అండమాన్ ప్రకృతి దీవులు

అండమాన్… ఈ పేరు మనకు మొదట్లో పరిచయమైంది భయంకరమైన కారాగారంగానే. ఇప్పుడది చక్కటి విహారప్రదేశం. ఇది మనదేశంలో భాగమే కానీ, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మనకో వింత.

andaman

ఇక్కడ మనకు కనిపించే స్థానికులు బ్రిటిష్ పాలన కాలంలో అండమాన్ జైలు నిర్వహణ కోసం బదిలీ అయిన ఉద్యోగులు. వీరిలో బెంగాలీలు, తమిళులు, తెలుగువాళ్లు, మలయాళీలు ఉన్నారు. వీళ్లు తమది కాని వస్తువును ముట్టుకోరు. పోలీసులు స్ట్రిక్టుగా, నిజాయితీగా పనిచేస్తారు. పర్యాటకులకు అవసరమైన సమాచారం ఇవ్వడమే తమ ప్రధాన ఉద్యోగం అన్నంతగా సహకరిస్తారు.

http://sakshi.com/newsimages/contentimages/16062013/Andaman-Beach-5-copy15-6-13-49500.jpgఇక్కడి పోలీసుల గురించి చెప్పాల్సిన మరో ప్రత్యేకత ఏమిటంటే… ఇక్కడ దేవాలయాలు, గురుద్వారా,మసీదులలో పోలీసులు కట్టించినవి ఉన్నాయి. వలస వచ్చిన వాళ్లు ఇలా రకరకాల వృత్తుల్లో ఉండగా స్థానిక గిరిజనులు అడవుల్లో ఉండిపోతారు. ఆటవిక తెగలు నివసించే దట్టమైన అడవుల్లోకి పర్యాటకులను తీసుకెళ్లుంటారు పర్యాటకశాఖ నిర్వహకులు. ఆటవిక తెగల జీవనశైలికి- నాగరిక జీవనశైలికి ఎక్కడా పొంతన ఉండదని ఊహించగలం. కానీ ఈ ఆటవిక తెగలకు దుస్తులు ధరించడం తెలియదంటే… ఇంతటి అనాగరకత ఇంకా వేళ్లూనుకుని ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది.

ఇంకా వింతను చూడాలంటే బారాటంగ్ దీవికి వెళ్లాల్సిందే…
బారాటంగ్ వెళ్లే దారిలో జార్వాన్ అనే ఆటవిక తెగలు జీవిస్తున్నాయి. వర్షం వస్తే వీళ్లు బయటకు రారు. అండమాన్‌లోని టూర్ ఆపరేటర్లు పర్యాటకులను ఈ అటవీ ప్రదేశానికి తీసుకువెళ్తారు. పర్యాటకులకంటే ముందు ఒక వాహనంలో ఒక వ్యక్తి వెళ్తుంటాడు. అతడు ఈ తెగల వారిని పిలిచి రోడ్డుకి రెండు వైపులా నిలబెడతాడు. దుస్తులు ధరించడం కూడా తెలియని జీవనశైలి వీరిది.

వీరిలో కొందరు స్త్రీలు కొత్తవాళ్లు ఎదురు పడ్డప్పుడు చేతులతో దేహాన్ని దాచుకుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బహుశా… నాగరకులు దేహాన్ని వస్త్రాలతో కప్పుకుంటున్నారు, తాము అలా చేయడం లేదన్న స్పృహ ఇప్పుడిప్పుడే కలుగుతున్నట్లు అనిపిస్తుంది. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్అలవాటైంది. వెళ్లిన వారిని ‘పాన్ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే.

మరో విచిత్రం ఏమిటంటే… వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. మనం వాహనంలో దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేస్తారు, వచ్చి తమను ఫొటో తీసిన వాళ్ల ముఖాన ఉమ్మేస్తారు. వీళ్ల పరుగు వేగం చూస్తే వీళ్లను ఒలింపిక్స్‌కు పంపిస్తే ఇండియాకు స్వర్ణం ఖాయం అనిపిస్తుంది.

రెడ్‌స్కిన్… ఇది అండమాన్‌లోని ఒక కలుషిత రహిత ప్రదేశం. ఇక్కడికి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. మన బాటిల్‌లో నీటిని మరో క్యాన్‌లోకి మార్చి ఇస్తారు. ఎన్ని చాక్లెట్లు, బిస్కట్ ప్యాకెట్లు తీసుకెళ్తున్నామో చెకింగ్ పాయింట్ దగ్గర నమోదు చేస్తారు. తిరిగి వచ్చినప్పుడు తినేసిన వాటి రేపర్లన్నీ చూపించాలి, లోపల ఒక్కటీ వదలకూడదు.

అండమాన్ తీరాలు!
అండమాన్‌లో ముత్యాలు, పగడాలు, కొబ్బరి బోండాలు, వక్కలు, రబ్బరు ప్రధానంగా లభిస్తాయి. వరి కూడా పండిస్తారు. సముద్రతీరంలో నడుస్తూ ఉంటే ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు,శంఖువులు ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. తమఎన్విరాన్‌మెంటల్ ప్రాపర్టీ అంటారు. నార్త్‌బే ఐలాండ్‌లో కొబ్బరి బోండం ఇరవై రూపాయలు, దాదాపుగా లీటరు నీళ్లుంటాయి.

ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవక, లిక్కర్ సగం ధరకే వస్తుంది. రకరకాల చీరలు, ఇతర దుస్తులు దొరుకుతాయి. కానీ ఇవన్నీ చెన్నై నుంచి దిగుమతి అయినవే. వీటి ధరలు ఎక్కువ. ఇక్కడ ఇళ్లు మనకు ఉన్నట్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. పొలాల మధ్య విసిరేసినట్లుంటాయి.

