పద్యాల చిన్నయసూరి

19vzrdv01Mother_20_2316798g

 

పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి తరాలకు అందించాలనే నా తపన” అంటున్నారు విశాఖపట్నానికి చెందిన పరవస్తు ఫణిశయన సూరి. ‘వారం వారం పద్య విహారం’ పేరిట ఆయన చేస్తున్న ప్రయత్నానికి బాలల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

పరవస్తు ఫణిశయన సూరి. ‘పేరెక్కడో విన్నట్టుగా ఉంది’ అన్నారంటే మీకు తెలుగు గురించి కొంచెం తెలిసినట్టే. ‘పరవస్తు చిన్నయసూరికి ఈయన ఏమవుతారు’ అని అడిగారనుకోండి, అప్పుడు మీకు భాష గురించి బాగా తెలిసినట్టు. తెలుగు భాషకు వ్యాకరణ కిరీటాన్ని పెట్టిన పరవస్తు చిన్నయసూరికి ఈ ఫణిశయన సూరి ఐదో తరం మనవడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న మనుషులున్న ఈరోజుల్లో కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును తెలుగు పద్యాల వ్యాప్తికి ఖర్చు చేస్తానంటున్న ‘అ’సామాన్యుడాయన.

కోటిచ్చినా నోటికొస్తుందా…
పూర్వం అక్షరాభ్యాసానికి పూర్వమే పిల్లలకు పద్యాలు నోటికొచ్చేవి. ఉదయాన్నే లేచి పనిచేసుకుంటూ పద్యాలను వల్లించుకునే బామ్మల నుంచో, రాత్రి పూట పద్యపఠనం చెయ్యకుండా పడుకోలేని తాతల నుంచో వినీవినీ వారికి అవి ఒంటపట్టేవి. ‘శ్రీరాముని దయచేతను….’ ‘నీ పాద కమలసేవయు…’ ‘ఉప్పుకప్పురంబు….’ ఒకటారెండా, ఒకటో తరగతిలో చేరేనాటికి తక్కువలో తక్కువ పాతిక పద్యాలయినా కంఠస్థమయి ఉండేవి చిన్నారులకు. ఇప్పుడా పరిస్థితి లేదు. “అలాగని తెలుగు పద్యాలను మరిచిపోతామా చెప్పండి? అపూర్వమైన నిధి కదండీ మన పద్యాలంటే? వాటిని పిల్లలకు నేర్పించకపోతే ఎలా?” అంటూ ఆ పనికి తానే ముందడుగేశారు.

‘వారం వారం పద్య విహారం’ అనే శీర్షికతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పౌర గ్రంధాలయం వేదిక అయింది. ‘పద్యం నేర్చుకోండి, పది రూపాయలు అందుకోండి’ అన్న నినాదంతో మొన్న వేసవి నుంచి ఆయన చేపట్టిన ప్రచారం చిన్నారుల్లో మంచి ఉత్సాహాన్నే నింపింది. ఏప్రిల్‌లో మొదలైన ఈ కార్యక్రమానికి దాదాపు 550 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా… 300 మంది వివిధ వయసుల విద్యార్థులు ఒక్కొక్కరూ పాతిక నుంచి రెండొందల వరకూ పద్యాలను నేర్చుకున్నారు! వాళ్లకు సుమారు యాభై వేల రూపాయలను బహుమతులుగా ఇచ్చారు ఫణిశయన సూరి. అలాగని ఇది డబ్బు కుమ్మరిస్తే అయిపోయే పని కాదు. కోటి రూపాయలు పోసినా నోటికో పద్యం రావాలంటే చాలా తతంగం ఉంది.

‘పద్య విహారం’ కార్యక్రమం విజయవంతం కావడానికి సూరి చాలా పరిశ్రమించారు. “మా తెలుగు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో ముందుగా తె లుగు సాహిత్యంలో అపూర్వ వజ్రాల వంటి పద్యాలను ఎంపిక చేసే పనిలో పడ్డాం. దేనికదే అపురూపంగా ఉండేది. ప్రతి పద్యాన్నీ చదువుతున్నప్పుడు దాన్ని పిల్లలకు ఎలాగైనా నేర్పించాలనిపించేది. ఏ కవినీ వదిలెయ్యాలనిపించేది కాదు. అబ్బో, అదొక విచిత్రమైన అవస్థ …’ అంటున్న సూరి మొత్తానికి తొలిమెట్టుగా ఒక ఐదు వందల పద్యాలను పోగుచేశారు. పిల్లలకు అర్థమయ్యేలా విడివిడి కాగితాల మీద రాసి నకలు తీయించారు.

తెలుగులో చదవలేని ఇంగ్లీష్ మీడియమ్ వారికైతే ఇంగ్లీష్‌లోనే రాసిచ్చారు. అర్థం చెబుతూ పద్యాన్ని చదవడంలో శిక్షణనిచ్చారు బాలలకు. “వేసవి శిబిరం బాగా నడుస్తుందా లేదా అని ఆందోళనగా ఉండేది. మొదట్లో తల్లిదండ్రులు బలవంతపెడితే, కొద్ది మందొచ్చేవారు. నెమ్మదిగా వాళ్లంతటవాళ్లుగా రావడం పెరిగింది. వేసవి శిబిరం తర్వాత ఆపేద్దామనుకున్న మేం ఇప్పుడు పద్య విహారాన్ని వారం వారం హాయిగా కొనసాగిస్తున్నామంటే బాలల్లోని ఆదరణే దానికి కారణం” అంటున్నారు సూరి.

