అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చు

bojjaసాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక విషయాల్లో దళితలోకానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల న్యాయవాద వృత్తిలో, ఏడు పదుల జీవితంలో బొజ్జా తారకం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

“అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కందికుప్ప మా ఊరు. కాకపోతే ఆ ఊరికి కిలోమీటర్ దూరంలోని ‘మాలపేట’ మా నివాస స్థలం. ఇది బంగాళాఖాతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రముఖంగా ఉండే రాజులు, కాపులు కూడా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అంటరాని కులానికి చెందిన వాడైనా ఆయనను ఎవరూ అలా చూసే వారు కాదు. అందుకే నా బాల్యంలో అంటరానితనం తాలూకు సమస్యలేవీ ప్రత్యక్షంగా నన్ను తాకలేదు కానీ, పరోక్షంగా వాటి గురించి కొంత తెలుసు.

నా పసితనంలో పెసరట్లు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి మా పేటకు వచ్చేవాడు. మోకాళ్ల దాకా పంచె తప్ప అతని ఒంటి మీద చొక్కా కూడా ఉండేది కాదు. పెద్ద బొజ్జ ఉండేది. అతడు గొల్ల కులస్తుడు. అతను పెసరట్లను మాల పిల్లలకే అమ్ముకోవడానికి వచ్చినా ఎవరూ తనను ముట్టుకోకుండా దూరదూరంగా ఉండేవాడు. తననే కాదు తన సైకిలును గానీ, పెసరట్లు తెచ్చిన డబ్బాను గానీ ఎవరూ తాకడానికి వీలులేదు. పిల్లలు డబ్బులు ఇస్తే పైనుంచి అరచేతిలోకి వేయాలి. తను కూడా పెసరట్లను ఆకులో పెట్టి పైనుంచి అరచేతుల్లోకి వదిలేవాడు.

అతను బతుకుతున్నది మాలపిల్లలు ఇచ్చిన డబ్బులతోనే అయినా వాళ్లు మాత్రం తనను తాకడానికి వీల్లేదనడంలోని ఆ వైరుధ్యం ఏమిటో మొదట్లో అర్థం కాకపోయినా ఆ తర్వాత రోజుల్లో అర్థమవుతూ వచ్చింది. నిజానికి ‘గొల్ల’ అగ్రకులమేమీ కాదు. అయినా అతనికి ఆ వాసనలు సోకాయి. 1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.

ఎక్కడో ఎదురవుతుంది
నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో ఓడిపోయినా తన సామాజిక కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు. తాతయ్య చాలామందికి పూజనీయుడిగా ఉండడం వల్లగానీ, నాన్నగారు ఎం.ఎల్.ఏగా, ఒక సామాజిక నాయకుడిగా ఎదగడం వల్ల గానీ, నా చదువైపోయేదాకా ఎక్కడా కుల వివక్ష తాలూకు కష్టాలు నన్ను వేధించలేదు. కానీ, న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో తొలిసారిగా ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మాత్రం ఆ సమస్యలు నన్ను ఢీకొన్నాయి. ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఎస్సీ న్యాయవాదిని నేనొక్కణ్నే. నా కేసుల్ని స్వీకరించే విషయంలో గానీ, నా వాదనల్ని వినే విషయంలో గానీ, తీర్పు చెప్పే విషయంలో గానీ, న్యాయమూర్తులు చాలా వివక్షతో వ్యవహరించేవారు.