ఇది దీవుల సమూహం కాబట్టి ప్రధాన రవాణా సాధనం పడవ. ఒక దీవి నుంచి మరో దీవికి పడవల్లోనే వెళ్లాలి.

ఎత్తై దీవులు!
అండమాన్ దీవుల్లో ఎత్తై ప్రదేశం సెడెల్‌పీక్. దాదాపుగా మూడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. దీవులన్నీ పర్యాటక ప్రాధాన్యంతో అభివృద్ధి చెందినవే. చుట్టూ సముద్రం, ఉన్న నేల కూడా దట్టమైన అడవులు కావడంతో ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు మించదు. మౌలిక సదుపాయాల రీత్యా ఇక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నట్లే. కానీ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగా దొరకదు. హెవ్‌లాక్, నెయిల్ దీవుల్లో శాటిలైట్ ఇంటర్నెట్ ఉంది, కానీ చాలా ఖరీదు. కొన్ని కంపెనీల డాటా కార్డులు మాత్రమే పని చేస్తాయి. టెలిఫోన్, మొబైల్ ఫోన్‌లు పోర్ట్‌బ్లెయిర్‌లో పనిచేస్తాయి. మారుమూల దీవులకు వెళ్లే కొద్దీ సిగ్నల్ దొరకదు.

నాలుగున్నరకే సూర్యోదయం!
అండమాన్ దీవుల్లో తెల్లవారుజామున నాలుగన్నరకే సూర్యోదయం అవుతుంది. హోటళ్లు ఐదున్నరకేఆహారంతో సిద్ధంగా ఉంటాయి, రాత్రి ఎనిమిదికి హోటళ్లు మూసేస్తారు. తొమ్మిదింటికి పెద్ద హోటళ్లు కూడా మూసేస్తారు. ఇక్కడ కూరగాయలు పొట్లకాయ, పందిరి చిక్కుడు, దొండకాయలే. ఆకుకూరలు పూర్తిగా వేరు. ఇక్కడి చిత్తడి నేలల్లో జాజికాయ, జాపత్రి, లవంగాలు పండిస్తారు.

ఎలా వెళ్లాలి?
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం పోర్ట్‌బ్లెయిర్. అండమాన్ దీవులకు వెళ్లాలంటే… మనకు చెన్నై లేదా విశాఖపట్నం అనుకూలం. పోర్ట్‌బ్లెయిర్‌లో ఎయిర్‌పోర్టు ఉంది. దీని పేరు వీరసావర్కార్ఎయిర్‌పోర్టు. ఇది డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు. కోల్‌కతా, చెన్నైల నుంచి రోజూ విమానాలు నడుస్తుంటాయి. జలమార్గంలో… కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం నగరాల నుంచి క్రూయిజ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి నెలకు ఒక సర్వీసు మాత్రమే నడుస్తుంది. ప్రయాణం నాలుగైదు రోజులు పడుతుంది.

ఎప్పుడు వెళ్లవచ్చు!
అండమాన్, నికోబార్ దీవుల పర్యటనకు అక్టోబరు నుంచి మే నెల వరకు అనుకూలం. ఇక్కడి వాతావరణం 23-30 డిగ్రీల మధ్య ఉంటుంది. ఎండ లేకపోయినా ఉక్కపోతగా అనిపిస్తుంది. ఇక్కడరెండు వర్షాకాలాలు ఉంటాయి. మే రెండవ వారం నుంచి సెప్టెంబరు మధ్య ఒకటి, నవంబర్ – డిసెంబర్ 15 వరకు ఒక వర్షాకాలం.

దీవుల పేర్లు…
సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్, లిటిల్ అండమాన్, నెయిల్, హెవ్‌లాక్, లాంగ్ ఐలాండ్, దిగ్లిపూర్,బారాటంగ్, నార్త్ పాసేజ్ ఐలాండ్, రంగాత్, మాయాబుండర్, లిటిల్ అండమాన్, చిరియా టాపూ వంటి ప్రకృతి దృశ్యాల నిలయాలన్నీ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌తో అనుసంధానమై ఉంటాయి. పోర్ట్‌బ్లెయిర్ నుంచి ఈదీవులకు బోట్‌లు, ఫెర్రీలు తిరుగుతుంటాయి. రాస్ ఐలాండ్, నార్‌కాండమ్ ఐలాండ్, ఇంటర్వ్యూ ఐలాండ్,బ్రదర్ ఐలాండ్, సిస్టర్‌ఐలాండ్, బారెన్ ఐలాండ్ మరికొన్ని దీవులు. మొత్తం దీవులు 572.

వీరుల జైలు!
http://sakshi.com/newsimages/contentimages/16062013/island15-6-13-5078.jpgఅండమాన్‌లోని సెల్యూలార్ జైల్‌ను చూడగానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్ననాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి.గోనెసంచులతో కుట్టిన దుస్తులను చూస్తున్నప్పుడు గుండెల్ని పిండినట్లనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ రోజూ లేజర్ షో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఆడియో వినిపిస్తుంటుంది. జైలు అధికారి సావర్కర్ సెల్‌కు రావడం,గద్దించి ప్రశ్నించడం, సావర్కర్ వంటి వీరులు సమాధానం చెప్పడం వంటి వన్నీ రికార్డ్ వెర్షన్‌లో వినిపిస్తుంటాయి.

స్థానిక వేడుకలు…
డిసెంబరు, జనవరిలలో పోర్ట్ బ్లెయిర్‌లో టూరిజం ఫెస్టివల్, జనవరిలో హెవ్‌లాక్ దీవిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వారోత్సవాలు జరుగుతాయి. నెయిల్ దీవిలో వివేకానంద జన్మదిన వేడుకలు,దిగ్లిపూర్‌లో బ్లాక్ మేళా, హరిబోల్ మేళా జరుగుతాయి.