అపర భువన విజయం
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి దాకా – వివిధ వయసుల బాలలు పూర్వ కవుల పద్యాలను గడగడా చదువుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది. “చిన్నారులు తప్పుల్లేకుండా భావయుక్తంగా పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను…” అంటున్న ఫణిశయన సూరిలో ఆ ఆనందామృతాన్ని పదిమందికీ రుచి చూపించాలనే ఆలోచన కలిగింది. తన శిక్షణలో బాలలు సొంతం చేసుకున్న పద్య సంపదను పదిమందిలోనూ ప్రదర్శిస్తూ ‘తెలుగు పద్య విజయం’, ‘తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం’ అన్న శీర్షికలతో ఇప్పటికీ రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించారు.

రెండిటిలోనూ నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన , మొల్ల… వంటి మహామహుల రూపాలను ధరించిన పిల్లలు… సాక్షాత్తూ ఆ కవులు భువికి దిగి వచ్చారా అన్నంత ధారణతో పద్యాలను చదువుతుంటే సభాసదులు పులకరించిపోయారు. ఇవన్నీ చేస్తున్నారు కదాని సూరి ఏమీ ఆగర్భశ్రీమంతుడు కాదు.

వివాహాది శుభకార్యాల్లో పువ్వుల అలంకరణ చేసే వృత్తికి తోడు అప్పుడప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా సినిమాలకూ పనిచేస్తుంటారు. పద్య విహారం కనీసం రెండేళ్ల పాటు నిర్విఘ్నంగా జరగడానికి ఐదు లక్షల రూపాయల నిధిని సొంతంగా సమకూర్చుకున్నాకే తొలి అడుగు వేశారాయన. “ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చమని నేనుగా ఎవరినీ అడగదల్చుకోలేదు.. పద్యం పట్ల అభిమానంతో ఎవరైనా ఇస్తే కాదనను” అంటున్న సూరి ప్రయత్నం ఎంతోమందికి మార్గదర్శకం.

మన తెలుగు పద్యాల గొప్పదనాన్నీ, వాటి అందచందాలనూ ఈ తరానికి తెలియజెప్పే శీర్షికలు కొన్ని పత్రికల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఈమాట’ వెబ్ మ్యాగజిన్‌లో విజయవాడవాసి చీమలమర్రి బృందావనరావు చక్కటి పద్యాలను ఏర్చి కూర్చి కొన్నేళ్లుగా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. అటువంటిదే మరో ప్రయత్నం గుంటూరుకు చెందిన రచయిత పాపినేని శివశంకర్ చేశారు.

అమెరికాలో వెలువడే ‘తెలుగునాడి’ మాస పత్రిక పాఠకుల కోసం ఆయన పరిచయం చేసిన అనర్ఘ రత్నాల వంటి పద్యాలు, వాటి వివరణలనూ ఒకచోట చేర్చి ‘తల్లీ నిన్నుదలంచి’ అన్న పుస్తకాన్ని ఈమధ్యే విడుదల చేశారు. “ప్రాచీన సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాకా అందరికీ జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి…” అని తెలుగు పద్య నిధిని తలుచుకొని మురిసిపోతున్నారు పాపినేని శివశంకర్.ఫణిశయన సూరి : 9440682323

– అరుణ పప్పు, విశాఖపట్నం

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!

తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ‘గోల్కొండ హైస్కూలు’ సినిమా ఒక మోస్తరుగా నడిచినా ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ మళ్లీ విజయాన్ని కట్టబెట్టింది. దశాబ్ద కాలపు సినీ జీవితంలో మోహనకృష్ణకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.

bharani
కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నా, టీచింగ్‌లోకి వెళ్లొచ్చని పిహెచ్.డిలో చేరినా అంతిమంగా సినిమా రంగం పట్ల నాకున్న ఇష్టం నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది. మా నాన్న శ్రీకాంత శర్మ గారి కారణంగా ఇంట్లో ఏర్పడిన సాహిత్య వాతావర ణం, మా అమ్మ జానకీబాలగారి కారణంగా ఏర్పడిన సంగీత వాతావరణం బహుశా నేను ఈ వైపు రావడానికి ప్రధాన కారణమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది.

1997లో నేను 50 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా ‘మహాంధ్ర’ అన్నపేరుతో ఒక డాక్యుమెంటరీ చేశాను. దాదాపు 1870 నుంచి 1947 వరకు రాష్ట్రంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చిన మార్పులేమిటి? అన్న విషయం తీసుకుని ఆ డాక్యుమెంటరీ చేశాను. జెవి సోమయాజులు నిర్మాతగా వ్యవహరిస్తే పవన్‌కుమార్ మాన్వి దానికి దర్శకత్వం వహించారు. దానికి సంబంధించిన పరిశోధన, రచన నేనే చేశాను.

సినిమా గురించిన ఒక అవగాహన కలిగించింది ఆయనే. అందువల్ల సినిమా లోకానికి సంబంధించినంత వరకు మాన్విగారు నా తొలిగురువు. సినిమా రచన గురించి, దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు నేను అయన నుంచి నేర్చుకున్నాను. ఆయన సలహా మీదే కెనడా వెళ్లి అక్కడో యూనివర్సిటీలో ఎం. ఎఫ్.ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ) చేశాను. ఆ తరువాత పిహెచ్.డిలో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం ఉండి అంటే 2001లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాను.

అడుగు మోపాకే తె లిసిందిసినిమా రంగంలో అడుగిడిన నాటి నుంచే మొదలయ్యాయి నా కష్టాలు. ఎవరికైనా ప్రత్యక్షంగా ఆ రంగ ంలోకి దిగేదాకా దానికి సంబంధించిన కష్టాలేం తెలుస్తాయి! కనిపించిన ప్రతి నిర్మాతకూ కథలు వినిపించేవాడ్ని. అలా ఓ మూడేళ్లు గడిచాయి. కానీ, ఎక్కడా సానుకూల స్పందన లేదు.