అది నన్ను తీవ్రమైన ఆవేదనకు గురిచేసేది. అక్కడంతా బ్రాహ్మణుల ఆధిపత్యమే ఉండేది. వాళ్ల కుటిలమైన ఎత్తుగడల వల్ల ఎస్సీ కేసులు తప్ప వేరే ఏవీ నా వద్దకు వచ్చేవి కాదు. పనిగట్టుకుని కొందరు అలా రాకుండా చేసేవారు. నాన్నగారి నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల సరిపోయింది గానీ, లేదంటే న్యాయవాద వృత్తి నాకు భారమయ్యేది. సరిగ్గా అదే సమయంలో ఒక భూస్వామి వద్ద పనిచేస్తున్న పాలేరును అన్యాయంగా ఒక కేసులో ఇరికించి అతన్ని దారుణంగా కొట్టి జైలుకు పంపించారు. వాళ్లు బెయిల్ కోసం నా వద్దకు వ చ్చారు. పిటిషన్ వేస్తే చాలా సులువుగా రావలసిన బెయిల్ రాలేదు. అది నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న న్యాయవాద వృత్తి నాది. చివరికి బెయిల్ కూడా ఇప్పించలేని న్యాయవాదిననైతే నా ఉనికికి అర్థమేముంటుంది?

జరిగిన కుతంత్రమేమిటో తెలుసుకుని ఐదు రోజుల తర్వాత బెయిల్ తిరస్కృతిని సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ వేశాను. ఇక తప్పదన్నట్లు ఈ సారి బెయిల్ ఇచ్చారు. అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.

అన్యాయానిదే రాజ్యమై…
నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న బోయిభీమన్న గారి కూతురు విజయభారతిని 1968లో నేను పెళ్లి చేసుకున్నాను. మొదట్లో వీలును బట్టి నిజామాబాద్‌కు వస్తూపోతూ ఉన్నా, ఆ తర్వాత నిజామాబాద్‌కే వచ్చేసి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఆ రోజుల్లో నిజామాబాద్‌లో దళిత లాయర్‌గా ప్రాక్టీసు చేసినవాడ్ని నేనొక్కడ్నే. అక్కడే ‘అంబేద్కర్ యువజన సంఘం’ స్థాపించాను. ఎస్సీలే కాకుండా బీసీ యువకులు కూడా అందులో ఉండేవారు. అలా ఉండడం అదే ప్రథమం. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. అంటరానితనానికి, అణచివేతకు, దళితుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ స్పూర్తితో ఈ సంఘం పనిచేసేది. లాయర్‌గా నాకు కేసులైతే వచ్చేవి కానీ, సంపాదనైతే ఏమీ ఉండేది కాదు. నా భార్య ఉద్యోగం చేస్తున్నందువల్ల సంసార భారమంతా ఆమే మోసేది. నిజామాబాద్ పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘పాలెం’ అనే గ్రామంలో ఒక రోజు ఒక కాపు తన జీతగాణ్ని కొట్టి చంపేశాడు. ఆ వెంటనే ఆ శవాన్ని దళితులతో పాతిపెట్టించాడు కూడా. అటువంటి సంఘటనలు అంతకు ముందు చాలా జరుగుతూ వచ్చాయి.

కాని నేను అక్కడికి వెళ్లాక జరిగిన తొలి సంఘటన అదే. ఆ వార్త తెలియగానే నిరసన ర్యాలీ తీయడానికి 40 మంది కుర్రాళ్లతో కలిసి లారీలో ఆ ఊరు వెళ్లాం. ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగితే, ఒక గుంపు ప్రజలు ఆ గ్రామానికి వెళ్లి, నిరసన ప్రకటించడం నిజామా బాద్ చరిత్రలో అదే ప్రథమం. మేము వెళ్లే దారిలో ఆర్మూరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా మీద దాడిచేస్తారని, వెళ్లొద్దని కబురొచ్చింది. అయినా భయపడకుండా వెళ్లాం. అందరూ చెప్పినట్లు ఆర్మూరు గ్రామం వద్ద ఎవరూ మమ్మల్ని ఆపలేదు. పైగా మేము వెళ్లగానే బాధితుడి పక్షాన పాలెం మాల మాదిగలంతా వచ్చేశారు.