షాపింగ్!
కొబ్బరి టెంకల ల్యాంప్‌షేడ్‌లు, నికోబార్ చాపలు, కొయ్య కుర్చీలు, టేబుళ్లు, పాత్రలు, ట్రేలు, చేతికర్రలు దొరుకుతాయి.

పగడపుదీవులు… ఫైబర్ పడవలు!
బీచ్‌లు, పార్కులు, జైళ్లు, సామిల్లు, మ్యూజియాలు… ఇవన్నీ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు చుట్టుపక్కల 20కి.మీ.ల పరిధిలోపలే ఉంటాయి. ఎంజి మెరైన్ నేషనల్‌పార్క్ 30కి.మీ.ల దూరంలో ఉంది. ఈ మెరైన్పార్క్‌లో ఫాసినేటింగ్ బీచ్‌లు, పగడపు దిబ్బలు, సముద్ర జీవులు… ఇలా ఒకదానికొకటి వైవిధ్యభరితమైన దృశ్యాలను చూడవచ్చు. క్యాంపింగ్, ట్రెక్కింగ్, స్కూబాడైవింగ్, సర్ఫింగ్, స్నోర్‌కెల్లింగ్ వంటి సాహసక్రీడలకువెళ్లవచ్చు.

పోర్ట్‌బ్లెయిర్‌లోని గాంధీపార్క్… పిల్లలకు స్వర్గంలాంటిది. అమ్యూజ్‌మెంట్ పార్క్, డీర్ పార్క్, వాటర్ స్పోర్ట్స్,రెస్టారెంట్‌లతో రోజంతా ఉల్లాసంగా గడపగలిగిన ప్రదేశం. అయితే ఎన్ని వాటర్ గేమ్స్ ఉన్నా నీటిలో కాలుపెట్టడానికి భయపడేవాళ్లకు మిగిలేది నిరాశనిస్పృహలే. అయితే అండమాన్‌లో గ్లాస్ బాటమ్‌డ్ బోట్‌లు ఉంటాయి. పడవ అడుగుభాగాన ఫైబర్ గాజు అద్దాలను అమరుస్తారు. ఈ పడవలో ప్రయాణిస్తూ పగడపు దీవులను దగ్గరగా చూడవచ్చు.

– ఓ పర్యాటకుడు భాస్కర్‌రెడ్డి అనుభవాల ఆధారంగా…

నయన మనోహరం.. ‘నందన వనం’

nandan

ఎటు చూసినా ప్రశాంత, రమణీయ వాతావరణం.. అందమైన సరస్సులు.. వాటి మధ్య కాంతులీనే కలువలు.. గత వైభవ చిహ్నాలుగా మిగిలిన అపురూప కట్టడాలు.. సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుత శిల్పకళ.. కర్నాటకలోని ‘బనవాసి’ ప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ ఇటీవలి కాలంలో ప్రముఖ పర్యాటక స్థలంగా పేరుపొందింది.

పచ్చదనం పరచుకున్న గిరులు, గుబాళించే విరుల వనాలు, ఆహ్లాదం కలిగించే లోయలు, దశాబ్దాల నాటి నిర్మాణాలు ‘బనవాసి’లో ప్రత్యేక ఆకర్షణలు. కర్నాటక రాష్ట్రానికి బెంగళూరు నగరం రాజధాని కాకముందు కొన్ని వందల ఏళ్లకు పూర్వం ‘కాదంబ రాజ్యం’ కాలంలో (క్రీ.శ. 345) ‘బనవాసి’ ముఖ్య కేంద్రంగా విరాజిల్లిందని చరిత్రకారులు చెబుతారు.

ఉత్తర కన్నడ జిల్లా సిర్సి ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో ‘బనవాసి’ ప్రకృతి శోభకు సాక్షీభూతంగా నిలిచింది. మహాభారత కాలంలో దీన్ని ‘వనవాసక’గా వ్యవహరించేవారు. క్రీస్తు శకం నాలుగో దశాబ్దం ప్రారంభంలో ఇది ‘జయంతిపుర’గా, ‘వైజయంతిపుర’గా వాసికెక్కింది.

nand2

క్రీ.శ. 630-644లో చైనా యాత్రికుడు హూయన్ త్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు, ‘బనవాసి’ పట్టణాన్ని ఆయన ‘కొంకణపుర’, ‘కొంకణపులొ’గా పేర్కొన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో ఈప్రాంతం బౌద్ధులకు, జైనులకు ఆలవాలంగా ఉండేదని ఆయన పేర్కొన్నాడు. ఇక్కడ సుమారు పదివేల మంది బౌద్ధ సన్యాసులు, మత ప్రచారకులు ఉండేవారని హూయన్ త్సాంగ్ గమనించాడని చరిత్రకారులు చెబుతారు. అశోకుడు ఈ ప్రాంతానికి బౌద్ధమత ప్రచారకులను పంపాడని తెలుస్తోంది.

క్రీస్తుశకం 1100 కాలంలో దావణగెరెలో లభించిన శాసనాల ప్రకారం బనవాసిని అప్పట్లో ‘నందనవనం’గా పిలిచేవారు. ఈ ప్రాంతంలో మూడు వైపులా ‘వరద’ నది ప్రవహిస్తున్నందున దీన్ని ‘జలదుర్గ’ (నీటికోట)గా పిలిచేవారని రెండో పులకేశి కాలం నాటి శాసనాల ద్వారా అవగతమవతుంది. ‘బనవాసి’ పట్టణం మధ్యలో నిర్మించిన మధుకేశ్వర స్వామి ఆలయం అపురూప శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం కాదంబులు, హోసళులు, చాళుక్యుల కాలం నుంచి ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఈశ్వరుడు కొలువుతీరిన మధుకేశ్వరాలయంలో ప్రధాన ద్వారం, ఆలయ మంటపం,గోడలు, అంతరాలయంపై అరుదైన శిల్పకళ నేటికీ చెక్కు చెదరలేదు. చాళుక్యుల నిర్మాణ శైలిలో ‘సంకల్ప మంటపం’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

