ద వీధి నుంచి తూర్పుపేట వరకూ లాగేవారు. కానీ,ఇప్పుడా రథాన్ని మహీంద్రా ట్రాక్టర్ లాగుతోంది.

కాలం ఎలా మారిపోయిందో, జీవితం ఎంత యాంత్రికంగా తయారయ్యిందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి! అనుభూతులన్నవే లేకుండా పోయాయి. వేసుకునే బట్టల దగ్గర నుంచి మాట్లాడే భాష దాకా మొత్తం మారిపోయింది. పండుగలూ పబ్బాలూ లేవు. పలకరింపులూ పంచుకోవడాలూ లేవు. ఆటపాటలు లేవు. అల్లరి చేష్టలూ లేవు. అన్నీ ఉన్న ఆనాటి రోజులు మళ్లీ రావు. ఆ అనుభవాలు అందవు.ఆ అనుభూతులూ దొరకవు. ఆనందాన్ని నింపిన ఆనాటి పచ్చాపచ్చటి జ్ఞాపకాలు, అందమైన రోజులుమళ్లీ తిరిగొస్తాయన్న నమ్మకం కూడా నాకు లేదు.
సమీరకు చెప్పిన విధంగా…

 

 

 

 

పుణ్యంకొద్దీ పూర్ణ!

ఇన్నర్ వ్యూ

annapurna

పుణ్యంకొద్దీ పురుషుడు అని కదా అంటారు.అక్కినేని మాత్రం పుణ్యంకొద్దీ పూర్ణ అంటారు! పూర్ణ అంటే అన్నపూర్ణ. ఆయన అర్ధాంగి. ఆయన వ్యక్తిత్వంలోని ఆ నిండుదనం… ఆయన ముఖారవిందంలోని ఆ చల్లదనం… పూర్ణ నింపినవే! అన్నపూర్ణ అడుగుపెట్టాకే అక్కినేని జీవితం పరిపూర్ణం అయింది. అన్నపూర్ణ తోడుగా ఉండబట్టే ఆయన నటన కళాప్రపూర్ణం అయింది.ఆరు దశాబ్దాల జీవన సహచర్యంలోని ఏ ఒక్క క్షణమూ ఈ దంపతుల హృదయాలు విడివిడిగా స్పందించలేదు!ప్రస్తుతం అన్నపూర్ణ లేరు. అలాగని ఆవిడ తన భర్తను ఒంటరిగా వదిలి వెళ్లిపోలేదు. ‘‘ఆమె తలపులు అనుక్షణం నన్ను పలకరిస్తూనే ఉన్నాయి’’ అని పలవరిస్తున్నారు అక్కినేని. అన్నపూర్ణ లేకుండా తొలిసారి పెళ్లిరోజు (ఫిబ్రవరి 18)ను వేదనతో గడిపిన ఆ ‘పూర్ణ’జన్ముడి ఇన్నర్‌వ్యూ ఇది!ద్విగుణంచాహారో చతుర్గుణంచ బుద్ధిః … షడ్గుణంచ క్రోధః అష్ట గుణంచ కామఃఇది రాసింది ఓ మగాడు కాబట్టి ఎంతవరకూ న్యాయంగా రాశారో నాకయితే తెలీదు కానీ ఆడాళ్లు మగాళ్లకంటే రెండు రెట్లు ఆహారం తీసుకుంటారట! మగాడికంటే వాళ్లకు నాలుగురెట్లు బుద్ధి కుశలత ఉంటుందట! ఆరు రెట్లు ఈర్ష్యాద్వేషాలుంటాయట! ఎనిమిది రెట్లు ఇంకేదో ఉంటుందట! బుద్ధి కుశలతలో ఒకే భాగం ఉన్న మగాడు తనకంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్న భార్య గుణాన్ని ఎలా కనిపెడతాడు? ఆమెను ఎలా నిర్వచిస్తాడు? నేనే కాదు, నాకు తెలిసి ఏ మగాడూ తన భార్యను పూర్తిగా అర్థం చేసుకోలేడు.మాది కృష్ణా జిల్లా వెంకట రాఘవాపురం. నాకు నాలుగేళ్ల వయసప్పుడే నాన్న చనిపోయారు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములకు తలా ఐదెకరాలు వచ్చాయి. అప్పట్లో ఎకరం ఆరొందలు పలికేది. అంటే ఒక్కొక్కళ్లకీ మూడువేల ఆస్తన్నమాట! ఆ మూడువేలూ పెట్టే నేను చదువుకోవాలి. మా వంశంలో ఎవరికీ చదువు లేదు. నాకయినా వస్తుందో లేదో తెలీదు. ఉన్న మూడు వేలూ ఖర్చుపెట్టి చదివిస్తే ఉద్యోగం వస్తుందో రాదో చెప్పేలేం. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టేయడం అవసరమా? ఇలాగే ఆలోచించింది మా అమ్మ. ఏదో పాటలు పాడుతున్నాడు, కోలాటం అంటున్నాడు, వాటిలో అయినా పైకి వస్తాడేమోనని నాటకాల్లో చేర్పించమని అన్నయ్యతో చెప్పింది. దాంతో తొమ్మిదో యేట తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నాను. అప్పట్నుంచీ పంతొమ్మిదేళ్ల వరకూ స్టేజి మీదే జీవితం గడిచిపోయింది. మొదటి నాటకానికి అర్ధరూపాయి తీసుకున్నవాణ్ణి ఆఖరి నాటకానికి ఐదు రూపాయలు తీసుకున్నాను. అంటే అప్పట్లో నేనో స్టార్ కింద లెక్క! ఆ తర్వాత సినిమాల్లో అడుగు పెట్టాను. మెల్లగా నిలదొక్కుకున్నాను. ఇక మిగిలింది… పెళ్లే!

పిల్ల దొరకలేదు!

అప్పట్లో సినిమావాళ్లకి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు. ఈ ఫీల్డ్‌లో చెడిపోవ డానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే అభిప్రాయమే అందుకు కారణం! చివరికి మా మేనమామ కూడా తన కూతుర్ని ఇవ్వనన్నాడు. దాంతో మధు సూదనరావుగారు, మరికొంతమంది శ్రేయోభిలాషులు నాకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఎంత వెదికినా పిల్ల దొరకలేదు. ఆ క్రమంలో ఓరోజు పేకాటలో వాళ్లకు ఫ్రెండయిన మా మామగారు అన్నపూర్ణను చేసుకోడానికి ఓ మంచి కుర్రాడెవరైనా ఉంటే చెప్పమని అడిగారట! వీళ్లు వెంటనే నా పేరు చెప్పారు. మా మామగారు పూర్ణను నాకివ్వడానికి ముందుకొచ్చారు. అప్పటికీ వాళ్ల బంధువులంతా సినిమా వాడికి పిల్లనివ్వొద్దు అంటూ ఒత్తిడి చేశారట! అయినా ఆయన నన్ను నమ్మారు. అన్నపూర్ణను నాకిచ్చి పెళ్లి చేశారు.

పూర్ణను ఓ మంచి భార్య అనే కంటే ఓ మంచి స్త్రీ అనాలి. నా ఆలోచనలను అంచనా వేయడంలో, అర్థం చేసుకో వడంలో, వెనకుండి ముందుకు నడి పించడంలో ఆమెను ఇతర స్త్రీలు ఆదర్శంగా తీసుకోవాలి. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా ఎప్పుడూ చలించేవాడిని కాదు నేను. ఓ సమయంలో నపుంసకుడిని అనిపించుకున్నాను. వీడు మగాడే కాదు, ఆడపిల్లల్ని చూడడు, మాట్లాడడు అని అందరూ అంటూవుంటే సిగ్గుపడ్డాను. అవమానంగా ఫీలై ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు సముద్రం దగ్గరకు కూడా పోయాను. అలాంటి పరిస్థితుల్లో అన్నపూర్ణ నా జీవితంలోకి వచ్చింది. తను మామూలుగా రాలేదు. ఎంతో అదృష్టాన్ని, ఎన్నో సుఖసంతోషాల్ని తనతో పాటు తీసుకొచ్చింది.