ఒక్కోసారి అనవసరంగా ఇండియాకు తిరిగొచ్చేశానేమో అనిపించేది. ఏమైనా ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఏటికి ఎదురీదడమేనని నాకు అర్థమైపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ‘ సరేలేవయ్యా, విదేశాలకు వెళ్లానంటున్నావు. బాగా చదువుకున్నానంటున్నావు. కానీ, అసలు నువ్వు సినిమా తీయగలవని మాకు నమ్మకమేంటి? ఇంత వరకు నువ్వు ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఏం చిత్రిస్తావో మాకేం తెలుసు? ఇప్పుడు నీ మీద అంత డబ్బు ఎలా పెడతాం?” అంటూ అడి గేవాళ్లు.

అదీ నిజమేననిపించింది. నువ్వేమిటో, నీ సామర్థ్యం ఏమిటో ఏమీ తెలియకుండా ఎవరైనా లక్షల్లో, కోట్లలో ఎలా ఖర్చు చేస్తారు? మన మీద మనం ఖర్చు చేసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం తప్ప మరోమార్గం లేదనిపించింది. వెంటనే అంటే 2003లో 30 నిమిషాల నిడివితో ‘చలి’ అనే చిన్న సినిమా (ఫీచర్ ఫిల్మ్) తీశాను.

నిర్మాతలు, దర్శకులు ఎవరు కనిపించినా వారికి ఒక సీడీ ఇచ్చే వాడ్ని. అది చూసి చాలా మంది బాగుందనే అన్నారు. తనికెళ్ల భరణి గారు కూడా చూశారు.అంతకు ముందే ఆయనతో నాకు కొంత పరిచయం ఉంది. చలం గారి రచన ఆధారంగా నేను తయారు చేసుకున్న ‘గ్రహణం’ అనే స్క్రిప్ట్ నా వద్ద ఉంది, అందులోని ప్రధానపాత్రను చేయడానికి మీరు అంగీకరిస్తే సినిమా చేద్దాము అన్నాను.

‘చలం గారి కథే అయితే చేస్తా. నాకు డబ్బులేమీ అక్కర్లేదు’ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ మాటే అమ్మతో చెప్పాను. ‘మూడు లక్షల్లో తీయగలవా మరి?. నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్రేక్ చేసి నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను’ అంది. వెనకా ముందు ఆలోచించకుండా సరే అన్నాను. ఆ మాటే భరణి గారికి చెబితే నవ్వేశారు. అలా కాదు గానీ, ఎలాగోలా ఇంకొంచెం పెంచుదాం అన్నారు.

మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 18 లక్షల దాకా ఖర్చయ్యింది. అప్పుడు నేషనల్ అవార్డుకు పంపిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి దర్శకుడిగా నాకు అవార్డు వచ్చింది. అక్కడినుంచి కెరీయర్‌కు ఒక టేకాఫ్ దొరికింది.విజయం, సమస్య కలగలిసిగ్రహణం సినిమాతో నాకు బాగా పేరొచ్చిన మాట నిజమే కానీ, చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా ఆర్డ్ ఫిలిం డైరెక్టర్ల జాబితాలో చేర్చివేసింది. మరో సినిమా చేసే అవకాశం నాకెవ్వరూ ఇవ్వలేదు.

నేను బాగా కష్టాల్లో పడిపోయాను.. నేను ఏ సినిమా తీసినా ‘గ్రహణం’ మూసలో తీస్తాననే ముద్ర ఒకటి పరిశ్రమ వేసింది. అయినా ఆ కష్టకాలంలో ‘మిస్సమ్మ’ తీసిన వి సత్యనారాయణ ఒక సినిమా తీద్దామని నా వద్దకు వచ్చారు. ఆయనతో చేసిందే ‘మాయాబజార్.’ కానీ, అది ఆశించినంత బాగా ఆడలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కథ పాత పద్దతిలో ఉందని, కుర్రకారుకు అది పట్టలేదని, ఆదర్శాల పాలు ఎక్కువైపోయిందనీ అన్నారు.

వ్యక్తిగతంగా నాకు మాయాబజార్ సినిమా అంటే చాలా ఇష్టం కానీ కమర్షియల్‌గా విజయవంతం కాకపోవడంతో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దాదాపు ఏడాది పాటు విపరీతమైన అంతర్మధనానికి గురయ్యాను.తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. మనిషి మీద ఒక ముద్ర పడితే అది ఒక్కోసారి జీవితకాలపు ముద్ర అవుతుందని అప్పటిగ్గాని నాకు తెలిసి రాలేదు

.అది ఆయన సాహసమేఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో రామ్మోహన్ అనే ఒక స్నేహితుడు నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవాడు. నేను తరుచూ ఆ స్టూడియోకు వెళ్లడం, కథలు చెప్పడం చేసేవాడ్ని. అలా పరిచయం అయిన వాడే అతను. ఆయన నా వద్దకు వచ్చి, నాకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ‘మాయాబజార్’ ఫెయిల్యూర్ విషయం పక్కకు పెట్టు. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం ఓ సినిమా చే ద్దాం అన్నాడు.

అప్పుడాయనకు నేను ‘అష్టాచమ్మా’ కథ చెప్పాను. ఆ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది. ఆర్ట్ సినిమాలే కాదు ఇతను వినోదాత్మకంగా కూడా తీయగలడు అన్న భావనను పరిశ్రమలో స్థిరపరిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా రామ్మోహన్‌కే దక్కుతుంది. ‘అష్టాచమ్మా’ విజయం తర్వాత అదే బ్యానర్ కింద ‘గోల్కొండ హైస్కూల్ ‘అనే సినిమా చేశాను. ఇది బ్లాక్‌బ్లస్టర్ కాకపోయినా, ఒక మేరకు సక్సెస్ సాధించింది.