nand1

ఆలయ మండపంలో ఏకశిలతో మలచిన ఏడడుగుల నంది విగ్రహం అందరి దృష్టిని కట్టిపడేస్తుంది. నృత్యప్రదర్శనలు నిర్వహించే ‘త్రిలోక మంటపం’ మరో అద్భుత కట్టడం. భారీ స్తంభాలు, మంటపం పైకప్పు అద్భుత శిల్పకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ మంటపంలోనే అప్పట్లో ప్రసిద్ధి చెందిన ‘నాట్యరాణి’ శాంతల సంగీత విద్వాంసుడు అల్లమ ప్రభును సవాల్ చేసిందని చరిత్రకారులు చెబుతుంటారు. మహాశిల్పిగా ప్రసిద్ధి చెందిన ‘అమరశిల్పి జక్కన’ ఈ ఆలయంలో శిల్పకళను తీర్చిదిద్దాడని అంటారు. ‘త్రిలోక మంటపా’న్ని కూడా ఏకశిలతో రూపొందించారని చాలామంది నమ్మకం. హోసళుల కాలంలో ఈ మండపం రూపుదిద్దుకుంది. మండపంలో నృత్య ప్రదర్శనలు చేసే వారి రూపాలు స్తంభాలపై ప్రతిబింబించేవని చెబుతుంటారు.

మధుకేశ్వరాలయంలో నంది కన్నులు రెండు వైపులా చూస్తున్నట్లు ఉంటాయని భక్తులు ఆనంద పారవశ్యానికి లోనవుతారు. ఎడమకన్నుతో ఈశ్వరుడిని, కుడి కన్నుతో పార్వతిని చూస్తున్నట్లు నంది కళ్లను తీర్చిదిద్దడం ఓ విశిష్టతగా భావిస్తారు. ఏ శివాలయంలోనైనా సాధారణంగా శివుడి ముఖానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ విడిగా ఉన్న పార్వతిదేవి ఆలయం నుంచి చూస్తే-‘అమ్మవారిని కుడి కన్నుతో నంది చూస్తున్న’ట్లు కనిపిస్తుంది.

ఇక్కడ అర్చనలు చేసేందుకు, అద్భుత శిల్పకళను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ‘బనవాసి’కి రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి సు మారు 70 కిలోమీటర్ల దూరంలో హవేరి రైల్వే స్టేషన్ ఉంది. 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలగుప్ప పట్టణంలో మేలైన భో జన,వసతి సౌకర్యాలు అందించే లాడ్జీలు, టూరిస్టు కాంప్లెక్సు ఉన్నాయి. *

  • ·

సముద్రమంత సరస్సు మన దగ్గరే

దట్టమైన అడవి… పచ్చటి చెట్ల గుబుర్లు…
మధ్యలో పెద్ద సరస్సు. సరస్సు మధ్యలో దీవులు.
ఆ దీవుల్లో విహారం, బస, భోజనం.
ఒక దీవి నుంచి మరో దీవికి ఊయల్లాంటి వంతెన మీద ప్రయాణం…
అదే లక్నవరం సరస్సు… ఈ సరస్సే ఈవారం మన విహారకేంద్రం!!

lak2

వరంగల్ జిల్లా… ఏటూరు నాగారం అడవుల్లో ప్రయాణం. దట్టమైన అటవీ ప్రదేశం… మధ్యలో నల్లటి తారురోడ్డు, రోడ్డు పక్కన అక్కడక్కడా ఏపి టూరిజం బోర్డులు లక్నవరం లేక్‌ను బాణాలతో సూచిస్తున్నాయి. అడవుల్లో జింకలు గెంతులేస్తున్నాయి. కొన్ని ఆగి చెవులురిక్కించి, కళ్లు విప్పార్చి చూస్తున్నాయి ఎవరీ అతిథులన్నట్లు. ఆరేడు వందల ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన మంచినీటి సరస్సును చూడడం వాటికేమీ వింత కాకపోవచ్చు.

ఈ సరస్సు మధ్యన ఉన్న దీవుల్లో విహరించాలన్న ముచ్చట వాటికి ఉందో లేదో కానీ పక్షులకు మాత్రం ఈ సరదా ఎక్కువే. అందుకే లక్నవరం పర్యాటకుల్లో ప్రకృతి ప్రేమికుల కంటే పక్షుల ప్రేమికులే ఎక్కువ. ఈ దీవుల్లో పర్యాటకులు విహరించవచ్చు, విడిది చేయనూ వచ్చు.

http://sakshi.com/newsimages/contentimages/09062013/loca8-6-13-30484.jpgలక్నవరం లేక్ పదివేల ఎకరాల్లో విస్తరించిన విశాలమైన సరస్సు. సముద్రాన్ని తలపించే సరస్సు ఇది. చిరు అలలతో పిల్ల తెమ్మెరల ఆత్మీయమైన తాకిడి అలరిస్తోంది. సముద్రఘోష లేదు, కడలి కల్లోలాలు లేవు. చంద్రుని వెన్నెలలా చల్లగా ఉంది వాతావరణం.