ఓర్పులో భూదేవే!

హీరోల భార్యలకి ఓర్పు ఉండాలి. ముఖ్యంగా నాలాంటి రొమాంటిక్ హీరో భార్యకయితే మరీ ఎక్కువుండాలి. చుటు ్టపక్కల వాళ్లు, మా స్టార్స్‌లో కొందరు ‘మీ ఆయన ఫలానా హీరోయిన్‌తో భలే యాక్ట్ చేస్తారండీ, చాలా నేచురల్‌గా చేస్తారండీ’ అని నా భార్యను రెచ్చగొట్టేవారు. దానికి ఆవిడ కోప్పడేది కాదు. ‘అలా చేస్తారు కాబట్టే కదండీ మా ఆయనకి రొమాంటిక్ హీరో అని పేరు’ అంటూ నవ్వేసేది. ఎదుటి వాళ్ల ఆలోచనల్ని చదవగలిగే తెలివితేటలు ఉన్నవాళ్లు మాత్రమే అలా మాట్లాడగలరు. లేకపోతే అంతమంది అందమైన హీరోయిన్‌లతో తన భర్త కలసి నటిస్తోంటే, సన్నిహితంగా ఉంటుంటే… చూసి భరించడానికి ఎంత ఓర్పు ఉండాలి!

కరణేషు మంత్రి!

పూర్ణ నవలలు బాగా చదివేది. ‘ప్రేమనగర్’ చేయడానికి తనే కారణం. కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల తను చదివింది. చేస్తే బాగుంటుంది, దేవదాసు కంటే పేరొస్తుంది అంది. ఆమె చెప్పింది నిజమే. సినిమా పెద్ద హిట్. అలాగే ‘భార్యాభర్తలు’లో తిరుగుబోతు పాత్ర నాది. సినిమా నిండా పాటలు, డ్యాన్సులు, రొమాన్సులే! నేనా పాత్ర చేయడం కె.వి.రెడ్డికి నచ్చలేదు.

‘‘మీరు శ్రీరామచంద్రుడిలా ఉండే వేషాలు వేస్తే బాగుంటుంది, అలాగయితేనే ఆడాళ్లు చూస్తారు, విటుడిగా చేస్తే ఇష్టపడరు’’ అన్నారు. ఆయనలా అన్నారు కదా అని, ఆ సినిమా అన్నపూర్ణకి చూపించాను. ‘‘మీరు రొమాంటిక్ హీరో కదా, ఇలాంటివి ఉన్నా ఆడవాళ్లు ఇష్టపడతారు’’ అంది. అంత ఆధునికంగా ఆలోచించేది. అలాగే ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో నన్ను కృష్ణుడిగా చేయమంటే నేను- ‘‘కృష్ణుడిగా రామారావుకు జనం అలవాటు పడి పోయారు కాబట్టి ఆయననే వేయనివ్వండి. సినిమా బాగా ఆడుతుంది, మీకూ నష్టం రాదు.

నాకు అర్జునుడి వేషమివ్వండి చాలు’’ అని సజెస్టివ్‌గా చెప్పాను. ఆ సినిమా చూశాక అన్నపూర్ణ అంది- ‘‘మీరు రామారావు లేకుండా చెంచులక్ష్మిలో బాగున్నారు. ఎవరి పాత్రలు వారివే కాబట్టి మాయాబజార్‌లోనూ బాగానే ఉన్నారు. ‘భూకైలాస్’లో రామారావుని ఆడించే నారదుడి వేషం కూడా బాగుంది. కానీ ఇందులో మీ ఇద్దరివీ ఢీ అంటే ఢీ అనే పాత్రలు.

ఆయనముందు మీరు నిలబడలేక పోతున్నారు. ఆయనకంటే మీ వాయిస్ వీక్‌గా ఉంది, ఆయనముందు మీ పర్సనాలిటీ కూడా వీక్‌గానే ఉంది. అందుకే ఇకమీదట ఇలాంటి పాత్రలు చేయవద్దు.’’ నేను ఆశ్చర్యపోయాను! తను అంత బాగా అనలైజ్ చేయగలదన్నమాట!

మొదటిసారి కాదంది!

మా ఇద్దరికీ ఎప్పుడూ పెద్దగా గొడవలు రాలేదు కానీ ఒక్కసారి మాత్రం గొడవ పడ్డాం… గుడివాడ కాలేజీకి లక్ష రూపాయలిచ్చి నప్పుడు! అదే గుడివాడలో నేను చెప్పుల్లేకుండా నడిచినరోజుల్లో నన్ను ఆశీర్వదించిన పెద్దలు వచ్చి కాలేజీ కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వమని అడిగారు. అప్పటికి నేను సినిమాకి పదిహేను వేలు తీసుకుంటున్నాను.

చాలా సినిమాలు చేశాను గానీ వెనకేసుకున్నది కేవలం లక్ష రూపాయలే. ఎందుకంటే ఆదాయపు పన్ను చాలా ఎక్కువ ఉండేది! దాంతో ఎక్కువ డబ్బు మిగిలేది కాదు. అయినా ఇస్తానన్నాను. అప్పుడే మొదటిసారి పూర్ణ నన్ను వ్యతిరేకించింది. ‘‘ఇద్దరు పిల్లలున్నారు, మూడో బిడ్డ కడుపులో ఉంది, ఒక్క ఇల్లు తప్ప మనకంటూ ఏమీ లేదు, లక్ష రూపాయలు ఎలా ఇచ్చేస్తారు’’ అని ప్రశ్నించింది. ‘‘నేను కారు నడుపుతున్నాను.

ఎప్పుడు బ్రేక్ వేయాలో నాకు తెలుసు. నువ్వు వెనక సీట్లో కూర్చున్నావు. అయినా ఎప్పుడేం జరుగుతుందోనని భయపడి బ్రేకు వేయమంటున్నావ్’’ అన్నాన్నేను. ఎందు కంటే అప్పటికి నేను మంచి డిమాండ్‌లో ఉన్నాను. కనీసం మరో ఏడెనిమిదేళ్లు సంపాదిస్తాను.

‘‘చదువు సంధ్యలు లేకుండా వీధుల్లో తిరిగిన నాలాంటివాడు ఇవాళ ఇలా ఉన్నాడంటే వాళ్లంతా ఆశీర్వదించి పంపడం వల్లే. వాళ్లు నోరు తెరిచి అడిగినప్పుడు ఇవ్వనంటే ఎలా?’’ అన్నాను. ‘‘అయినా సరే, ఓసారి ఆలోచించండి’’ అంది. నేను పట్టు వదల్లేదు. ఎలాగో తనని ఒప్పించాను.

ఇదంతా తన మాట వినకూడదనీ కాదు, అది నేను సంపాదించిన డబ్బు అన్న అహమూ కాదు. ఒకప్పుడు నాటకాలు వేసేవాడినని, సినిమావాడినని తక్కువగా చూశారు. పిల్లనివ్వడానిక్కూడా వెను కాడారు. సినిమాల్లో నటించినంత మాత్రాన చెడిపోతామా? ఉద్యోగాలు చేసేవాళ్లు చెడిపోరా? అయినా వాళ్లు చెడిపోకపోవడం గొప్ప కాదు.

చెడిపోవడానికి ఇన్ని అవకాశాలు ఉండి కూడా మేం చెడిపోలేదంటే… అది గొప్ప! మమ్మల్ని అలా అంచనా వేస్తారు కాబట్టే, మా దగ్గరకొచ్చి ఏదైనా అడిగినప్పుడు చేయలేనని అనకూడదని నా ఉద్దేశం!

అప్పుడు తప్ప ఏరోజూ దేనికీ పూర్ణ నాకు అడ్డు చెప్పలేదు. నా కోసం ఇది చెయ్యండి అని కోరలేదు. తనే నాకోసం చాలా చేసింది. స్టూడియో కడదామను కునేటప్పటికి పిల్లలింకా మైనర్లే. తనని సలహా అడిగితే ‘ఏమీ ఆలోచించొద్దు, వెంటనే మొదలు పెట్టేయండి’ అంది. ఆ సమయంలో నాకున్న అండ తనొక్కతే. తనే లేకుంటే నేనేమీ చేయగలిగేవాడిని కాదు!

