గుండెను ఆగనివ్వొద్దు

ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే ప్రాణం పోయింది. గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేసినా ప్రాణం దక్కేది.‘ – ఇంచుమించుగా ఇటువంటి డైలాగ్‌లు భూమ్మీద ఎక్కడో ఒక దగ్గర పేషెంటు పక్కన ఉన్న వాళ్లతో డాక్టరు చెప్తుంటాడు. డాక్టర్లే ఏమీ చేయలేనప్పుడు మనమేం చేయగలంఅనుకుంటాం మనం. ఆ ఆలోచనే పొరపాటు. గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలను కాపాడడం మీ చేతుల్లోనే ఉంటుంది. సిపిఆర్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తానుఅంటున్నారు డాక్టర్ అపర్ణ యలమంచిలి. ఈవిడ యుకె, బర్మింగ్‌హామ్‌లో ఫ్యామిలీ ఫిజిషియన్‌గా చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చి మరీ ఇక్కడ నేర్పించాలనే ఆలోచనకి కారణమేమిటో అపర్ణ మాటల్లోనే…

image003
గుండెపోటుకి గురయిన వ్యక్తికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిపిఆర్ (ఛ్చిటఛీజీౌఞఠజూఝౌn్చటడ ఖ్ఛటఠటఛిజ్ట్చ్టీజీౌn (కార్డియో పల్మొనరీ రిససిటేషన్)) చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టొచ్చు. డాక్టర్లో, పారామెడికల్ సిబ్బందో సిపిఆర్ చేయాలనేమీ లేదు. నేర్చుకుంటే మీరు కూడా చేయొచ్చు ఆ పని. నేర్చుకోవడం పెద్ద కష్టమూ కాదు. యుకెలో సిపిఆర్‌ను దాదాపు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. మన దేశంలో గుండెపోటు వల్ల సంభవించే మరణాలు ఎక్కువే. అయినా సిపిఆర్ పట్ల అవగాహన మాత్రం చాలా తక్కువ.

గుండెపోటుతో మనిషి పడిపోయిన తరువాత అంబులెన్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు పోతున్నాయి. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య తగ్గించాలంటే ప్రతి ఒక్కరికీ సిపిఆర్ శిక్షణ అవసరం. మొదట ఎక్కువమంది పనిచేసే కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకులు, మీడియా సంస్థలు, పాఠశాలల్లో దీన్ని నేర్పిస్తే ఎక్కువ ఉపయోగం. అందుకే హైదరాబాద్‌లో నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.

అమ్మ మరణంతో…
ఈ ఆలోచన రావడానికి కారణం మా అమ్మ మరణం. తను గుండెపోటుతో హైదరాబాద్‌లో డిసెంబర్ 2010లో మరణించింది. నన్ను పట్టుబట్టి డాక్టర్ చదివించిన అమ్మ ప్రాణాలు కాపాడేందుకు సమయానికి నేను ఆవిడ దగ్గర లేకపోవడం నన్నెంతో బాధకి గురి చేసింది. ఈ విషాదం జరిగినప్పుడు యుకెలో ఉన్నాను. మా అమ్మకి జరిగినట్టు మరొకరికి జరగకుండా ఉండేందుకే వీలైనంత ఎక్కువమందికి సిపిఆర్ నేర్పించాలనుకున్నాను. ఇది కార్యరూపం దాల్చేందుకు ఏడాదిన్నరకు పైగా శ్రమపడాల్సి వచ్చింది. యుకె నుంచే కార్పొరేట్ సంస్థల్ని, స్కూల్ యాజమాన్యాలను సంప్రదించాను.

కానీ ఎవరూ సరిగా స్పందించలేదు. కొందరయితే నా ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేశారు. కాని సింపుల్‌గా ఉండే సిపిఆర్ పద్ధతిని తెలుసుకోవడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడొచ్చనేది నా ఆశ. అందుకే పట్టువదలని విక్రమార్కిణిలా పదేపదే ప్రయత్నించాను. ఈ ఏడాది పంజాబ్‌నేషనల్ బ్యాంక్, కస్తూరి బాయి నేషనల్ ట్రస్ట్, కూకట్‌పల్లిలోని ఆలంబన సంస్థ తమ అంగీకారం తెలిపాయి.
image002
http://www.andhrajyothy.com/i/2013/mar/5nav-2.jpgసిపిఆర్ ఎలా చేయాలంటే…
గుండెపోటు వచ్చిన వ్యక్తిని మొదట తట్టి లేపాలి. ఆ తరువాత సిపిఆర్ చేయడం మొదలు పెట్టాలి. అయితే ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోవాలి. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తి ఛాతీ మీద రెండు చేతులు పెట్టి నొక్కాలి. ఒకవైపు ఇది చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. నోటి ద్వారా శ్వాస అందించడానికి ఇన్‌ఫెక్షన్ల భయం వలన కొందరు వెనకాడతారు. అటువంటి వాళ్ల కోసం సిపిఆర్ ఫేస్ మాస్క్‌లు ఉన్నాయి.