మన రాష్ట్ర పర్యాటక చిత్రపటంలో ఇప్పుడిది స్టార్ వెకేషన్ పాయింట్. హాలిడే వెకేషన్ గడపడానికి థాయ్‌ల్యాండ్ వెళ్లక్కర్లేదు, కాశ్మీర్ దాల్ లేక్ కోసం పరుగులు తీయక్కర్లేదు, కేరళ హౌస్‌బోట్ కోసం ఎదురు చూపులూ అక్కర్లేదు. లక్నవరం సరస్సులో ఈ అనుభూతులన్నీ సొంతమవుతాయి అంటే… ఈ టూరిస్ట్ స్పాట్ మన రాష్ట్రంలోనే ఉందా అనిపిస్తోంది,ఇలాంటి మాటనే ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా వాసులు కూడా అన్నారు. మన జిల్లాలో ఇలాంటి పర్యాటక ప్రదేశం ఉందా అని ఆశ్చర్యపోయారు. సరస్సులో మెయిన్ ఐల్యాండ్‌లో హరిత లేక్ రిసార్ట్స్ ఉంది. ఇందులో అధునాతన సౌకర్యాలున్న కాటేజ్‌లున్నాయి. దీవిలో ఉడెన్ హట్‌లున్నాయి.

lak3

ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. సముద్రతీరాల్లో ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి కట్టే హమాక్(ఊయల)ని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఆ గట్టుని ఈ గట్టుని ఆధారం చేసుకుని నీటి మీద తేలే వంతెన కనిపిస్తోంది. నేల మీద ఈ చివర- ఆ చివర మాత్రమే పిల్లర్లున్నాయి. వంతెన మొత్తం ఏ ఆధారం లేకుండా ఉన్నట్లే కనిపిస్తుంది. దీని మీద బరువు పడినప్పుడు బేరింగులు బరువును ఒక చోట కేంద్రీకృతం కానివ్వకుండా విస్తరింపచేస్తున్నాయి. అప్పుడు వంతెనలో వచ్చే కొద్దిపాటి కుదుపులను పిల్లలు ఊయలూగినట్లు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంతటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో సీతాదేవి గంగానదిని దాటడానికి రాముడు, లక్ష్మణుడు కట్టిన రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలాలను తలపిస్తోంది ఈ సస్పెన్షన్ బ్రిడ్జి. నడుస్తుంటే ఊయల ఊగినట్లు ఊగుతున్నాయని ఆ వంతెనలను ఊయల అనే పిలిచారు త్రేతాయుగంలో. లక్నవరం బ్రిడ్జిని ఊయల వంతెన అంటున్నారు కలియుగంలో.

పడవలో విహారం!
మెయిన్ ఐల్యాండ్ తీరాన వరుసగా బారులు తీరి సిద్ధంగా ఉన్నాయి పడవలు. కొన్ని పై కప్పు పడవలు,కొన్ని స్పీడ్‌బోట్లు… అప్పటికే పర్యాటకులను సరస్సులో తిప్పి చూపించే డ్యూటీలో ఉన్నాయి. వేగంగా వెళ్లడమా లేక చిన్న అలలను చూస్తూ పిల్లగాలిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా విహరించడమా అని తేల్చుకునే ఓపిక చాలామందిలో కనిపించడం లేదు. గడియారంలో ముల్లుకంటే వేగంగా పరుగులు తీయడం అలవాటైన కాంక్రీట్ జంగిల్ నగరీకులకు ఫాస్ట్ బోట్‌లో విహారమే కిక్‌నిస్తున్నట్లుంది. ఎక్కడికొచ్చినా పరుగేనా, సెలవుని ప్రశాంతంగా గడవనిద్దాం అనుకునే వాళ్లంతా మామూలు బోట్‌లో విహరిస్తూ చుట్టూ ఉన్న నీటిని, కనుచూపు మేరలో కనిపిస్తున్న చెట్టు- పుట్ట, కొండ- కోనల్ని ఆనందంగా చూస్తూ ఉన్నారు.
lak1
http://sakshi.com/newsimages/contentimages/09062013/huts-way8-6-13-30562.jpgసాయంత్రం అవుతోంది… సూర్యుడు విశ్రాంతి కోరుతున్నట్లున్నాడు. ఒకసారి సరస్సులో మునిగి సేదదీరాలనుకుంటున్నాడో ఏమో! సరస్సులోని నీరంతా రంగుమారుతోంది, నీటి అడుగున ఎర్రబంతిలాగ సూర్యుడు కనిపించీ కనిపించనట్లు, చేతికందీ అందనట్లు అద్దంలో చందమామలా ఊరిస్తున్నాడు. ఎప్పుడు మాయమవుతాడో ఏంటో వెలుగు ఉండగానే రిసార్ట్‌కి చేరాలి.

లక్నవరం గురించి…
ఇది ఆరువందల ఏళ్ల క్రితం కాకతీయ పాలకులు నిర్మించిన మంచినీటి సరస్సు. ఈ సరస్సు మధ్యలో 13దీవులున్నాయి. వీటిలో మూడు దీవులను కలుపుతూ టూరిజం శాఖ వంతెనలు నిర్మించింది. ఈ దీవుల్లో పర్యాటకులు బస చేయడానికి కాటేజ్‌లు కట్టింది రాష్ట్ర పర్యాటకశాఖ.

ఎప్పుడు వెళ్లాలి?
లక్నవరం సరస్సు పర్యటనకు జూలై నుంచి జనవరి వరకు అనువుగా ఉంటుంది.

ఇలా వెళ్లాలి…
లక్నవరం సరస్సు వరంగల్ జిల్లా కేంద్రానికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. ములుగు-జంగాలపల్లి జాతీయ రహదారి మీదుగా లక్నవరం చేరుకోవచ్చు. చల్వాయి గ్రామానికి ముందు కుడివైపు రోడ్డు ద్వారా8 కిలోమీటర్ల లోపలికి వెళ్తే సరస్సు దగ్గర ఉంటాం.
లక్నవరానికి… హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి ములుగు.. ఏటూరునాగారం ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చే పర్యాటకులు రైల్వే మార్గాన వరంగల్ లేదా కాజీపేట స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి హన్మకొండ బస్టాండ్, ములుగు, జంగాలపల్లి మీదుగా లక్నవరం చేరవచ్చు.