కాకపోతే నాకు దర్శకుడిగా విపరీతంగా పేరొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో ఒక భిన్నత్వం ఉందని ప్రేక్షకులనుంచి ప్రశంసలొచ్చాయి.ప్రేక్షకుల సృష్టి జరగాలి’అష్టాచమ్మా’ విజయం నాకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. పేక్షకులకు ఏం కావాలా వాటిని మనం ఊహిస్తూ కూర్చోవడం కన్నా, మనం నమ్మిన దాన్ని ఎంత పక్కాగా తీయగలిగితే అది ప్రేక్షకుల్ని అంత తొందరగా చేరుతుందని అనిపించింది.

సినిమాలో వినోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎలాంటి వినోదం ఇవ్వాలనేది దర్శకుడు నిర్ణయించుకోవాలి. దర్శకుడు తన ప్రేక్షకుల్ని సృష్టించుకునే క్రమం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

హీనమైన వినోదం ఇస్తే ఆ స్థాయి ప్రేక్షకులే పుట్టుకొస్తారు. ఉన్నతమైన వినోదాన్ని ఇస్తే ఉన్నతమైన ప్రేక్షకులు పుడతారు.మనం తక్కువ సంస్కారవంతమైన వినోదానికి ఎక్కువ కాలం అలవాటు పడి వేరొకరకమైన వినోదాన్ని చూసి ఆనందించగల స్థాయి వారిలో తగ్గిపోవచ్చు. అలాంటి స్థితిలో అటువంటి వినోదంతో వ చ్చే సినిమాల్ని వారు అర్థం చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి, అభినందించడానికి వారికి టైం పడుతుంది.

అస్తమానం పడిపోతున్న విలువల విషయమై తిట్టుకుంటూ కూర్చోకుండా ఆ తరహా ప్రేక్షకుల్ని సృష్టించుకోవడం తప్పనిసరి అన్న సత్యం నాకు స్పష్టంగా బోధపడింది.

– బమ్మెరఫోటోలు: రాజ్‌కుమార్

అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చు

bojjaసాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక విషయాల్లో దళితలోకానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల న్యాయవాద వృత్తిలో, ఏడు పదుల జీవితంలో బొజ్జా తారకం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

“అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కందికుప్ప మా ఊరు. కాకపోతే ఆ ఊరికి కిలోమీటర్ దూరంలోని ‘మాలపేట’ మా నివాస స్థలం. ఇది బంగాళాఖాతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రముఖంగా ఉండే రాజులు, కాపులు కూడా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అంటరాని కులానికి చెందిన వాడైనా ఆయనను ఎవరూ అలా చూసే వారు కాదు. అందుకే నా బాల్యంలో అంటరానితనం తాలూకు సమస్యలేవీ ప్రత్యక్షంగా నన్ను తాకలేదు కానీ, పరోక్షంగా వాటి గురించి కొంత తెలుసు.

నా పసితనంలో పెసరట్లు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి మా పేటకు వచ్చేవాడు. మోకాళ్ల దాకా పంచె తప్ప అతని ఒంటి మీద చొక్కా కూడా ఉండేది కాదు. పెద్ద బొజ్జ ఉండేది. అతడు గొల్ల కులస్తుడు. అతను పెసరట్లను మాల పిల్లలకే అమ్ముకోవడానికి వచ్చినా ఎవరూ తనను ముట్టుకోకుండా దూరదూరంగా ఉండేవాడు. తననే కాదు తన సైకిలును గానీ, పెసరట్లు తెచ్చిన డబ్బాను గానీ ఎవరూ తాకడానికి వీలులేదు. పిల్లలు డబ్బులు ఇస్తే పైనుంచి అరచేతిలోకి వేయాలి. తను కూడా పెసరట్లను ఆకులో పెట్టి పైనుంచి అరచేతుల్లోకి వదిలేవాడు.

అతను బతుకుతున్నది మాలపిల్లలు ఇచ్చిన డబ్బులతోనే అయినా వాళ్లు మాత్రం తనను తాకడానికి వీల్లేదనడంలోని ఆ వైరుధ్యం ఏమిటో మొదట్లో అర్థం కాకపోయినా ఆ తర్వాత రోజుల్లో అర్థమవుతూ వచ్చింది. నిజానికి ‘గొల్ల’ అగ్రకులమేమీ కాదు. అయినా అతనికి ఆ వాసనలు సోకాయి. 1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.

ఎక్కడో ఎదురవుతుంది
నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో ఓడిపోయినా తన సామాజిక కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు. తాతయ్య చాలామందికి పూజనీయుడిగా ఉండడం వల్లగానీ, నాన్నగారు ఎం.ఎల్.ఏగా, ఒక సామాజిక నాయకుడిగా ఎదగడం వల్ల గానీ, నా చదువైపోయేదాకా ఎక్కడా కుల వివక్ష తాలూకు కష్టాలు నన్ను వేధించలేదు. కానీ, న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో తొలిసారిగా ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మాత్రం ఆ సమస్యలు నన్ను ఢీకొన్నాయి. ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఎస్సీ న్యాయవాదిని నేనొక్కణ్నే. నా కేసుల్ని స్వీకరించే విషయంలో గానీ, నా వాదనల్ని వినే విషయంలో గానీ, తీర్పు చెప్పే విషయంలో గానీ, న్యాయమూర్తులు చాలా వివక్షతో వ్యవహరించేవారు.