తన బాధ చూడలేకపోయాను!

తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఆస్తులు, గుణాలు, రూపం ఎలా వస్తాయో… అలా అనారోగ్యం కూడా వస్తూ ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ల నాన్న మైగ్రెయిన్‌తో చాలా అవస్థపడేవాడు. అది పూర్ణకు పదమూడేళ్లకే వచ్చింది. పిల్లలు పుట్టి బ్లడ్‌లో మార్పు వస్తే పోతుందేమో అనుకున్నాం. కానీ పోలేదు. మెనోపాజ్ వచ్చాక పోవచ్చన్నారు. అప్పుడూ పోలేదు. అలాగే వాళ్ల నాన్నమ్మకు డయాబెటిస్ ఉంది. అది ఈమెకి పద్దెనిమిదేళ్లకే వచ్చింది. వాళ్ల తాతగారికి ఆర్థరైటిస్ ఉంది.

ముప్ఫయ్యేళ్లకే ఈమెకీ వచ్చింది. వీటన్నిటికీ మందులు వాడీ వాడీ చివరకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దాంతో చలాకీగా తిరుగుతూ అన్నీ చక్కబెట్టిన పూర్ణ చక్రాల కుర్చీకి పరిమితమవ్వాల్సి వచ్చింది. అన్నిటా తానై అందరినీ సాకిన ఆమెకు మరొకరి సాయం అవసరమయ్యింది. అలా చాలా యేళ్లు ప్రత్యక్ష నరకాన్ని చవి చూసింది. రోగం తన శరీరాన్ని నమిలేస్తుంటే, ఆమె పడుతున్న బాధ నా మనసును మెలిపెట్టేది.

ఆమెకు చివరి రోజులు సమీపించాయన్న నిజం నా గుండెను పట్టి పిండేసేది. తను లేని జీవితం ఊహించడానికి భయంగా ఉన్నా, తను అనుభవిస్తున్న బాధను చూడలేకపోయాను. మనసు చంపుకుని, తనను త్వరగా తీసుకెళ్లిపొమ్మని దేవుణ్ని ప్రార్థించాను. ఆ దేవుడు నా ప్రార్థనే విన్నాడో లేక పూర్ణ ఆయుష్షు అంతటితో పూర్తయ్యిందో తెలీదు కానీ… నా అన్నపూర్ణ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్లిపోయింది.

పోయినోళ్లందరూ మంచోళ్లు… ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు… ఓ సినిమాలో నేను పాడిన పాటలోని చరణాలివి. నా భార్య పోయింది. తన జ్ఞాపకాలు మాత్రం నాతోనే ఉన్నాయి. తనకి గులాబిరంగంటే ఇష్టం. స్వీట్లంటే ఇష్టం. నల్లంచు తెల్లచీరంటే ఇష్టం. అందుకే తనను ఆ చీర కట్టే సాగనంపాను. ఇలా ఇంకా కొన్ని మధుర స్మృతులు ఉన్నాయి. వాటిని ఈ భూమ్మీద శాశ్వతంగా నిలపాలను కుంటున్నాను. నా గుండెల్లో, జ్ఞాపకాల్లో ఉన్న అన్నపూర్ణను ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిపోతాను!

అన్నపూర్ణ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను భోజనం తినకుండా, కావాలని వీక్‌గా తయారయ్యి, తాగుబోతుల మీద స్టడీ చేసినందుకే ‘దేవదాసు’లో అంత బాగా నటించానన్న మాట ఎంత అబద్ధమో, ఆవిడ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందన్న మాట కూడా అంతే అబద్ధం!

తలుచుకున్నప్పుడల్లా కళ్లు చెమరుస్తాయి!

ఓసారి మా ఊరెళ్లినప్పుడు, మా అన్నయ్య సత్తుగిన్నెలో అన్నం తినడం చూసింది పూర్ణ. తర్వాత అన్నయ్యవాళ్లు మా ఇంటికొచ్చినప్పుడు ఓ వెండి కంచాన్ని మా వదిన చేతిలో పెట్టింది. ‘‘ఇకమీద బావగారికి ఇందులోనే భోజనం పెట్టండక్కా’’ అని తను చెబుతుంటే, చాలా ఆనందపడ్డాను. అన్నయ్యలు డబ్బులు అడిగినప్పుడు నేనొక్కోసారి కాదనేవాడిని.

తనేమో నేనటు వెళ్లాక, ‘‘ఆయన బిజీగా ఉంటారు, మీకేదైనా కావలిస్తే నన్నడగండి బావగారూ’’ అంటూ వాళ్లు అడిగినంత చేతిలో పెట్టేది. ఇలాంటివి తలచుకున్నప్పుడల్లా కళ్లు చెమరుస్తాయి. జీవితంలో చాలా సమయాల్లో కళ్లు చెమరుస్తాయేమో కానీ, భార్య గొప్పదనాన్ని తలచుకున్నప్పుడు కళ్లు తడిసే అవకాశం నాలాంటి ఏ భర్తకో గానీ రాదు!

తర్వాతెప్పుడూ నాతో సినిమాకు రాలేదు!

పెళ్లయిన కొత్తలో మా ఆవిడతో సినిమా కెళ్లాను. కొందరు నన్ను గుర్తుపట్టారు. అయితే నన్ను చూసిన ఆనందం కంటే, నా పక్కనున్న స్త్రీ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలమే వారిలో ఎక్కువ కనిపించింది. ‘ఆ వచ్చింది ఎవర్రా’ అన్నాడొకడు. ‘తెలీదు’ అన్నాడు ఇంకొకడు. ‘భానుమతా’ అన్నాడు.

‘భాను మతి లావుగా ఉంటుంది కదా’… వీడి జవాబు. ‘ఒకవేళ అంజలీదేవా’… ‘అంజలి పొట్టిగా ఉంటుందిగా?’… ‘మరి ఎస్.వరలక్ష్మా?’… ‘వరలక్ష్మికి పళ్లెత్తు కదా?’… ‘అయితే ఎవరో ఎక్స్‌ట్రాని కొట్టుకొచ్చుంటాడులే’… ఓ స్త్రీతో నేను కనిపించగానే వాళ్ల మధ్య జరిగిన సంభాషణ ఇది. అంతే… ఆ తర్వాత మా ఆవిడ నాతో ఎప్పుడూ సినిమాకి రాలేదు.
…………..

నేను బాధపడిన సంగతి తనకి చెప్పలేదు!

ఓసారి నేనో షాప్ ఓపెనింగ్‌కి వెళ్లాను. ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుందనుకుంటే అక్కడ కాస్ట్‌లీవి ఏమీ లేవు. అన్నీ ఐదారొందలవే ఉన్నాయి. దాంతో ఆ రేటులోనే ఓ చీర కొని తీసుకెళ్లాను. దాన్ని చూడగానే- ‘‘ఏం టేస్టండీ మీ టేస్టు… ఏం చీర ఇది, అస్సలు బాలేదు’’ అంది. నా మనసు చివుక్కుమంది. అంతే… జీవితంలో మరెప్పుడూ నేను తనకి చీర కొనలేదు. కానీ నేను బాధపడ్డానన్న విషయం తనకెప్పుడూ చెప్పలేదు. నేనిలా చెబుతున్నప్పుడు ఆమె ఆత్మ వింటే ఇప్పటికైనా తనకు తెలుస్తుందేమో!

………….

తనకు తెలిసినంతగా నాకు తెలీదు

పూర్ణ మంచి భార్యే కాదు, మంచి తల్లి కూడా. నేను సినిమా లంటూ తిరుగుతుంటే తనే వాళ్లను పెంచి పెద్దచేసింది. వాళ్ల మంచీ చెడూ ఆమెకు తెలిసినంతగా నాకు తెలీవు. పిల్లల్ని ఏ విషయంలోనూ శాసించేది కాదు. రూల్స్ పెట్టేది కాదు. తల్లి లేని సుమంత్‌ని తనే పెంచి పెద్ద చేసింది. ముఖ్యంగా నాగార్జున అంటే తనకెంత ప్రేమో! నాగార్జునకి కూడా అంతే.

