డా.శర్మగారి రిక్షా బ్యాంకు

కొందరి మనస్సులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూనే ఉంటాయి. ఏదో ఒక కొత్త ఆచరణను రచిస్తూనే ఉంటాయి. అవన్నీ మంచి ఆలోచనలయితే, చిత్తశుద్ధి గల ఆచరణలయితే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పనక్కరలేదు. అలాంటి ఒక పరోపకారి అయిన డాక్టర్ ప్రదీప్‌కుమార్ శర్మ గురించి తెలుసుకుందాం.

ప్రదీప్‌కుమార్ శర్మ చదువుకున్నది పశువైద్యం కాని సామాజిక వైద్యం పట్లే ఎక్కువ మక్కువ ఆయనకు. అందుకే ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని రకరకాల మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు రిక్షా బ్యాంకు ఆలోచన చూడండి. ఆయనొక రోజు గౌహతిలో ఒక రిక్షా ఎక్కి వెళుతున్నాడు. కాలక్షేపానికి రిక్షా అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది అద్దె రిక్షా అని, అతని రోజు ఆదాయంలో మూడో వంతు కిరాయికి పోతుందని తెలుసుకున్నాడు. అందుకే 16 ఏళ్ళుగా రిక్షా నడుపుతున్నా అతనికి సొంత రిక్షా లేకుండా పోయిందని అర్థం చేసుకున్నాడు. ఎలాగైనా రిక్షా డ్రైవర్ని రిక్షా యజమానిని చేయాలనుకున్నాడు.

ఆయన ఆచరణలో పెట్టిన ఆ ఆలోచన పేరు ‘దీప్‌బహన్ రిక్షా బ్యాంకు ప్రాజెక్టు’. రిక్షా నడిపే వ్యక్తి రోజుకు 40 రూపాయలు చొప్పున కడుతూ పోతే ఏడాది నిండేసరికి సొంత రిక్షా సంపాదించుకోగల పథకమిది. అంటే 14 వేలకే రిక్షా సొంతం చేసుకునే పథకం. అంత చవక రిక్షాలెక్కడున్నాయి? అందుకే తక్కువ బరువుండే తక్కువ ఖర్చుతో తయారయ్యే రిక్షాల గురించి ఆలోచించి గౌహతిలోని ఐఐటి విద్యార్థుల చేత ఆ పని చేయించాడు. ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ లివర్ కంపెనీలను ఒప్పించి తలా వంద రిక్షాలకు స్పాన్సర్ చేయించాడు. వాటికి బీమా సదుపాయం కూడా కల్పించాడు. 2004లో మొదటి బ్యాచ్ రిక్షాలు రోడ్డెక్కాయి. డ్రైవర్లకు లైసెన్సులు, ఐడెంటిటీ కార్డులతో పాటు యూనిఫారాలు, చెప్పులు కూడా పంచి పెట్టి వాళ్ళ వృత్తికి ఒక హుందాతనం తీసుకువచ్చాడు.

ఇవాళ అస్సాం అంతటా కలిసి దీప్‌బహన్ రిక్షాలు ఐదువేల దాకా ఉన్నాయి. నాలుగేళ్ళ క్రితం అవి లక్నో, బనారస్, అలహాబాద్‌లకు కూడా వ్యాపించాయి. 12-14 వేల దాకా ఉన్నాయని అంచనా. ఈ ప్రాజెక్టుకు ఎంత పేరు వచ్చిందంటే అమెరికాలోని ఎంఐటి సంస్థ ఇటువంటి నమూనాల మీద ఏకంగా ఒక కోర్సునే ప్రారంభించింది. డా. శర్మ అక్కడితో ఆగలేదు. సోలార్ ప్యానెల్ అమర్చిన రిక్షా మోడల్స్‌ను తయారు చేయించాడు. ఆ సౌర శక్తితో మూడు లైట్లు, ఒక రేడియో, మొబైల్ చార్జింగ్ పనిచేస్తాయి. ఆర్నెల్ల క్రితం తయారైన ఈ మోడల్ రిక్షాలు ఇప్పటికే 200 దాకా అమ్ముడు పోయాయట. ప్రదీప్‌కుమార్ డబ్బున్నవాడేం కాదు. అయినా అతను ఈ పనులు చేయడానికి కుటుంబ ప్రోత్సాహం ఉంది. “మా పిల్లలు, నేను కూడా మనస్ఫూర్తిగా ఆయన చేసే పనుల్ని ఇష్టపడతాం. మహా అయితే విందులు, విహారాలకు డబ్బు తక్కువవుతుంది. అంతేకదా” అంటుంది ఆయన భార్య అనిత. వాళ్ళు అస్సాం వదిలి ఢిల్లీ వచ్చినపుడు ఆమె భోరుమని ఏడ్చిందట అక్కడెలా బతకాలో అని. కాని ఢిల్లీలో తన ప్రాజెక్టులకు నిధుల సమీకరణ తేలికవుతుందని ప్రదీప్‌కుమార్ ఆమెను ఒప్పించాడు.