అది నన్ను తీవ్రమైన ఆవేదనకు గురిచేసేది. అక్కడంతా బ్రాహ్మణుల ఆధిపత్యమే ఉండేది. వాళ్ల కుటిలమైన ఎత్తుగడల వల్ల ఎస్సీ కేసులు తప్ప వేరే ఏవీ నా వద్దకు వచ్చేవి కాదు. పనిగట్టుకుని కొందరు అలా రాకుండా చేసేవారు. నాన్నగారి నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల సరిపోయింది గానీ, లేదంటే న్యాయవాద వృత్తి నాకు భారమయ్యేది. సరిగ్గా అదే సమయంలో ఒక భూస్వామి వద్ద పనిచేస్తున్న పాలేరును అన్యాయంగా ఒక కేసులో ఇరికించి అతన్ని దారుణంగా కొట్టి జైలుకు పంపించారు. వాళ్లు బెయిల్ కోసం నా వద్దకు వ చ్చారు. పిటిషన్ వేస్తే చాలా సులువుగా రావలసిన బెయిల్ రాలేదు. అది నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న న్యాయవాద వృత్తి నాది. చివరికి బెయిల్ కూడా ఇప్పించలేని న్యాయవాదిననైతే నా ఉనికికి అర్థమేముంటుంది?

జరిగిన కుతంత్రమేమిటో తెలుసుకుని ఐదు రోజుల తర్వాత బెయిల్ తిరస్కృతిని సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ వేశాను. ఇక తప్పదన్నట్లు ఈ సారి బెయిల్ ఇచ్చారు. అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

అన్యాయానిదే రాజ్యమై…
నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న బోయిభీమన్న గారి కూతురు విజయభారతిని 1968లో నేను పెళ్లి చేసుకున్నాను. మొదట్లో వీలును బట్టి నిజామాబాద్‌కు వస్తూపోతూ ఉన్నా, ఆ తర్వాత నిజామాబాద్‌కే వచ్చేసి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఆ రోజుల్లో నిజామాబాద్‌లో దళిత లాయర్‌గా ప్రాక్టీసు చేసినవాడ్ని నేనొక్కడ్నే. అక్కడే ‘అంబేద్కర్ యువజన సంఘం’ స్థాపించాను. ఎస్సీలే కాకుండా బీసీ యువకులు కూడా అందులో ఉండేవారు. అలా ఉండడం అదే ప్రథమం. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. అంటరానితనానికి, అణచివేతకు, దళితుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ స్పూర్తితో ఈ సంఘం పనిచేసేది. లాయర్‌గా నాకు కేసులైతే వచ్చేవి కానీ, సంపాదనైతే ఏమీ ఉండేది కాదు. నా భార్య ఉద్యోగం చేస్తున్నందువల్ల సంసార భారమంతా ఆమే మోసేది. నిజామాబాద్ పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘పాలెం’ అనే గ్రామంలో ఒక రోజు ఒక కాపు తన జీతగాణ్ని కొట్టి చంపేశాడు. ఆ వెంటనే ఆ శవాన్ని దళితులతో పాతిపెట్టించాడు కూడా. అటువంటి సంఘటనలు అంతకు ముందు చాలా జరుగుతూ వచ్చాయి.

కాని నేను అక్కడికి వెళ్లాక జరిగిన తొలి సంఘటన అదే. ఆ వార్త తెలియగానే నిరసన ర్యాలీ తీయడానికి 40 మంది కుర్రాళ్లతో కలిసి లారీలో ఆ ఊరు వెళ్లాం. ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగితే, ఒక గుంపు ప్రజలు ఆ గ్రామానికి వెళ్లి, నిరసన ప్రకటించడం నిజామా బాద్ చరిత్రలో అదే ప్రథమం. మేము వెళ్లే దారిలో ఆర్మూరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా మీద దాడిచేస్తారని, వెళ్లొద్దని కబురొచ్చింది. అయినా భయపడకుండా వెళ్లాం. అందరూ చెప్పినట్లు ఆర్మూరు గ్రామం వద్ద ఎవరూ మమ్మల్ని ఆపలేదు. పైగా మేము వెళ్లగానే బాధితుడి పక్షాన పాలెం మాల మాదిగలంతా వచ్చేశారు.

వారిని వెంటతీసుకుని కాపుల వీధుల్లోంచే ఊరేగింపు తీశాం. రెడ్లంతా వాళ్ల మిద్దెల మీద నిలుచుని చూశారే గానీ, మమ్మల్ని నిరోధించడానికి గానీ, దాడి చేయడానికి గానీ ఏ ఒక్కరూ సాహసించలేదు. అప్పటిదాకా తాము చేసేవన్నీ న్యాయబద్ధమే అనుకునే వాళ్ల అవగాహనను తప్పని వారికి చెప్పగలిగాం. అందుకే వారు ఒక అపరాధ భావనతో చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్టు కూడా చేయించి జైలుకు పంపించాం. అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.

అనుకున్నదే కదా!
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకుల్ని రెచ్చగొడుతున్నానన్నది పోలీసులు నా మీద మోపిన ప్రధాన అభియోగం. నిజామాబాద్ జైలుకు తరలించడానికి ముందు నన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా నాన్నగారు కాకినాడ నుంచి హుటాహుటిన బయల్దేరి నేనున్న జైలుకు వచ్చారు. నాకు తీవ్రమైన జ్వరంగా ఉంది, నన్ను చూడటానికి ఎవరినీ రానివ్వడం లేదు. నాన్నగారు నా వద్దకు రాగానే ఏడ్చేశాను. అప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన ఆయనకు నా బేలతనం సరైంది కాదని అనిపించిందేమో! ” ఎందుకు ఏడుస్తావ్? నీకు నువ్వుగా ఎంచుకున్న మార్గమే కదా ఇది?” అన్నారు. ఆ మాటలు నాలో అదే పనిగా మార్మోగాయి. మనం ఎంచుకున్న మార్గమనే విషయం మనమే మరిచిపోతే మనమెంత బలహీనపడతామో ఆ మాటల ద్వారా నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత చంచల్‌గూడ జైలులో ఏడాది పాటు నిశ్చలంగా గడపడానికి కావలసిన శక్తినంతా ఆ మాటలే నాకు ప్రసాదించాయి.