ఆ రోజు డిసెంబర్ 27… ఓ ముఖ్యమైన పనిమీద బెంగళూరు బయలుదేరుతున్నాడు నాగార్జున. నేనెందుకో అటుగా వెళ్తూ చూసేసరికి… తను వాళ్లమ్మ కాళ్లు నొక్కుతున్నాడు. ఆమె ప్రేమగా తన కొడుకుని చూసుకుంటోంది. ఆ దృశ్యం చూడగానే కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి నాకు!

-సమీర నేలపూడి

రసజ్ఞతే జీవితం

అదర్ సైడ్
పరమశివుణ్ని ఫ్రెండ్లీ గాడ్ అంటారు భరణి.
భరణి – మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో శివుడు!
చెంబుడు నీళ్లు, చిటికెడు బూడిద చాలు..
ముక్కంటి ఫ్లాట్ ఐపోతాడని భరణి ధీమా.
‘అవి మాత్రం ఎందుకయ్యా’ అంటాడేమో ఆ భోళాశంకరుడు!
అంతటి మహా శివభక్తుడు భరణి!!
శివ శివా.. మహా శివభక్తుణ్ని కాదు,‘మహాశివ’ భక్తుణ్ని మాత్రమే నేను అంటారు భరణి మళ్లీ.
బహుశా ముక్కంటి భక్తుడైనందుకేమో..
భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ.
చాయ్‌కప్పుడు సాహిత్యానికీ..
ట్రెడిషన్‌ని ఎవరో నిలబెడుతున్నారంటే అక్కడికీ..
మనతో ఎంతదూరమైనా ఆయన నడిచొస్తారు!
కారు దిగి, కొండలెక్కి వచ్చేస్తారు!!
అప్పుడు కనిపించేదే… భరణి అదర్‌సైడ్.http://sakshi.com/newsimages/contentimages/16122012/SRI_1783final16-12-12-29812.jpg‘నాలోన శివుడు గలడు’ అంటూ ఎప్పుడూ శివస్తుతి చేస్తుంటారు. ఎందుకు శివుణ్ని మీ లోపలే పెట్టుకున్నారు?తనికెళ్ల: ‘సర్వం శివమయం జగత్’ అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. నా లోపలే కాదు… శివుణ్ణి మీలోపల కూడా పెట్టా. యాక్చువల్‌గా నేను పెద్ద వీర శివభక్తుణ్ణేం కాదు. ‘మీరు మహా శివభక్తులు సార్…’ అంటారు నాతో కొంతమంది. ‘మహా’ శబ్దం నాకు కలపొద్దు. నేను మహాభక్తుణ్ణి కాదు. ఆ మహాశివుడికి భక్తుణ్ణి మాత్రమే అని చెబుతుంటాను. ఎందుకంటే చాలామంది ఈ భక్తి తత్వంలో కూడా సాత్వికాహంకారం చూపించేస్తుంటారు. చూశావా… నేనెంత పూజ చేస్తున్నానో! చూశావా… నేను ఆ గుడి ఎలా కట్టించానో! పూజ చేయడం, గుడి కట్టించడం వరకూ ఓకే. దాన్ని బయటివారికి ప్రదర్శించే గుణమే సాత్వికాహంకారం. అందుచేత నేను మహాశివభక్తుణ్ణి అనరాదు. ‘మహాశివ’… భక్తుణ్ణి అంటే సంతోషిస్తా. కాకా హోటల్‌కి వెళ్లి నిలబడి ఓ ఛాయ్ తాగొచ్చినంత ఈజీగా శివాలయంలో దర్శనం అయిపోతుంది. సింప్లిసిటీకి చిహ్నం శివుడు. కొంచెం వేరే ఆలయానికి వెళితే హడావిడి, గొడవ ఎక్కువ ఉంటాయ్. మాదయ్యగారి మల్లన్న రాసిన ‘రాజశేఖర
చరిత్రం’లో…
‘నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి
పత్రి నెవ్వాడు ఇసుమంత పారవేచు
కామధేనువు వానింటి గాడి పసరము
అల్ల సురశాఖి వాడింటి మల్లె చెట్టు
అని రాశారు. శివపూజను కఠోరమైన నిష్టాగరిష్టంతో ఏం చేయక్కర్లేదు. శివుడు భోళాశంకరుడు. ఊరికే నాలుగు మారేడాకులు అలా విసిరేస్తే చాలు… ఓ చెంబుడు నీళ్లు అలా పోసేస్తే చాలు… శివుడు ఖుష్ అయిపోతాడు. నేను రాసిన ‘శబ్బాష్ రా శంకరా’ పుస్తకంలో‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్… చిటికెడు బూడిద పోస్తే బస్… వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా…’ అన్నాను. నేను గ్రహించిన శివ ఫిలాసఫీ ఇదే.

అసలు దేవుడే లేడనే వారున్నారు!

తనికెళ్ల: నేను అలాంటివాళ్లనీ గౌరవిస్తాను. ఎందుకంటే మనం దేవుడున్నాడని ఎందుకంటాం. దేవుడంటే ఓ నమ్మకం, ఓ శక్తి, ఓ ధైర్యం. దేవుడు లేడనేవాడికి వాడి మీద వాడికి నమ్మకం ఉండాలి. అదీ గొప్ప విషయమే కదా. దేవుడు లేడూ అన్నాడంటే, దేవుడు చేసే గొప్ప పనులు కూడా వీడు చేసేయ్యాలి. నాకింతవరకూ ఎక్కడా పరిపూర్ణమైన భక్తుడు, పరిపూర్ణమైన నాస్తికుడు కనబడలేదు. దేవుడికి దణ్ణం పెడితే నష్టమేముందిలే అనుకునే భక్తులు, మా ఆవిడ గోల పడలేక సత్యనారాయణ వ్రతంలో పక్కన కూర్చున్నా అని చెప్పే నాస్తికులే నాకు ఎక్కువ కనబడ్డారు. ‘నాస్తికుడంటే దేవుడు మీద నమ్మకం లేనివాడు కాదు. వాడి మీద వాడికి నమ్మకం లేనివాడు’ అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు.

అయినా ఈ రోజుల్లో దైవభక్తి కూడా ఓ వ్యాపారం అయిపోయింది…

తనికెళ్ల: నిజమే. గుళ్లో దేవుడు భక్తులంతా వెళ్లిపోయాక వస్తాడని నా సందేహం. ఈ పూజారులు, ఈ వ్యాపారులు, ఈ దళారులు, ఈ భక్తులు… వీళ్లందరూ వెళ్లిపోయాక తలుపులు వేసేస్తారుగా. అప్పుడు దేవుడు గుళ్లోకి ఎంటరవుతాడేమోననిపిస్తుంది.

ఆన్‌లైన్ పూజలు కూడా వచ్చేశాయి. ఇలాంటివి చూస్తే మీకేమనిపిస్తుంది?

తనికెళ్ల: హడావిడి ఎక్కువైన కొద్దీ అక్కడ భక్తి లుప్తమైపోతోంది. భక్తి అంటే విభక్తము కానిది. అంటే… మన నుంచి దూరంగా పోనిది. భక్తి అంటే టోటల్‌గా కాన్‌సన్‌ట్రేషన్ ఆన్ పర్టిక్యులర్ యాస్పెక్ట్. ఇప్పుడస్సలు అది లేదు. ఒక్క భక్తి అనేమిటి అన్నిటికీ ఆన్‌లైన్‌నే కల్చర్‌గా చేసుకుంటున్న ఒక కొత్త తరం బయల్దేరింది!

ఒకప్పుడు తెలుగువారంటే గోంగూర పచ్చడి, ఆవకాయ్ పెరుగన్నం, పంచెకట్టు, పురాణ కాలక్షేపాలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడంతా పిజ్జా బర్గర్లమయమైపోయింది. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్‌లు సరేసరి. ఈ అభివృద్ధిని మీరు అంగీకరిస్తారా?