వారిని వెంటతీసుకుని కాపుల వీధుల్లోంచే ఊరేగింపు తీశాం. రెడ్లంతా వాళ్ల మిద్దెల మీద నిలుచుని చూశారే గానీ, మమ్మల్ని నిరోధించడానికి గానీ, దాడి చేయడానికి గానీ ఏ ఒక్కరూ సాహసించలేదు. అప్పటిదాకా తాము చేసేవన్నీ న్యాయబద్ధమే అనుకునే వాళ్ల అవగాహనను తప్పని వారికి చెప్పగలిగాం. అందుకే వారు ఒక అపరాధ భావనతో చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్టు కూడా చేయించి జైలుకు పంపించాం. అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.

అనుకున్నదే కదా!
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకుల్ని రెచ్చగొడుతున్నానన్నది పోలీసులు నా మీద మోపిన ప్రధాన అభియోగం. నిజామాబాద్ జైలుకు తరలించడానికి ముందు నన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా నాన్నగారు కాకినాడ నుంచి హుటాహుటిన బయల్దేరి నేనున్న జైలుకు వచ్చారు. నాకు తీవ్రమైన జ్వరంగా ఉంది, నన్ను చూడటానికి ఎవరినీ రానివ్వడం లేదు. నాన్నగారు నా వద్దకు రాగానే ఏడ్చేశాను. అప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన ఆయనకు నా బేలతనం సరైంది కాదని అనిపించిందేమో! ” ఎందుకు ఏడుస్తావ్? నీకు నువ్వుగా ఎంచుకున్న మార్గమే కదా ఇది?” అన్నారు. ఆ మాటలు నాలో అదే పనిగా మార్మోగాయి. మనం ఎంచుకున్న మార్గమనే విషయం మనమే మరిచిపోతే మనమెంత బలహీనపడతామో ఆ మాటల ద్వారా నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత చంచల్‌గూడ జైలులో ఏడాది పాటు నిశ్చలంగా గడపడానికి కావలసిన శక్తినంతా ఆ మాటలే నాకు ప్రసాదించాయి.

పోరాటమిచ్చిన జ్ఞానం
1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడుతూ వచ్చాను. ఉన్నట్లుండి 2013 లో ఒకరోజు దళిత సమస్యల పని మీద ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాను. అయితే నేను ఎక్కడినుంచి వచ్చానో నాకేమీ గుర్తు రావడం లేదు. ఆ మాటే నా భార్యను అడిగితే అదేం ప్రశ్న అన్నట్లు చూసింది. నాకు నేనే గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా గుర్తుకు రాకపోవడంతో ఏడుపొచ్చేసింది. వైద్య పరీక్షల్లో మెదడులో కణితి ఉన్నట్లు బయటపడింది. వెంటనే సర్జరీ చేశారు. అది కేన్సర్ కణితి అనే విషయం సర్జరీ అయిపోయే దాకా నాకు తెలియదు. ఆపరేషన్ తర్వాత నా ఆరోగ్యం క్రమక్రమంగా చక్కబడుతూ వచ్చింది. ప్రస్తుతం మా తాతయ్య, మా నాన్న గారి జీవిత కథల్ని ఒకే పుస్తకంగా రాసే పనిలో ఉన్నాను. అది పూర్తయితే మరో నవల కూడా రాయాలన్న సంకల్పం ఒకటి నాలో బలంగా ఉంది. నిరంతరం పోరాటాల మధ్య జీవించడం కారణంగానేమో గానీ, నన్నేదీ భయపెట్టదు.

పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఆ జ్ఞానమే బహుశా కేన్సర్ అని తెలిసినా నన్ను నిశ్చలంగా ఉండేలా చేసింది. నేను త్వరగా కోలుకోవడానికి కూడా బహుశా అదే దోహదం చేసింది. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను. ఇన్నేళ్ల నా పోరాటానికి ఏ ఆత్మవిశ్వాసం కేంద్రంగా ఉంటూ వచ్చిందో, ఆ ఆత్మవిశ్వాసమే నా భవిష్య జీవనానికి కూడా ఊతంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం
– బమ్మెర
ఫోటోలు: బాబూరావు

విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?-కాకర్ల సుబ్బారావు.

డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘజీవన ప్రస్థానంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’.

kakarla

‘ఒక రకం సిద్ధాంతాన్ని ఎంచుకుని, అందుకు విరుద్ధంగా అడుగులు వేయడంలో కలిగే బాధేమిటో అనుభవించిన వారికే తెలుస్తుంది. కృష్ణాజిల్లాలోని పెద్ద ముత్తేవి నా జన్మస్థలం. నా ప్రాథమిక విద్యాభ్యాసం చల్లపల్లి రాజా వారి హైస్కూల్లో జరిగింది. సాయంత్రం వేళ స్కూలు హాస్టల్‌లోనే చండ్ర రాజేశ్వరరావు, మరికొంత మంది పెద్దలు అక్కడి విద్యార్ధులందరికీ కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి, మార్క్సిజం గురించి చెబుతుండే వారు. పక్కా గాంధేయవాది అయిన నా మిత్రుడి ప్రభావమో ఏమో నా మనసు మాత్రం గాంధేయవాదం వైపే మొగ్గు చూపేది. 1940లో.. గాంధీ గారి పిలుపుతో మనం కూడా సత్యాగ్రహం చేద్దామని నా మిత్రుడన్నాడు. నా చదువు, పురోగతి మీద నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే సామాజిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం నాకు ఇష్టముండేది కాదు. కాకపోతే గాంధేయవాదం మీద అభిమానంతో మేము చిన్నచిన్న నాటకాల్లో పాలుపంచుకునే వాళ్లం. అది కూడా చల్లపల్లి రాజా అయిన యార్లగడ్డ శివరామ ప్రసాద్ రాజు గారికి నచ్చేది కాదు. ఒక రోజు ఆయన మేనేజర్ మమ్మల్ని పిలిచి ‘బాబూ ఇలాగైతే చాలా కష్టం. ఇక ముందెప్పుడూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే మంచిది’ అన్నాడు. ఆ తరువాత మేమింక మౌనంగా ఉండిపోయాం.

హింసతో ఏం చేద్దామని..

కాలేజీకి వచ్చాక.. 1941-42లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది. మేమూ అనుసరించాం. గాంధీ ఉపవాసదీక్ష చేస్తే మేమూ చేసేవాళ్లం. మమ్మల్ని ఏ అంశం ప్రభావితం చేసిందో ఏమో కానీ గాంధీ గారి సిద్ధాంతానికి విరుద్ధంగా ఒకరోజు విద్యార్థులమంతా కలిసి చల్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి పట్టాల్ని తొలగించేందుకు సిద్ధమయ్యాం. పని ప్రారంభించగానే పోలీసులు వచ్చారు. ఏం జరుగుతుందోనని మాలో ఒకటే ఉత్కంఠ. ఉన్నట్టుండి మాలో కొందరు వాళ్ల మీదికి రాళ్లు విసిరారు. ఓ రాయి పోలీస్ కానిస్టేబుల్ నుదుటికి తాకింది. రక్తంతో దుస్తులు తడిచిపోయాయి. ఊహించని పరిణామంతో నిశ్చేష్టుడినయ్యాను. ఇలాంటి హింసాత్మక కార్యాల్లో నేనెందుకు పాల్గొనాలి? అని నాలో నేనే మధనపడ్డాను. వెంటనే అక్కడి నుంచి తప్పుకుని వచ్చేశాను. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. నేను భయపడి పారిపోయానని అందరూ తిట్టుకున్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. హింస ఏ వైపున జరిగినా తప్పే కదా! గాంధీగారి అహింసా సూత్రాన్ని నేను ఇప్పుడూ అంతే బలంగా నమ్ముతాను.