వీటినే సిపిఆర్ కీ చెయిన్ మాస్క్‌లు అని కూడా అంటారు. ఈ మాస్క్‌ను నోటికి పెట్టుకుని శ్వాస అందివ్వడం వల్ల నోట్లోకి ఉమ్మి వెళ్తుందన్న సమస్య ఉండదు. శిక్షణ తరువాత ఈ కీ చెయిన్లను అందచేస్తున్నాను. ఇద్దరు మనుషులు కలిసి సిపిఆర్ చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకరు తలను కాస్త వెనక్కి వంచి నోటి దగ్గర నోరు పెట్టి శ్వాసను అందిస్తుంటే మరొకరు ఛాతీ మీద ఒత్తిడి పెట్టాలి. ఒకవేళ ఇద్దరు అందుబాటులో లేకపోయినా ఒక్కరైనా ఇది చేయొచ్చు.

ప్రాణాల్ని నిలబెట్టేందుకు
సిపిఆర్‌తో పాటు ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిల్లేటర్‘ (ఎఇడి) కూడా నేర్పిస్తున్నాను. పేరు వినడానికి పెద్దగా ఉన్నా సింపుల్‌గా చెప్పాలంటే దీనికి రెండు ప్యాడ్స్ ఉంటాయి. సినిమాల్లో, టివి సీరీయల్స్‌లో చాలాసార్లు చూసే ఉంటారు. వీటిని గుండె పోటు వచ్చిన వ్యక్తి ఛాతీమీద పెట్టి షాక్ ఇస్తారు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎఇడిలే షాక్ ఇవ్వండి, ఆపండిఅంటూ సజెషన్స్ ఇస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తుంటాయి. ఇటువంటి వాటిని పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాల్లో ఫ్లోర్‌కి ఒకటి ఉంచితే ఎంతో ఉపయోగకరం. దీనివల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తి జీవించే అవకాశాలు 30 నుంచి 50 శాతం పెరుగుతాయి.

సిపిఆర్ శిక్షణకి ఒక్కొక్కరి దగ్గర 75 రూపాయల ఫీజు కట్టించుకుంటున్నాను. ఆ డబ్బుని మా అమ్మ పేరు మీద ఏర్పాటుచేసినఆనందకుమారి ట్రస్ట్కి అందిస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా పేద, మెరిట్ విద్యార్థులకి ఆర్థికసాయం అందిస్తున్నాం. అవసరమైన వాళ్లకి వైద్యానికి సాయం కూడా చేస్తున్నాం. నేనిక్కడ మార్చి నెలాఖరు వరకు ఉంటాను. వీలయినంత ఎక్కువమందికి సిపిఆర్ ఎలా చేయాలో నేర్పిద్దామనేది నా ఆలోచన. మీరు నేర్చుకుంటే వేరొకరికి విలువైన జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఆసక్తి ఉన్న సంస్థలు, బ్యాంక్‌లు, విద్యాలయాలు 99593 84940 నంబరులో నన్ను సంప్రదించొచ్చు.

అట్లాంటి లీడర్లనిప్పుడు చూస్తామా?