తనికెళ్ల భరణి: ఇది అభివృద్ధి కాదు. విస్మృతి. మనకు బామ్మ అక్కర్లేదు. ఆవిడ భారతం అక్కర్లేదు. తాత అక్కర్లేదు. ఆయన కూర్చున్న పడక్కుర్చీ అక్కర్లేదు. కానీ బామ్మగారి బంగారు దుద్దులు కావాలి. తాతగారి పొలాలు కావాలి. ఎప్పుడన్నా సెలవులకు వెళ్తే మామ్మ చేసే వంకాయ పచ్చడి కావాలి. అక్కడి పూతరేకులు కావాలి. ఒక జాతికి కొన్ని ముద్రలు ఉంటాయ్. మలయాళీ అనగానే కథాకళి గుర్తుకొస్తుంది. తెలుగువారంటే ఓ కూచిపూడి నాట్యం, కొన్ని పిండివంటలు, భాష, కొంత సంస్కారం, సంగీతం.. గుర్తుకు రావాలి. వీటన్నిటినీ ఇవాళ వదిలేశాం. ఇప్పుడు సమస్తమూ ఆన్‌లైనే. సమస్తమూ అక్కడే. సూర్యోదయం చూడవు. సూర్యాస్తమయం చూడవు. ఆకాశంలో ఎన్ని వేల నక్షత్రాలుంటాయో తెలీదు. ఏం వేస్తే బియ్యం వచ్చి అన్నం తయారవుతుందో తెలీదు. ఒక కోడికి గింజలు వేయడం ఎరుగవు. పక్కన ఉన్న ప్రకృతినే పట్టించుకోకుండా, కంప్యూటర్ దగ్గరకు వెళ్లడం ఎంత దురన్యాయం! నిధిని పక్కన పెట్టుకుని చెయ్యి చాస్తున్నాం మనం.

ప్రపంచమంతా ముందుకు దూసుకెళ్తుంటే మమ్మల్ని వెనక్కు లాగేస్తున్నారని ఇప్పటి తరం ఆక్షేపిస్తోంది?

తనికెళ్ల: ముందుకు వెళ్లొద్దనడంలేదు. ముందూ వెనకా చూసుకోమంటున్నానంతే. అసలు మనం అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం? బాగా సంపాదించేసి, రిటైరయ్యాక ఓ చిన్న రిసార్ట్, నాలుగు చెట్లు వేసుకుని, హాయిగా బతకాలని అందరూ కలలు కంటారు. అందరికీ సక్సెసయిపోవాలనే ఆరాటం. వందకి వంద మార్కులు వచ్చేశాయని విద్యా సంస్థలు తెగ ప్రచారాలు చేసేస్తుంటాయి! ఓకే.. వీళ్లంతా సక్సెస్‌ఫుల్ పీపులే. కానీ ‘దే ఆర్ నాట్ హ్యాపీ’. జీవితానికి పరమార్థం ఆనందమా? విజయమా?సక్సెస్ అయిన ప్రతివాడూ ఆనందంగా ఉన్నట్టు కాదు. కానీ ఆనందంగా ఉన్నవాడు సక్సెసైనట్టే లెక్క. ఒక హడావిడిలో లేచి, ఒక హడావిడిలో పని ముగించుకుని, హడావిడిలో ఇంటికొచ్చేసరికి అందరూ నిద్రపోతుంటారు. అంతేనా జీవితం ఇంక. జ్వరమొచ్చినప్పుడు సెలవు పెడతాం. అసలు సెలవనేది ఇంట్లో వాళ్లను సరదాగా బయటికి తీసుకెళ్లడానికి ఉండాలి కానీ,ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సెలవైతే అదేం దరిద్రం!? ఇంతకన్నా భిన్నంగా ఎవరి జీవితమైనా ఉందా?

ఇప్పుడే ఇలా ఉంటే, భవిష్యత్ సమాజం ఎలా ఉంటుందంటారు?

తనికెళ్ల: బావుంటుందనే ఆశ ఉంది. పెద్ద చెట్టు కూలిపోయి నాశనమైతే, మళ్లీ చిగురు మొలుస్తుంది. అది లేతగా, స్వచ్ఛంగా ఉంటుంది. పులులు అంతరించినట్టు, సంస్కృతి అంతరించిపోతోంది. పులుల్ని కాపాడ్డానికి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నట్టే,సంస్కృతీ పరిరక్షణకు అలాంటి ప్రాజెక్టులు పెట్టుకోవాలి. ఈ మధ్య ఓ ఇన్సిడెంట్ తెలుసుకుని చాలా ముచ్చటేసింది. లండన్‌లో స్థిరపడిన ఓ తెలుగాయన వాళ్లమ్మాయికి ఆరు నెలలు సెలవులొచ్చాయని ఇక్కడకు తీసుకొచ్చి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో పెట్టేశాడు. ఆ అమ్మాయికి ఇంగ్లీషు తప్ప ఏమీరాదు. ఈ ఆరు నెలల్లో ఆ అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి. నేర్చుకుంది కూడా. నాతో ‘మా అమ్మాయిని గర్వంగా, ఆనందంగా లండన్ తీసుకెళ్తున్నాన’ని చెప్పాడాయన. నాకు వళ్లు పులకరించింది. ఇలా స్ట్రాంగ్‌గా మరో ఇద్దరు, ముగ్గురు చేస్తే మిగతావాళ్లు కూడా అనుసరిస్తారు. మన భాష మాట్లాడ్డానికి ఏం తక్కువొచ్చింది? 11వ శతాబ్దంలోనే కావ్యాలు రాసిన జాతి మనది.

ఇప్పటి జనరేషన్‌కి తెలుగే కాదు… రామాయణ, భారత, భాగవతాల గురించి కూడా తెలియదు. రాముడు, కృష్ణుడు, దర్మరాజు… లాంటి పురాణ పురుషుల గురించి తెలియదు. దీని గురించి ఏమంటారు?

తనికెళ్ల: అంతదాకా ఎందుకు? మీ తాత పేరు ఏంటని అడగండి ఎవరినైనా, తాత పేరు తెలియదు. మామ్మ పేరు తెలియదు. ఇంకా విచిత్రం చెప్పనా, చాలామందికి వాళ్ల పేరుకున్న అర్థమే తెలీదు. ‘విష్వక్’ అంటాడు అర్ధమేంటని అడిగితే తెలీదు. ఇప్పుడు జనరేషన్‌లో అందరికీ మూడక్షరాల పేర్లే. లేకపోతే రెండక్షరాలు. అందులో 99 శాతం సంస్కృతం పేర్లే అయ్యుంటాయి. అది సంస్కృతమనీ తెలీదు, దాని అర్థం కూడా తెలీదు. ‘నిర్యాణ్’ బావుందని పెట్టేసుకుంటారు. నిర్యాణమంటే చావు. ‘పిండక్’లాంటి పేర్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరో వైరుధ్యం కూడా ఉంది. ఇప్పుడంతా బాగా చదువుతున్నారు. బాగా సంపాదిస్తున్నారు. ఓకే… కానీ చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?!

తనికెళ్ల: ఆత్మహత్యల నేపథ్యంలోనే ‘సిరా’ పేరుతో ఓ లఘుచిత్రం చేశా. చనిపోతున్నవాడికి మృత్యువు ఎదురై వెయ్యి చావులకన్నా ఓ బతుకు గొప్పది అని చెబుతుంది. అదీ కథ. ఈ లఘుచిత్రం చూసి దిలీప్ అనే ఒకతను నాకు ఫోన్ చేశాడు. సార్… నేను వారం క్రితం ఆత్మహత్యయత్నం చేసుకున్నా. కానీ బతికాను. మీ సినిమా చూశాక నాకు బ్రతకాలనే ఆశ రెట్టింపైంది’’ అని చెప్పాడు. ఇంతకన్నా అవార్డు ఏముంటుంది? అతని పెళ్లికి కూడా నేను వెళ్లా. అతని మొబైల్‌లో నా పేరు ‘ప్రాణం’ అని పెట్టుకున్నాడు. జీవితం పట్ల ఓ అభిరుచి, సంస్కారం కావాలి. జీవితమొక వరం అనే విషయం అందరూ తెలుసుకోవాలి.