ఎక్కడ ఉండాలి?
లక్నవరం సరస్సు మెయిన్ ఐల్యాండ్‌లో ఎ.పి టూరిజం నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్ ఏసీ కాటేజ్‌లున్నాయి. మరో ఐల్యాండ్‌లో ఉడెన్ హట్ (ఏసీ)కాటేజ్‌లున్నాయి. డబుల్ రూమ్ అద్దె రోజుకు1410 రూపాయలు.
హన్మకొండలో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ‘హరిత కాకతీయ’, రామప్ప చెరువు దగ్గర ‘హరిత రామప్ప’,ఘన్‌పూర్‌లో ‘హరిత ఘన్‌పూర్’ రిసార్టులున్నాయి.

భోజనం ఎలా?
లక్నవరం హరిత రిసార్ట్సులో ఏసీ రెస్టారెంట్ ఉంది. శాకాహార బఫే భోజనం 75 రూపాయలు. మాంసాహారంలో కూరలు ఐటెమ్ వారీగా ఆర్డర్ చేయవచ్చు.
– లక్నవరం వెళ్లవలసిన పర్యాటకులు సంప్రదించవలసిన ఫోన్ నంబరు – 88970 65307

ఇంకా ఏమి చూడవచ్చు?
ఈ ట్రిప్‌లో వరంగల్‌లోని చారిత్రక ప్రదేశాలను కూడా కలుపుకోవచ్చు. హన్మకొండలో వేయిస్తంభాల గుడి,వరంగల్‌లో భద్రకాళి ఆలయం, భద్రకాళి చెరువు, పాలంపేటలోని రామప్ప దేవాలయం, రామప్ప చెరువు,ఘన్‌పూర్‌లో పాండవుల గుహలు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే సమ్మక్క సారక్క ఉత్సవాల వేదికను(గద్దె) కూడా చూడవచ్చు.

– లక్నవరం నుంచి రామప్ప గుడి 30 కి.మీ.లు, ఘన్‌పూర్ 20 కి.మీ.లు.

సలామ్ మలేషియా

ఎంత అధునాతనంగా కనబడుతుందో, అంత ప్రాచీన చరిత్ర ఉన్న దేశం మలేషియా. ఈ మలేల గడ్డ మీదకు భారతీ యులు, చైనీయులు అనాది కాలంలో వచ్చి స్థిరపడటంతో ఇది భిన్న జాతులు, భిన్న సంస్కృతులకు ఆలవాలమైంది. కొన్ని చోట్ల సంస్కృత అక్షరాలు కూడా కనిపిస్తాయి. పర్యాటకాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మలేషియా ఆ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకుగాను దేశదేశాల నుంచి ఇటీవల మరోసారి మీడియా ప్రతినిధులను ఆహ్వానించింది. ఆ బృందంలో ‘సాక్షి’ తరఫున కంచర్ల యాదగిరిరెడ్డి పర్యటించారు. ఆయన అనుభూతులే ఈవారం ఇన్నర్‌వ్వ్యూ…

malay1

అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మలేషియా ఆ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఏటా విదేశీ జర్నలిస్టులకు ఆహ్వానం పలుకుతోంది. అక్కడి ప్రకృతి సహజ సౌందర్యాలను ఆస్వాదించేలా చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మే నెలలో సాక్షి దినపత్రిక తరఫున నాకు మలేషియా సందర్శించే అవకాశం లభించింది. మేమంతా వారం రోజుల పాటు కౌలాలంపూర్ పరిసర ప్రాంతాలతో పాటు థాయ్‌లాండ్ సరిహద్దుల్లో ఉన్న లాంఖావీ ద్వీపాన్ని కూడా చుట్టివచ్చాం. నాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది మీడియా ప్రతినిధులు, ఆరుగురు ట్రావెల్ ఏజెంట్లు మా బృందంలో ఉన్నారు.

విమానాశ్రయంలో రైలు
‘టూరిజం మలేషియా’ ఆహ్వానంతో మే 15వ తేదీ రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో కౌలాలంపూర్‌లో అడుగుపెట్టాను. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగీదిగగానే చెప్పలేనంత ఆశ్చర్యం, సంభ్రమం! అధునాతన సదుపాయాలు కల్పించడంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఈ చిన్నదేశం చూపిస్తున్న చొరవ, సాధిస్తున్న ప్రగతి చూసి ముచ్చటేసింది.

విమానాశ్రయంలో ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు వెళ్లేందుకు రైలు సౌకర్యం కలిగి ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఇదేనని నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మలేషియా పర్యాటక శాఖ గైడ్ చెప్పారు. ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు ప్రయాణికులను తీసుకువెళ్లే ఈ రైలు పూర్తిగా ఆటోమేటేడ్. విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే ప్రయాణికులకు ఇదో చక్కని అనుభూతి.

అప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులను అక్కడ నేను కలుసుకున్నాను. మేమే కాకుండా ప్రపంచంలోని 32 దేశాల నుంచి 143 మంది మీడియా ప్రతినిధులు కూడా ఈ పర్యటనకు వచ్చారు. అందులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, ఫ్రాన్స్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు.

పామాయిల్ తోటలు- హోమ్ స్టే
విమానాశ్రయంలో మూడు గంటల పాటు కలియతిరిగిన తరువాత మేమంతా మాకు కేటాయించిన హోటళ్లకు బయలు దేరాం. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ నగరం 70 కిలోమీటర్లు. వెళ్లేందుకు గంట సమయం పడుతుంది. దారంతా ఎటు చూసినా పచ్చదనమే. దట్టమైన, పొడవైన పామాయిల్ తోటలు చూడచక్కగా ఉన్నాయి. హోటల్‌కు చేరుకున్న వెంటనే భారత్ నుంచి వచ్చిన జర్నలిస్టులు, ట్రావెల్ ఏజెంట్లతో కలిపి రెండు గ్రూపులుగా ఏర్పడ్డాం. మా గ్రూపు కౌలాలంపూర్ పరిసర ప్రాంతాలతో పాటు లంఖావీ దీవిని సందర్శించడానికి సిద్ధమైంది.