‘ఎన్టీయార్ అంటే రాముడు. నేను ఆయన దగ్గర పని చేసిన లక్ష్మణుడిని. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే హృదయం బరువెక్కి వారం రోజుల పాటు తిండి తినబుద్ధే కాదు…’ అంటారు క్యాతం లక్ష్మణ్. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీయార్ 90వ జయంతి సందర్భంగా ఆయన కారు డ్రైవర్ లక్ష్మణ్ అనుభూతులూ అనుభవాలూ…
“నేను ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో మామూలు డ్రైవర్ని. ఒకరోజు మా డిపార్ట్‌మెంట్ వాళ్లు పిలిచి సీఎం దగ్గర డ్రైవర్‌గా పంపించారు. ఎన్టీయార్‌గారికి నచ్చడంతో డ్యూటీకి రమ్మన్నారు. ఇక అప్పట్నుంచి పద్నాలుగున్నరేళ్లు ఆయన దగ్గరే పని చేశాను. అన్నేళ్లలో ఏ ఒక్కరోజూ ఆయన నన్ను కోప్పడలేదు. అంతేకాదు, తన సిబ్బందిని బయటవాళ్లు ఒక్కమాటన్నా సహించేవారు కాదు, చివరకు ఆయన సొంత పిల్లలైనా. క్రమశిక్షణ, పట్టుదల ఆయన దగ్గర నేను నేర్చుకున్న గుణాలు.
ఎన్టీయార్ తన ఏ అవసరాలకూ ప్రభుత్వ సొమ్ము వాడేవాళ్లు కాదు.
ఆయన ఖర్చులు ఆయనే పెట్టుకునే వారు. ప్రభుత్వం నుంచి ఆయన తీసుకున్న కారు కూడా ఒక్కటే. కుటుంబసభ్యులు కూడా దాన్ని వాడేందుకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. తమ సొంత కార్లనే వాడుకోమనే వారు. ఒకసారి జయబాబు ఏదో పని మీద మా కార్లో వచ్చారు. “నాన్నగారూ మిమ్మల్ని సెక్రటేరియట్‌లో దింపి నేను ఆబిడ్స్‌లో దిగిపోతాను” అన్నారు. దానికి సారు.. “ఇది సీఎం కారు. మీ వ్యక్తిగత అవసరాలకు కాదు” అన్నారు. అంతెందుకు సీఎం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఫోన్ కాల్స్ విషయంలో కూడా పట్టుదలగా ఉండేవారు. తన ఆఫీసు నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో ఆ లిస్టంతా పీఏతో ఉదయమే తెప్పించుకొని పరిశీలించేవారు.
కుటుంబ సభ్యులెవరైనా ఆ ఫోన్‌ని వాడితే మందలించేవారు. ప్రభుత్వ సొమ్ము వృధా చేయొద్దనే వారు. సార్ దగ్గర పని సూర్యోదయానికి ముందే షురువయ్యేది. ఉదయం నాలుగు గంటలకు ఆయన ఇంటి వద్ద ఉండాలి. గండిపేట లేదా నాచారం.. కొంతకాలం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 13లో ఉన్నారు. అక్కడి నుంచి ఆబిడ్స్ వచ్చేవాళ్లం. ఇంట్లో కారెక్కగానే భగవద్గీత లేదా శివస్తుతులు వినేవారు. ఆబిడ్స్‌కి రాగానే అక్కడ సుప్రభాతం. ఇల్లంతా సాంబ్రాణి పొగలతో నిండి ఉండేది. మాకు ఏదో పవిత్ర స్థలానికి వచ్చిన అనుభూతి కలిగేది. అక్కడో రెండు గంటలు పని చూసుకున్నాక ఏడింటికే సెక్రటేరియేట్ వెళ్దామనే వారు.
ఇంకా స్టాఫ్ ఎవరూ రారు సార్.. ఎనిమిది తర్వాత వెళ్దాం అంటే సరేననేవారు. లలిత కళా తోరణం, ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల పని నడుస్తున్నంత కాలం ప్రతి రోజు అక్కడికి వెళ్లాల్సిందే. ఆ పనులు స్వయంగా చూడాల్సిందే. ట్యాంక్‌బండ్ మీది విగ్రహాలనైతే ఎంతో సునిశితంగా పరిశీలించేవారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఆ విగ్రహాల నమూనాలను పట్టి పట్టి చూసేవారు. తనకు సంతృప్తి కలిగే వరకు నమూనాల్ని మార్పించేవారు.
మీరు రాజులు ప్రజలు పేదలు
ఒకరోజుమంత్రి అశోక గజపతిరాజుని సార్ కార్లో కూర్చోబెట్టుకున్నారు. ‘బ్రదర్.. ఏంటి విశేషాలు’ అని అడిగారు. ఆయన కొన్ని కబుర్లు చెప్పి ‘రెండు రూపాయలకు కిలో బియ్యంతో ఖజానా మీద చాలా భారం పడుతోంది. కొంచెం రేటు పెంచుదామా’ అన్నారు. అంతే… సార్ సీరియస్ అయిపోయారు. “ఏం బ్రదర్ ఏంటి మీరు మాట్లాడుతున్నది. మీరు రాజులు. ప్రజలు పేదలు. వీలైతే మరింత తగ్గించవచ్చేమో చెప్పండి . పెంచమని సలహాలు ఇవ్వకండి’ అని ఆగ్రహంగా అన్నారు. అంతే ఇక సెక్రటేరియేట్‌లో బండి దిగేవరకు అశోక గజపతిరాజు ఒక్క మాట మాట్లాడలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి సెంటు భూమి సస్యశ్యామలం కావాలి లచ్చన్నా’ అంటూ ఉండేవారు ఎన్టీయార్.
హైదరాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల సమయంలో కూడా చాలా పట్టుదలతో వ్యవహరించారు. ఉదయం మూడు గంటలకే రోడ్ల మీదకు వచ్చేవారు. ఆయనతో పాటు అధికారులు కూడా. ‘చార్మినార్ కింద కూర్చుని చూస్తే ఫలక్‌నుమా ప్యాలెస్ కనిపించాలి. రోడ్డు అలా తీర్చిదిద్దండి’ అనేవారు. ఒకసారి చార్మినార్ దగ్గరున్న యునాని ఆసుపత్రి పైకి వెళ్లాం. అక్కడ రోడ్డు విస్తరణ ప్రయత్నం చేస్తున్నారు. షాపులు, తోపుడు బండ్ల వాళ్లు, ఎంఐఎం కార్యకర్తలూ, నాయకులూ వచ్చేశారు. ఎన్టీయార్ డౌన్‌డౌన్ అనే నినాదాలు మొదలయ్యాయి. సార్ కిందికి వచ్చారు. మల్గీల వాళ్లని పిలవమన్నారు. వాళ్లతో ‘మీకొచ్చిన నష్టం ఏముంది? రోడ్డు వెడల్పు చేశాక మల్గీలు కట్టిస్తాం.
అవి మీకే అప్పజెప్పుతాం. మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు’ అని నచ్చజెప్పారు. అక్కడే ఉన్న అధికారులతో వాళ్ల పేర్లు నమోదు చేసుకోమన్నారు. దాంతో వెంటనే ‘ఎన్టీయార్ జిందాబాద్’లు మిన్నుముట్టాయి. నిజాం కాలేజీ రోడ్డు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో ఉన్న గుడిని చూసి ‘లచ్చన్నా ఇక్కడ గుడి ఇంతకుముందు లేదు కదా. కొత్తగా వచ్చినట్లుందే’ అన్నారు. ‘అవున్సార్ ఇక్కడ నిజాం కాలేజీ వాచ్‌మెన్ రూం ఉండేది.’ అన్నాను. ‘లచ్చన్నా దీన్ని కూల్పించేయ్! నీ విగ్రహం ట్యాంక్‌బండ్ మీద పెడతా’ అన్నారు. అదే వాహనంలో ఉన్న ఆనాటి పోలీస్‌కమిషనర్ విజయరామారావు గట్టిగా నవ్వేశారు. ‘సార్ నా వల్ల కాదు’ అన్నాను మెల్లగా. రోడ్డుకు అడ్డంగా అప్పటికప్పుడు వెలసిన గుడులన్నా, మసీదులన్నా కోపంగా ఉండేది ఎన్టీయార్‌గారికి.
తప్పును ఒప్పుకునే మనిషి
ఎవరైనా తప్పు చేస్తే ఎంత సున్నితంగా మందలించే వారో, తాను తప్పు చేస్తే అంతే నిజాయితీగా ఒప్పుకునే వారు సార్. ఒకరోజు ఆబిడ్స్ ఇంట్లో ఉన్నాం. మధ్యాహ్నం రెండింటికి సెక్రటేరియట్ వెళ్దామని చెప్పారు. టైముంది కదా అని నాకు తెలిసిన వాళ్లొస్తే పక్కకు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ లోపున సార్ కారు దగ్గరకు వచ్చేశారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ‘ఏంటీ ఎటువెళ్లారు’ అని అడిగారాయన కొంచెం కోపంగా. క్షణం ఆలస్యమైనా సహించరు ఆయన. క్రమశిక్షణ గల మనిషి. సార్ రెండు గంటలకు వెళ్దామన్నారు కదా. ఇపుడు ఒకటిన్నరే అయ్యింది అని వాచీ చూపించాను. దానికాయన ‘సారీ లచ్చన్న, నిద్ర పట్టలేదు. అందుకే తొందరగా బయలుదేరాను’ అన్నారు.
అప్పుడేకాదు ఆయన కుటుంబ సభ్యులుగానీ, అధికారులు, నాయకులుగానీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు అని తెలిస్తే చాలు సారీ చెప్పేవారు. ‘మీరు పెద్దవాళ్లు..’ అన్నాగానీ తప్పు తప్పే అనేవారు. ఒకసారి ఆబిడ్స్ నుంచి జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్తున్నాం. తాజ్‌కృష్ణా అప్‌లోకి రాగానే.. ‘లచ్చన్నా.. బాబు పాలన ఎలా ఉందీ’ అని అడిగారు. ‘రాజకీయాల గురించి నాకేంతెల్సు సార్’ అన్నాను. ‘బయట అనుకుంటారుగా’ అన్నారు. దాంతో నేను ‘బాగానే ఉంది సార్’ అన్నాను. ‘బాబు రాజకీయ చాణుక్యుడులే’ అన్నారు. ఆ మాటల సందర్భంలోనే నేను కొంచెం చొరవ తీసుకున్నాను. ‘మన దగ్గరా తప్పులున్నాయి కదా సార్’ అంటూ ‘ఎంతో తపోశక్తి కలిగిన రావణాసురుడు సీతను చెర పట్టగానే పేరు చెడిపోయింది కదా సార్’ అన్నాను. ఆయన ‘అందరూ అన్నారు లచ్చన్నా. నీవొక్కడివే మిగిలిపోయావనుకున్నా. చివరకు నువ్వూ అనేశావు’ అనే ఒక్కమాట మాట్లాడి తల కిందికి దించేసుకున్నారు. ఇంటి వద్ద దిగే వరకు మళ్లీ ఆయన తలపైకెత్తలేదు. ఆయనలోని సంస్కారం అలాంటిది. అట్లాంటి లీడర్లని ఇప్పుడు చూస్తామా?
ఆప్యాయంగా చూసేవారు