పోరాటమిచ్చిన జ్ఞానం
1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడుతూ వచ్చాను. ఉన్నట్లుండి 2013 లో ఒకరోజు దళిత సమస్యల పని మీద ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాను. అయితే నేను ఎక్కడినుంచి వచ్చానో నాకేమీ గుర్తు రావడం లేదు. ఆ మాటే నా భార్యను అడిగితే అదేం ప్రశ్న అన్నట్లు చూసింది. నాకు నేనే గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా గుర్తుకు రాకపోవడంతో ఏడుపొచ్చేసింది. వైద్య పరీక్షల్లో మెదడులో కణితి ఉన్నట్లు బయటపడింది. వెంటనే సర్జరీ చేశారు. అది కేన్సర్ కణితి అనే విషయం సర్జరీ అయిపోయే దాకా నాకు తెలియదు. ఆపరేషన్ తర్వాత నా ఆరోగ్యం క్రమక్రమంగా చక్కబడుతూ వచ్చింది. ప్రస్తుతం మా తాతయ్య, మా నాన్న గారి జీవిత కథల్ని ఒకే పుస్తకంగా రాసే పనిలో ఉన్నాను. అది పూర్తయితే మరో నవల కూడా రాయాలన్న సంకల్పం ఒకటి నాలో బలంగా ఉంది. నిరంతరం పోరాటాల మధ్య జీవించడం కారణంగానేమో గానీ, నన్నేదీ భయపెట్టదు.

పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఆ జ్ఞానమే బహుశా కేన్సర్ అని తెలిసినా నన్ను నిశ్చలంగా ఉండేలా చేసింది. నేను త్వరగా కోలుకోవడానికి కూడా బహుశా అదే దోహదం చేసింది. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను. ఇన్నేళ్ల నా పోరాటానికి ఏ ఆత్మవిశ్వాసం కేంద్రంగా ఉంటూ వచ్చిందో, ఆ ఆత్మవిశ్వాసమే నా భవిష్య జీవనానికి కూడా ఊతంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం
– బమ్మెర
ఫోటోలు: బాబూరావు

గురుదేవో’భవనం’

guru

చదువుల తల్లి గూడు చెదిరితే తమ గుండె పగిలినట్లు బాధపడే టీచర్లు వీళ్లు. ప్రభుత్వ నిర్ణయంతో ఒక పాఠశాల మూతపడినప్పుడు.. తమ ఉద్యోగానికొచ్చిన ముప్పేమీ లేదని ఊరుకోలేదు. పేదపిల్లలకు చేరువలోనే మరో చదువుల గుడిని కట్టించేందుకు రెండేళ్లు పెద్ద పోరాటమే చేశారు. ఎక్కడా ఖాళీ స్థలమే దొరక్కపోతే, ఆఖరికి మరుగుదొడ్డిని కూల్చి, కొత్త పాఠశాలకు ప్రాణం పోసిన హైదరాబాద్‌లోని మేకలమండి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కథ ఇది.

ఇదొక ప్రభుత్వ పాఠశాల. చదువు చెబుతున్న అయ్యవారు, బుద్ధిగా వింటున్న పిల్లలు.. ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న దృశ్యమిది. రెండేళ్లు వెనక్కి వెళితే- ఇదొక మరుగుదొడ్డి అంటే నమ్మగలరా? అవును అప్పుడిది ఇది పబ్లిక్ టాయ్‌లెట్. మనస్ఫూర్తిగా ఒక మంచి పనికి పూనుకోవాలేగానీ,ఎంతటి దుర్గంధాన్నైనా కడిగేసి, సుగంధాలను వెదజల్లడం సాధ్యమే అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాఠశాల. దీని వెనక పెద్ద కథే నడిచింది. పాఠాలు చెప్పే టీచర్లు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కాళ్లకు బలపం కట్టుకుని ఆఫీసులన్నీ తిరగాల్సి వచ్చింది.

రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు ప్రజాప్రతినిధుల దగ్గరికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. చదువులు చెప్పడమే కాదు, ఆ చదువుల తల్లి గూడు చెదిరిపోతే గుండె పగిలినట్లు భావించిన ఆ టీచర్లు మల్లికార్జునరెడ్డి, బదిరీనారాయణరావులు. వీరికి అండగా మరో ఐదుగురు రవీందర్‌రెడ్డి, శౌరి, గీతాదేవి, రామసుబ్బారావు, త్రినేత్రి టీచర్లు ఉన్నారు. లేకపోతే ఒక పాఠశాల ప్రాణం పోసుకునేదే కాదు.

బడి కోసం..
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ‘తిగుల్’కు చెందిన పొణ్యాల మల్లికార్జునరెడ్డి ఒక సెకండరీగ్రేడ్ టీచర్. హైదరాబాద్ జూబ్లీబస్టాండ్‌కు దగ్గర్లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ నాలుగేళ్లు పనిచేశాక బోలక్‌పూర్‌లోని మేకలమండి ప్రభుత్వ పాఠశాలకు బదిలీఅయ్యాడు.