ప్రదీప్‌కుమార్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా యాక్టివిస్టే. స్టూడెంట్ సైన్స్ సొసైటీలో సభ్యుడిగా ఉండి శాస్త్రీయ దృక్పథం ప్రచారం కోసం కృషి చేసేవాడు. కంప్యూటర్ విద్య ఇంత తప్పనిసరి కాకముందే ఉచితంగా కంప్యూటర్ క్లాసులు నిర్వహించేవాడు. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల పట్కాయ్ కొండల్లో జీవజాలం చనిపోతోందని గొడవ చేసి తన ఉద్యమాన్ని పార్లమెంటు దాకా తీసుకెళ్ళి విజయం సాధించిన ఘనుడాయన. వెటర్నరీ డాక్టరుగా పనిచేస్తున్న రోజుల్లో కూడా ఆయన ఎన్నో కొత్త ఆలోచనలు చేశాడు. మారుమూల గ్రామాల్లోని రైతులు తమ పశువుల్ని సంరక్షించుకోవడానికి వీలుగా ‘పెట్ – వెట్’ పేరుతో క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. రైతులకే శిక్షణ ఇచ్చి వారిని పారా వెట్‌లుగా తయారుచేసి వెట్ ఎయిడ్ కేంద్రాల్ని నెలకొల్పాడు. పశుసంపద పెంపునకు ఆయన చేసిన ఈ కృషికి గాను డా. శర్మకు ‘అశోకా లెమెల్‌సన్ ఫెలో’ అవార్డు కూడా వచ్చింది. ఇదంతా 2001 ముందు సంగతి. 2004 నుంచి మాత్రం ఆయన పూర్తిగా దీప్‌బహన్ రిక్షా బ్యాంకు ప్రాజెక్టులోనే తలమునకలై ఉన్నారు.

ప్రదీప్ కుమార్ శర్మ తర్వాత ఆలోచన- మెడి రిక్షా. అంటే చిన్న చిన్న వైద్య పరీక్షల్ని చేసే పరికరాలతో ఇంటింటికీ వెళ్ళగల రిక్షా. పల్లెలు, చిన్న పట్టణాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన ఉద్దేశ్యం. చెరకు రసం తీయడానికి ఇప్పుడున్న పెద్ద మిషన్ల స్థానే చిన్నవి తయారు చేయాలనే ఆలోచన కూడా ఉంది ఆయనకు. పరోపకారం చేయాలనే ఆలోచన ఉండాలే గాని చేయగల పనులకేం కొదవ?

300 జీతం నుంచి 30 కోట్ల లాభానికి!

చాలా ఏళ్ల క్రితం సంగతి. తమిళనాడుకు చెందిన నటరాజన్, చిన్నస్వామి, కందస్వామి అన్నదమ్ములు. వీరిచిన్నప్పుడే తండ్రి చనిపోయారు. దీంతో బాల్యం నుంచే పనిచేయాల్సి వచ్చింది. నటరాజన్, చిన్నస్వామి ఇద్దరూ పండ్లషాపులో పనికి చేరారు. చిన్నతమ్ముడు కందస్వామి పెట్రోలు బంకులో పనికి కుదిరాడు. పన్నెండేళ్లపాటు ఫ్రూట్‌షాపులో పనిచేశాక నటరాజన్ సొంతంగా ఒక దుకాణం తెరవాలనుకున్నాడు. జీవితంలో ఎదుగూ బొదుగూ లేదు.