విపరీతమైనపోయిన సాంకేతికాభివృద్ధి గురించి?

తనికెళ్ల: ఒక్క అన్నం తినే పనితప్ప మిగతావన్నీ మెషీన్లే చేసేస్తున్నాయి. ఇక ప్రతివాడికీ శంఖుచక్రాల్లాగా బీపీ, షుగరూ రమ్మంటే ఎందుకు రావు? ఇప్పుడు ప్రతిదానికీ స్విచ్. ఆ స్విచ్‌లు పనిచేయడానికి రిమోట్ స్విచ్. శరీరం ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో,అప్పుడు జబ్బులు హాయిగా మనలోకి ఎంటరైపోతాయి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. అయినా మేం కింద కూర్చునే భోంచేస్తాం. కొన్నింటిని అలంకారాలుగానే ఉంచేయాలి. మన అలవాట్లు మాత్రం ఆరోగ్యకరంగా ఉండేలా చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి పొద్దున్నే బూట్లేసుకుని కిలోమీటర్ల కొద్దీ రన్నింగులూ, జాగింగ్‌లూనూ. ఈ జిమ్ సెంటర్లన్నీ ఎందుకు వెలిశాయి? పనంతా పనిమనిషికప్పగించి, నువ్వు యోగా చేస్తే ఎట్లా? పని కూడా ఓ యోగానే కదా.

పల్లెటూళ్లలో కూడా మట్టి వాసనే లేకుండా పోయింది. అన్నీ బోన్సాయ్ సిటీల్లా తయారయ్యాయి!

తనికెళ్ల: అవును. ప్రతివాడూ హైద్రాబాద్ వచ్చేయవలసిందే. హైదరాబాద్ నుండి వెళ్లేటప్పుడు ఈ కల్చర్ పట్టుకుపోతున్నాడు. వంశీ సినిమా కోసం గతంలో ఓ సారెప్పుడో పోలవరానికి దూరంగా ఓ పల్లెటూరికి వెళ్తే అడవిపూలు పెట్టుకుని కోకా రైక కట్టుకుని కడవలతో నీళ్ల కోసం గోదావరి ఒడ్డుకొచ్చే ఆడవాళ్లనూ చూస్తే ఓ దివ్యమైన సౌందర్య సాక్ష్యాత్కారం. మొన్నీ మధ్య వెళ్తే అంతా నైటీల్లో కనిపించారు. అసలు పెళ్లి మంటపాల్లో సిగ్గుపడ్డ అమ్మాయిలను నేనీ దశాబ్దంలోనే చూడలేదు. పెళ్లికొడుక్కే తన బాయ్‌ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తున్నారు అమ్మాయిలు!

సినిమా అంటే అందరికీ క్రేజే. కానీ పిల్లనివ్వడానికి, ఇల్లు అద్దెకివ్వడానికి మాత్రం ఇప్పటికీ సినిమా వాళ్లంటే ఓ వివక్ష ఉంది. ఎందుకంటారు?

తనికెళ్ల: సినిమావాళ్లంటే అదేదో సెపరేటనే ముద్ర ఉంది. అన్ని రకాలుగా చెడిపోయినవాళ్లు అనే ఫీలింగ్ కొందరిది. దానికి కారణం గ్లామరస్ ఫీల్డ్ కావడం. ‘మిథునం’ సినిమా ఆఫీసు కోసం ఎన్ని చోట్ల వెతికినా నాకే ఇవ్వలేదు. చివరకు మా ఇంట్లోనే ఆఫీసు పెట్టుకోవాల్సి వచ్చింది. పూర్వం నటుల్ని పంక్తి బాహ్యులు అనేవారు. నటులకు పంక్తిలో భోజనం పెట్టేవారు కాదు. ప్రపంచంలో సర్వదుర్మార్గాలు చేస్తున్నవాళ్లు బయట ఉన్నారు. బయటి వాళ్లయితే గ్లామర్ ఉండదు కాబట్టి, సినిమా వాళ్ల మీద పడతారు.

మిమ్మల్ని పూర్తిగా సినిమా మనిషి అనుకోలేం. నటనకు దీటుగా మీలో కవిత్వమూ కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా ప్రేమ కవిత్వం రాశారా? ఎందుకంటే ‘ప్రేమలేఖలు’ అనేవి ఎవ్వరికైనా తీపి అనుభవాలు. ఈ జనరేషన్ వాటిని కోల్పోతున్నట్లుంది?

తనికెళ్ల: అసలు ప్రేమ ఉంటే కదా లేఖ. ఇప్పుడంతా వ్యాపారమే. వాడు మనకు వర్కవుట్ అవుతాడా అని ఆమె, దీన్ని ఎంతలోపు ట్రాప్ చేయొచ్చని వాడు… ఇలా ఏడ్చి చచ్చాయి ప్రేమలు. అమాయకత్వాలు, గౌరవాలు అన్నీ సినిమాల్లోనే. అందుకే సినిమాను గౌరవిస్తాను నేను. సినిమా ఈజ్ ప్రొటెక్టింగ్ పాస్ట్ కల్చర్. కార్తీక దీపాలు, అద్భుతమైన సాహిత్యాలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయీ అంటే సినిమాల్లోనే. నిజజీవితంలో ఏమీ లేవు. బయట చిన్న నిక్కరు వేసుకుని తిరిగే హీరోయిన్ సినిమాలో చీర కట్టుకునే గుడికి వెళ్తుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎక్కువ కల్చరల్ ప్రొటెక్షన్ చేస్తుంది సినిమానే. భర్త కాళ్లకు భార్య దణ్ణం పెట్టడమనేది సినిమాల్లోనే సాధ్యం. మా ఆవిడెప్పుడు నా కాళ్లకు దణ్ణం పెట్టలేదు (నవ్వేస్తూ).

మీరెన్ని ప్రేమలేఖలు రాసి ఉంటారు?

తనికెళ్ల: నేను రాయడం తక్కువే. కానీ అందుకున్నవి ఎక్కువ. కవిని కాబట్టి నాకు కొంచెం క్రేజ్ ఉండేది. ప్రేమలేఖలు రాయడం,అందుకోవడం అదొక మధురమైన భావన. ఆ వయసులో, ఆ యౌవనంలో అదొక మజా. ఇప్పుడేమో ప్రేమలేఖల స్థానంలో ఎస్సెమ్మెస్‌లు, చాటింగులొచ్చాయి. మాధ్యమం ఏదైతేనేం అనుభూతి మాత్రం అదే. వేళాకోళానికి అన్నా అస్సలు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది. అయితే సినిమాలు, టీవీల వల్ల ప్రేమ పక్కా కమర్షియల్ అయిపోతోంది. దాంతో అంతా ఓ అనుమానంతో ప్రేమిస్తున్నారు.

ప్రేమను అనుమానిస్తూ, డబ్బును ప్రేమిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లుంది?

తనికెళ్ల: ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడది 100% కరెక్ట్. చిన్నప్పుడు మా ఇంట్లో ఏడుగురు ఉండేవాళ్లం. ఒక్కటే బాత్‌రూమ్. ఇప్పుడు మా ఇంట్లో ఏడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అన్నింట్లో స్నానం చేయలేంగా. ‘ఇడ్లీ వడ ఆకాశం’ పుస్తకంలో కామత్ ఓ మంచి మాట చెబుతాడు. ఓ చిన్న కారులో మేం చాలామందిమి వెళ్లేవాళ్లం. మేమంతా ఇరుకుగా కాకుండా చాలా దగ్గరగా ఉన్నామన్న భావన కలిగేది. ఆ దగ్గరితనాన్ని మనం ఫీలవ్వాలి.

సంపాదించినంతకాలం సంపాదించేసి, ఎంజాయ్ చేసినంతకాలం ఎంజాయ్ చేసేసి, చివరాఖరున మాత్రం దాన ధర్మాలు చేసేసి మంచి పేరుని, పుణ్యాన్ని మూట కట్టేసుకోవాలనుకుంటారు చాలామంది. సబబేనా?