మధ్యాహ్నం 12 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయలుదేరి ‘హోమ్ స్టే’ కోసం ‘పెటాలింగ్ జయ’ అనే ప్రదేశానికి వెళ్లాం. ఓ గ్రామంలో కొన్ని గంటలు ఉండి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ఏర్పాటు అయ్యిందే ఈ హోమ్ స్టే. మేము వెళ్లిన ప్రదేశంలో రైతులు విరివిగా వరి పండిస్తున్నారు. అక్కడ ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలోనే బస ఏర్పాటు చేసుకుంటాడు. కొందరు రైతులు విదేశీ పర్యాటకుల కోసం విశాలమైన భవంతులను నిర్మించారు. మేము వెళ్లిన గ్రామంలో ఒక రైతు మాకు మాంసాహార, శాకాహార భోజనం ఏర్పాటు చేశాడు. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, పిల్ల కాలువలతో అది అచ్చం మన కోనసీమను తలపించే రీతిలో ఉంది. దాదాపు నాలుగు గంటల పాటు మా బృందమంతా అక్కడ ఆహ్లాదంగా గడిపింది. కాల్వల్లో గాలం వేసి చేపలు పట్టాం. పతంగులు ఎగరేశాం. స్థానికులతో కలిసి నృత్యం చేశాం. మలేషియా పర్యాటక శాఖ పర్యాటకుల కోసం దేశంలో చాలా చోట్ల హోమ్‌స్టే పేరుతో ఈ రకమైన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లాం. ఆ రకంగా మా మొదటి రోజు పర్యటన ముగిసింది.

88వ అంతస్తు నుంచి…
మరుసటి రోజు 17వ తేదీన ఉదయాన్నే కౌలాలంపూర్ నగర పర్యటనకు బయలుదేరాం. మొదట ‘పార్లమెంట్ ఆఫ్ మలేషియా’ చూశాం. దాదాపు 3 వేల ఎకరాల విస్తీర్ణం. విశాలమైన పార్కులు, ఎటు చూసినా పచ్చదనం… వైభవోపేతంగా ఉంది. కౌలాలంపూర్ నగరంలో ఏ రోడ్డులో ప్రయాణించినా పచ్చదనంతో నిండి ఉండే ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందులో లేక్ గార్డెన్ ఒకటి. పార్లమెంట్ భవనం ఆవరణలోనే ఇది ఉంది. 230 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం మా బృందాన్ని కట్టిపడేసింది. పోటీలు పడి ఫొటోలు తీసుకున్నాం. తరువాత కౌలాలంపూర్ బర్డ్ పార్క్‌కు వెళ్లాం. ఇది ఆగ్నేయాసియాలోనే పెద్దది. అప్పటికి మధ్యాహ్నం కావడంతో సమీపంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భోజన కార్యక్రమాన్ని ముగించాం.

ఆ తరువాత మా నగర పర్యటన మళ్లీ మొదలైంది. కౌలాలంపూర్‌కే వన్నె తెచ్చిన పెట్రనాస్ టవర్స్ దిశగా మా వాహనం దూసుకుపోతోంది. విచిత్రమేమిటంటే, నగరంలో ఏ మూలకు వెళ్లినా ఈ టవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. మాటల్లోనే పెట్రనాస్ టవర్స్‌ముందు మా వాహనం ఆగింది. మా బృందం సభ్యులు బయటి నుంచే దానిని ఆసక్తిగా తిలకిస్తుంటే గైడ్ వచ్చి లోపలకు వెళదామని ఆహ్వానించారు.

పెట్రనాస్ టవర్స్‌లో మామూలు పర్యాటకులను ఐదో అంతస్తు వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ మేము టూరిజం మలేషియా అతిథులం కదా! చివరి అంతస్తు వరకు వెళ్లి కౌలాలంపూర్ అందాలు తిలకించే అరుదైన అవకాశాన్ని పొందగలిగాం. అయితే, అక్కడకు కెమెరాలను అనుమతించబోమని ముందే చెప్పారు. పెట్రనాస్ టవర్స్ చివరిదైన 88వ అంతస్తు నుంచి సిటీని చూసినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.జంట టవర్లు కావడంతో 41, 42 అంతస్తుల్లో స్కై బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ టవర్స్‌లో గడిపి సాయంత్రం ఆరు గంటలకు మా రెండో రోజు పర్యటన పూర్తి చేసుకున్నాం.

malay2

లిటిల్ ఇండియా
మరునాడు 18వ తేదీన ఉదయాన్నే కౌలాలంపూర్ నగరంలో ఉన్న ‘లిటిల్ ఇండియా’కు వెళ్లాం. అక్కడ నివసిస్తున్న వారిలో 90 శాతం భారత జాతీయులే. ఇడ్లీ, వడ, పూరి, దోశతో పాటు దక్షిణ భారత వంటకాలన్నీ ఇక్కడ దొరుకు తాయి. మళ్లీ ఈ భారతీయ సంతతి వారిలో 60 శాతం మంది తమిళులు. వ్యాపారాలన్నీ అక్కడ నివసిస్తున్న భారతీయుల కోసమే. అక్కడ గడిపిన రెండు గంటలూ హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్నట్లు అనిపించింది. అక్కడే ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి మధ్యాహ్నానికి మా హోటల్‌కి చేరుకున్నాం. సాయంత్రం దాకా హోటల్‌లోనే గడిపాం.

చీకటిపడే సమయానికి సిటీ ఆఫ్ లైట్స్ (షా ఆలమ్, సెలంగూర్) ప్రాంతానికి వెళ్లాం. హోటల్ నుంచి నలభై నిమిషాల ప్రయాణం. అంత రాత్రి అయినా ఎక్కడా చీకటి కానరాలేదు. ఇంకా పట్టపగలేనేమో అనిపించింది. పొద్దుటి నుంచి అక్కడే ఉన్నవారికి బహుశా చీకటి అంటే తెలియదేమో అనిపించింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు గంట పాటు అక్కడ విద్యుద్దీపాలను చూస్తూ, గడిపాం. అలా మా మూడో రోజు పర్యటన ముగిసింది.