బడికొచ్చే వంద మంది పిల్లల్లో అందరూ నిరుపేదలే! చదువులన్నీ సాఫీగా నడుస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కాంపౌండ్‌లో రెండు మూడు స్కూళ్లుంటే వాటిని ఒక స్కూల్ కిందకు తీసుకురావాలన్నది దానిముఖ్యఉద్దేశ్యం. ఆ ప్రక్రియలో మేకలమండి ప్రభుత్వ పాఠశాలను మూసేశారు. పిల్లలందర్నీ ఏకీకృత పాఠశాలకు బదలాయించారు.

అయితే గదుల కొరత తలెత్తింది. దాంతో కాలనీవాసులు భారమైనా సరే, ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించక తప్పలేదు. కొందరైతే ఫీజులు కట్టలేక పిల్లల్ని బడిమాన్పించాల్సి వచ్చింది. ఈ బాధలేవీ పట్టించుకోకపోయినా తమ జీతం తమకు వస్తుంది కదాని ఊరుకోలేదు మల్లికార్జునరెడ్డి, బదిరీనారాయణరావు. మేకలమండీలోనే మరో కొత్త బడి పెడితే సమస్యలన్నీ తీరిపోతాయని భావించారిద్దరూ.ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు.

పేదలందరూ ‘కాలనీ నడుమ పాఠశాల ఉంటేనే పిల్లల్ని పంపిస్తాము’ అని ముక్తకంఠంతో తీర్మానించారు. బడి కావాలంటూ ప్రభుత్వాన్ని అడిగితే సరిపోదు. భవన నిర్మాణానికి స్థలం కావాలి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేగంగా స్పందించిఅనుమతులు మంజూరు చేయాలి. అప్పుడే పాఠశాల సిద్ధమవుతుంది. ఇవన్నీ ఇప్పట్లో సాధ్యమయ్యే పనులా? అన్నారు చాలామంది.

“ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడితే ముగ్గురు లేదా నలుగురు టీచర్లకు ఉపాధి పోతుంది. డ్రాపౌట్లు పెరుగుతాయి. ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది పేద పిల్లలే! అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేశాం. ఆఖరికి ప్రభుత్వం స్పందించి పదకొండువందల మురికివాడల్లో అవసరమైన చోట కొత్త పాఠశాలలు పెట్టేందుకు సమ్మతించింది”అని చెప్పారు మల్లికార్జునరెడ్డి. ఒకవైపు అది చేస్తూనే- మేకలమండి పాఠశాల మూతపడగానే జయనగర్‌కాలనీ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలిక పాఠశాలను ప్రారంభించారీ ఉపాధ్యాయులు. కాని పిల్లలెవ్వరూ రాలేదు. మరోవైపు పాఠశాల స్థలం కోసం అన్వేషణా మొదలైంది. అధికారుల దగ్గరికి వెళితే “ఎక్కడున్నాయయ్యా ఖాళీ స్థలాలు? ఉంటే మీరే వెతికిపెట్టండి..” అన్నారు.

గజం స్థలమే వేలల్లో పలికే మహానగరంలో ఖాళీ జాగా దొరకడం ఎంత కష్టం! “అసలే బోలక్‌పూర్ ఇరుకైన ప్రాంతం. ఎంత వెదికినా రవ్వంత జాగా కూడా కనిపించలేదు. అధికారులను, స్థానిక నేతలను.. ఇలా ఎవరు కనిపిస్తే వాళ్లనల్లా అడిగాము. ఆఫీసులకు తిరగని రోజు లేదు. ఆ ప్రయత్నంలో మాకు అపురూపంగా కనిపించింది ఒక ప్రభుత్వ మరుగుదొడ్డి. కాలనీకి దాని అవసరం తగ్గిపోయిందని విన్నాం. ఆ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చేసి ఆ స్థానంలో పాఠశాల కడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది..” అన్నారు టీచర్లు.

కాళ్లకు బలపం కట్టుకుని..
ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళితే, అక్కడ గ్రంథాలయం పెట్టాలనుకుంటున్నామన్నారు. పాఠశాలకు ఒప్పుకోలేదు. మళ్లీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు టీచర్లు. “స్థానిక నేతల్ని కూడగట్టి డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనుమతితో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించాం. ఫైలు కదిలేందుకు ఆఫీసుల చుట్టూ యాభై అరవైసార్లు తిరిగుంటాం. ఆఖరికి స్థలాన్ని కేటాయించారు. దాంతో ఆ ఫైల్ సర్వశిక్ష అభియాన్‌కు వెళ్లింది.

అప్పుడు ఆ ప్రాజెక్టు ఆఫీసర్ “ఉన్నదే రెండొందల ఇరవై గజాల స్థలం. అంత తక్కువ స్థలంలో పాఠశాల కట్టడం కుదరదు. నిబంధనలు అంగీకరించవు” అన్నారు. అయినా మేము నిరుత్సాహపడలేదు.

“సార్ ఇది పిల్లల కోసం పడుతున్న తపన. సిటీలో ఎనభై గజాల్లో నడుస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఒప్పుకోండి” అని ప్రాధేయపడ్డాము” అన్నారు మల్లికార్జున్, బదిరీనారాయణరావు. అంతటితో ఊరుకోకుండా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఇల్లు,ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు వీళ్లు. “మర్రిశశిధర్ రెడ్డి చొరవ చూపారు. ఒక పాఠశాల కోసం ఇన్నిసార్లు నా వద్దకు వచ్చిన టీచర్లు మీరేనయ్యా అన్నారాయన” అని చెప్పుకొచ్చారీ మేస్టార్లు. మున్సిపల్ అనుమతి కోసమూ తిరిగారు. భవన మంజూరు జరిగాక.. నిధులు ఇవ్వాల్సింది సర్వశిక్ష అభియాన్. ఉపాధ్యాయుల పట్టుదల చూసి 31 లక్షల నిధులను కేటాయించారు అధికారులు.