అందుకే, ఉన్న కాస్త సొమ్మునూ పెట్టుబడిగా పెట్టి కోయంబత్తూరులో ఒక దుకాణం అద్దెకు తీసుకుని పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. అయితే చాలీచాలని ఆదాయంతో మిగిలిపోకూడదనుకున్నాడు. ఇక్కడ రెండు సమస్యలను ఎదుర్కోవాలి. రోడ్డుపై బండికంటే తక్కువ ధర ఉంటేనే వస్తారు కాబట్టి వారికంటే తక్కువకే ఇవ్వాలి. వెంటనే అమ్ముడుపోక కుళ్లిపోయిన పళ్ల వృథాను లాభాలు కవర్ చేయాలి. ఈ కారణాలతో కొంతకాలానికే చుక్కలు కనిపించాయి. నష్టాలు మిగిలాయి.

ఇక దుకాణం మూసేద్దాం అనుకున్న సమయంలో నటరాజన్ సోదరులు కాస్త ధైర్యం చేసి అన్నిరకాల పళ్ల రసాలు అమ్ముదాం అనుకున్నారు. అనుకోవడమే కాదు, వెంటనే ఆచరణలో పెట్టేశారు. నెమ్మదిగా వ్యాపారం లాభాల బాట పట్టింది. కోయంబత్తూరు నగరంలో వేర్వేరు చోట్ల దుకాణాలు తెరిచి దాదాపు నగరమంతా పళ్లను ఇంటికి డెలివరీ చేయడం మొదలుపెట్టారు. దేశంలో కేవలం పళ్లు మాత్రమే అమ్మే ఏకైక రిటైల్ చెయిన్ దుకాణాలు వీరివి మాత్రమే. బ్రాండ్ పేరు ‘కొవై’.

పళ్లను కిలోల్లో అమ్మడం మొదలుపెట్టింది కూడా వీరే. ఇంకో సక్సెస్ సూత్రం ఏంటంటే… దేశంలో దొరికే అన్ని పళ్లనూ ఒక చోటికి తేవడం వీరి ప్రత్యేకత. ఇప్పుడు నటరాజన్ సోదరులతో పాటు వారి పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుకుని అదే వ్యాపారంలోకి దిగారు.

తమిళనాడులోని వివిధ నగరాలు, పట్టణాల్లో 50 స్టోర్‌లు తెరిచారు. ఇప్పుడు వారివద్ద విదేశీ పళ్లు కూడా దొరుకుతున్నాయి. దుకాణంలోనే ఫ్రూట్ సలాడ్ కూడా అమ్ముతారు. తాజా పళ్లు, తక్కువ ధరకు… సూపర్ మార్కెట్లు కూడా ఇవ్వలేని ధరకు ఇస్తారు. ఇపుడు ‘కొవై’ విదేశాల నుంచి భారీగా పళ్లు దిగుమతి చేసుకుంటున్న కంపెనీ. వీరి లాభం ఏడాదికి 30 కోట్లు!

– ప్రకాష్ చిమ్మల

ఒక ఖరీదైన గ్రామం

స్టార్ హోటళ్లు, విల్లాలు, బీఎండబ్ల్యు కార్లు- ఖరీదైన నగరాల్లో కనిపించడం సహజం. అదే పల్లెల్లో కనిపిస్తే- అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆశ్చర్యానికి కారణమైన గ్రామం పేరు ‘హక్సీ విలేజ్’.

“ఇది పల్లెటూరా..? ఇంత విలాసవంతమైన సౌకర్యాలు మెట్రోసిటీల్లో కూడా ఉండవు” అంటారు హక్సీ విలేజ్‌ను తొలిసారి చూసిన సందర్శకులు. ఖరీదైన పగోడాలు, టన్నెల్స్, లాంగ్సీ లేక్, వరల్డ్ గార్డెన్, ఫార్మర్ గార్డెన్‌లతో తీర్చిదిద్దినట్లు ఉంటుంది ఆ ఊరు. గ్రామం మధ్యలోకి వెళ్లగానే 60 అంతస్తుల ఆకాశహర్మ్యం కనిపించి ఔరా ఏమిటీ అద్భుతం అనిపిస్తుంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో ఉన్న ఈ గ్రామం.. బీజింగ్ నుంచి 600 కిలోమీటర్లు వెళితే వస్తుంది. చైనీయులందరూ దీన్ని లిటిల్ దుబాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఖరీదైన హక్సీ విలేజ్‌ను 1961లో స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వూరెన్‌బావో స్థాపించారు. గ్రామంలోని రైతులంతా శ్రీమంతులు. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.25 కోట్ల దాకా డబ్బులు నిల్వ ఉంటాయంటే ఎంత షావుకార్లో అర్థమవుతుంది. వీరికి ఇన్నేసి ఆస్తులు వారసత్వంగా రాలేదు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల వచ్చాయి.

వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని డిమాండ్ కలిగిన వ్యాపార రంగాలకు మళ్లించారు. అందుకోసం రైతులందరూ కమ్యూన్‌గా (ఒక బృందంగా) ఏర్పడ్డారు. ఇనుము ఉత్పాదక సంస్థలు, రవాణా సంస్థలు, దుస్తుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కమ్యూన్ అంటే ఒక రకంగా మన దగ్గరున్న రైతు సహకార సంఘంగా చెప్పుకోవచ్చు. కమ్యూన్ లాభాల బాట పట్టాక మరికొన్ని సబ్సిడరీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిపి 40 దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి చేరుకోవడంతో.. రైతుల దశ తిరిగింది. విపరీతమైన లాభాలు రావడంతో.. రైతులందరికీ అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది కమ్యూన్. ఎటు చూసినా కిలోమీటరు కూడా లేని హక్సీ.. ఇప్పుడు చైనాలోనే అత్యంత ఖరీదైన గ్రామంగా రికార్డులకు ఎక్కింది. పల్లెలో అతి తక్కువ జనాభా ఉన్నప్పటికీ వలస వచ్చిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య ఎక్కువ.

సౌకర్యాలకు కొదవ లేదు..

హక్సీ విలేజ్‌ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపేందుకు.. 60 అంతస్తుల ఆకాశ హర్మ్యం నిర్మించారు రైతులు. ఈ టవర్ ఎత్తు 328 మీటర్లు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన టవర్లలో ఇది పదిహేనవది. 324 మీటర్ల ఎత్తున్న పారిస్‌లోని ఈఫిల్ టవర్, 319 మీటర్లున్న క్రిస్‌లర్ బిల్డింగ్‌లకంటే కూడా హక్సీ విలేజ్ టవరే ఎత్తయినది. టవర్ ఆఖరి అంతస్తులో ఒక టన్ను బరువున్న గోవు స్వర్ణ ప్రతిమను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో వెచ్చించిన ఈ ప్రతిమను వ్యవసాయానికి చిహ్నంగా భావిస్తారు చైనీయులు.

ఆకాశహర్మ్యంలో అత్యాధునిక విలాసవంతమైన సూట్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్స్, రెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో ఒక ఇంటర్‌నేషనల్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నిట్నీ కేవలం హక్సీ విలేజ్‌లోని రెండువేల మంది రైతులకు మాత్రమే కేటాయిస్తారు. వ్యాపారం, వ్యవసాయంతో అలసిపోయిన గ్రామస్తులు కుటుంబాలతో వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోతారు. చైనా దేశానికే భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ గ్రామం పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది. ఏటా 120 దేశాలకు చెందిన పది లక్షల మంది హక్సీవిలేజ్‌ను సందర్శిస్తారు.

ఇన్ని విశేషాలుండడం వల్ల ఈ గ్రామం ఇప్పటికే నేషనల్ సివిలైజ్డ్ విలేజ్, నేషనల్ కల్చరల్ మోడల్ విలేజ్ అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ వ్యవసాయంలో కాలానుగుణంగా మార్పులు తీసుకురావడం, అనుబంధ వ్యాపారాల్లో అడుగుపెట్టడం హక్సీ విలేజ్ రైతులకు కలిసొచ్చింది. ఇలాంటి మార్పును అవకాశమున్న రైతులు అవలంభిస్తే మన రైతులు కూడా ఆ స్థాయిలో కాకపోయినా.. ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కరవు గ్రామంలో నీటి పరవళ్లు

నీరుంటేనే జీవితం అని వేలసంవత్సరాల క్రితమే గుర్తించిన మనిషి దాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు పడకూడని కష్టాలు పడుతున్నాడు. సంతోషించదగిన విషయం ఏంటంటే… ఇప్పుడిప్పుడే మళ్లీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడు. అలాంటి ఒక ఆదర్శనీయ గాథ ఖోప్లా గ్రామానిది, దాన్ని నడిపించిన మథుర్ సావనీది. ఎండిపోయిన బావులను నిండుకుండల్లా మార్చి, ఊరిని సస్యశ్యామలం చేశారాయన.