తనికెళ్ల: నేనెప్పుడూ ఓ జోక్ చెబుతుంటా. ఒకడు నవరత్నాల ఉంగరం చేయించుకుని వేలికి పెట్టుకుంటే, అది కాస్తా బాగా బిగిసిపోయి వేలు వాసింది. ఎంతకూ తగ్గలేదు. డాక్టరు దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరకు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని వేలు వాపు తగ్గిస్తే, ఉంగరం హుండీలో వేస్తానన్నాడు. వేలువాపు వెంటనే తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయానికి బంగారం రేటు ఆరు రెట్లు పెరిగిపోయింది. దాంతో వీడిలో మళ్లీ అంతర్మథనం మొదలైంది. స్వామితో ఇంకో బేరం పెట్టాడు. ‘‘నీకు ఫలానా రేటు ఉన్నప్పుడు మొక్కుకున్నా కాబట్టి, ఆ సమానమైన డబ్బులు హుండీలో వేసేస్తా’’ అని ఆ డబ్బు హుండీలో వేసేశాడు. ఆ డబ్బుతో పాటు ఉంగరం కాస్తా జారి హుండీలో పడిపోయింది. ఎందుకంటే వెంకటేశ్వరుడు వడ్డీకాసులవాడు కదా. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే నువ్వు బిజినెస్ చేయదలుచుకుంటే అమాయకుడుతో చెయ్. దేవుడు చాలా తెలివైనవాడు.

మళ్లీ మీకు బాల్యంలోకి వెళ్లే అవకాశం వస్తే?

తనికెళ్ల: బాల్యం అనేది ఓ అవస్థ. ఐస్‌క్రీమ్‌ని ఫస్ట్ టైమ్ చూసినపుడు ఎంత థ్రిల్ ఫీలయ్యామో, ఆ థ్రిల్‌ని ఇవ్వాళ కూడా ఫీలయ్యితే అదే బాల్యం. ఆ బాల్యాన్ని మళ్లీ తెచ్చుకోవడం కోసమే దేవుడు వార్థక్యాన్ని పెట్టాడు. మనమేమో వార్థక్యాన్ని ఓ అవస్థగా ఫీలవుతున్నాం.

‘ఆదిత్య 369’లో టైమ్ మెషీన్ తరహాలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్లే అవకాశమొస్తే?

తనికెళ్ల: ఏ కాలమైనా సరే ముందు మనలో ఆ రసజ్ఞత ఉండాలి. రజ్ఞమైన హృదయం ఉంటే ఇప్పుడు హంపి వెళ్లినా కృష్ణదేవరాయల కాలాన్ని ఊహించుకోవచ్చు. రసహృదయం ఉంటే ముందుకూ వెళ్లనవసరం లేదు. వెనక్కూ వెళ్లక్కర్లేదు.

దేవుడు ప్రత్యక్షమై మీకు ఫలానా వారిలా పుట్టే అవకాశమిస్తే ఏం చేస్తారు?

తనికెళ్ల: అమాయకుడిగా పుట్టించమని అడుగుతాను. ప్రతిదానికీ ఆశ్చర్యపోతూ… ప్రతీదీ ప్రశ్నిస్తూ…ఓ నిండైన అమాయత్వంతో బతికే జీవితం కావాలి.

ఆత్మకథ రాసే యోచనలో ఉన్నారని…

తనికెళ్ల: ‘నలుపు… తెలుపు… కొంచెం కలరూ’ పేరుతో ఆత్మకథ రాద్దామన్న ఆలోచన ఉంది. కొంత ప్రిపరేషనైతే జరుగుతోంది. చూద్దాం… షష్టిపూర్తి సమయానికైనా రెడీ అవుతుందేమో! ఎవర్నీ హర్ట్ చేయని నిజాలు అందులో ఉంటాయి. ఎదుటివారిలో నెగటివ్ గుణాలు చెప్పడం మంచి లక్షణం కాదు. నాలో అవి లేకపోతే కదా. నిజాలైతే చెబ్తా. నేను బాధపడ్డవి, గాయపడ్డవి, కన్నీరు పెట్టుకున్నవి రాస్తా. ఎదుటి వాళ్ల దుర్మార్గాల గురించి నేను రాయదలచుకోలేదు.

సంభాషణ: పులగం చిన్నారాయణ

‘‘కదలిపోతోంది… భావన వదిలి పోతోంది.
వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది.
ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను.
కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను.
కవితలను రాసి రాసి అలసిపోయాను.
అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది.
తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి.
బాధలో నా భావనలను చెదరగొట్టాను.
వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి.
భావనలు వెళ్లిపోయాయి
నన్ను వదిలి వెళ్లిపోయాయి’’.
(తనికెళ్ల భరణి ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా రాసిన తొలి కవిత)

‘ఆట కదరా శివా’
ఆట కదరా శివా
ఆట కద కేశవా
ఆట కదరా నీకు
అమ్మ తోడు

ఆట కద జననాలు
ఆట కద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకు

ఆట కద భూమిపై
మూడు వంతులు నీరు
మిగతాది కన్నీరు
ఆట నీకు

మానసవీణమధుగీతం

డెరైక్టర్ అంటే…
వైట్ అండ్ వైట్… అట్టహాసం… 555 ప్యాక్…
ఖరీదైన కారు ్ల… ఎక్కే విమానం దిగే విమానం
లోన ఈగల మోత ఉన్నా, బయట పల్లకీ మోతే! అంతా షో బిజినెస్!
కానీ సింగీతం… సూపర్ హిట్ డెరైక్టరయినా, సింప్లిసిటీని వదల్లేదు!
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి… జీవితం సరళంగా ఉండాలి అంటారాయన.
ఆయన శ్రీమతి కూడా అంతే! సింపుల్‌గా జీవిస్తే సంసారంలో కలతలు కూడా సింప్లిఫై అయిపోతాయని చెబుతున్న ఈ దంపతుల దాంపత్యసారాన్ని తెలుసుకుంటే ప్రతిసంసారం సంతోషమే…
మానసవీణ మధుగీతమే!

Description: http://sakshi.com/newsimages/contentimages/10122012/79-12-12-33109.jpg

సింగీతం దంపతులు వయసు ఎనిమిది పదులకు చేరుకుంటోంది. వారి వివాహ వయసు ఐదు పదులు దాటింది. తెలుగింటి దంపతులైన వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. వీరిని కలిసి దాంపత్యజీవితం విజయవంతం కావాలంటే ఏంచేయాలో తెలపమని కోరితే… పెద్ద హంగామా ఏమీ లేకుండానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు.

సినిమానా…! ప్రభత్వ ఉద్యోగమా…!

‘ఆయ్యోరామ… సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తి ఎందుకే..! ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమున్న అబ్బాయిని పెళ్లిచేసుకొని హాయిగా ఉండక… అంటూ హితవు పలికారు మా వైపు పెద్దలు’ అన్నారు లక్ష్మీకల్యాణి తమ పెళ్లి ముచ్చటను ప్రారంభిస్తూ. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. మధ్యతరగతి జీవనం. ఆ రోజుల్లోనే తండ్రి ఆమెను బీఏ వరకు చదివించారు.

‘అమ్మాయి తరపువారు ఇలా భావించడంలో తప్పులేదు. ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితం సేఫ్ అనే భావన ఉంటుంది కదా! నేనేమో పోస్టల్ డిపార్టుమెంటులో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాను’ అని ఒప్పుకున్న సింగీతం స్వస్థలం నెల్లూరు జిల్లా.

… ‘ఆ సమయంలో మా అత్తమామలు- కట్నకానుకలు తీసుకోవడం, ఇవ్వడం మాకు అలవాటు లేదు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే చాలు – అన్నారు. ఆ మాటలతో వారి కుటుంబం మీద నాకు ఎనలేనంత గౌరవం ఏర్పడింది’ కొనసాగింపుగా అన్నారు లక్ష్మీ కళ్యాణి.