“కాంట్రాక్టర్‌తోనూ సమస్యలొచ్చాయి. మూన్నెళ్లు అవాంతరాలొచ్చాయి. ఒకటో అంతస్థు పూర్తయ్యాక పనులన్నీ అర్థాంతరంగాఆగిపోయాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. విషయాన్ని ఆరాతీసిన కలెక్టర్ ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు కాంట్రాక్టర్లు పనిని పూర్తి చేశారు” అని గుర్తు చేసుకున్నారు.

అడ్డంకులను అధిగమిస్తూ..
ఎట్టకేలకు మరుగుదొడ్డిని కూల్చిన స్థలంలో భవన నిర్మాణం పూర్తయింది. దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆటస్థలంగా మార్చాలన్నది ఉపాధ్యాయుల మరో ఆలోచన. అప్పటికే అది ఆక్రమణకు గురైనందువల్ల ఆ కబ్జాదారులకు అది ఇష్టం లేదు. “ఏంఅయ్యవార్ల్లూ, చదువులు చెప్పుకోకుండా జాగాల మీద పడ్డారు. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది” అని కొందరు వీరిని బెదిరించారు కూడా. దేనికీ భయపడని ఉపాధ్యాయులు ఎమ్మార్వో స్పందించే వరకు ఊరుకోలేదు.

చివరికి “పోలీసులు జోక్యం చేసుకుని స్థలాన్ని పాఠశాలకుస్వాధీనం చేశారు. అప్పుడు కబ్జాదారులు మమ్మల్ని తిట్టని తిట్టు లేదు. పాఠశాల కోసమే అవన్నీ భరించాం” అని తెలిపారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభమైన తమ మేకలమండి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నది టీచర్ల లక్ష్యం.”ఎల్‌కేజీ నుంచి అయిదు వరకు ఇంగ్లీషు మీడియం పెట్టించాము. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్ కొన్నాళ్లు అందులో నడిచి మూతపడింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) వాళ్లను సంప్రదించాము. సాయానికి అంగీకరించారు. ఇక, పాఠశాలలో చదివే పిల్లలంతా పేదలు కావడంతో యూనిఫాం కొనుక్కోలేని పరిస్థితి. ఎన్‌టిపిసి అధికారులే చొరవ తీసుకుని 150 మందికి ఒక జత చొప్పున దుస్తులు ఇచ్చారు. మా తపనను అర్థం చేసుకున్న ఆ సంస్థ ‘పవర్ కిడ్స్’ పేరుతో 3-5 ఏళ్ల పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేందుకు ఇద్దరు టీచర్లు, మరో ఇద్దరు ఆయాల్ని ఏర్పాటు చేసింది..” అని చెప్పారు మేకలమండి టీచర్లు.

ఆదర్శవంతంగా..
పార్లమెంటు సభ్యుల నిధులతో కంప్యూటర్స్, నీటిపంపులు, గ్రిల్స్ ఏర్పాటయ్యాయి. ఎవరు సాయం చేస్తారన్నా సరే వెళ్లి అర్థించే ఉపాధ్యాయుల్ని చూసి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కదిలొచ్చింది. డెస్కులు, టేబుళ్లను కొనిచ్చింది. మరుగుదొడ్డి స్థలంలో పాఠశాల నిర్మించేందుకు కృషి చేసిన టీచర్లను అభినందిస్తూ ‘డీక్యూ స్మైల్ ఫౌండేషన్’ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్‌కు ఊతం ఇచ్చింది. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి.. చైతన్యవంతుల్ని చేసింది. నాంపల్లిలోని ఎస్‌బీఐ శాఖ తాగునీటి వసతికిఆసరాగా నిలిచింది.

“మేము ఇంత కష్టపడింది ప్రభుత్వ పాఠశాల కోసం మాత్రమే కాదు. అందులో చదివే పిల్లల భవిష్యత్తు బాగుపడాలని. అందుకోసం ఏ అవకాశాన్నీ వదులుకోలేదు” అని చెప్పారు ప్రస్తుతం స్కూల్‌లో పని చేస్తున్న టీచర్ నూర్జహాన్. తండ్రిలేని పిల్లలకు లుంబా ఫౌండేషన్ నెలకు ఐదొందలు ఇస్తుందని తెలిసి వారిని సంప్రదించి సాయం తెచ్చుకున్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లప్రావీణ్యం తక్కువ. ఆ సమస్యను పరిష్కరించేందుకు ‘టీచ్ ఫర్ ఇండియా’ను కలిశాము మేము.

వాళ్ల తరఫున ఒక టీచర్‌ను మాకిచ్చారు. ఆమె రోజూ స్కూలుకు వచ్చి ఆంగ్లంలో పిల్లలకు తర్ఫీదు ఇస్తోంది” అని ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు మాధవి చెప్పారు. ‘ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, మేకలమండి’ అన్న బోర్డు తగిలించుకుని ఠీవిగా నిల్చున్న మూడంతస్థుల ఆ పాఠశాలను కళ్లారా చూసుకుని, సంతృప్తిపడే మల్లికార్జున్, బదిరీ.. మొన్న బదిలీలప్పుడు కొత్త పాఠశాలలకు వెళ్లకతప్పలేదు. కాని వాళ్లు వెళుతూ వెళుతూ నూటాఅరవై మంది పిల్లలకు సరస్వతినిచ్చి వెళ్లడమంటే.. అంతకంటే గొప్ప స్ఫూర్తిపాఠంఇంకేముంటుంది?

– మల్లెంపూటి ఆదినారాయణ,
ఫోటోలు : బాబూరావు