పేషెంట్‌దే పెద్దమాట

అమెరికాలో చదువుకోవాలనే కోరిక నాలో బలంగా ఉండేది. వైజాగ్‌లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ కోసం అమెరికా వెళ్లాను. పేషంట్ చెప్పే విషయాల్ని వినేందుకు ఇక్కడ మన డాక్టర్లు విసుగుపడతారు. కానీ అమెరికాలో పరిస్థితి వేరు. డాక్టర్, పేషంట్ల మధ్య పరస్పర గౌరవభావం ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదే కావడం వల్లనో ఏమో.. పేషంట్ల మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే వారి ఆలోచనా విధానం నాకు బాగా నచ్చేది. డాక్టర్ అన్ని వ్యా«ధుల మీదా కొంతే మనసు పెడతాడు. కానీ పేషంట్ తనకున్న ఒక్క వ్యాధి గురించి ఎంతో లోతుగా తెలుసుకుంటాడు.

ఇప్పుడు ఇంటర్‌నెట్ వల్ల మరింతగా తెలుసుకోగలుగుతున్నాడు. డాక్టర్ కన్నా బాగా విద్యావంతుడైన రోగి బెటర్ అని అంటాన్నేను. ఓ రోజు ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యను ఒక న్యూరాలజిస్టు వద్దకు తీసుకువచ్చాడు. ‘నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటి? దానికి కారణమేంటి?’ అంటూ అతనేదో అడిగితే, ‘ఆ జబ్బు గురించి మీకు అర్థం కావాలంటే ఐదేళ్లు పడుతుంది’.. అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ డాక్టరు. విదేశాల్లో ఎప్పుడూ అలా మాట్లాడరు. వివరించి చెప్పేంత సమయం లేకపోతే దానికి సంబంధించిన పత్రికలో, పుస్తకాలో సూచిస్తారు. కానీ ఇలా దాటవేసే ప్రయత్నం చేయరు. ఈ విషయంలో నేను విదేశీయుల నుంచి చాలా నేర్చుకున్నాను.

అప్పటికి అదే మేలు

కొందరు పేషంట్లు వేసే ప్రశ్నలు వింతగా ఉండేవి. నేను రేడియాలజిస్టును కదా. 1960లో.. ఎక్స్‌రే ప్రాక్టీస్ చేస్తున్నాను. గర్భిణులకు ఎక్స్-రే తీసే సందర్భంలో మాకు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురయ్యేది. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లాడా? అని గుచ్చిగుచ్చి అడిగేవారు. మాకు తెలియదని చెప్పినా, మౌనంగా ఉన్నా.. ‘పుట్టబోయేది ఆడపిల్లే కావచ్చు.. అందుకే డాక్టర్ ఏమీ చెప్పడం లేదు’ అనే అభిప్రాయానికి వచ్చేవారు. ఆ రోజు నుంచే ఆమె ఆహార పానీయాల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండేవారు.

దీంతో ఎవరైనా అడిగితే తడుముకోకుండా మగపిల్లాడే అని చెప్పేవాడ్ని. అప్పట్నుంచి ఆమె కుటుంబసభ్యులంతా ఆమె ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేవారు. నేను చెప్పినదానికి విరుద్ధంగా ఆడశిశువు పుడితే నన్నెవరూ నిలదీయలేదు కానీ, మగబిడ్డ పుట్టినవాళ్లు మాత్రం.. మీరు చెప్పినట్టే జరిగిందని నాకు స్వీట్ పాకెట్లు ఇచ్చేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునే వాడిని. అలా చెప్పడం ఇప్పుడు చట్ట విరుద్ధమే కానీ, ఆ రోజుల్లో ఆ మాటే ఎంతో మేలు చేసేది. ‘పడగొట్టే సత్యం కన్నా నిలబెట్టే అబద్దమే గొప్పది’.. అనే శ్రీకృష్ణుడి మాటలు నాకు పదేపదే గుర్తుకొచ్చేవి.

నియంత్రణ లోపిస్తే నిలకడేది?