ఈ లోకంలో ఎప్పటికీ అర్థం కాని వింత ఒకటుంది… ప్రతి రాష్ట్రంలో, ప్రతిజిల్లాలో, ప్రతి ఊర్లో ప్రతిమనిషికీ ఏదో ఒక సందర్భంలో నీటి సమస్య ఎదురై ఉంటుంది. అయినా మేల్కొనరు. కానీ, గుజరాత్‌లోని కరవు ప్రాంతమైన సౌరాష్ట్రలోని ఖోప్లా వాసి మధుర్‌భాయ్ సావనీ మేల్కొన్నాడు. తన ఊరిని, ఆ స్ఫూర్తితో తన ప్రాంతాన్ని మేల్కొల్పాడు.
Description: http://sakshi.com/newsimages/contentimages/22042012/adarsam21-4-12-50421.jpg

మధుర్‌భాయ్ ఖోప్లాలో చదువుకుంటు న్నపుడు ఆ ఊరు పచ్చగా ఉండేది. ఏడాదికి రెండు పంటలతో అలరారేది. కొన్నాళ్లకు వ్యాపార రీత్యా వారి కుటంబం సూరత్‌కు వలసపోయింది. వజ్రాల వ్యాపారంలో బాగా ఎదిగింది. కానీ, అంతలో వారి ఊరి పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఆ ఊళ్లో తొంైభై ఐదు శాతం కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి.

వానలు సరిగా కురవని ప్రాంతం కావడంతో బోర్ల ద్వారా భూగర్భ జలాలు తోడి పంటలు పండించే వారు. ప్రతి చేనుకో బావి, ఒక బోరుబావి. దీంతో క్రమంగా భూగర్భ జలం అడుగంటింది. వానలు తక్కువ కావడం వల్ల తోడిన నీరు మళ్లీ రీఛార్జ్ కాలేదు. నీరు బోర్లకు కూడా అందనంతగా అడుగంటి పోయింది.

అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చివెళ్లే మధుర్ ఊరి పరిస్థితిని గమనించాడు. మళ్లీ ఊరికి పూర్వరూపం తేవాలనుకున్నాడు. కొందరు నిపుణులను కలిసి భూగర్భ జలాలు పెంచే మార్గాల గురించి అన్వేషించాడు. అందులో ఉత్తమ పద్ధతి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే అని అతనికర్థమైంది.

గ్రామస్థులతో మమేకం
ఒకరోజు ఊరి రైతులందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటుచేశారు మధుర్. ‘మన ఊరంతా వ్యవసాయం మీదే బతుకుతోంది. బోర్లలో నీళ్లు లేవు, వానల్లేవు. ఇలాగే ఉంటే తాగడానికి కూడా పట్టణానికెళ్లి నీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరంతా కలిస్తే మళ్లీ మన ఊరు కళకళలాడేలా చేద్దాం’ అన్నాడు. కానీ, ఎవరి మాటో ఎందుకు వినాలి అన్న ఇగో ఆ ఊరి ప్రజల్లో ఐకమత్యాన్ని దూరం చేసింది.

అయినా ఇలాంటి పలురకాల సమావేశాల్ని సొంత ఖర్చుతో పెట్టి వారిలో చైతన్యం తేవడానికి ప్రయత్నించాడు. అప్పటికీ గ్రామస్థుల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అందుకే తనే సౌరాష్ట్ర జల్‌ధార ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. మళ్లీ గ్రామస్థుల వద్దకు వెళ్లి, ‘ఊరిని బాగుచేయడానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేశాను. నా వంతుగా దీనికి పదహారు లక్షల రూపాయలు ఇస్తున్నాను’ అని ప్రకటించాడు. అది చాలామందిలో చైతన్యం తెచ్చింది. చెక్‌డ్యామ్‌లు కడితే ఊరికి జరిగే మేలును కూలంకషంగా వివరించాడు.