ఆయన దగ్గర పని అంటే మా ఇంట్లో పని చేసుకున్నట్లే ఉండేది. అంతటి ఆప్యాయత చూపేవారు. ‘లచ్చన్నా భోజనం చేశారా? ఏం తెచ్చుకున్నారు? ఇంత చిన్న బాక్సు ఏం సరిపోతుందీ?’ అని పలకరించేవారు. ఆయన కార్లో ఏదైనా తింటూంటే గేర్ రాడ్ మీద ఉన్న నా చేయిని కొట్టి ‘ఊ’ అని సైగ చేసి నాకూ పెట్టేవారు. భోజన ప్రియుడు. ఉదయం నాలుగు గంటలకే ఓ కోడి, చిక్కగా మరగబెట్టిన లీటర్ పాలు, రాత్రి కిలో చేపలు, సాయంత్రం రసమలై, కోవా గర్జ్, అపుడపుడు పల్లీలు, బెల్లం… ఇట్లా మంచి బలమైన ఆహారం తీసుకునేవారు. ప్రతి ఆదివారం కొడుకులూ, కూతుళ్లూ, మనువలూ, మనవరాళ్లందరినీ పిలిచి అందరితో కలిసి భోంచేసేవారు. సార్ తిరిగి అధికారంలోకి వస్తే సత్యనారాయణస్వామి వత్రం చేస్తానని నా భార్య మొక్కుకుంది. ఆయన విజయం సాధించారు.
వ్రతం విషయం చెప్పాను. ‘నేను వస్తాను’ అన్నారు. మంచిది సార్ అన్నాను కానీ నాకు నమ్మకం లేకుండె. కానీ ఆయన నిజంగానే వచ్చారు. ఏ ఫంక్షన్లో కూడా కొద్ది నిమిషాలకు మించి ఉండని ఆయన రెండు గంటల పాటు నా ఇంట్లో ఉన్నారు. పార్సీ గుట్టలో చిన్న రెండు గదుల ఇల్లు నాది. వచ్చేముందు ఫోన్ చేసి ఏమేం వంటకాలు చేయించారని అడిగారు. ఆలు ఫ్రై, పప్పు, సాంబారు అని చెప్పాను. వచ్చి భోంచేశారు. నా పిల్లల్ని దీవించారు. నాకు బట్టలు కూడా పెట్టారు. అవి నేను కుట్టించుకోలేదు. నేను చనిపోయినప్పుడు వాటిని నా శవం మీద కప్పాలని నా కోరిక. మా నాన్న చనిపోయినపుడు కారు ఇచ్చి మరీ నన్ను ఇంటికి పంపించారు. కార్యక్రమాలన్నీ చూసుకొని రండి అని చెప్పారు. ఆ పదిరోజులే నేను ఆయన వద్ద పనిచేసిన కాలంలో డ్యూటీకి దూరంగా ఉన్నది. అలాంటి మనిషి మళ్లీ పుట్టడు.
అభిమానులంటే గౌరవం..
సార్ ఎంత బిజీగా ఉన్నా అభిమానులకూ, అవసరం రీత్యా వచ్చిన వారికి టైమ్ ఇచ్చేవారు. ఒకసారి ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. లంబాడీ. ఆజానుబాహుడు. ఆయన్ను చూసి ఎందుకొచ్చారని అడిగారు సార్. ‘నా కూతుర్ని చెట్టుకు కట్టేసి చెరిచారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు స్పందించడం లేద’ని చెప్తే 24 గంటలు తిరగక ముందే నిందితుల్ని అరెస్ట్ చేయించి, అక్కడి పోలీసు అధికారిని సస్పెండ్ చేయించారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందని చెవినబడితే వెంటనే స్పందించేవారు. యాక్షన్ తీసుకునే వరకు మర్చిపోకుండా అధికారుల్ని ఆరా తీసేవారు.
ఆబిడ్స్ నివాసానికి సార్‌ని చూసేందుకు చాలా మంది వచ్చేవారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని సార్‌కి తెలియనిచ్చేవారు కాదు. ప్రతిరోజు మేము ఇంట్లోంచి బయలుదేరగానే వెనుక మూడు, నాలుగు బస్సులు ఫాలో అయ్యేవి. అందరూ అభిమానులే. సార్‌ని ఒక్కక్షణమైనా చూద్దామని వాళ్ల కోరిక. నేనొకరోజు ఈ విషయాన్ని సార్‌కి చెప్పాను. ఆయన మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి అభిమానుల్ని కలిసారు. ఆ తర్వాత ఆబిడ్స్‌లో వాళ్లకో పెద్ద హాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి.. ఏవైనా ఫిర్యాదులుంటే స్వీకరించే ఏర్పాట్లు చేయించారు. ప్రతిరోజు ఒకసారి అక్కడికి వెళ్లి వాళ్లందర్నీ చూసి చేయి ఊపి వెళ్లేవారు.
అలాంటి మనిషి డల్ అయితే…
ఎప్పుడూ హుషారుగా ఉండేవారాయన. సెక్యూరిటీవాళ్లు వచ్చి డోర్ తీసేలోపు జింకపిల్లలా చటుక్కున స్వయంగా డోర్ తీసుకొని కూర్చునేవారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా అంతే. నేను కారు రివర్స్ తీసుకునే లోపున తిరిగి వచ్చేసేవారు. ఎంతో వేగంగా, చలాకీగా ఉండేవి ఆయన పనులు. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా డల్ అయ్యారు. చాలా నెమ్మదిగా కారు దిగేవారు. కిందికి దిగడానికి నేను సాయం పట్టాల్సిన పరిస్థితి.
– పి. శశికాంత్