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో మా మామయ్య వాళ్లుండే వాళ్లు. అక్కడ వారికి 18 ఎకరాల భూమి ఉండేది. అందులో రాళ్లే ఎక్కువ. ఎలాగోలా చదును చేసి ద్రాక్షతోట వేసే వాళ్లం. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఆబిడ్స్‌లో క్లినిక్ కూడా ఉండేది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఓ రోజు రాత్రి ఆ తోటంతా నరికివేశారు. తరువాత కొద్ది రోజులకే మా ఇంటికి నిప్పంటించారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మనసు చెదిరిపోయింది. ఇక ఇక్కడ ఉండాలనిపించలేదు. ప్రొఫెసర్‌గా ఉద్యోగం చూసుకుని 1970లో అమెరికా వె ళ్లిపోయాను.

రెండేళ్లు గడిచాక తిరిగి వచ్చేద్దామనుకునే సరికి ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలయ్యింది. దీంతో 1985 వరకు.. అంటే ఎన్‌టీఆర్ రమ్మని పిలిచేదాకా అక్కడే ఉండిపోయాను. ఉద్యమాలకు నేను వ్యతిరేకం కాదు. అన్యాయం జరిగితే, జరిగిందనిపిస్తే ఉద్యమాలు రావచ్చు. కానీ, అవి విధ్వంసకరంగా, హింసాత్మకంగా మారొద్దన్నది నా అభిప్రాయం. ఆలోచనాపరులెవరూ అలాంటి చర్యలకు పాల్పడకపోవచ్చు. ఉద్యమ నాయకులూ అందుకు ప్రోత్సహించకపోవచ్చు. కానీ, అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా నియంత్రించే బాధ్యత మేధావులది, ఉద్యమ నాయకులది కూడా. హింస, విధ్వంసాలు జరిగిన చోట మానవ సంబంధాలకు మనుగడ ఉండదని నా అనుభవంలో తెలిసొచ్చింది.

చిన్నవే అనుకుంటే చితికిపోతాం..

అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఓసారి బస్సెక్కాను. బస్సులో ఉండే మెషీన్‌లో మూడు నాణాలు వేస్తే టికెట్ వస్తుంది. తీరా చూస్తే నా వద్ద రెండు నాణాలే ఉన్నాయి. డాలర్స్ ఉన్నాయి కానీ, నాణాలే వేయాలి. అత్యవసరంగా వెళ్లాలి. అప్పటికే ఆలస్యమయింది. మరో నాణెం దొరక్కపోతుందా అని జేబులన్నీ తడిమి చూశాను. లేదు. ఇక లాభం లేదనుకుని, నన్ను నేనే తిట్టుకుని బస్సు దిగేందుకు ఓ అడుగు వేశాను. ఎప్పటినుంచి గమనిస్తున్నాడో ఓ 14 ఏళ్ల బ్లాక్ కుర్రాడు ఓ నాణెం తీసి ఇచ్చాడు. చిరునవ్వుతో నన్నే చూస్తున్న ఆ పిల్లాడిని సంభ్రమాశ్చర్యాలతో చూశాను. నాణెం తీసుకుని డాలర్ ఇవ్వబోతే వద్దని తలూపాడు. వాళ్ల భాష రాకపోవడం వల్ల కృతజ్ఞతగా కరచాలనం చేశాను.

జీవితంలో ప్రతి విషయం పట్లా ఎంతో జాగ్రత్తగా ఉంటామనుకుంటూనే ఎలాంటి పొరపాట్లు చేస్తామో నాకు ఆ రోజు స్పష్టంగా బోధపడింది. జీవన గమనాన్ని ఆపడానికి పెద్ద తప్పులే చేయనవసరం లేదు. చాలా చిన్నతప్పు వల్ల కూడా ఒక్కోసారి జీవితం స్తంభించిపోతుందని ఆ రోజు స్పష్టమయింది. ఆ సత్యమే నన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా మార్చింది.

బమ్మెర