అందరి అంగీకారంతో 1960లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బాజాబజంత్రీలు మోగాయంటూ అలనాటి ఆనందాలను పంచుకునేందుకు పోటీపడ్డారీ దంపతులు.

ఆమె చెప్పినట్టే జరిగింది!

‘పెళ్లయ్యేనాటికి నెలకు రూ. 200ల జీతం. విజయావాహినీ, జయంతి సంస్థల్లో పనిచేస్తుండేవాణ్ణి. చెన్నైలో చిన్న అద్దెగది. టీ నగర్ బస్టాండు సమీపంలోని ఆ అద్దెగదికి ముందు కొట్టం, దానిలో ఇంటి యజమానుల పశువులూ ఉండేవీ. ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈవిడను కాపురానికి తీసుకెళ్లాను. నా మనస్సులోని భావనను గ్రహించిందో ఏమో, ‘మీరేం ఫీల్ కాకండి, పశువులు ఇంటి వద్ద ఉంటే శుభం’ అంటూ ఆనందంగా ఆ గదిలో అడుగుపెట్టింది. ఆమె చెప్పినట్లే జరిగింది, ఆ ఇంటి నుండే నేను అంచలంచెలుగా ఎదిగాను’ అన్నారు శ్రీనివాసరావు. శ్రీవారు ఉన్నచోటే అద్దాలమేడగా భావించే శ్రీమతి చెంత ఉంటే, నింగికి నిచ్చెనలు వేయచ్చు అనే భావన వారి మాటల్లో స్పష్టమైంది.

స్క్రిప్టుల్లోనూ ఒకే నిర్ణయం…

వృత్తిపరమైన పనుల్లో భార్య జోక్యం చేసుకోవడం చాలామంది భర్తలకు నచ్చదు. ‘నీకేం పని ఇక్కడ’ అని కసురుకుంటారు కూడా. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ… భార్యకు వృత్తిపరమైన పనుల్లోనూ అవకాశాన్ని కల్పిస్తే ఆ భర్త ఎన్నో విజయాలను చవిచూడవచ్చు అని చెప్పారు సింగీతం. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ రిలీజై, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ స్టోరీ డిస్కషన్ జరుగుతున్న రోజులవి.‘పురాణాలు, చరిత్ర అధ్యయనం కోసం కన్నెమెరా, యూనివర్సిటీ లైబ్రరీలకు కలిసి వెళ్లేవారం. ఆ రోజుల్లో ఆటోలు లేవు, కారులో వెళ్లే స్థోమత లేదు. అందుకే సిటీ బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. లైబ్రరీల్లో గుర్తించిన విషయాలను ఇద్దరం చర్చించుకుని, ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత స్క్రిప్టు సిద్ధం చేసేవారం’ అని చెబుతున్న కళ్యాణి గొంతులో భర్తకు సమవుజ్జీగా నిలబడిన జ్ఞాపకాల తరంగాలు దొంతర్లుగా వినిపించాయి.

శ్రీమతి చేతుల్లో ‘సిరి’సేఫ్…

ఈ రోజుల్లో అయితే ‘నీ డబ్బు, నా డబ్బు’ అంటూ ఎవరి ఖర్చులు వారు చూసుకుంటున్నారు. ఎవరి బ్యాంకు బ్యాలెన్స్‌లు వారు చూసుకునే తత్వం వచ్చేసింది. ఈ పద్ధతి దాంపత్య జీవనానికి గొడ్డలిపెట్టుగా మారుతోంది అంటారు ఈ దంపతులు. ‘పెళ్లైన మొదట్లో సంపాదించిన రు.200ల నుండి ఈరోజు వరకు నేను ఆర్జించే మొత్తాన్నంతా కల్యాణి చేతులోనే పెట్టడం అలవాటు నాకు. నేను డబ్బిచ్చినా, చెక్కిచ్చినా ముందు దేవుడి వద్ద పెడుతుంది, ఆ తరువాతే బీరువాలోకి చేరుతుంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే‘ఈయన పాకెట్‌మనీ కావాలన్నా నన్నే అడుగుతారు’ అన్నారు లక్ష్మీకల్యాణి గుంభనగా నవ్వేస్తూ.

కష్టమైనా… సుఖమైనా…

కష్టసుఖాల్లో ఒకరికి ఒకరం ఉన్నామనే భరోసానే దాంపత్యజీవితాన్ని ఆనందం మయం చేస్తుంది. అవి ఈ దంపతుల జీవితంలో నిండుగా ఉన్నాయి కాబట్టే వారి కాపురం మెండుగా నిలబడింది. మచ్చుకు ఒకటి – ‘విజయావారి ఉమాచండీగౌరీశంకరుల కథ,జయంతి పిక్చర్స్ భాగ్యచక్రం రెండూ ఫెయిలయ్యాయి. నిర్మాతలు నష్టపోయారు. దీంతో జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. నేను ఆధారపడే రెండు సంస్థలు ఒకేసారి చేతులెత్తేయడంతో కుటుంబ పోషణ కష్టమైంది’ అని శ్రీనివాసరావు చెబుతుంటే.. ‘ఒడిలో చిన్న పిల్ల. దాని అవసరాలకైనా సంపాదించాలని దగ్గరలోని ఒక స్కూల్లో పాపను చేర్పించి అక్కడే టీచర్‌గా చేరాను. స్కూలు నుండి ఇంటికి వచ్చిన తరువాత స్క్రిప్టుల రూపకల్పనలో సహకరించేదానిని. ’ అని భార్య గుర్తు చేసుకుంటుంటే … ‘బొమ్మలు గీయడంలో ప్రవేశం ఉండటంతో పండుగలు, కొత్తసంవత్సరం గ్రీటింగు కార్డులను తయారుచేసి, అంగళ్లకు తీసుకెళ్లి అమ్మేవాడిని. నిర్మాతల దగ్గర స్క్రిప్టులు ఫెయిర్ చేసి కొంత సంపాదించేవాడిని. అలా ఇంటిని చక్కదిద్దుకునేవాళ్లం’ అని చెప్పారు శ్రీనివాసరావు.

భావాలలోనూ సర్దుబాటు

‘ఈవిడకు భక్తి ఎక్కువ. ఆమె తృప్తి కోసం దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టిన నేనూ భక్తునిగా మారిపోయాను.’ అని శ్రీమతి తనలో తెచ్చిన మార్పులను చెబుతుంటే… కల్యాణి అందుకున్నారు -‘ప్రతి చిన్నదానికి టెన్షన్ పడేదాన్ని. కోపం కూడా త్వరగా వచ్చేసేది. ఆ ప్రతాపాన్ని వంటగిన్నెలపై చూపించేదాన్ని. ఈయన సాహచర్యంలో కోపాన్ని అదుపుచేసుకోగలిగాను. అయితే టెన్షన్ మాత్రం ఇప్పటికీ వదల్లేదు. టెన్షన్ పడే సందర్భాలలో ఈయన జోక్‌లు వేసి, నవ్విస్తారు. ఈయనలో మరో గొప్ప విషయం ఏంటంటే వంట ఎలా ఉన్నా తినేస్తారు. కనీసం ఉప్పు లేకున్నా ఇదేమని అడగరు’ అంటూ తమ కాపురంలోని అసలు కిటుకు చెప్పేశానా అన్నట్టు పెద్దగా నవ్వేశారు. ఆమె నవ్వులకు శ్రీనివాసరావు నవ్వులు జతకలిశాయి.

ఇద్దరు ఆడపిల్లల పెంపకంలో ఒకే తరహా నియమావళిని అవలంబించామని తెలిపిన ఈ దంపతులు వారి వివాహ విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించామని చెప్పారు. ఎంతో సుదీర్ఘజీవితాన్ని, ఒడిదొడుకులను దాటుకొచ్చిన వీరి దాంపత్య విశేషాలు తెలుసుకున్నాక స్నేహపరిమళాలు వీరి వైవాహిక జీవితాన్ని సుసంపన్నం చేశాయని అనిపించింది.

– కొట్రా నందగోపాల్, బ్యూరోచీఫ్, చెన్నై
ఫొటోలు: వన్నె శ్రీనివాసులు