ఆయన ప్రయత్నాన్ని నమ్మబుద్ధయింది వారందరికీ. ఐదు వేల జనాభా, 16 వేల బిగాల భూమి (1 ఎకరం = 1.75 బిగాలు) ఉన్న ఊరు కదిలింది. రైతులు, రైతు కూలీలు ఒక్కటయ్యారు. ఎవరికీ ఏ సమస్యా రాకుండా భూమిని బట్టి విరాళమిచ్చారు. ఒక బిగాకు 300 రూపాయలు చొప్పన ట్రస్టుకు ఇచ్చారు. అదంతా కలిపితే 48 లక్షలు అయ్యింది.

జలయజ్ఞం మొదలు
మొత్తం 200 పల్లపు ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టాలనుకున్నారు. కానీ, వారి దగ్గరున్న 63 లక్షలు సరిపోలేదు. దీంతో మధుర్ తనకున్న వ్యాపారుల పరిచయాలను ఉపయోగించి మరో కోటిన్నర విరాళాలు సేకరించాడు. కేవలం ఏడు నెలల్లో రెండొందల చెక్‌డ్యాములు పూర్తిచేశారు. కూలీ, రైతు తేడా లేకుండా పనులు చేశారు. తర్వాత వచ్చిన వర్షా కాలంలో రెండు వందల చెక్‌డ్యాములు నీటితో కళకళలాడాయి. సరిగ్గా రెండు నెలల్లో భూగర్భ జల మట్టం విపరీతంగా పెరిగింది. ఆ సీజనులో వచ్చిన పంట ద్వారా గ్రామప్రజలు ఏడుకోట్ల రూపాయల పంట పండించారు.

ఆ ఊరు సౌరాష్ట్రకే స్ఫూర్తి
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతమంతా కరవే. వర్షాలు చాలా తక్కువ. అటువంటి ప్రాంతంలో ఖోప్లా సాధించిన విజయం అందరికీ తెలిసింది. అది కరవు గ్రామాలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. దాంతో సావనీ ఆ పద్ధతిని సౌరాష్ట్రలోని చాలా గ్రామాలకు విస్తరింపజేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్న సౌరాష్ట్ర వ్యాపారుల నుంచి తన ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి, సుమారు 1000 గ్రామాలకు నీటి సమస్యను తీర్చాడు. మధుర్ కారణంగా గత పదేళ్లలో చెక్‌డ్యాముల్లో గుజరాత్ భారీ ప్రగతిని సాధించింది. ఇటీవల నీటి యాజమాన్య పద్ధతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంగా కూడా ఎంపికైంది. ……………….. ప్రకాష్ చిమ్మల

పనిలో పనిగా పీజీ, పీహెచ్‌డీ, కాలేజీ

ఆర్థిక ఇబ్బందులతో అర్ధంతరంగా బడి మానేసిన కుర్రాడేమవుతాడు..? ఏదైనా పనిలో చేరతాడు. అందులోనే స్థిరపడతాడు! లేదంటే ఇంకో పని చూసుకుంటాడు.. ఇలాగే జీవితాన్ని గడిపేస్తాడు! కానీ తమిళనాడుకు చెందిన కదిరేశన్ దారి వేరు. ‘పని’లో పనిగా పీజీ చేశాడు.. పీహెచ్‌డీ పట్టా కూడా పొందాడు. ఇప్పుడో కళాశాలలో లెక్చెరర్‌గా పనిచేస్తున్నాడు. మన భారత రత్నం అబ్దుల్ కలాం తీర్చిదిద్దిన ఈ రత్నం గురించి తెలుసుకుందాం రండి..!

Description: http://sakshi.com/newsimages/contentimages/06052012/adarsam5-5-12-4042.jpg
తమిళనాడులోని వడచెన్నిమలైకి చెందిన కదిరేశన్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఇల్లు గడవడం కష్టమైన స్థితిలో అతను తనకెంతో ఇష్టమైన చదువుకు దూరం కాక తప్పలేదు. బడి మానేశాడు. కుటుంబ భారాన్ని మోయడానికి సిద్ధమయ్యాడు. కొన్నాళ్లు ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో 1979లో సైన్యంలో డ్రైవర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. మొదట భోపాల్‌లో, ఆపై సిక్కిం, హైదరాబాద్‌లలో పనిచేశాడు. తర్వాత డీఆర్‌డీఓకు డెరైక్టర్‌గా ఉన్న అబ్దుల్ కలామ్‌కు డ్రైవర్ కావడం కదిరేశన్ జీవితంలో కీలక మలుపు.