నిలబడ్డం కాదు నిలబెట్టడమే ముఖ్యం

tulasi

ఎవరో సాయం చేస్తే తప్ప ఎస్ఎస్ఎల్‌సి పరీక్ష ఫీజు కూడా కట్టలేని ఒకనాటి పేద విద్యార్థి, నేడు ఏటా 6500 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేస్థాయికి చేరుకున్నాడు. అతనే తులసీ రామచంద్ర ప్రభు. ఐఐటిలో తనకు రావలసిన ఉద్యోగం ఎప్పటికీ రాదని తెలుసుకుని నీరసించిపోకుండా, రుణసాయంతో చిన్న అట్టపెట్టెల (కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమను మొదలెట్టి, ‘కోస్టల్ ప్యాకేజింగ్నుంచి తులసీ సీడ్స్దాకా దాదాపు డజను కంపెనీలకు పైగా అధిపతి అయ్యారాయన. 67 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఆయనకు ఎదురైన సంఘటనలే ఈ వారంఅనుభవం

పేదతనం వల్ల ఎదురయ్యే అవమానాలు, ఆటుపోట్లకు పెద్దవాళ్లయితే ఎలోగోలా తట్టుకుంటారు కానీ, అవి పసిబిడ్డలను భరించలేని బాధకు గురిచేస్తాయి. నేను పుట్టింది గుంటూరులోని జగ్గాపురం. పెరిగింది మాత్రం గుంటూరులోనే. మాది మొదట్లో సంపన్న కుటుంబమే అయినా, నాన్నగారి పొగాకు వ్యాపారంతో ఉన్న ఆస్తులన్నీ పోయి కుటుంబం అప్పుల పాలయ్యింది. నా హైస్కూలు రోజుల నాటికే కుటుంబ పరిస్థితి పుస్తకాలు, స్కూలు ఫీజు కట్టలేని స్థితికి చేరుకుంది. ఒక జత బట్టలకు మించి నాకు ఎప్పుడూ ఉండేవి కాదు. నా చిరిగిన దుస్తులకేసి జనం చూసే చూపులు చిత్రంగా ఉండేవి.

ఎస్ఎస్ఎల్‌సి పరీక్షకు కట్టాల్సిన 16 రూపాయల ఫీజుకే బంధువుల్ని ఆశ్రయించాల్సిన స్థితి మాది. ఇక కాలేజ్‌లో చేరేనాటికి స్కాలర్‌షిప్‌లు వస్తే తప్ప నాలాంటి వాడు చదువు కొనసాగించడం సాధ్యం కాదనే విషయం నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. ఆ ఆలోచన నన్ను మరింత కష్టపడేలా చేసింది. ఐఐటి ప్రవేశ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ రావడంతో నాకు మద్రాసు ఐఐటిలో సీట్ వచ్చింది. మెరిట్ స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. ఫస్ట్ ర్యాంక్‌తో మెకానికల్ ఇంజినీరింగ్ పాసయ్యాను. నాకైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత ఆనందం వే సింది కానీ, ఆ తర్వాత జరిగిందంతా అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగానే.

అక్కడే ఆగిపోయి ఉంటే….

పట్టా చేతికి వచ్చీ రాగానే బిహెచ్ఇఎల్‌లో టెక్నికల్ మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపిక య్యాను. వెంటనే వచ్చి చేరిపొమ్మన్నారు. వెళ్లే ముందు ఆనవాయితీగా జరిగే ఒక వైద్య పరీక్షకు పిలిచారు. అయితే, ఆ పరీక్షల్లో నాకు కలర్ బ్లైండ్‌నెస్ ఉందంటూ ఒక రిపోర్టు ఇచ్చారు. అప్పటిదాకా నాకు తెలియని ఒక దృష్టిలోపాన్ని వాళ్లు ఎత్తిచూపినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కలర్ బ్లైండ్‌నెస్ అంటే ఇతరత్రా ఏ దృష్టిలోపమూ ఉండదు. ఆకుపచ్చ, ఎరుపు వర్ణాల మధ్య ఉండే తేడా తెలియదంతే. సామాన్య జీవనంలో ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ, టెక్నికల్ మేనేజ్‌మెంట్‌లో ఈ లోపం చాలా ప్రమాదం అంటూ సెలక్షన్ లిస్ట్‌లోంచి నా పేరు తొలగించారు. నా కాళ్ల కింది భూమి కదిలిపోయింది. ఈ ఉద్యోగం పోతే పోయిందిలే అనుకుని మరో ఉద్యోగానికి వెళ్లినా అక్కడా ఇదే సమస్య కదా! అలాంటప్పుడు సొంతంగానే ఏమైనా చేసుకుంటే పోలా అనిపించింది.

ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, కేవలం 4 లక్షల పెట్టుబడితో అట్టపెట్టెల ( కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమ స్థాపించాను. బ్యాంకు రుణం పోగా అందులో నేను పెట్టింది 45 వేలే. అందులోనూ నా స్నేహితులూ, ఆత్మీయులు ఇచ్చిందే ఎక్కువ. ఏమైనా, 1977లో ప్రారంభమైన ఆ పరిశ్రమ విజయవంతం కావడంతో వెనక్కి తిరిగిచూసే అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత 84లో ఒకటి, 2001లో మరొకటి మొత్తం మూడు పరిశ్రమల్ని గుంటూరులోనే నెలకొల్పాను. ప్రస్తుతం 450 కోట్ల టర్నోవర్‌తో ఈ పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కోస్టల్ ప్యాకేజింగ్, చంద్రాట్రాన్స్‌పోర్టు, తులసీ సీడ్స్ ఇలా పలు సంస్థల్ని ప్రారంభించాను.
http://s3-ap-southeast-1.amazonaws.com/ajposts/articles/2013-9-26/pid_madhu_20139261932_2
అవన్నీ కూడా విజయవంతంగానే నడుస్తున్నాయి. ఆ రోజే కనుక నేను ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే, నాకు అదే ప్రపంచమైపోయేది. జీవితం అక్కడే ముగిసిపోయేది, ఆ ఉద్యోగంలో ఎంత కష్టపడినా నేను ఈ స్థితికి వచ్చే వాడ్నే కాదు. వాస్తవానికి, ఇంతటి విశాల ప్రపంచంలో ఒక దారి మూసుకుపోయినంత మాత్రాన ప్రపంచమే చేజారిపోయినట్లు విషాదంలో కూరుకుపోవలసిన అవసరం లేదు. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా వేల మార్గాలు కనిపిస్తాయి. ఇదీ ఆ సంఘటన ఫలితంగా నేను గ్రహించిన అనుభవం.

అలా మొదలయ్యింది

19 ఏళ్ల క్రితం ఒక రోజు నేను గుంటూరులోని నా కార్యాలయంలో ఉన్న సమయంలో ఎవరో ఒక స్టూడెంట్ నా కోసం వచ్చాడని ఆఫీస్ బాయ్ చెప్పాడు. వేచి ఉండమని చెప్పి మళ్లీ పనిలో నిమగ్నమైపోయాను. పని ముగించుకునేసరికి రాత్రి అయ్యింది. ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక కుర్రాడు బయట కనిపించాడు. ఉదయం నుంచి నాకోసం ఎదురుచూస్తున్న విద్యార్థి అతడేనని తెలుసుకుని, వెంటనే ఛాంబర్‌లోకి పిలిపించాను. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా డబ్బుల్లేక బి. ఎస్‌సిలో చేరిన ఆ కుర్రాడి గా«థ విని డిడి తీసి ఇంజనీరింగ్‌లో చేర్పించాను. దానితో మొదలైన ఆలోచన ప్రతిభ ఉండీ చదువుకోలేకపోయిన వాళ్లకు సహకరించేందుకు శ్రీకృష్ణ దేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలెజ్డ్అన్న పేరుతో ఒక సంస్థకు శ్రీకారం చుట్టేలా చేసింది.

ఓ పదేళ్ల క్రితం కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్న రోజుల్లో జరిగిన ఓ సంఘటన నన్ను విపరీతంగా కదిలించివేసింది. వేరే చోట 90 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8.30 అయ్యింది. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా, అడ్మిషన్ ఫీజు కట్టలేని స్థితిలో ఓ 55 ఏళ్ల పెద్దమనిసి తన కొడుకును వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. “వాళ్లను చూడగానే ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి?” అన్నాను ” రేపల్లెనుంచి పొద్దున 8.30 కు వచ్చామయ్యాఅన్నారు.ఎప్పుడు బయల్దేరారు?”అంటే “ఉదయం 3.30కు అయ్యాఅన్నారు.

నేను ఇచ్చే 5వేల రూపాయల కోసం ఉదయం 3.30కు బయల్దేరి వచ్చి రాత్రి 8.30 దాకా వేచిచూస్తున్నారా? నేనో మహాదాతలా ఇన్ని గంటలు వెయిట్ చేయించానా?’ నాలో ఏదో తెలియని బాధ. ఒక అపరాధ భావన.మీకు నా మీద కోపం రావడం లేదా?” అన్నాను. ఊహించని నా ప్రశ్నకు ఆ పెద్దాయన ఉలిక్కిపడ్డట్లు చూశాడు. కొద్ది క్షణాల్లో అతని కళ్లల్లో నీళ్లు తిరగడం మొదలెట్టాయి. ” మీ మీద నాకు కోపమా అయ్యా! నేనెవరో మీకు తెలియదు. అయినా నా కొడుకు చదువు కోసం మీరు 5 వేలు ఇస్తున్నారు. మీ మీద నాకు కోపం ఏమిటి సామీ! కోపం కాదుగానీ, భయమేసిందయ్యా! అన్నాడు.