అందాల దీవి లంఖావి

నాలుగో రోజు (మే 19)న ఉదయమంతా హోటల్ గదిలో గడిపి, సాయంత్రం మలేషియా ప్రభుత్వం కౌలాలంపూర్ సిటీలో ఏర్పాటు చేసిన ‘కలర్స్ ఆఫ్ మలేషియా’ కార్యక్రమానికి హాజరయ్యాం. వివిధ దేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు, ట్రావెల్ ఏజెంట్లు అందరూ అక్కడ ఉన్నారు. ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. కార్యక్రమం రాత్రి 7 గంటలకు ప్రారంభమై 11 గంటల దాకా కన్నుల పండువగా సాగింది. నాలుగు రోజుల కౌలాలంపూర్ పర్యటన ముగించుకుని, ఐదో రోజు ఉదయమే లంఖావి బయలుదేరి వెళ్లేందుకు మా బృందం కేఎల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో మా లంఖావి ప్రయాణం మొదలైంది. దాదాపు గంట తరువాత మేము అక్కడి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాం. అదృష్టవశాత్తూ విండో సీటులో కూర్చున్న నాకు ల్యాండింగ్‌కు ముందు లంఖావిలో సముద్రతీర ప్రాంత అందాలను ఆస్వాదించే అవకాశం కలిగింది.

విమానాశ్రయంలో దిగి బయటకు వెళుతుంటే మలేషియా సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. లంఖావి దీవిలో లక్షమంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడింది. ఇక్కడ విలాసవంతమైన హోటళ్లు ఉన్నాయి. ఈ రంగంలో అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచిన గ్రూపులు ఇక్కడ హోటళ్లు నిర్మించాయి. మేము బస చేసిన ఐదు నక్షత్రాల రిసార్ట్ సముద్రతీర ప్రాంతంలో ఉంది. ఆ రిసార్ట్‌కు సొంతంగా బీచ్ ఉంది. ఇక్కడ ఒక రాత్రి బస ఖర్చు 1400 రింగిట్స్… అంటే భారతీయ కరెన్సీలో 21 వేల రూపాయలు.

మధ్యాహ్నం హోటల్లో భోజన కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి కేబుల్ కారు టూర్‌కు వెళ్లాం. కేబుల్ కారు మార్గం పొడవు 2.2 కిలోమీటర్లు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో ఒకేసారి ఆరుగురు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. ప్రతి నిమిషానికొకటి బయలుదేరుతుంది. పూర్తిగా పైకి చేరిన తరువాత ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. మేఘాలు మనల్ని తాకుతూ వెళుతున్న అనుభూతి మరువలేనిది. మొదటి రోజు కేబుల్ కారుతోనే మా పర్యటన పూర్తయింది.

వెల్‌కమ్ టు థాయ్‌లాండ్

మరుసటి రోజు (21న) ఉదయం సుంగాయి కిమ్ నేచర్ పార్క్ టూర్‌కు బయలుదేరి వెళ్లాం. సముద్రంలో ఒక బోటులో మేము ప్రయాణం మొదలు పెట్టాం. మధ్యలో రంగురంగుల చేపలను చూశాం. సాగరానికి ఇరువైపులా పచ్చని కొండలు మమ్మల్ని కనువిందు చేశాయి. అలా సముద్రంలో వెళుతుంటే అకస్మాత్తుగా మా మొబైల్ ఫోన్‌లో సంక్షిప్త సందేశం ఒకటి ప్రత్యక్షమైంది. దానిలో సారాంశం ఏమిటంటే… వెల్‌కమ్ టు థాయ్‌లాండ్ అని. ఆ సందేశం చదువుతుండగానే థాయ్‌లాండ్ నేవీ బోట్ ఒకటి వచ్చి మమ్మల్ని చుట్టుముట్టింది. నేవీ అధికారి ఒకరు మాతో మాట్లాడారు. మేమంతా విదేశీ జర్నలిస్టులమనీ, మలేషియా పర్యటనకు వచ్చామనీ తెలుసుకున్న తరువాత మా బోట్ తిరుగు ప్రయాణమైంది.

మధ్యాహ్నం ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భోజన కార్యక్రమం ముగించుకుని సాయంత్రం ‘సన్‌సెట్ క్రూయిజ్’ ఎక్కాం. ఆ బోట్‌లో మాతో పాటు దాదాపు 200 మంది విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒకసారి అందులోకి ప్రవేశించిన తరువాత సాఫ్ట్ డ్రింక్, ఆల్కహాల్ ఏది తీసుకోవాలన్నా ఉచితమే. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రయాణంలో నిర్వాహకులు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో సముద్రంలో స్విమ్ చేసేందుకు వీలుగా వలలు కూడా ఏర్పాటు చేశారు. అది మర్చిపోలేని అనుభవం. అదే మా చివరి అంకం కూడా. మరుసటి రోజు, అంటే మే 22వ తేదీ ఉదయం లంఖావి నుంచి విమానంలో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవడంతో నా పర్యటన ముగిసింది.

ప్రొఫైల్

దేశం : మలేషియా
రాజధాని : కౌలాలంపూర్
పాలన పట్టణం : పుత్రజయ
ఖండం : ఆసియా
విస్తీర్ణం : 3,29,758 చ.కి.మీ.
జనాభా : 2 కోట్ల 83 లక్షలు
అధికార భాష : మలే
అధికార మతం : ఇస్లాం
కరెన్సీ : రింగిట్ మలేసియా
విభజన : 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు
నివాస జాతులు : మలేలు(57%), చైనీయులు, భారతీయులు, ఇతరులు 43%