కదిరేశన్‌లో నిద్రాణంగా ఉన్న ‘చదువుపై మక్కువ’ను తట్టిలేపింది కలామే. అనేక వేదికల్లో కలాం ప్రసంగిస్తు న్నపుడు, ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడు తున్నపుడు చదువు విలువ గురించి ఆయన చెప్పే మాటలు కదిరేశన్‌లో ఆలోచన రేకెత్తిం చాయి. మళ్లీ పుస్తకాలు పడదామన్న ఆశ మొదలైంది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చదవగలనా అన్న అనుమానం. కానీ కలాం ప్రోత్సాహంతో భయం పోయింది. దూరవిద్య ద్వారా చదువు కొనసాగించేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు.

ఉదయం పది నుంచి ఆరు వరకు విధులు పూర్తి చేసుకోవడం.. ఇంటికి రాగానే పుస్తకాలు పట్టడం. ఇలా ముందుగా పదో తరగతి పూర్తి చేశాడు. తర్వాత పన్నెండో తరగతి కూడా దాటేశాడు. ఆపై మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ సాధించాడు. తర్వాత ఆయన కన్ను పీజీపై పడింది. పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాడు. ఇదే యూనివర్సిటీలో బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్ కూడా పూర్తి చేశాడు. లా కూడా ముగించాడు. ఆపై మనోన్మణ్యన్ సుందరనార్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా పొందాక కానీ ఆయన పరుగు ఆగలేదు. ఇదంతా జరిగేటప్పటికి అతని వయసు 47.

2001లో ఉపాధ్యాయ ప్రవేశ పరీక్షలో నెగ్గిన కదిరేశన్‌కు కోవిల్‌పట్టిలో ఉపాధ్యా యుడిగా అవకాశం దక్కింది. అక్కడ ఎనిమిదేళ్లు పనిచేశాడు. అయితే ఆ పనికే పరిమితమైపోలేదు కదిరేశన్. చరిత్రపై రెండు పుస్తకాలు రాశాడు. తిరునల్వేలి జిల్లాకు సంబంధించి ట్రావెల్ గైడ్ కూడా రూపొందించాడు. ప్రస్తుతం ఆయన వడ చెన్నిమలైలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘ఎంతో పనిచేస్తున్నామంటూ మనమంతా బాధపడుతుంటాం. కాని అంకిత భావం, కష్టపడే తత్వం ఉంటే చాలు.. ఏమైనా చేయొచ్చని ఎంతైనా కష్టపడొచ్చని ఆయన్ని చూస్తే అనిపిస్తుంది’’… కదిరేశన్ గురించి మణి అనే విద్యార్థి అన్న మాటలివి.

తన ప్రయాణం గురించి కదిరేశన్‌ను కదిపితే.. ‘‘బడి మానేయడం నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన. కలాం సార్ లేకుంటే ఇవేవీ జరిగేవి కావు. ఆయన సాయం ఎప్పటికీ మరిచిపోను. పీహెచ్‌డీ పూర్తయ్యాక సార్‌కి ఫోన్ చేశా. ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పా. అప్పుడాయన అన్న మాటలు, ఇచ్చిన ప్రశంసలు అత్యంత విలువైనవి. నామీద ఆయన ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు’’ అంటూ ఉద్వేగంగా చెబుతాడు. తన అభ్యున్నతిలో భార్య కస్తూరి పాత్ర కూడా వెలకట్టలేనిదని, కష్టకాలంలో ఆమె తనకెంతో అండగా నిలిచిందని చెప్పాడు.

కస్తూరి కూడా ఉపాధ్యాయురాలే. వీరిద్దరికీ సంతానమైన రాఘవన్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అతని చదువు గురించి, భవిష్యత్తు గురించి కదిరేశన్‌కు దిగులేం లేదు. ఆయన దృష్టంతా తనలా మధ్యలోనే చదువు వదిలేసిన పిల్లల గురించే. అలాంటి వాళ్లు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరాయన! అంతేకాదు, ప్రతి ఎలక్షన్‌లోనూ నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దు, మీ ప్రశ్నించే హక్కును పోగొట్టుకోవద్దు అంటూ ప్రచారం చేస్తుంటాడు……… ప్రకాశ్ చిమ్మల