ఎందుకూ అంటే “ఇంత రాత్రయింది కదా ! రేపు రమ్మంటారేమోనని భయమేసిందయ్యా! ఎందుకంటే రేపు మళ్లీ రావ డానికి నా దగ్గర డబ్బుల్లేవయ్యా!అన్నాడు. ఇంక నేను నిగ్రహించుకోలేకపోయాను, నా కళ్లల్లోంచి బొటబొటా నీళ్లొచ్చేశాయి. పిల్లాడి చదువు మీద ఎంత శ్రద్ధ లేకపోతే ఇక్కడ ఇన్ని గంటలు నిరీక్షిస్తాడు? సమయానికి ఒక సహాయం అందకపోతే ఎంతో ఉజ్వలంగా వెలగాల్సిన జీవితాలు ఎలా కొడిగట్టుకుపోతాయో కదా అనిపించింది. ఈ పనికి ఎవరో కొద్దిమంది చేయూత ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఆర్థికంగా ఎంతో కొంత నిలదొక్కుకున్న ప్రతి ఒక్కరూ తమ శ క్తి మేరకైనా ఆదుకోకపోతే బంగారం లాంటి పిల్లల మనుగడ మట్టిపాలవుతుందని నేను నిత్యం అనుకుంటాను.

మనుషుల్ని చేయడం ముఖ్యం

నేను ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టూ సక్సెస్ అయ్యింది. వ్యక్తిగతంగా నేను విజేతనే. కానీ, ఒక వ్యక్తి విజయం దేశ విజయం కాదు కదా! వ్యక్తిగత విజయం సంతోషదాయకమే కావచ్చు గాక సామాజిక దృష్టితో చూస్తే నిత్యం ఆందోళన పడుతున్న మనిషిన్నేను. కొంతమందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ద్వారా నేనేదో మహాయజ్ఞం చేశానని అనుకోవడం లేదు. జరుగుతున్న విపరిణామాల్ని చూసి లోలోపల ఎంతో ఆవేదనకు గురవుతుంటాను. ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని చెప్పుకునే మనం భావితరాల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన పిల్లలకు, స్త్రీలకు ఏమైనా భవిష్యత్తూ, భద్రతా ఉన్నాయా? మన బిడ్డలు రేపు ఎక్కడ అత్యాచారాలకు గురవుతారో, ఎక్కడ గొంతు పిసికేయబడతారో, ఎప్పుడు రక్తపు ముద్దలై మన కళ్లముందు కుప్పపడతారో ఏమీ తెలియకుండా పోతోంది.

మన అతి పెద్ద బాధ్యత వీటిని నివారించడంలోనే ఉందని నాకు తరుచూ అనిపిస్తూ ఉంటుంది. పొట్ట పోసుకోవడం కోసం ఎవరూ అంత క ష్టపడక్కర్లేదు. ఏ చిన్న పనితోనైనా బతికేయొచ్చు. నిజంగానే ఏమైనా చేయాల్సి ఉంటే అది దేశం కోసమే. ఎవరికి వాళ్లు డబ్బుల లెక్కల్లోనే సతమతమైపోతున్నారు. ఒక్కోసారి నాకే లెక్కలు సరిగా రాక వెనకబడిపోతున్నానేమో ? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ, డబ్బే సమస్తం అనుకోవడం వల్లే కదా మనిషి మనిషి కాకుండాపోతున్నాడు. ఏదో సాయం అందించి శరీరాల్ని నిలబెట్టడం చేయవచ్చు. కానీ, అంతకన్నా ముఖ్యంగా మనిషిని నిలబెట్టాలి. మనీషిగా నిలబెట్టాలి. ఈ విషయంలో ఎవరెంత ఎక్కువ చేసినా అది తక్కువేనని నాకనిపిస్తుంది.

బమ్మెర ,
గింజుపల్లి భాస్కరరావు-గుంటూరు

కేక్ కట్ చేస్తారు…హార్ట్ టచ్ చేస్తారు

జీవితం ఒక తియ్యని వేడుక.
అందరికీనా?
అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ!
పిల్లల్లో కలిసిపోతే…
పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది.
స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం…
ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది.
అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు!
సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్…
చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి…
అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో!
ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’.

అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే… ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం…

spurthi1

సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు… చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే… ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు.

క్యాండిల్ దగ్గర నుంచి వెల్‌కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్‌కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు… అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే… బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

స్కూలు ఆలోచన…

అమెరికాలో ఎమ్‌ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు.

మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు… ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి… పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది.

ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత

 ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం… చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్… వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్.

అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు
 ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’
– శ్రీవ్యాల్